టీడీపీ నాయకుల హత్యలకు పిన్నెల్లికి ఏంటి సంబంధం?:
తెలుగుదేశం నాయకుల హత్యలకు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి ఏంటి సంబంధం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రహనించారు. హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన స్కార్పియోపై జేబీఆర్ అని ఉందని.. జేబీఆర్ అంటే జూలకంటి బ్రహ్మారెడ్డి కానీ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కాదన్నారు. హత్యకు గురైన వారి బంధువులు కూడా తెలుగుదేశం నాయకులే చంపారని చెప్పారని.. కానీ ఈ హత్యలో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామి రెడ్డిని ఇరికించడం దారుణమన్నారు. జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రోద్బలంతోనే పిన్నెల్లి సోదరులపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. పోలీసులు తెలుగుదేశం పార్టీకి జేబు సంస్థగా పని చేస్తున్నారని అంబటి మండిపడ్డారు.
జగన్‌పై పెట్టినవన్నీ అక్రమ కేసులే:
వైసీపీ నేతలు, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కూటమి ప్రభుత్వంపెట్టినవన్నీ అక్రమ కేసులే అని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని, తప్పకుండా అన్నీ కేసుల నుంచి ఏమీ లేకుండా బయటకు వస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా రైతుల కోసం పోరాటం చేస్తున్నాం అని, గిట్టుబాటు ధరలు లేక పొగాకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఇబ్బందులు లేకుండా మార్జ్ ఫీడ్ ద్వారా కొనుగోలు చేయించాం అని గుర్తు చేశారు. రైతులకు వైసీపీ అండగా ఉంటుందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
తేల్చేందుకు కమిటీ ఏర్పాటు:
మిస్ వరల్డ్ పోటీలపై వచ్చిన సంచలన ఆరోపణల్లో నిజమెంతో తేల్చేందుకు డీజీ శిఖాగోయెల్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై విచారణకు సీనియర్ ఐపీఎస్‌లతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. రెమా రాజేశ్వరి, సైబరాబాద్ ఎస్‌బీ డీసీపీ సాయి శ్రీ నేతృత్వంలో కమిటీ విచారణ చేపట్టింది. పోటీల నిర్వహణపై కంటెస్టెంట్ల నుంచి సమాచారం సేకరిస్తుంది. మిల్లా మాగీ ఆరోపణల్లో నిజమెంతన్నదిపై దర్యాప్తులో తేలనుంది.
తెలుగు రాష్ట్రాల అంశాలను ప్రస్తావించిన ప్రధాని మోడీ:
“మన్ కీ బాత్” లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై ప్రధాని మోడీ ప్రస్తావించారు. “డ్రోన్ దీదీలు” తెలంగాణలో వ్యవసాయంలో పెను మార్పులు తీసుకొస్తున్నారని వెల్లడించారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా మహిళలు డ్రోన్లతో వ్యవసాయం చేయడాన్ని మోడీ ప్రశంసించారు. “గ్రామీణ మహిళలు డ్రోన్ ఆపరేటర్లుగా శిక్షణ పొందారు. పండ్ల తోటలకు పురుగుమందులు, శీల్దార పిచికారీ కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారు. సాంప్రదాయ పద్ధతులకంటే వేగంగా, సమర్థవంతంగా పురుగుమందులను పిచికారీ చేయవచ్చు. నీటిని, మందుల వినియోగాన్ని 30–40 శాతం వరకు తగ్గించవచ్చు. మహిళల ఆత్మవిశ్వాసం, స్వావలంబన పెరిగింది. “డ్రోన్ టెక్నాలజీ”ని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లడంలో ఈ పరిణామం ఒక గొప్ప ముందడుగు. కేంద్ర ప్రభుత్వం ‘డ్రోన్స్ ఫర్ అగ్రికల్చర్’ పథకం కింద మహిళా సమూహాలకు రాయితీతో డ్రోన్లు అందిస్తోంది. శిక్షణా కేంద్రాలు, “డ్రోన్ లైసెన్సింగ్” సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి.” అని మోడీ వెల్లడించారు. ఈ మహిళలను “స్కై వారియర్స్”గా మోడీ సంబోధించారు.
వృద్ధుడితో 28 ఏళ్ల యువతి అసభ్యకర చేష్టలు:
పోలీసుల సమాచారం ప్రకారం.. బిచోలి మర్దానా గ్రామానికి చెందిన బాధితుడు మదన్ సింగ్(61) ఇండోర్‌లోని మక్వానా కాంప్లెక్స్‌లోని ఒక సూపర్ మార్కెట్‌కు తన దుకాణాన్ని అద్దెకు ఇచ్చాడు. వినీత్ జైన్ అనే వ్యక్తి ఆ సూపర్ మార్కెట్ నడుపుతున్నాడు. ఆ భవన యజమాని అయిన 61 ఏళ్ల వృద్ధుడు మదన్ సింగ్ దుకాణానికి వచ్చి వెళ్ళేవాడు. పహాడీ టేక్రిలో నివాసముంటున్న సంతోష్ మానవత్ భార్య వైశాలి(28) ఇదే షాపులో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తుంది. దుకాణంలోకి వస్తూ పోతూ ఉండగా మదన్ సింగ్‌తో మాటలు కలిపింది. రెండేళ్ల కిందట వైశాలి వృద్ధుడికి ఫోన్ చేసి కలవమని కోరింది. ఆ వృద్ధుడిని తన బుట్టలో వేసుకుంది. మదన్ సింగ్ ఆమెను తన కారులో తిప్పాడు. అలాగే కారులో ఉజ్జయినికి వెళ్లారు. అక్కడ రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక హోటల్‌లో గది తీసుకున్నారు. నిందితురాలు వైశాలి మదన్ సింగ్ ని ఆహారం తీసుకురామని గది నుంచి బయటకు పంపింది. ఇంతలో వైశాలి తన మొబైల్ ఫోన్‌ను వీడియో రికార్డింగ్ మోడ్‌లో పెట్టి దాచింది. ఆహారంలో సైతం ఏదో కలిపింది. అది తిన్న మదన్ సింగ్ స్పృహ తప్పి పడిపోయాడు. ఆ తర్వాత వైశాలి వృద్ధుడితో అసభ్యకరమైన రీతిలో ఫొటోలు, వీడియోలు తీసుకుంది. కొన్ని రోజుల తర్వాత.. వైశాలి ఆ మదన్ సింగ్ కి ఫోన్ చేసి ఫొటోలు, వీడియోలు బయట పెడతానని బెదిరించింది. నిందితురాలు వైశాలి మదన్ సింగ్ ని దుకాణానికి పిలిపించి ఒక వీడియో చూపించింది. కుటుంబ సభ్యులకు చెబుతానని చెప్పింది. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి పరువు తీయడమే కాకుండా, జైలుకు పంపుతామని బెదిరించింది. బాధితుడు ఈ వయసులో ఇవన్నీ బయటపడితే బాగుండదని భావించాడు. దీంతో వాటిని డిలీట్ చేయడానికి వైశాలి రూ.50 లక్షలు డిమాండ్ చేసింది.
మరో నిర్భయ.. గిరిజన మహిళపై దారుణం:
మధ్యప్రదేశ్‌లో నిర్భయ తరహా ఘటన జరిగింది. గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులు, ఆమెపై చిత్రహింసలకు పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావంతో మహిళ మరణించింది. ఖాండ్వాలో ఖల్వా పరిధిలోని రోష్నీ చౌకీ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ దారుణమైన అత్యాచారం, హత్య జరిగింది. బాధిత మహిళ ఇద్దరు పిల్లల తల్లి అని పోలీసులు తెలిపారు. మహిళను ఆమె కూతురు పొరుగున ఉన్న ఇంట్లో అపస్మారక స్థితిలో గుర్తించారు. అత్యాచారం చేసిన వ్యక్తులు ఆమె ప్రైవేట్ భాగాల్లో ఇనుప రాడ్‌ని చొప్పించి, ఆమె గర్భాశయాన్ని బయటకు తీశారని పోలీసులు తెలిపారు. తీవ్ర రక్తస్రావంతో ఆమె చనిపోయింది. మహిళతో పరిచయం ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెపై సామూహిక అత్యాచారం చేసినట్లు అనుమానిస్తున్నారు. నిందితులను హరి పాల్వి, సునీల్ దుర్వేగా గుర్తించారు. వీరి ఇంట్లోని బాధితురాలి మృతదేహం లభ్యమైంది. మహిళ మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు.
అత్యాచార బాధిత, మైనర్ బాలిక ప్రసవానికి హైకోర్టు అనుమతి:
31 వారాల గర్భవతి అయిన మైనర్ బాలిక తన బిడ్డను ప్రసవించడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు అనుమతించింది. జస్టిస్ వినయ్ సరాఫ్ నేతృత్వంలోని సింగ్ బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. బిడ్డ పుట్టిన తర్వాత పూర్తి వైద్య సంరక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. లైంగిక వేధింపులకు గురైన మైనర్ గర్భం దాల్చిందని పోలీసులు అదనపు జిల్లా జడ్జి (ADJ) కోర్టుకు తెలియజేశారు. అయితే, ఆ సమయంలో పిండానికి 29 వారాల 6 రోజుల వయసు అని వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది.
బ్రహ్మోస్ మిస్సైల్” తయారీ కోసం భారత్, రష్యా చర్చలు:
ఆపరేషన్ సిందూర్‌లో భారత్ ఉపయోగించిన ‘‘బ్రహ్మోస్ మిస్సైల్స్’’ శక్తిని ప్రపంచమంతా చూసింది. ముఖ్యంగా, పాకిస్తాన్ కి చెందిన 11 ఎయిర్ బేస్‌లపై దాడుల్లో బ్రహ్మోస్ పనితనం బయటపడింది. అయితే, ఇప్పుడు అడ్వాన్సుడ్ బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ కోసం భారత్, రష్యాలు చర్చలు జరుపుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు రష్యా పూర్తి సాంకేతిక సహాయాన్ని అందించిందని పలు నివేదికులు పేర్కొన్నాయి. లక్నోలో కొత్తగా ప్రారంభించబడిన బ్రహ్మోస్ తయారీ ఫెసిలిటీలోనే అధునాతన బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేసే లక్ష్యంతో ఇప్పటికే చర్చలు జరిగాయని తెలుస్తోంది.
అమెరికా యుద్ధాల వల్ల లాభపడుతోంది:
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత నుంచి పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ వరసగా వార్తల్లో నిలుస్తున్నారు. ఉగ్ర ఘటన తర్వాత, పాశ్చాత్య మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా, వెస్ట్రన్ దేశాల ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ దాడి చేస్తుంటే, వింత ప్రకటనలు చేస్తూ పాకిస్తాన్ ప్రజల నుంచే ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. తాజాగా, ఆయన అమెరికా గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అమెరికా తన ఆయుధ పరిశ్రమకు ప్రయోజనం చేకూర్చడానికి ఉద్దేశపూర్వకంగా ప్రపంచ సంఘర్షణలను పెంచుతున్నాయని అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా దీనిపై చర్చ నడుస్తోంది. ఆయన వ్యాఖ్యలను విమర్శిస్తున్న వారు కూడా ఉన్నారు.
రిటైర్మెంట్‌పై ఎంఎస్ ధోనీ కీలక వ్యాఖ్యలు:
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, లెజెండరీ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ గురించి ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ధోనీ రిటైర్మెంట్ ఇస్తున్నాడని, ఐపీఎల్‌లో నేడు చివరి మ్యాచ్ ఆడుతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ అనంతరం తన రిటైర్మెంట్‌పై మహీ స్వయంగా స్పందించాడు. తనకు నిర్ణయం తీసుకోవడానికి ఇంకా 4-5 నెలల సమయం ఉందని, ఇప్పుడే తొందరేమీ లేదని తెలిపాడు. తాను రిటైర్మెంట్ ఇస్తానని చెప్పడం లేదని, అలాగని వచ్చే ఏడాది ఆడుతానని కూడా చెప్పడం లేదని ధోనీ చెప్పుకొచ్చాడు.
ఓజీ రిలీజ్ డేట్ ఫిక్స్:
పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసింది. మరీ లేట్ చేయకుండా 2025 సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా మూవీ టీమ్ ప్రకటించింది. సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ రీ స్టార్ట్ అయింది. నెలలుగా పెండింగ్ లో ఉన్న షూటింగ్ లో రీసెంట్ గానే పవన్ అడుగు పెట్టారు. వరుసగా డేట్లు కూడా కేటాయించేశారు. ఒకే షెడ్యూల్ లో మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేయాలని ఇప్పటికే టీమ్ కు సూచించారు.
మాస్ పాట పాడిన శృతిహాసన్:
హీరోయిన్ శృతిహాసన్ కు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న ఈ బ్యూటీ.. మల్టీ ట్యాలెంటెడ్ అనే విషయం తెలిసిందే. తాజాగా స్టేజి మీదనే పాటపాడి అందరినీ అలరించేసింది. కమల్ హాసన్ నటిస్తున్న తాజా మూవీ థగ్ లైఫ్. ఈ సినిమా జూన్ 5న రాబోతోంది. మణిరత్నం దర్శకత్వంలో చాలా ఏళ్ల తర్వాత కమల్ హాసన్ నటిస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ మూవీలో శింబు, త్రిష కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శృతిమాసన్ ‘విన్వెళి నాయగ’ అనే పాట పాడిన విషయం తెలిసిందే. తాజాగా చెన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ స్టేజి మీద శృతి లైవ్ లో అందరి ముందు ఆ పాట పాడి అదరగొట్టింది.
