కూటమి నేతల మధ్య విభేదాలు.. చెక్ పెట్టే పనిలో పెద్దలు:
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య ఏర్పడిన విభేదాలకు చెక్ పెట్టే పనిలో ఇరు పార్టీల పెద్దలు రంగంలో దిగినట్టు తెలుస్తోంది. విజయవాడలో తాడేపల్లిగూడెంకు చెందిన టీడీపీ ఇంచార్జి వలవల బాబ్జి, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌లతో సమన్వయ కమిటీ భేటీ నిర్వహించింది. ఇద్దరి మధ్య ఏర్పడిన విభేదాలను పక్కన పెట్టి పనిచేయాలని పార్టీ పెద్దలు సూచించినట్లు సమాచారం. తాడేపల్లిగూడెంలో జనసేన, టీడీపీ మధ్య విభేదాలేమీ లేవని.. ప్రజల సంక్షేమం కోసం టీడీపీ-జనసేన కలిసి పనిచేస్తాయని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్పష్టం చేశారు. తనతో పాటు తిరిగే కొంతమంది టీడీపీ నేతలు తన చావు కోసం ఎదురుచూస్తున్నారు అంటూ తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ సమన్వయ భేటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఏపీలో సీబీజీ ప్లాంటు ఏర్పాటుకు ముందుకొచ్చిన ఆర్వెన్సిస్ గ్రూప్:
ఏపీలో కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) ప్లాంట్ నిర్మాణానికి ఆస్ట్రేలియాకు చెందిన ఆర్వెన్సిస్ గ్రూప్ ముందుకొచ్చింది. ఆర్వెన్సిస్ గ్రూప్ సంస్థ ప్రతినిధులు ఈరోజు తాడేపల్లిలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్‌ను కలిశారు. ఈ సమావేశంలో ప్రకాశం జిల్లాలో సీబీజీ ప్లాంట్ నిర్మాణానికి ఒకే చెప్పారు. తొలుత రూ.150 కోట్లతో తొలి ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 12-20 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళికలు రచించారు. భూ కేటాయింపులు, ఇతర అనుమతుల అనంతరం సీబీజీ ప్లాంట్ ఏర్పాటుకు ఆర్వెన్సిస్ గ్రూప్ ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు. సింగిల్ విధానం ద్వారా అనుమతులు ఇవ్వనున్నట్లు సంస్థ ప్రతినిధులకు మంత్రి గొట్టిపాటి తెలిపారు. సీబీజీ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు రావడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
రేపు తెలంగాణ గవర్నర్ను కలవనున్న కాంగ్రెస్ బీసీ నేతలు:
రేపు ఉదయం 10:30 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు కలవనున్నారు. ఏప్రిల్ 8వ తేదీన బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ శాసన సభలో చేసిన బిల్లుకు ఆమోదం తెలపడంతో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకి కాంగ్రెస్ బీసీ నేతలు ధన్యవాదాలు తెలపనున్నారు. అయితే, రేపు (మే 2న) ఉదయం రాజ్ భవన్ తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, కేశవరావు ,మధుయాష్కి గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, దండే విఠల్, విజయశాంతి, నారాయణ, ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, వాకటి శ్రీహరి, మక్కన సింగ్ రాజ్ ఠాకూర్, ఈర్లపల్లి శంకర్, ప్రకాష్ గౌడ్, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు.
పాలమూరు జిల్లాను గత బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైంది:
ఎస్ఎల్బీసీ టన్నెల్ సంఘటన దురదృష్టకరం అని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. బాధ్యతగా ఆ కుటుంబ సభ్యులను ఆదుకుంటాం.. దొరకని ఆరు మృతదేహాలు బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాం.. ప్రభుత్వపరంగా ఒక్కో కుటుంబానికి 25 లక్షల నష్ట పరిహారం చెల్లించాం.. జియో లాజికల్ సర్వే సూచన మేరకే రెస్కూ ఆపరేషన్ నిలిపివేశాం.. ఆరు మృతదేహాల ఘటన స్థలంలో క్రిటికల్ కండిషన్ ఉంది, రెస్క్యూ సిబ్బంది ప్రాణాలకు ముప్పు పొంచి ఉండటంతో పనులు ఆపేశాం.. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల పూర్తి కోసం హై లెవెల్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ వేశామన్నారు. 2026 మార్చి 31వ తేదీ వరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ హామీ ఇచ్చారు.
పాక్‌పై యుద్ధంలో సిక్కులు పాల్గొనవద్దు:
పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇలాంటి సమయంలో, ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌తో భారత్ యుద్ధం చేస్తే సిక్కులు ఈ యుద్ధంలో పాల్గొనవద్దని పిలుపునిచ్చాడు. ‘‘భారత్ పాకిస్తాన్‌పై దాడి చేస్తే, అది భారత్ మరియు మోడీకి చివరి యుద్ధం అవుతోంది. పంజాబీలు పాకిస్తాన్‌కి మద్దతుగా నిలుస్తారు. పంజాబ్ పాకిస్తాన్‌కి వెన్నెముక అవుతుంది’’ అంటూ ఒక వీడియో సందేశంలో పిలుపునిచ్చినట్లు పాక్ మీడియా నివేదించింది. భారత్ పంజాబ్‌లో సైనిక కంటోన్మెంట్ ప్రాంతాల్లోని గోడలపై సిక్కులు ఈ యుద్ధంలో పాల్గొనవద్దని రాస్తున్నట్లు ఆయన అబద్ధాలను ప్రచారం చేయడం ప్రారంభించాడు. పన్నూ వ్యాఖ్యలకు ముందు, పాక్ సెనెటర్ పాల్వాషా మొహమ్మద్ జై ఖాన్ మాట్లాడుతూ.. భారత సైన్యంలోని ఏ సిక్కు సైనికుడు కూడా పాకిస్తాన్‌పై దాడి చేయడని అన్నారు. పాక్ గురునానక్ భూమి అని సిక్కులు తమపై దాడి చేయరని అన్నారు.
బంగ్లాదేశ్‌లో పాక్ సైనిక అధికారులు:
పహల్గామ్ ఉగ్రవాద దాడి భారత్, పాకిస్తాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తత, యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. 26 మందిని బలి తీసుకున్న ఈ ఉగ్రదాడిలో పాకిస్తాన్, లష్కరే తోయిబా ప్రమేయం ఉన్నట్లు స్పష్టంగా తేలింది. అయితే, పాకిస్తాన్ ఇప్పటికే తన సైన్యాన్ని భారత సరిహద్దుల్లో మోహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్, బంగ్లాదేశ్ సాయంతో భారత సరిహద్దుల్లో అలజడి సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం వస్తోంది. ఈమేరకు బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల్లో భారత్ హై అలర్ట్ ప్రకటించింది. రాడికల్ గ్రూపులను పాకిస్తాన్ గూఢచార సంస్థ “ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్” (ఐఎస్ఐ) యాక్టివ్ చేసినట్లు తెలుస్తోంది. రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తోందని భారత నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. హై సర్వెలైన్స్‌లో నిఘా వర్గాలు ఉన్నాయి. బంగ్లా సరిహద్దుల్లో భారత సైనిక దళాలు అప్రమత్తమయ్యాయి.
కరాచీ, లాహోర్ ఎయిర్‌స్పేస్‌ని పాక్షికంగా మూసేసిన పాకిస్తాన్:
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌కి భయాందోళనలు పెరిగాయి. కాశ్మీర్ అందాలను చూస్తున్న అమాయకపు ప్రజలపై పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌పై, టెర్రరిజంపై కఠిన చర్యలు తీసుకోవాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే సింధు జలాల ఒప్పందం భారత్ రద్దు చేయడంతో పాకిస్తాన్ హడలి చేస్తోంది. మరోవైపు, భారత్ సైనిక చర్యకు దిగుతుందనే సమాచారంతో దాయాది దేశం భయపడుతోంది. ఈ నేపథ్యంలో పీఓకే, గిల్గిత్ ప్రాంతాలకు ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ నుంచి వెళ్లే విమానాలను రద్దు చేసుకుంది. మరోవైపు, భద్రతా కారణాలను చెబుతూ.. పాకిస్తాన్ విమానయాన అధికారులు మే 1 నుంచి మే 31, 2025 వరకు కరాచీ, లాహోర్ ఎయిర్ స్పేస్‌లను పాక్షికంగా మూసేస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్ విమానాశ్రయాల అథారిటీ (PAA) జారీ చేసిన ఎయిర్‌మెన్‌లకు నోటీసు (NOTAM) జారీ చేసింది. ఈ నెల పొడవునా ప్రతీ రోజు ఉదయం 4 గంటల నుంచి 8 గంటల మధ్య ఈ రెండు నగరాల గగనతలాన్ని పాక్షికంగా మూసివేయబడుతాయి.
బంగ్లాదేశ్ ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమిస్తుంది:
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 26 మందిని బలిగొన్న ఈ ఉగ్రవాద ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్‌పై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే భారత్, దాయాది దేశానికి దౌత్యపరమైన షాక్‌లు ఇస్తోంది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాటు పాకిస్తాన్ జాతీయులకు వీసాలు రద్దు చేసింది. ఇక పాకిస్తాన్‌కి బిగ్ షాక్ ఇస్తూ భారత్ తన గగనతలాన్ని పాక్ విమానాలకు బ్లాక్ చేసింది. ఇదిలా ఉంటే, షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా గద్దె దిగిన తర్వాత, మహ్మద్ యూనస్ అధికారం చేపట్టారు. అప్పటి నుంచి పాకిస్తాన్‌తో సంబంధాలు పెట్టుకోవడానికి తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ ప్రభుత్వంలోని సీనియర్ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2009 బంగ్లాదేశ్ రైఫిల్స్ (BDR) ఊచకోతను దర్యాప్తు చేస్తున్న జాతీయ స్వతంత్ర విచారణ కమిషన్ చైర్‌పర్సన్ మేజర్ జనరల్ (రిటైర్డ్) A.L.M. ఫజ్లూర్ రెహమాన్ మాట్లాడుతూ.. ‘‘భారత్ పాకిస్తా్న్‌పై దాడి చేస్తే, బంగ్లాదేశ్ ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకుంటుది. ఈ విసయంలో చైనాతో ఉమ్మడి సైనిక వ్యవస్థపై చర్చలను ప్రారంభించడం అవసమరం ’’ అని బెంగాలీలో ఆయన సోషల్ మీడియా చేశారు.
‘హిట్3’ వైబ్ అదిరిపోయింది:
నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం ‘హిట్ 3’. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం ఇపుడు యూనానిమస్‌గా సాలిడ్ పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. అటు రివ్యూస్ సహా ఆడియెన్స్ నుంచి కూడా పాజిటివ్ టాక్ రావడంతో.. హిట్ 3 మాస్ మేనియా చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు నాని. ఇక అందరినీ ఆకట్టుకొని ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకున్న సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో భాగంగా నాని మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం. ఇది ఒక అద్భుతమైన రిలీజ్‌డే. పొద్దున లేచి చూస్తే నా ఫోను మెసేజ్ లతో నిండిపోయింది. ఇండస్ట్రీ, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ సినిమా గురించి అద్భుతంగా రెస్పాండ్ అవుతున్నారు. చాలా రిలీజ్ డేస్ చూసాను. ఇది జస్ట్ బిగినింగ్ ఆఫ్ హిట్ 3 జర్నీ.. ఈరోజు నుంచి ప్రతి రోజు కూడా ఒక సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది. మీ అందరి ప్రేమను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఈ సినిమాకి కనీసం నాలుగైదు సెలబ్రేషన్స్ చేయాలి. ఈసారి నేను ప్రొడ్యూసర్ కూడా కాబట్టి ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఉంది. నేను మీరు ఒకటేనని నమ్మిన ప్రతిసారి, మీరు నేను కరెక్ట్ అని ప్రూవ్ చేస్తునందుకు మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమాని ఇంత అద్భుతంగా సపోర్ట్ చేసి మీడియాకి థాంక్యూ సో మచ్. మీ సపోర్ట్ వలనే ఈ బ్లాక్ బస్టర్ సాధ్యమైంది. మే ఫస్ట్ స్టార్ట్ అయింది. మే అంత ఇది సెలబ్రేషన్స్ లాగా ఉండాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
చిరంజీవి ఫ్యాన్స్ సపోర్ట్‌తోనే ఈ స్థాయికి:
ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్‌లో ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES) 2025 చాలా ఘనంగా మొదలైంది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు సాగనున్న ఈ ఈవెంట్లో 90కి పైగా దేశాల నుంచి, పదివేల మందికి పైగా ప్రతినిధులు, 300కి పైగా కంపెనీలు, 350కి పైగా స్టార్టప్‌లు పాల్గోంటున్నారు. అలాగే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ భారత సినిమా ఇండస్ట్రీకి చెందిన సినీ తారలు, వ్యాపార దిగ్గజాలు, కేంద్ర మంత్రులు కూడా భాగం అవుతున్నారు. కాగా ఈ వేదికలో భాగంగా.. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వేవ్స్ సమిట్‌ను నిర్వహించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. అలాగే తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.. ‘ మా తాత అల్లు రామలింగయ్య 1000కి పైగా సినిమాల్లో నటించారు. మా తండ్రి అల్లు అరవింద్ 70 సినిమాలు నిర్మించారు. నేను ఈ స్థాయికి వచ్చాను అంటే మా మామ చిరంజీవి ఫ్యాన్స్ సపోర్ట్ వలనే. ‘పుష్ప’ సినిమాతో నాకు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. అందరికి చెప్పేది ఒకటే ప్రతి నటుడికి ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. షూటింగ్‌లో లేనప్పుడు కూడా ఫిట్‌నెస్‌ని లైట్ తీసుకోకూడదు. నాకు సినిమా తప్ప వేరే ఆలోచన లేదు. షూటింగ్ లేకపోతే ఇంట్లో విశ్రాంతి తీసుకుంటాను.. ఇక సినిమాల్లో సిక్స్ ప్యాక్ కోసం చాలా కష్టపడ్డాను’ అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.
చూసుకోవాలి కదా శ్రేయాస్ భయ్యా:
ఎట్టకేలకు పంజాబ్ కింగ్స్ గట్టెక్కింది. యుజ్వేంద్ర చహల్ 4 వికెట్లు, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 72 పరుగులతో రాణించడంతో పంజాబ్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే చెన్నైని ఓడించింది. ఈ విజయంతో పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంది. అటు చెన్నై సూపర్ కింగ్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే కెప్టెన్‌గా, ఆటగాడిగా సక్సెస్ అయినప్పటికీ.. శ్రేయాస్‌పై బీసీసీఐ చర్యలు తీసుకుంది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇప్పటికే పంత్, గిల్ భారీగా నష్టపోయారు. తాజాగా స్లో ఓవర్ రేట్ కారణంగా బీసీసీఐ శ్రేయాస్‌కు రూ.12 లక్షల రూపాయల ఫైన్ విధించింది. ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ తొలిసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేయడంతో రూ.12 లక్షలతో బీసీసీఐ సరిపెట్టింది. రెండోసారి ఇదే రిపీట్ అయితే రూ.24 లక్షల ఫైన్ పడుతుంది. ఐపీఎల్ నియమం 2.2 ప్రకారం నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోతే కెప్టెన్‌కు జరిమానా పడుతుంది. కాగా పంజాబ్ తమ తదుపరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. పంజాబ్‌పై ఓడిన చెన్నై నెక్స్ట్ ఆర్సీబీతో తలపడుతుంది. ఈ సీజన్లో చెన్నై 10 మ్యాచుల్లో కేవలం రెండు మాత్రమే గెలిచింది. పటిష్ట టీమ్ లేకపోవడంతో ఈ సీజన్ ధోనీ సేనకు ఏ మాత్రం కలిసి రాలేదు.
ఆర్ఆర్ యాజమాన్యానికి తలనొప్పిగా మారిన వైభవ్:
ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ.. రెగ్యులర్ కెప్టెన్ సంజూ స్థానంలో ఆడుతున్నాడు. సంజు గాయం కారణంగా జట్టుకు దూరమవడంతో వైభవ్ కి తుది జట్టులో అవకాశం వచ్చింది. అయితే, సంజూ తిరిగి జట్టులోకి వస్తే వైభవ్ ని తప్పిస్తారా లేక సంజుకి ఇంకొన్నాళ్ళు విశ్రాంతి కల్పిస్తారా చూడాలి. ఈ విషయంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వైభవ్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా సంజూ గాయంపై మాట్లాడిన ద్రవిడ్ సంజుకి మరి కొంతకాలం రెస్ట్ అవసరమని చెప్పుకొచ్చాడు. గాయం నయమవుతుందని, అయితే యాజమాన్యం సంజూ విషయంలో తొందరపడాలనుకోవట్లేదని పేర్కొన్నాడు. తొందర పడి జట్టులోకి తీసుకుని, సమస్యని మరింత పెంచాలనుకోవట్లేదన్నాడు. మరోవైపు వైభవ్ పై కూడా ఎక్కువ దృష్టి పెట్టాలనుకోవట్లేదని రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిద్ తెలిపారు. కానీ అతని టాలెంట్ ను ఎవరూ ఆపలేరని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ద్రవిడ్ చేసిన ఈ వ్యాఖ్యలను గమనిస్తే.. సంజూ ఇంకొంత కాలం విశ్రాంతి మోడ్ లోనే ఉండొచ్చని తెలుస్తుంది. కాగా, వైభవ్ కోసమే సంజుని పక్కన పెడుతున్నారని కొందరు అభిప్రాయ పడుతున్నారు.
