NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

చికెన్ మేళాకు అనుహ్య స్పందన:
బర్డ్‌ ఫ్లూ నేపథ్యంలో ప్రజల్లో అపోహలను తొలగించేందుకు రాజమండ్రిలో చికెన్ మేళాకు అనుహ్య స్పందన లభించింది. చికెన్ వంటకాలను తినడానికి నాన్ వెజ్ ప్రియులు క్యూ కట్టారు. మేళాలో వివిధ రకాల చికెన్ వంటకాలను ఏర్పాటు చేశారు. చికెన్ వంటకాలను ఆరగించడానికి నాన్ వెజ్ ప్రియులు ఎగబడ్డారు. చికెన్ హోల్ సేల్ అండ్ రిటైల్ వర్తక సంఘం ఆధ్వర్యంలో రాజమండ్రి ఆజాద్ చౌక్ సెంటర్లో ఈ చికెన్ మేళాను ఏర్పాటు చేశారు. చికెన్ 100 డిగ్రీల వేడిలో ఉడికించి తినడం వల్ల బర్డ్‌ ఫ్లూ మనిషికి వచ్చే అవకాశం లేదని తెలియజెప్పడానికి ఈ మేళా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. బర్డ్‌ ఫ్లూ భయంతో చికెన్, గుడ్డు అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపిందని నిర్వాహకులు ఆవేదన చెందారు. పౌల్ట్రీ రంగానికి అపార నష్టం వాటిల్లిందని అన్నారు. చికెన్ మేళాకు అనూహ్యస్పందన రావడం తమకు చాలా సంతోషంగా ఉందన్నారు.

సీఎం టీడీపీ నేతల కోసం పనిచేస్తారా?:
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం టీడీపీ నేతల కోసం పనిచేస్తారా?.. లేదా ప్రజలందరి కోసం పనిచేస్తారా? అని వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రశ్నించారు. తన కొడుకును సీఎం చేసుకోవటానికి నారా లోకేష్ నియోజకవర్గానికి నిధులు మళ్లిస్తున్నారన్నారని, ప్రశ్నించిన వైసీపీ నాయకులపై అక్రమ కేసులుపెట్టి జైళ్లకు పంపిస్తున్నారన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కు నిధులు కేటాయింపులు చేయకుండా మంత్రి నిమ్మల మాటలతో సరిపెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు కాదు.. విషం చిమ్మే నాయకుడు అన్నట్లుగా చిత్తూరు పర్యటనలో మాట్లాడారని ఎమ్మెల్యే తాటిపర్తి పేర్కొన్నారు.

ఎట్టకేలకు చిక్కిన బైక్ రేసర్లు:
గత కొద్ది రోజుల నుండి విశాఖ బీచ్ రోడ్డులో హల్ చల్ చేస్తున్న బైక్ రేసర్ల భరతం పట్టారు పోలీసులు. ఎన్టీవీలో ప్రసారం అయిన వార్తలకు స్పందన లభించింది. వరుస కథనాలతో పోలీస్ యంత్రాంగం కదిలింది. నగరంలో పలు చోట్ల నిఘా పెట్టి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేశారు. బైక్ రేసింగ్లకు పాల్పడుతున్న యువకులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు పోలీసులు. విశాఖలో బైక్ రేసింగ్‌లపై పోలీస్ కమిషనర్ సీరియస్ అయ్యారు. బీచ్ రోడ్లు, ఖాళీ ప్రదేశాల్లో మోడల్ బైకులుతో రేసింగ్‌లు, మితిమీరిన వేగం ప్రమాదకర విన్యాసాలతో రెచ్చిపోతున్నారు బైక్ రేసర్లు. వికెండ్స్ లో సాగర్ నగర్, జోడు గుళ్ల పాలెం, రుషి కొండ, భీమిలి ప్రాంతాల్లో మద్యం మత్తులో, గంజాయి మత్తులో జోరుగా బైక్ రేసింగ్‌లు జరుగుతున్నాయి. బైక్ రేసర్ల ఆగడాలతో వాహనదారులు హడలి పోతున్నారు. ఇంస్టాగ్రామ్ లో గ్రూపులు ఏర్పాటు చేసుకొని మరి యువత రేసింగ్లలో పాల్గొంటున్నారు. 30 మంది యువకులపై కేసుల నమోదు చేసి 38 మోడల్ బైకులు స్వాధీనం చేస్తున్నారు పోలీసులు.

చేతనైతే చంద్రబాబుపై యుద్ధం ప్రకటించు:
వనపర్తి వేదికగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. “రేవంత్ రెడ్డి నీకు చేతనైతే కృష్ణ నీటి విషయంలో చంద్రబాబుపై యుద్ధం ప్రకటించు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయినా పాత చింతకాయ పచ్చడి వాగుడే వాగుతున్నాడు. కేసీఆర్ ను తిట్టడం తప్ప ప్రజలకు పనికొచ్చే విషయం ఒక్కటి కూడా మాట్లాడడం లేదు. కన్నతల్లికి పట్టెడన్నం పెట్టలేనోడు పినతల్లికి బంగారు గాజులు కొనిస్తాడట. వంద రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీల గురించి మాట్లాడటం చేతకాదు కానీ మూసీ ప్రక్షాళన లాంటి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. పదేపదే పాలమూరు బిడ్డను అంటూ, శుష్కమైన సెంటిమెంట్ ను వల్లించడమే తప్ప పాలమూరుకు ఒరగబెట్టిందేమీ లేదు. నిజానికి పాలమూరు బిడ్డలు పనిమంతులు, రేవంత్ కు మాత్రం మాటలు ఎక్కువ చేతలు తక్కువ. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ కు కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టుల గురించే కాదు, ఏ ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. 68 శాతం కృష్ణ పరివాహక ప్రాంతం ఉన్న తెలంగాణ, 60 ఏండ్ల పాటు కృష్ణా జలాలు దక్కక అలమటించిందంటే అది ఎవరి పాపం? బంగారం పండే నల్లరేగడి భూములు ఉన్న పాలమూరు జిల్లాను వలసల జిల్లాగా మార్చిన వంచకులు మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులే కారణం. తెలంగాణను కరువు కాటకాల పాలు చేసి 60 ఏండ్లు ఘోర కలిని సృష్టించింది కాంగ్రెస్. తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే బాబుకి ఊడిగం చేసిన రేవంత్ ఇప్పుడు బాబును నొప్పించకుండా కృష్ణాజిల్లాల గురించి మాట్లాడాలనుకుంటున్నాడు. కాంగ్రెస్ మంజూరు చేసిన ప్రాజెక్టులను బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందని రేవంత్ అనడం జోక్ ఆఫ్ ద మిలీనియం.” అని హరీష్‌రావు పేర్కొన్నారు.

9 ఏళ్లు ఐనా మృతదేహాలు దొరకలేదు:
అవసరమైతే రోబోలను పంపి.. రెస్క్యూ ఆపరేషన్ లో వాడుకునే దిశగా ప్రయత్నం చేయాలని సూచించామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా సానుభూతి తెలపాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పరీక్షించిన ఆయన మీడియాతో మాట్లాడారు. 11 కేంద్ర, రాష్ట్ర సంస్థలు ఈ విపత్తు లో పనిచేస్తున్నాయన్నారు. “ఇది ఒక ప్రమాదం.. ఇది విపత్తు.. అందరం కలిసి సానుభూతి ప్రకటించాల్సిన అవసరం ఉంది. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే.. హెలికాప్టర్ ఇచ్చి మంత్రులు జూపల్లి, ఉత్తమ్ లను ఇక్కడికి పంపాను.. ఎప్పటికప్పుడు రెస్క్యూ సమాచారం తెలుసుకున్నాను.. నిమిషం నిమిషం మానిటరింగ్ చేశాను.. 8 కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం.. గతంలో శ్రీశైలం ప్రాజెక్ట్ లో ప్రమాదం జరిగితే.. నేను వచ్చే ప్రయత్నం చేసాను. నన్ను అరెస్ట్ చేశారు.” అని సీఎం తెలిపారు.

కేసీఆర్ అంటే కాళేశ్వరం:
ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట దేవుని గుట్ట తండాలో ఎండిపోయిన వరిపొలాలను మాజీ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకువచ్చి మల్కపేట రిజర్వాయర్ లో పోస్తే.. దేవుని గుట్ట తండాలోని రైతులు వ్యవసాయం చేశారు. కేసీఆర్ మీద ఉన్న కోపం, ద్వేషంతో మేడిగడ్డలో జరిగిన కుట్రపూరిత ప్రమాదాన్ని సాకుగా చూపించడంతో రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయి. సిరిసిల్ల ప్రాంతంలోని చాలామంది రైతులు సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. కాళేశ్వరం నీళ్లు రాక తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లోనూ వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లింది. కేసీఆర్ అంటే కాళేశ్వరం.. కాంగ్రెస్ అంటే శనీశ్వరం. ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు. మేడిగడ్డ పర్రెను రిపేర్ చేసి నీళ్లు ఇవ్వవచ్చు.” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్:
దేశానికి వెన్నెముక అయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు వినూత్నమైన పథకాలను తీసుకొస్తున్నాయి. నీటి సౌకర్యాలను కల్పిస్తూ.. ఆర్థిక సాయం అందించే పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ రైతులకు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రైతులకు రూ.5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్ అందించనున్నట్లు ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ప్రకటించారు. సీఎం హౌస్‌లోని సమత్వ భవన్‌లో కిసాన్ ఆభార్ సమ్మేళన్ జరిగింది. ఈ సందర్భంగా సీఎం ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసి వెంటనే అమలు చేయాలని కార్యక్రమంలో ఉన్న అధికారులను ఆయన ఆదేశించారు.

మేనల్లుడికి మాయావతి షాక్‌:
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) రాజకీయ పార్టీలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. బీఎస్పీ అధినేత్రి తన మేనల్లుడికి షాక్ ఇచ్చింది. ఆకాశ్ ఆనంద్ ను పార్టీ అన్ని పదవుల నుంచి తొలగించింది. దీంతో పార్టీకి ఇద్దరు కొత్త జాతీయ సమన్వయకర్తలు వచ్చారు. ఆకాష్ ఆనంద్ స్థానంలో ఆయన తండ్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ కుమార్, రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్‌లను బీఎస్పీ జాతీయ సమన్వయకర్తలుగా మాయావతి నియమించారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఈరోజు లక్నోలో జరిగిన పార్టీ ముఖ్యమైన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

యువకుడి వినూత్న నిరసన:
రోడ్లపై గుంతలు వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. గుంతల్లో పడి కొందరు గాయాలపాలై, మరికొందరు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఘటనలు మన దేశంలో కోకొల్లలు. రోడ్ల నిర్మాణం చేపట్టాలంటూ తమకు తోచిన పద్దతుల్లో నిరసనలు వ్యక్తం చేస్తుంటారు. ఇదే రీతిలో ఓ యువకుడు రోడ్లపై గుంతలతో విసుగెత్తిపోయి వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. రోడ్డుపై పేరుకుపోయిన నీటిలో మనిషిని పోలిన నకిలీ బొమ్మను తలకిందులుగా ఉంచి రోడ్డు దుస్థితిని ఎత్తి చూపాడు. ఈ ఘటన లండన్ లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

ఆసక్తికరంగా ‘శివంగి’ ట్రైలర్:
ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలలో దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్ పై నరేష్ బాబు పి. నిర్మించిన పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ శివంగి. జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. ఇటివలే రిలీజ్ చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ సినిమా ‘శివంగి’ థ్రిల్లింగ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అందరి జీవితంలో గుడ్ డే, బ్యాడ్ డే అని ఒక రోజు వుంటుంది. కానీ నా జీవితంలో రెండూ ఒకే రోజు జరిగాయి’ అంటూ ఆనంది చెప్పిన డైలాగ్ తో ఓపెన్ అయిన ట్రైలర్ ఆద్యంతం థ్రిల్లింగ్ సాగింది. వరలక్ష్మి శరత్‌కుమార్ కు ఆనందిని విచారించడం చాలా ఇంట్రస్టింగ్ గా వుంది.

ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు:
సినీనటి మీనాక్షి చౌదరిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. నిజానికి ఈ మధ్యకాలంలోనే మీనాక్షి చౌదరి సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. వరుసహిట్లతో దూసుకుపోతున్న ఈ అమ్మడిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్లు ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదని ఏపీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే ఫ్యాక్ట్ చెక్ పోర్టల్ నిర్ధారించింది. మీనాక్షి చౌదరిని ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారని సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం పూర్తిగా ఫేక్ అని అందులో పేర్కొన్నారు. ప్రభుత్వం పేరుతో ఉద్దేశపూర్వకంగా ఇలాంటి తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై, ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పలు సోషల్ మీడియా యూజర్లు ఈ మేరకు ఆమెకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంబాసిడర్ గా నియమించింది అంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వమే క్లారిటీ ఇవ్వడంతో ఈ ప్రచారానికి బ్రేకులు పడే అవకాశం ఉంది.

మెరిసిన శ్రేయాస్ అయ్యర్:
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా నేడు భారత్- న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు న్యూజిలాండ్‌కు 250 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత్ తరఫున శ్రేయాస్ అయ్యర్ అత్యధికంగా 79 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ (42), హార్దిక్ పాండ్య (45) పరుగులతో రాణించారు.