*మున్సిపల్ కార్మిక సంఘాలను మరోసారి చర్చలకు పిలిచిన ప్రభుత్వం
రేపు(మంగళవారం) మున్సిపల్ కార్మిక సంఘాలను ఏపీ ప్రభుత్వం మరోసారి చర్చలకు పిలిచింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కార్మిక సంఘాలతో మంత్రులు భేటీ కానున్నారు. ఏపీ సచివాలయంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ నేతృత్వంలో చర్చలు జరగనున్నాయి. సచివాలయంలోని సెకెండ్ బ్లాక్‌లో సమావేశం జరగనుంది. సమాన పనికి సమాన వేతనంపై సీఐటీయూ పట్టుబడుతోంది. ఇప్పటికే మున్సిపల్ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కార్మిక సంఘాల డిమాండ్ మేరకు మరికొన్ని క్యాటగిరీలకు కూడా ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ఇస్తూ ప్రభుత్వం ఇవాళ జీవో జారీ చేసింది. గతంలో తమ డిమాండ్లన్నీ పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని మున్సిపల్ కార్మికుల సంఘాలు తేల్చిచెప్పాయి. కార్మిక సిబ్బంది అందరినీ పర్మినెంట్ చేయాలని, లేదా సమాన పనికి సమాన వేతనంగా నెలకు రూ.20వేలు బేసిక్ పే ఇవ్వాలని సంఘాల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో మున్సిపాలిటీల్లో సమ్మెలో ఉన్న కార్మిక సంఘాల నాయకులతో పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అమరావతి సచివాలయంలోని తన చాంబర్‌లో ఐదారు గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఏపీఎండబ్లూఈఎఫ్, ఏఐసీటీయూ, టీఎన్‌టీయూసీ, ఐఎ్‌ఫటీయూ, ఎమ్మార్పీఎస్ సంఘాల నాయకులతో పాటు ఇతర సంఘాలు చర్చల్లో పాల్గొన్నాయి. సమ్మె విరమించాలని మంత్రి కోరగా, తమ డిమాండ్లు అన్నింటిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తేనే, చర్చల సారాంశాన్ని కార్మికులకు వివరించి, తదుపరి నిర్ణయం తీసుకుంటామని నాయకులు తేల్చిచెప్పారు. కార్మికుల నుంచి స్పష్టత తీసుకునే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఈ సారి చర్చలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
*కశ్మీర్ తివాచీల నుంచి కన్యాకుమారిలో దొరికే అన్ని వస్తువులు నుమాయిష్ లో దొరుకుతాయి..
హైదరాబాద్ నగరంలోని 83వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 2, 400 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 15 వరకు 45 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ జరగనుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కశ్మీర్ తివాచీల నుంచి కన్యాకుమారిలో దొరికే అన్ని వస్తువులు నుమాయిష్ లో దొరుకుతాయి.. దేశాన్నే ఆకర్షించే నుమాయిష్ హైదరాబాద్ ఉండడం మన గర్వకారణం అని ఆయన చెప్పుకొచ్చారు. దేశంలో హైదరాబాద్ ను గుర్తు తెచ్చుకుంటే నుమయిష్ గుర్తు వస్తుంది.. హైటెక్స్ లాంటి ఏక్సిబిషన్ లు వచ్చినా నాంపల్లి నుమాయిష్ కళ తగ్గలేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గత పది సంవత్సరాల నుంచి పేరుకుపోయిన సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తాము అని సీఎం తెలిపారు. ఏక్సిబిషన్ సొసైటీలో మహిళా సోదరీమణులు ఉండడం సంతోషంగా ఉందని చెప్పారు. మీ సమస్యలు ఏమి ఉన్నా ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుంది.. నేను గతంలో రెగులర్ గా ఈ నుమయిష్ కు వచ్చే వాడిని అని చెప్పారు. రాజకీయాల్లో బిజీ అయిన తరువాత రావడం తగ్గించాను అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
*మంత్రి విడదల రజనీ ఆఫీసుపై టీడీపీ శ్రేణుల దాడి దుర్మార్గం
గుంటూరులో మంత్రి రజని కార్యాలయంపై దాడి చేయడం దుర్మార్గమని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఆఫీస్ మీద రాళ్లు వేసి ఫ్లెక్సీలు చింపివేసి టీడీపీ శ్రేణులు రౌడీయిజం చేశారని తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ వాళ్లు ఫ్రీ ప్లాన్‌డ్‌గా చేసిన చర్య ఇది అంటూ ఆయన ఆరోపించారు. మంత్రి విడుదల రజిని కార్యాలయంపై దాడి చేయడం హింసను ప్రేరేపించడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కార్యాలయం పై దాడి చేసిన వారిని క్షమించేది లేదన్నారు. దాడి చేసిన వారిని అణచివేస్తామని, చట్టం తన పని తాను చేస్తుందన్నారు. ఒక బీసీ మహిళ పోటీ చేస్తుంటే దమ్ముంటే ప్రజాస్వామ్య విధంగా పోటీ చేసి గెలవాలన్నారు. అంతేగాని బీసీ మహిళపై దాడి చేయడం మంచిది కాదన్నారు. టీడీపీ, జనసేన కలిస్తే అరాచకం ఎలా ఉంటుందో గుంటూరు ఘటనతో తెలిసిందన్నారు మంత్రి అంబటి రాంబాబు. గతంలో ఖమ్మంలో నాపై కూడా ఓ సామాజిక వర్గం వాళ్లు దాడి చేశారు.. వాళ్లు కూడా మొత్తం టీడీపీ వాళ్లేనని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ కాళ్లకున్న చెప్పులు తీసి బూతులు తిట్టి కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని.. జనసేన సైనికులను అరాచక శక్తులుగా తయారు చేస్తున్నారని విమర్శించారు. ఇది దురదృష్టకరమైన పరిణామమన్నారు. నారా లోకేష్ రాసేది ఎర్రబుక్కో, ఎర్రి బుక్కో భవిష్యత్తులో తెలుస్తుందన్నారు. కానీ ఎర్రబుక్కు పేరుతో మంత్రులను, అధికారులను బెదిరించడం టీడీపీ నాయకులకు అలవాటుగా మారిందన్నారు. ఈ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం కల్ల అని.. కుప్పంలో చంద్రబాబు ఓడిపోవడం ఖాయమన్నారు. కుప్పంలో గెలిచిన ఇన్నాళ్లకు, కుప్పం అభివృద్ధి గుర్తుకు వచ్చిందా అంటూ ప్రశ్నించారు. కుప్పంను మున్సిపాలిటీ చేసుకోలేకపోయినా దీన పరిస్థితి చంద్రబాబుదంటూ ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుకి కుప్పంలో సొంత ఇల్లు లేదు.. ఆంధ్రప్రదేశ్‌లో సొంత ఇల్లు లేదు… ఈ రాష్ట్రంలో సొంత ఇల్లు లేని వాళ్ళు ఈ రాష్ట్రానికి ఏదో చేస్తారంట అంటూ ప్రశ్నించారు. ప్రజలు ,మేధావులు ,చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ చేస్తున్న కుయుక్తులు ప్రజలు గమనించాలన్నారు. మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. “చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంపై సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నారు. హౌసింగ్‌లో అవినీతి జరిగిందని, ల్యాండ్ ఎంక్వయిరీ విషయంలో అక్రమాలు జరిగాయని సీబీఐ విచారణ కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం విచారణ చేయాలనుకుంటే చేస్తుంది. రావణాసురుడికి పది తలకాయలు ఉన్నట్లు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ ఓ తలకాయి. గతంలో సీబీఐని రాష్ట్రంలో రావడానికి వీలు లేదని చెప్పిన చంద్రబాబు, అతని పార్ట్‌నర్ ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీ కోరుతున్నారు. చంద్రబాబు సీబీఐ ఎంక్వయిరీ అడగలేక, పవన్ కళ్యాణ్‌తో ఆ మాటలు అడిగిస్తున్నాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల కలియక రాష్ట్రానికి మంచిది కాదు. చంద్రబాబు ఫ్రస్టేషన్‌లో ఉన్నాడు. ముఖ్యమంత్రి అయితేనే శాసనసభకు వస్తాననే మనస్తత్వం చంద్రబాబుది. పదవి మీద ఎందుకు అంత వ్యామోహమో అర్దం కాదు. గతంలో వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడిపై దాడి చేశారు. ఖమ్మంలో నాపై దాడి చేశారు.ఇప్పుడు బీసీ మహిళ మంత్రి విడదల రజనీపై దాడి చేస్తున్నారు. విధ్వంసాలు చేయడం ద్వారా అధికారం సాధిద్దామని అనుకుంటే అది పొరపాటే అవుతుంది. ప్రజాస్వామ్యంలో దాడులు ప్రజలు క్షమించరు.” అని మంత్రి అన్నారు.
*విశాఖ గ్యాంగ్ రేప్ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్
విశాఖ గ్యాంగ్ రేప్ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. విశాఖ జిల్లా గ్యాంగ్ రేప్ ఘటనపై మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాంగ్ రేప్ ఘటన కేసును మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని, ఘటన పూర్తి వివరాలు తెలియజేయాలని విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలన్నారు. బాధిత బాలిక వివరాల గోప్యత పాటించడంతో పాటు వైద్య సదుపాయం, రక్షణ కల్పించాలన్నారు. అసలేం జరిగిందంటే.. విశాఖలో 17 ఏళ్ల దళిత బాలికపై పది మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక వారి చేతిలో నరకం చూసింది. ఓ బాలికపై 10 మంది అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నగరంలోని పలు లాడ్జిలలో నిందితులు అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. ఒడిశా నుంచి పనుల కోసం వచ్చిన 17 ఏళ్ల బాలికను ప్రేమపేరుతో వంచించి ప్రియుడు తొలుత కామవాంఛ తీర్చుకున్నాడు. తర్వాత మరో తొమ్మిది మంది బాలికు రెండు రోజుల పాటు లాడ్జిలో నిర్భంధించి చిత్రహింసలకు గురి చేశారు. ఈ సంఘటన నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన ఓ కుటుంబం విశాఖలోని కంచరపాలెంలో నివసిస్తోంది. రైల్వే న్యూ కాలనీలో ఓ ఇంట్లో ఆ బాలికకు కుక్కలకు ఆహారం పెట్టే పని కుదిరింది. భువనేశ్వర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ నెల 18న ఆమెను ప్రియుడు నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తర్వాత తన స్నేహితుడిని పురమాయించాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకొనేందుకు ఆరే బీచ్ కు వెళ్లింది. అక్కడ పర్యాటకుల ఫోటోలు తీసే ఓ వ్యక్తి జగదాంబ కూడలి సమీపంలోకి ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ అతడితో సహా ఎనిమిది రెండు రోజుల పాటు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తండ్రి మిస్సింగ్ కేసు నమోదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
*ఇండియాలో ఇప్పటివరకు 196 సబ్ వేరియంట్ కేసులు నమోదు..
దేశంలో కోవిడ్ సబ్ వేరియంట్ జేఎన్-1 మొత్తం 196 కేసులు నమోదయ్యాయి. వేరియంట్ ఉనికిని గుర్తించిన రాష్ట్రాల జాబితాలో ఒడిషా కూడా చేరింది. పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో సబ్ వేరియంట్ ఉనికిని గుర్తించారు. కేరళ (83), గోవా (51), గుజరాత్ (34), కర్ణాటక (8), మహారాష్ట్ర (7), రాజస్థాన్ (5), తమిళనాడు (4), తెలంగాణ (2) ఒడిశా (1), ఢిల్లీ ( ఒకటి) నమోదైనట్లు గుర్తించారు. ఇదిలా ఉంటే.. ఇండియాలో కరోనా కేసులు మళ్లీ చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. కొత్తగా 636 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు.. చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 4,394 కు పెరిగింది. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. మంత్రిత్వ శాఖ ఉదయం 8 గంటలకు నవీకరించిన డేటా ప్రకారం.. గత 24 గంటల్లో కేరళలో ఇద్దరు రోగులు, తమిళనాడులో ఒకరు కరోనాతో మరణించారు. గత ఏడాది డిసెంబర్ 5 నాటికి.. రోజువారీ కేసుల సంఖ్య రెండంకెలకు చేరింది. అయితే జలుబు, వైరస్ యొక్క కొత్త రూపం కారణంగా కేసులు మరింతగా పెరిగాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం.. ఇప్పటివరకు కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్లు దాటింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం ఉంది. మంత్రిత్వ శాఖ ప్రకారం.. దేశంలో కోవిడ్-19 వ్యతిరేక టీకా ప్రచారం కింద ఇప్పటివరకు 220.67 కోట్ల డోసులు ఇచ్చారు.
*రామమందిర శంకుస్థాపన ఏర్పాట్లపై రేపు బీజేపీ సమావేశం
అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. జనవరి 22న రామాలయంలో రాంలాలా జీవితం పవిత్రం కానుంది. దీనిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ క్షణం కోసం రామభక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు సంబంధించి.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రేపు ఢిల్లీలో రామ మందిరం శంకుస్థాపన ఏర్పాట్లపై సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఒక్కో రాష్ట్రం నుంచి ఇద్దరు అధికారులు కూడా హాజరు కానున్నట్లు సమాచారం. జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామ్‌లాలా మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. అయితే అంతకు ముందు రామ మందిరంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బీజేపీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని యోచిస్తోంది. దేశంలో ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా.. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ పూర్తి విశ్వాసంతో ఉన్నారు. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12.20 గంటలకు అయోధ్యలోని శ్రీరాముని ఆలయంలో పవిత్రోత్సవం జరగనుంది. రామ మందిర నిర్మాణ సంస్థ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రాణ్ ప్రతిష్ఠ జరుగుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించి భారీ సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశంలోని ప్రముఖులకు ఆహ్వానం అందించారు.
*గర్భవతిని చేస్తే రూ. 13 లక్షలు ఇస్తామంటూ ఆఫర్.. 8 మంది అరెస్ట్
బీహార్‌లోని నవాడాలో సైబర్ మోసం పతాక స్థాయికి చేరుకుంది. గర్భం దాల్చలేని మహిళలను గర్భం దాల్చేందుకు ఒక ఏజెన్సీని నడుపుతున్న ముఠాను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. మహిళలను గర్భం దాల్చడం కోసం పురుషులకు 13 లక్షల రూపాయల వరకు జాబ్ స్కామ్‌లో బీహార్ పోలీసులు మొత్తం ఎనిమిది మంది వ్యక్తులను అరెస్టు చేశారు. అయితే, ఈ గ్రూప్ వివిధ సోషల్ మీడియా వేదికగా ‘ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్’గా వర్క్ చేస్తుంది.. ఉద్యోగ సేవలో పాల్గొనమని పురుషులను ఎర వేసింది. ఆసక్తిగల అభ్యర్థులు తొలుత 799 రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. ఇక, ఫేస్‌బుక్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అమాయక ప్రజలే టార్గెట్ గా ఈ కేటుగాళ్లు పని చేస్తున్నారు. వారు తెలిసిన వెబ్ సైట్ లో రిజిస్ట్రర్ అయిన తర్వాత వాళ్లకి అమ్మాయిల ఫోటోలు సైతం పంపేవారు. అమ్మాయిని ఎంపిక చేసుకున్న తర్వాత బాధితుడి నుంచి దాదాపు 5 వేల నుంచి 20 వేల రూపాయల వరకు పూర్తి సెక్యూరిటీ మొత్తాన్ని చెల్లించాలని ఈ ముఠా కోరేది.. అమ్మాయి గర్భం దాల్చిన తర్వాత ప్రైజ్ మనీ (లక్షల్లో) చెల్లిస్తానని కూడా ఈ బృందం బాధితులకు చెప్పేది. ఈ మొత్తం నగదు చెల్లింపులు చేసిన తర్వాత ఈ ముఠా పరార్ అయ్యేది.. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై బీహార్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు చేసింది. ఈ కేసులో కీలక సూత్రధారి మున్నా కుమార్ వ్యవహరిస్తున్నాడని పోలీసులు తెలిపారు. అతడికి సంబంధం ఉన్న పలు ప్రాంతాలపై దాడులు చేసిన తర్వాత ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో ప్రధాన నిందితుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు అని డీఎస్పీ కళ్యాణ్ ఆనంద్ తెలిపారు. అయితే, అరెస్టైన వ్యక్తులు దేశవ్యాప్తంగా నడుస్తున్న పెద్ద సైబర్ క్రైమ్ సిండికేట్‌లో భాగమని చెప్పారు. ఈ దాడుల్లో తొమ్మిది స్మార్ట్‌ఫోన్‌లు, ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో మరి కొంత మందిని అరెస్టు చేసే అవకాశాలున్నాయని పోలీసులు తెలిపారు.
*సచిన్ బిడ్డకు తల్లి కాబోతున్న సీమా హైదర్..!
2024 సంవత్సరం మొదటి రోజున సీమా హైదర్ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈసారి సీమా తమకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది సచిన్ బిడ్డకు సీమా హైదర్ తల్లి కాబోతోంది. ఓ ప్రైవేట్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీమా, సచిన్ ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే శుభవార్త అందిస్తాం’’ అని సీమా హైదర్ అన్నారు. పాకిస్థాన్ నుంచి భారత్‌కు పారిపోయి వచ్చిన సీమకు ఇది ఐదవ సంతానం. అంతకు ముందు.. ఆమెకు తన మొదటి భర్తతో నలుగురు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు కూడా సీమతో కలిసి ఇండియా వచ్చి గ్రేటర్ నోయిడాలోని సచిన్ ఇంట్లో ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. సీమ మాట్లాడుతూ.. నేను ఎప్పుడు తల్లి అవుతానో తెలియదు.. కానీ సచిన్‌కి, తనకు కచ్చితంగా బిడ్డ పుట్టడం ఖాయమని తెలిపింది. కాగా.. పాకిస్తాన్ కు చెందిన సీమా హైదర్, ఇండియాలోని యుపీకి చెందిన సచిన్ మీనా ప్రేమకథ గత సంవత్సరం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. వీరిద్దరు ఆన్‌లైన్‌లో PUBG గేమ్ ఆడుతున్నప్పుడు పరిచయం ఏర్పడి.. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత నేపాల్‌లో వీరు కలుసుకుని.. అక్కడే పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత.. గతేడాది సీమా తన నలుగురు పిల్లలతో పాకిస్థాన్ నుంచి గ్రేటర్ నోయిడాలో ఉంటున్న సచిన్ ఇంటికి వచ్చింది. పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ తర్వాత ప్రయాణ ఆంక్షల షరతులతో వారిని విడుదల చేశారు. సీమా, సచిన్ ల ప్రేమ వ్యవహారం భారత్, పాకిస్తాన్ మధ్య చర్చనీయాంశమైంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ ఈ విషయంపై ఆసక్తి చూపారు.
