NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్‌!

Top Headlines@9am

Top Headlines@9am

తేరుకుంటున్న పల్నాడు:
రాజకీయ ఘర్షణలతో గత మూడు రోజులుగా అట్టుడుకుతున్న పల్నాడు జిల్లా ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. పోలీసు ఉన్నతాధికారులు శాంతిభద్రతలను అదుపులోకి తెస్తున్నారు. ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ బిందు మాధవ్‌ మంగళవారం రాత్రి నుంచే మాచర్లలోనే మకాం వేయడంతో పాటు అదనపు బలగాలను మోహరింపజేసి.. పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. శాంతిభద్రతలు ఒకింత అదుపులోకి రావడంతో పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే చిరు వ్యాపారాలు తెరుచుకుంటున్నాయి. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేవరకూ 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని ఎస్పీ బిందు మాధవ్‌ తెలిపారు. ప్రస్తుతం పల్నాడు జిల్లా ప్రధాన పట్టణాల్లో భారీగా పోలీసులు మోహరించారు.

టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్న పోలీసులు:
అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైసీపీ నేతల ఇండ్లపై జరిగిన దాడులపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలలో భాగంగా టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. చిన్నమండెం మండలం పడమటికోన గ్రామం బోరెడ్డిగారిపల్లెలో రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీ నేత వండాడి వెంకటేశ్వర్లు ఇంటివద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాత్రి జరిగిన ఘటన నేపథ్యంలో టీడీపీ, వైసీపీ పార్టీ కార్యాలయాల వద్ద పోలీసు బలగాలు భారీగా మోహరించి ఉన్నాయి. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు.

నేడు ఢిల్లీకి ఏపీ సీఎస్, డీజీపీ:
మే 13వ తేదీన జరిగిన పోలింగ్ సమయంలో రాష్ట్రంలో జరిగిన హింసత్మక ఘటనలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ సీఎస్ జవహర్ రెడ్డితో పాటు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు నోటీసులు ఇచ్చింది. గురువారం ఢిల్లీకి వచ్చి దాడులపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్ తో సీఎస్, డీజపీ సమావేశం అయ్యారు. ఈ భేటీలో మాచర్ల, నరసరావుపేట, తాడిపత్రి, అనంతపురం, గురజాల ఘటనలపై సమీక్షించారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై ప్రధానంగా చర్చలు జరిపారు. ఎన్నికల తర్వాత జరుగుతున్న హింసను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి నేడు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నివేదిక రెడీ చేసినట్లు సమాచారం.

నేడు మహారాష్ట్రకు చంద్రబాబు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు పూర్తైన నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు మహారాష్ట్రకు వెళ్తున్నారు. ఆయన కొల్హాపూర్లోని శ్రీ మహాలక్ష్మీ ఆలయాన్ని సందర్శించి అక్కడ.. ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం షిర్డికి చేరుకోనున్నారు. షిర్డీలో సాయిబాబా దేవాలయాన్ని దర్శి్స్తారని టీడీపీ పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికలు పూర్తైన తర్వాత చంద్రబాబు వరుసగా ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఇటీవల వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ఆయన నేడు మహారాష్ట్ర వెళ్లనున్నారు.

నేడు బీఆర్‌ఎస్‌ రాష్ట్రవ్యాప్త నిరసన:
నేడు రాష్ట్ర వ్యాప్తంగా నియోజక వర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసన తెలపాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన అనంతరం వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి.. ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రైతాంగాన్ని మరోసారి వంచించడమే అన్నారు. కాంగ్రెస్ సర్కార్ రైతులకు మోసం, దగా చేయడమేనని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలా ప్రకటిస్తుంది? అని ప్రశ్నించారు.

మమతా బెనర్జీ కీలక ప్రకటన:
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. సీట్ల పంపకంలో తేడా రావడంతో ఇండియా కూటమితో విభేదించిన ఆమె.. ప్రస్తుతం ఆ కూటమికి జై కొట్టారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు తమ పార్టీ బయటి నుంచి మద్దతు ఇస్తుందని మమతా వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతిపక్ష కూటమి ఏర్పాటులో తాను ముఖ్య పాత్ర పోషించానన్నారు. కూటమి పేరు కూడా తానే పెట్టానని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో సీపీఐ(ఎం), కాంగ్రెస్‌లు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు.

ప్లేఆఫ్స్‌పై సన్‌రైజర్స్‌ గురి:
ఐపీఎల్‌ 2024లో అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కీలక పోరుకు సిద్ధమైంది. గురువారం ఉప్పల్‌ మైదానంలో గుజరాత్‌ టైటాన్స్‌ను ఢీకొట్టనుంది. ప్రస్తుతం 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించిన సన్‌రైజర్స్‌.. 14 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఉన్న సమీకరణాల దృష్ట్యా సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టేందుకు ఒక్క పాయింట్‌ మాత్రమే చాలు. గుజరాత్‌పై విజయం సాధిస్తే.. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సగర్వంగా ప్లేఆఫ్స్‌ చేరుతుంది. గుజరాత్‌పై ఓడినా హైదరాబాద్‌కు ప్లేఆఫ్స్‌కు చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. కానీ వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి.. టాప్‌-2లో చోటు దక్కించుకోవాలని కమిన్స్ సేన చూస్తోంది.

పాయల్ ‘రక్షణ’ రిలీజ్ డేట్ లాక్:
క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘రక్షణ’తో టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవలే ఈ సినిమా నుంచి పోస్టర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. రక్షణ జూన్ 7న థియేటర్లలోకి రానున్నట్లు వెల్లడించారు. మంగళవారం సినిమాతో చాలెంజింగ్ రోల్ ను కూడా చెయ్యగలదని పాయల్ నిరూపించింది. ఇప్పుడు మరో సస్పెన్స్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.