బెయిల్‌పై విడుదలైన గోరంట్ల మాధవ్:
వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి బెయిల్‌పై విడుదల అయ్యారు. గుంటూరు కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పదివేల పూచీకత్తు, ఇద్దరు జామీన్ల హామీతో బెయిల్ మంజూరైంది. రెండు నెలల పాటు ప్రతి శనివారం గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో సంతకం చేయాలన్న కోర్టు ఆదేశించింది. గోరంట్ల మాధవ్ ఈ నెల 11 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఇక మాధవ్ సహా రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉన్న ఐదుగురు అనుచరులు కూడా బెయిల్‌పై విడుదల అయ్యారు. గత నెల 10న టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ తో పాటు ఎస్కార్ట్ పోలీసులపై దాడి చేసిన కేసులో గోరంట్ల మాధవ్ అరెస్ట్ అయ్యారు.
ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వందే:
ఏలూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో టార్గెట్ పేరుతో రైతులను అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న మాటల్లో వాస్తవం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ సంవత్సరం పంట దిగుబడి ఎక్కువగా ఉండటంతో కొంత సమస్య ఏర్పడిందని, లక్ష్యానికి మించి దాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతులు వద్ద ప్రతిదాన్యం గింజ కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి మాటలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమరావతికి ప్రధాని రాక నేపథ్యంలో కూటమి నేతలతో మంత్రి నాదెండ్ల సమీక్ష సమావేశం నిర్వహించారు.
జైల్లో మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదు:
విజయవాడ జిల్లా జైల్లో తనకు మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదని కోర్టుకి సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులు తెలిపారు. పూజకు పుస్తకాలు, పెట్టుకోవటానికి బొట్టు ఇవ్వటం లేదని జడ్జికి చెప్పారు. తాను విచారణకు సహకరిస్తున్నారని, మరోసారి కస్టడీకి తీసుకున్నా సహకరిస్తానన్నారు. జైల్లో తాను వెళ్లిన తర్వాత తన కారణంగా వేరే వారికి కూడా సౌకర్యాలు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను జైలుకి వెళ్లిన తొలి రోజున టీవీ ఉందని, వాకింగ్ వెళ్లి వచ్చేసరికి టీవీ లేదని కోర్టుకి పీఎస్‌ఆర్ తెలిపారు. ఈ సదుపాయాలపై పిటిషన్ వేరేగా దాఖలు చేసుకోవాలని జడ్జి సూచించారు. కస్టడీలో ఇబ్బంది పెట్టారా? అని ప్రశ్నించగా.. లేదని పీఎస్‌ఆర్ బదులిచ్చారు. పీఎస్‌ఆర్‌ను కోర్టు నుంచి జైలుకు తరలించారు.
టెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్:
నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టిసారించింది. ఇప్పటికే గ్రూప్స్, డీఎస్సీ ఉద్యోగాలను భర్తీ చేసింది. మరోసారి పలు ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు రెడీ అవుతోంది. దీనిలో భాగంగా ఇటీవల టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డీఎస్సీకి అర్హత సాధించాలంటే టెట్ క్వాలిఫై తప్పనిసరి. ఇప్పటికే వేల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా అప్లై చేసుకోని వారికి బిగ్ అలర్ట్. తెలంగాణలో రేపటితో అంటే ఏప్రిల్ 30తో టెట్ దరఖాస్తు గడువు ముగియనున్నది. వెంటనే అప్లై చేసుకోండి. ఈ ఏడాది టెట్ పరీక్షలు జూన్ 15 నుంచి 30 మధ్య నిర్వహించనున్నారు.
ప్రీమియర్ ఎక్స్ ఫ్లోజివ్ కంపెనీలో పేలుడు:
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మోటకొండూరు మండలంలోని ప్రీమియర్ ఎక్స్ ఫ్లోజివ్ కంపెనీలో పేలుడు సంభవించింది. పేలుడు ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పేలుడు ధాటికి భవనం కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న నలుగురు కార్మికులు గాయపడ్డారు. మరో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
ప్రధాని మోడీ నివాసానికి ఆర్ఎస్ఎస్ చీఫ్:
ఢిల్లీలో పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. వరసగా సమావేశాలతో ప్రధానితో సహా కేంద్ర మంత్రులు బిజీ బిజీగా ఉన్నారు. మంగళవారం, ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు – ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చని ప్రధాని మోడీ త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. టైమ్, టార్గెట్, ప్లేస్ అంతా సైన్యానికే వదిలిపెట్టారు. ఉగ్రవాదంపై ప్రతీకారం తీర్చుకునే విషయంలో ఆయన సైన్యంపై పూర్తి నమ్మకం ఉంచుతున్నట్లు చెప్పారు.
మోడీ సంచలన నిర్ణయం:
పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకున్న చర్యలపై ప్రధాని నరేంద్రమోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనిపై స్పందించడానికి భారత త్రివిధ దళాలకు పూర్తిగా స్వేచ్ఛను ఇచ్చారు. ప్రధాని మోడీ నివాసంలో జరిగిన అత్యున్నత సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని మోడీ ఆదేశించారు. 90 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ సిబ్బంది చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు – ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు.
మే 29న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి భారత వ్యోమగామి:
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లో అడుగుపెట్టిన రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డులకు ఎక్కబోతున్నాడు. ఈయన స్పేస్‌ఎక్స్ (SpaceX) సంస్థ అభివృద్ధి చేసిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌కు పైలట్‌గా వ్యవహరించబోతున్నారు. ఇందుకు సంబంధించిన అనుమతి కూడా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) నుండి ఇటీవల లభించింది. తాజాగా అంతరిక్ష కేంద్రానికి శుక్లా మే 29న వెళ్లనున్నట్లు అధికారికంగా యాక్సియమ్ (Axiom) తెలిపింది. యాక్సియమ్-4 మిషన్‌లో భాగంగా ఆయన మే 29న ఐఎస్‌ఎస్‌కు వెళ్లనున్నారు.
పాకిస్తాన్‌ని బిగ్ షాక్ ఇచ్చిన మిత్రదేశం టర్కీ:
పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కమ్ముకుంది. రెండు దేశాలు కూడా యుద్ధానికి సిద్ధమయ్యేందుకు అవసరమైన మిలిటరీ ఎక్సర్‌సైజులు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఈ ఉగ్రవాద దాడిపై పలు దేశాలు స్పందించాయి. అమెరికా, రష్యా, ఇజ్రాయిల్, ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాలు భారతదేశానికి మద్దతు పలికాయి. ఉగ్రవాదాన్ని అణిచివేయాలని, ఈ విషయంలో భారత్‌కి తాము మద్దతు తెలుపుతామని చెప్పాయి. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ కూడా తన మిత్రులను కలుసుకుంటోంది. ప్రస్తుతం పాకిస్తాన్‌కి టర్కీ, చైనా, మలేషియా, అజర్ బైజార్ మంచి మిత్రులుగా ఉన్నాయి. తాజాగా, వస్తున్న సమాచారం ప్రకారం, టర్కీ పాకిస్తాన్‌కి ఈ వివాదంలో సాయం చేయలేమని ప్రకటించినట్లు సమాచారం. పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో టర్కీ, పాకిస్తాన్‌కి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పంపినట్లు వార్తలు వచ్చాయి. సైనిక పరికరాలను ఇచ్చేందుకు టర్కీష్ C-130E హెర్క్యులస్ కరాచీలో దిగిందని నివేదికలు తెలిపాయి. దాదాపుగా ఆరు C-130E విమానాలు పాకిస్తాన్‌లో దిగాయని పలు మీడియా సంస్థలు పెర్కొన్నాయి.
బన్నీ కోసం డిజాస్టర్ హీరోయిన్:
పుష్ప లాంటి వరుసగా రెండు బ్లాక్‌బస్టర్ హిట్ సిరీస్‌ల తర్వాత, ఇప్పుడు అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ముంబైలో నిశ్శబ్దంగా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్‌లకు అవకాశం ఉందని ఒక వార్త వెలుగులోకి వచ్చింది. అందులో ముగ్గురు అల్లు అర్జున్ సరసన నటించనుండగా, మరో ఇద్దరు సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో మృణాళ్ ఠాకూర్ ఒక హీరోయిన్‌గా ఎంపికైంది, దానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. అలాగే, దీపికా పదుకొణెను కూడా ఈ సినిమాలో తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది, కానీ అది ఇంకా ఖరారు కాలేదు.
అబ్బే ఆ హీరోయిన్లు సినిమాలో లేరట:
లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి దారుణమైన వైఫల్యాల తర్వాత, దర్శకుడు పూరీ జగన్నాథ్ చాలా గ్యాప్ తీసుకుని పకడ్బందీగా స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఇప్పుడు పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి హీరోగా ఒక సినిమాను అనౌన్స్ చేశాడు. అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా నటీనటుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. విజయ్ సేతుపతి లాంటి హీరోకి కథ చెప్పి ఒప్పించడమే పెద్ద టాస్క్. అయినప్పటికీ, కథ ఒప్పించడంతో తన పని అయిపోయిందనుకోకుండా, నటీనటులందరినీ ఉత్తమంగా ఎంపిక చేసేలా సిద్ధమవుతున్నాడు. ముందుగా ఈ టీంలోకి టబు వచ్చింది, తర్వాత దునియా విజయ్‌ను విలన్‌గా ఎంపిక చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్‌లకు అవకాశం ఉందని ప్రచారం జరిగింది. వారిలో ఒకరు నివేదా థామస్, మరొకరు రాధికా ఆప్టే అని ప్రచారం మొదలైంది. అయితే, ఇది కేవలం ప్రచారం మాత్రమే, ఎందుకంటే వీరిద్దరి పేర్లు పరిశీలనలో లేవు. నిజానికి, ఈ సినిమాలో ఒకే ఒక హీరోయిన్‌కు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇప్పటికే తెలుగు డైరెక్టర్, తమిళ హీరో, కన్నడ విలన్, బాలీవుడ్‌తో పాటు సౌత్‌లో క్రేజ్ ఉన్న డబ్బు లాంటి నటిని రంగంలోకి దించిన పూరీ, హీరోయిన్‌ను బాలీవుడ్ నుంచి ఎంపిక చేసే అవకాశం ఉంది.
మొదట బ్యాటింగ్ చేయనున్న కేకేఆర్:
ఐపీఎల్‌లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ ఇరుజట్లకు రెండింటికీ కీలకం కానుంది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేఆప్స్ చేరుకునేందుకు ప్రయత్నిస్తుంది. మరోవైపు, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా విజయం సాధించి ప్లేఆప్స్ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది. పాయింట్ల పట్టికలో ఢిల్లీ జట్టు నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ భారీ పోటీ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎటువంటి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. ఇక నేడు జరగబోయే ఇరుజట్ల ఆటగాళ్ల ప్లేయింగ్ XI ఇలా లిస్ట్ ఇలా ఉంది.
