Site icon NTV Telugu

Top Headlines @9AM: టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

మూడు ప్రధాన కాలువలకు సాగునీటి సరఫరా నిలిపివేత:
తూర్పుగోదావరి జిల్లా గోదావరి డెల్టా పరిధిలోని మూడు ప్రధాన కాలువలకు ఈరోజు అర్ధరాత్రి నుండి సాగునీటి సరఫరా నిలిపివేయనున్నారు. దాంతో డెల్టా పరిధిలోని మూడు కాలువలు గురువారం ఉదయం నుండి మూసివేయనున్నారు. ఉభయగోదావరి జిల్లాలోని పది లక్షల 13వేల ఎకరాల వరి సాగుకు ధవళేశ్వరం బ్యారేజీ నుండి తూర్పు, పశ్చిమ, సెంట్రల్ డెల్టాలకు సాగునీరు అందించడం జరుగుతుంది. రబీ పంటలు పూర్తయి కోతలకు రావడంతో సాగునీటి సరఫరా నిలిపివేయనున్నారు. ఆఖరి రోజు సందర్భంగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజి నుండి గోదావరి డెల్టాకు 8 వేల 4 వందల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. మళ్లీ జూన్ ఒకటో తేదీ నుండి డెల్టాలోని మూడు కాలువలకు సాగునీరు విడుదల చేయడానికి సన్నాహాలు చేయనున్నారు. మే నెలలో 366 కోట్ల రూపాయల వ్యయంతో కాలువల మరమ్మతు పనులను చేపట్టానున్నారు. టెండర్లను పిలిచి వెంటనే పనులు చేపట్టడానికి ఇరిగేషన్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నెల రోజులు వ్యవధిలో కాలువల మరమ్మతు పనులు పూర్తి చేయడానికి కసరత్తు చేస్తున్నారు.

నేడు వైసీపీ పీఏసీ తొలి సమావేశం:
నేడు వైసీపీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశం జరగనుంది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు పీఏసీ తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పీఏసీ సభ్యులు హాజరుకానున్నారు. పీఏసీ సమావేశంలో పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇటీవల వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు పార్టీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీని పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే. 33 మందిని పీఏసీ సభ్యులుగా నియమించారు. పార్టీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణా రెడ్డి పీఏసీ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. నేటి సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. పార్టీ భవిష్యత్ కార్యచరణపై వైఎస్‌ జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లాల్లో పార్టీ పరిస్థితి, పార్టీ బలోపేతం సహా కూటమి సర్కార్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై భవిష్యత్తులో పోరాటాలపై పీఏసీ చర్చించనుంది.

కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు:
వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం అర్ధరాత్రి దేశరాజధాని ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో సీఎంకు కేంద్రమంత్రులు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్.. ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, కలిశెట్టి అప్పల నాయుడు.. పార్టీ సీనియర్‌ నేత కంభంపాటి రామ్మోహన్‌ రావు తదితరులు స్వాగతం పలికారు. రాత్రి ఢిల్లీలో బస చేసిన సీఎం చంద్రబాబు.. నేడు పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్ర అభివృద్ధి అంశాలతో పాటు రాజకీయ అంశాలు, కూటమి వ్యవహారాలపై కేంద్రమంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు చర్చలు జరపనున్నారు. ఏపీ రాజ్యసభ సీటు ఎవరికి కేటాయించాలనే దానిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కీలక మంతనాలు జరపనున్నారు. అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన కోసం ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెల 2న అమరావతికి వస్తున్న నేపథ్యంలో.. అందుకోసం చేస్తున్న ఏర్పాట్ల గురించి కేంద్ర హోం మంత్రికి సీఎం వివరించనున్నట్లు సమాచారం. నేడు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్, న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘవాల్‌ను సీఎం కలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

వ్యాపారవేత్త ఇంట్లో 2 కిలోల బంగారం, 3 కోట్ల నగదు చోరీ:
కాచిగూడలో వ్యాపారవేత్త ఇంట్లో భారీ దోపిడి జరిగింది. వ్యాపారవేత్త దంపతులకు మత్తుమందు ఇచ్చి డబ్బు నగలు దోపిడీ చోటు చేసుకుంది. వ్యాపారవేత్త హేమ రాజ్ ఇంట్లో రెండు కిలోల బంగారం ఆభరణాలు మూడు కోట్ల నగదు చోరీ చేశారు. పని మనుషులు.. వ్యాపారవేత్త దంపతులకు రాత్రి భోజనంలో మత్తుమందు కలిపి పెట్టారు. హేమ్రాజ్ దంపతులు మత్తుమందుతో కూడిన భోజనం తిని అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వాళ్లు స్పృహ కోల్పోయిన వెంటనే ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, మూడు కోట్ల నగదు దోచుకెళ్లారు. ఉదయం వాకింగ్ కి హేమ రాజు రాకపోవడంతో స్నేహితులు ఇంటికి వచ్చారు. ఇంట్లో అపస్మార్క స్థితిలో ఉన్న హేమరాజు దంపతులను ఆసుపత్రిలో చేర్పించారు. ఇంటి నుంచి బంగారు ఆభరణాలు నగదు ఎత్తుకెళ్లిన నేపాలి దంపతుల కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు. కాగా.. పని మనుషులను ఎంచుకునే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

నేడు ఇంటర్ ఫలితాలు:
తెలంగాణలో నేడు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలు తమకు అనుకూలంగా రాకపోవడంతో ఏటా విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. చదువే జీవితంకాదని ఆ చిన్నారులు గ్రహించలేకపోతున్నారు. తల్లిదండ్రులు కోపగించుకుంటారని ఆవేదన చెందుతున్నారు. ఆత్మ న్యూనతతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. అధికార యంత్రాంగం సోషల్ మీడియా వేదికగా ఎంత ప్రచారం కల్పిస్తున్నా చిన్నారుల్లో అవగాహన కలగకపోవడం విచారకరం. పరీక్షల ఫలితాల వేళ తల్లిదండ్రులు సైతం అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నా వారి ఏమరపాటు కారణంగా రెప్ప పాటు కాలంలో చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.

మీ నాన్నను చంపినట్లే చంపేస్తాం:
మహారాష్ట్ర మాజీ మంత్రి, దివంగత నేత బాబా సిద్ధిఖీ తనయుడు, ఎన్సీపీ నేత జీషాన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించారు. సిద్ధిఖినీని చంపినట్లుగానే చంపేస్తామంటూ మెయిల్ చేశారు. రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతేడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బాబా సిద్ధిఖీ హత్యకు గురయ్యారు. అక్టోబర్ 12న ముంబైలోని తన కుమారుడు కార్యాలయంలో ఉండగా దుండగులు ఆయనపై కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్యకు తామే కారణమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఇప్పుడు తాజాగా ఆయన కుమారుడు జీషాన్‌కు బెదిరింపు వచ్చింది. మీ తండ్రిని చంపినట్లే చంపేస్తామంటూ హెచ్చరించారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

హిందీకి వ్యతిరేకంగా పోరాడండి:
కేంద్ర ప్రభుత్వం- తమిళనాడు సర్కార్ మధ్య వివాదం కొనసాగుతుంది. తాజాగా, ఈ వివాదంపై డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మరోసారి స్పందించారు. చెన్నైలోని నందనం ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో తమిళనాడు మాజీ సీఎం ఎం. కరుణానిధి పేరుతో 4.80 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించిన ఆడిటోరియం ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘పెరియార్‌, గ్రాండ్‌మాస్టర్‌ అన్నా, ముత్తమిళర్ కళైంజర్ తో పాటు మన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో సహా పలువురు హిందీకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారని పేర్కొన్నారు. 1986లో హిందీకి వ్యతిరేకంగా కరుణానిధి చేసిన ప్రసంగం ఇప్పటికీ ప్రతి ఒక్కరికీ గుర్తిండి పోయిందని చెప్పుకొచ్చారు.

హార్వర్డ్ యూనివర్సిటీ సంచలన నిర్ణయం:
అగ్ర రాజ్యం అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీ-ట్రంప్ ప్రభుత్వం మధ్య తీవ్ర పోరాటం జరుగుతోంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి 2.2 బిలియన్ డాలర్ల నిధులను ట్రంప్ సర్కార్ నిలిపివేసింది. అంతేకాకుండా యూనివర్సిటీకి కల్పించే పన్ను మినహాయింపును కూడా నిలిపివేసింది. దీంతో హార్వర్డ్ యూనివర్సిటీ.. ట్రంప్ సర్కార్‌పై ప్రత్యక్ష పోరాటానికి దిగింది. ట్రంప్ పరిపాలనపై యూనివర్సిటీ దావా వేసింది. ప్రభుత్వం బెదిరించి నిధులను నిలిపివేసిందని పేర్కొంది. యూనివర్సిటీ ప్రతిష్టతను ట్రంప్ సర్కార్ దెబ్బతీస్తుందని.. అంతేకాకుండా విదేశీ విద్యార్థులను కూడా బెదిరిస్తోందని దావాలో వాపోయింది. ఈ మేరకు మసాచుసెట్స్ ఫెడరల్ కోర్టులో దావా వేసింది.

తొలిసారి పుతిన్ సంచలన నిర్ణయం:
రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఈస్టర్ సందర్భంగా కాల్పులకు విరామం ప్రకటించి సంచలనం సృష్టించారు. తాజాగా మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌తో నేరుగా శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు స్వయంగా పుతిన్ ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. తాజా ప్రకటనతో రష్యా అధ్యక్షుడిలో మార్పు కనిపిస్తుందని ప్రపంచ నేతలు భావిస్తున్నారు. ఇక యుద్ధం ప్రారంభం అయ్యాక.. ఇలాంటి ప్రకటన చేయడం ఇదే తొలిసారి. ట్రంప్ రెండో సారి అమెరికా అధ్యక్షుడయ్యాక రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలకు శ్రీకారం చుట్టారు. సౌదీ అరేబియా వేదికగా రష్యాతో అమెరికా అధికారులు చర్చలు జరిపారు. అంతేకాకుండా నేరుగా ట్రంప్-పుతిన్‌కి ఫోన్ చేసి కూడా మాట్లాడారు. ఇంత చేసినా ఏ మాత్రం సత్‌ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో విసుగు చెందిన అమెరికా.. ఇటీవల ఈ మధ్యవర్తిత్వం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ట్రంప్‌నకు వేరే పనులు చాలా ఉన్నాయని.. ఇక బ్రోకర్ పనుల నుంచి తప్పుకోబోతున్నట్లు వెల్లడించింది. అమెరికా హెచ్చరికలతో మొత్తానికి పుతిన్ ఇన్నాళ్లుకు దిగొచ్చారు. మార్పునకు కారణమేంటో తెలియదు గానీ.. ప్రత్యక్షంగానే ఉక్రెయిన్‌తో చర్చలు జరుపుతామని ప్రకటించడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ‘ఈడీ’ నోటీసులు:
టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేశ్ బాబుకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు జారీ చేసింది. ఈనెల 27వ తేదీన హైదరాబాదులోని ఈడీ కార్యాలయం ఎదుట హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది. హైదరాబాద్ చెందిన సాయి సూర్య డెవలపర్స్ తో పాటు సురానా గ్రూపు కంపెనీ వ్యవహారంలో ఈడీ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ కోసం మహేశ్ బాబు ప్రమోషన్ నిర్వహించాడు. ఇందు కొరకు రూ. 5.9 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇందులో కొంత నగదు రూపంలో తీసుకోగా మరికొంత ఆర్‌టీజీఎస్‌ రూపంలో ట్రాన్స్‌ఫర్‌ అయింది. అయితే ఈ డబ్బులకు సంబంధించిన లావాదేవీలు సాయి సూర్య డెవలపర్స్, సురానా కంపెనీలో ఈడీ సోదాలు నిర్వహించినప్పుడు అవకతవకలు జరిగినట్టు బయటపడింది. సోదాలలో దొరికిన పత్రాల ఆధారంగా మహేశ్ బాబుకి ఈడి నోటీసులు ఇచ్చింది. సాయి సూర్య డెవలపర్స్, సురానా కంపెనీలు పెద్ద మొత్తంలో వెంచర్ల పేరుతో డబ్బులు వసూలు చేసి ప్రజలను మోసం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు గతంలోని సాయి సూర్య డెవలపర్స్ చైర్మన్ సతీష్ గుప్తను అరెస్టు చేశారు. అదే మాదిరిగా సూరానా గ్రూపు పైన కూడా కేసు నమోదు చేశారు. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ విచారణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఈనెల 16వ తేదీన ఈడీ రెండు రోజులపాటు సాయి సూర్య డెవలపర్స్ , సూరన గ్రూపులో సోదాలు నిర్వహించింది.

వారి కోసమే ఇండస్ట్రీకి దూరం అయ్యా:
కొందరు సీనియర్ హీరోయిన్స్ లాగే రంభ కూడా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించాల‌నుకుంటోంది. అక్క, వ‌దిన‌, త‌ల్లి త‌ర‌హా పాత్రలు చేయ‌డానికి రంభ రెడీ అవుతున్నట్లుగా క‌నిపిస్తోంది. ఇటీవ‌లే ఒక టీవీ షోకు జ‌డ్జిగా కూడా వ‌చ్చిన రంభ‌. ఈ నేప‌థ్యంలో త‌న సెకండ్ ఇన్నింగ్స్ గురించి రంభ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడింది..‘పెళ్లి త‌ర్వాత నేను కెన‌డాలో స్థిర‌ప‌డ్డాను. కుటుంబం, పిల్లల కోస‌మే సినిమాల‌కు దూర‌మ‌య్యాను. నా పిల్లల‌కు ఒక వ‌య‌సు వ‌చ్చే వ‌ర‌కు త‌ల్లిగా బాధ్యతగా ఎంతైనా ఉంటుంది. ఇక ఇప్పుడు మా బాబుకి ఆరేళ్లు. అమ్మాయిల‌కు 14, 10 ఏళ్లు. ప్రస్తుతం ఎవ‌రి ప‌నులు వాళ్లు చేసుకోగ‌లుగుతున్నారు. నాకు మూవీస్ మీద ఉన్న ఆస‌క్తి గురించి నా భ‌ర్తకు తెలుసు. అందుకే మ‌ళ్లీ న‌టిస్తానంటే ఒప్పుకున్నారు. ముందుగా ఒక డ్యాన్స్ షోకు జ‌డ్జిగా చేశాను. ఎందుకో తెలిదు అప్పుడు చాలా భ‌య‌ప‌డ్డాను. కానీ షో సాఫీగా సాగిపోయింది. ప్రేక్షకుల చ‌ప్పట్లు నాలో మ‌ళ్లీ ఉత్సాహం నింపాయి. న‌ట‌న నా ర‌క్తంలోనే ఉంది. మ‌ళ్లీ న‌టించ‌డానికి రెడీగా ఉన్నాను. నాతో క‌లిసి న‌టించిన చాలామంది ఇంకా ఇండ‌స్ట్రీలో ఉన్నారు.. నా చేతిలో ప్రజంట్ కొన్ని ఆఫర్ లు కూడా ఉన్నాయి. త్వర‌లోనే నేను న‌టించే సినిమాను ప్రక‌టిస్తా’ అని తెలిపింది రంభ.

అప్పుడే ఓటీటీలోకి ‘రాబిన్‌హుడ్’ మూవీ:
ఇప్పటికే డిజాస్టార్‌లు అందుకుంటున్న నితిన్, శ్రీలీల కెరీర్లో రాబిన్‌హుడ్ రూపంలో మరో డిజాస్టర్ పడిందని చెప్పాలి. ఈ రాబిన్‌హుడ్ మూవీ ఓటీటీలోకి రానుంది. జీ5 డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న ఈ మూవీ.. మే 2న స్ట్రీమింగ్‌కి రానుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో బజ్. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే థియేటర్లలో విడుదలై నెలరోజుల్లోపే ఈ సినిమా ఓటీటీ వేదికపై అందుబాటులోకి రానుంది. ఇంత తక్కువ టైమ్‌లో ఓటీటీలోకి రాబోతున్న ఈ మూవీ, థియేటర్‌లో మిస్ అయినవారికి ఇప్పుడు ఇంట్లోనే చూసే ఛాన్స్ దక్కింది. మరి థియేటర్లలో ఫెయిలైన ఈ మూవీ ఓటీటీలో మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.

 

Exit mobile version