1.25 కోట్లు గెలిచిన కోడిపుంజు:
సంక్రాంతి పండగ వచ్చిందంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంబరాల్లో మునిగిపోతారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిండివంటలూ, రంగవల్లులతో పాటుగా కోడిపందేలతో తెగ ఎంజాయ్ చేస్తారు. ఈసారి కోస్తాంధ్ర మాత్రమే కాదు.. రాయలసీమలోనూ కోడిపుంజులు తొడకొట్టాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన కోటి రూపాయల కోడి పందెం గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. తాజాగా మరో కోడి పందెంకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఓ కోడిపుంజు సైలెంట్‌గా నిలబడి రూ.1.25 కోట్లు గెలిచింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఐదు కోళ్ల మధ్య పందెం పెట్టారు. పందెం దారులు గిరి గీసి ఐదు కోడి పుంజులను వదిలారు. నాలుగు కోళ్లు ఒకదానితో ఒకటి తలపడ్డాయి. ఢీ అంటే ఢీ అన్నట్లుగా నాలుగు పుంజులు తలపడ్డాయి. అయితే ఓ కోడిపుంజు మాత్రం సైలెంట్‌గా నిలబడింది. మిగతా కోడిపుంజులు కొట్టుకుంటున్నా.. తనకేమీ పట్టనట్టుగా ఉంది. ముందుగా రెండు కోడిపుంజులు కిందపడిపోగా.. ఆపై మరొకటి కింద పడింది. అప్పటివరకు బాగానే ఉన్న మరో పుంజు హఠాత్తుగా పడిపోయింది. నాలుగు కోళ్లు కొట్టుకొని చచ్చిపోగా.. చివరికి సైలెంట్‌గా నిలబడిన కోడి విజేతగా గెలిచింది. దాంతో ఆ కోడిపుంజు యజమాని ఎగిరి గంతులేశాడు.
తిరుమలలో నకిలీ టికెట్ల కలకలం:
శ్రీవారి నకిలీ దర్శన టికెట్ల వ్యవహారం తిరుమలలో మరోసారి కలకలం రేపింది. నకిలీ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లతో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం నకిలీ టికెట్లతో భక్తులకు శ్రీవారి దర్శనం చేయిస్తున్న కొందరిని టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారులు పట్టుకున్నారు. ట్యాక్సీ డ్రైవర్ల ద్వారా నకిలీ టికెట్లు విక్రయిస్తు్న్నట్లు అధికారులు గుర్తించారు. ముగ్గురు ఇంటి దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కౌంటర్ ఉద్యోగి లక్ష్మీపతి.. అగ్నిమాపక శాఖ సిబ్బంది మణికంఠ, భానుప్రకాశ్‌లు ముఠాగా ఏర్పడి కొన్నేళ్లుగా నకిలీ టికెట్ల దందా నిర్వహిస్తున్నారు. ట్యాక్సీ డ్రైవర్లు శశి, జగదీశ్‌తో కుమ్మకై.. స్వామివారి ఆదాయాన్ని అందినకాడికి దోచుకున్నారు. మణికంఠ సాయంతో లక్ష్మీపతి నకిలీ టికెట్లు తయారు చేస్తున్నట్లు టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారులు గుర్తించారు. లక్ష్మీపతి విధుల్లో ఉన్నప్పుడు నకిలీ టికెట్లతో భక్తులను దర్శనానికి పంపుతున్నట్లు తేల్చారు.
ఖమ్మం పత్తి మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం:
ఖమ్మం పత్తి మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మార్కెట్ యార్డ్ షెడ్‌లో పత్తి బస్తాలు తగలబడుతున్నాయి. దీంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. మరోవైపు.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. మంటల్లో 400కి పైగా బస్తాలు కాలిపోయినట్లు సమాచారం తెలుస్తోంది. ఖరీదు చేసే పత్తి మంటల్లో కాలి పోవడంతో వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయ మార్కెట్‌లో ఓ వ్యాపారికి చెందిన పత్తి సుమారు 200 బస్తాల అగ్నికి ఆహుతి కావటం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. హుటాహుటిన మార్కెటింగ్, ఫైర్ అధికారులతో మాట్లాడి తక్షణమే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
త్వరలో తెలంగాణకు రాహుల్ గాంధీ:
ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ నివాసంలో టీ కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహా, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫిబ్రవరిలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారుపై ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ తో రాష్ట్ర మంత్రులు, ఇతర నేతలు చర్చించారు. ఢిల్లీలోని కేసి వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై చర్చించారు. సంస్థాగత అంశాలతో పాటు, శాఖల వారీగా పనితీరుపై సమీక్ష చేపట్టారు. కేసీ వేణు గోపాల్ మంత్రులతో ముఖాముఖి భేటీలు నిర్వహించారు.
మహిళ రీసెర్చ్ స్కాలర్‌కు లైంగిక వేధింపులు:
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మహిళలపై లైంగిక వేధింపులు ఆగడం లేదు. రోజురోజుకి మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన తమిళనాడు రాష్ట్రాన్ని కుదిపేసింది. తాజాగా మద్రాస్ ఐఐటీలో లైంగిక వేధింపుల వ్యవహారం కలకలం రేపుతోంది. హ్యుమానిటీస్ మరియు సోషల్ సైన్సెస్ రీసెర్చ్ స్కాలర్ అయిన మహిళ(30)పై వలస కార్మికుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తారామణి-వేలాచ్చేరి మెయిన్ రోడ్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక మగ స్నేహితుడితో ఉండగా ఈ ఘటన జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్రీరామ్ అనే 29 ఏళ్ల వలస కార్మికుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తిరువళ్లువర్‌కి గవర్నర్ ‘‘కాషాయ’’ నివాళి:
తమిళ కవి తిరువళ్లువర్ దినోత్సవం సందర్భంగా తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి నివాళులు అర్పించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. బుధవారం చెన్నైలోని రాజ్ భవన్ ప్రాంగణంలో తిరువళ్లువర్ చిత్రపటానికి గవర్నర్ రవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఫోటోలో తిరువళ్లువర్‌కి ‘‘కాషాయ’’ వస్త్రధారణ, రుద్రాక్ష పూసలు ఉండటంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యతరం తెలిపింది. బూడిద, కుంకుమ వంటి మతపరమైన గుర్తులు ఉండటాన్ని తప్పుపట్టింది. ఇలాంటి చిత్రీకరణ ఆమోదయోగ్యం కాదని తమిళనాడు పీసీసీ ప్రెసిడెంట్ కే. సెల్వపెరుంతగై అన్నారు.
కాల్పుల విరమణ ఒప్పందంపై కొనసాగుతున్న ఉత్కంఠ:
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కొలిక్కి వచ్చినట్లు మంగళవారం ఖతర్ తెలిపింది. ఇందుకు హమాస్ అంగీకరించినట్లు పేర్కొంది. బందీలను అప్పగించేందుకు హమాస్ అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం తోసిపుచ్చింది. కాల్పుల విరమణ, బందీల అప్పగించేందుకు హమాస్ నుంచి ఇంకా స్పందన రాలేదని నెతన్యాహు కార్యాలయం పేర్కొంది. ఒకవేళ అంగీకరిస్తే.. బుధవారం రాత్రికి ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉంటుందని జెరూసలేం అధికారులు ఇజ్రాయెల్ మీడియాకు తెలిపారు. హమాస్ వైపు నుంచే స్పందన రాలేనట్లుగా తెలుస్తోంది.
కంగనా రనౌత్ ‘‘ఎమర్జెన్సీ’’ని నిషేధించిన బంగ్లాదేశ్:
కంగనా రనౌత్ నటించిన ‘‘ఎమర్జెన్సీ’’ సినిమా ఈ నెల 17న విడుదల కాబోతోంది. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ‘‘అత్యవసర పరిస్థితి’’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో కంగనా, ఇందిరా గాంధీ పాత్రని పోషించింది. ఇదిలా ఉంటే, ఈ సినిమాని బంగ్లాదేశ్ నిషేధించింది. భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్న కారణంగా ఎమర్జెన్సీని బంగ్లా నిషేధించింది. ‘‘బంగ్లాదేశ్‌లో ఎమర్జెన్సీని నిషేధించాలనే నిర్ణయం భారత్-బంగ్లాల మధ్య ప్రస్తుతం దెబ్బతిన్న సంబంధాలతో ముడిపడి ఉంది. సినిమా కంటెంట్ గురించి కాదు’’ అని సోర్సెస్ వెల్లడించాయి. అయితే, షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత, మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్ జాతిపిత అయిన ‘‘షేక్ ముజిబుర్ రెహమాన్’’ చరిత్రను కనుమరుగు చేయాలని చూస్తోంది. ఎమర్జెన్సీ సినిమాలో ఇందిరా గాంధీ బంగ్లాదేశ్ ఏర్పాటుకు సాయపడిన అంశంతో పాటు, ముజిబుర్ రెహమాన్‌కి మద్దతు ఇవ్వడం వంటి అంశాలు సినిమాలో ఉండే అవకాశం ఉంది.
ఈసారి దసరా మీద కన్నేసిన చెర్రీ:
ఏడాదికి వన్ ఆర్ టు సినిమాలను దింపేయాలని గట్టిగానే ట్రై చేస్తున్నాడు చిరంజీవి తనయుడు. మినిమం ఇయర్‌లో వన్ మూవీతో ఐనా అభిమానులతో టచ్‌లో ఉండేలా ప్లాన్స్ వేస్తున్నాడు. సంక్రాంతికి గేమ్ ఛేంజర్‌తో వస్తే.. మరో పండుగకు కర్చీఫ్ రెడీ చేసుకుంటున్నారు. ప్రజెంట్ చెర్రీ టూ మూవీస్ కమిటయ్యాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఆర్సీ16, సుకుమార్‌తో మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పాడు. ఆర్సీ 16 ఇప్పటికే వన్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. స్పోర్ట్స్ డ్రామాగా, ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆర్సీ16ని చకా చకా పూర్తి చేసి.. దసరా బరిలో దింపాలని ట్రై చేస్తున్నట్లు టాలీవుడ్‌లో న్యూస్ చక్కర్లు కొడుతుంది. దసరా హాలీడేస్ టార్గెట్ చేస్తూ ఆర్సీ 16ని తీసుకురావాలని అనుకుంటున్నారట చెర్రీ. ఫ్యాన్స్‌తో వచ్చిన గ్యాప్‌ను ఫిల్ చేసి..వారిని ఖుషీ చేసేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. అది ఎంతవరకు నిజం అవుతుంది అనేది చూడాలి.
మలయాళంలో అదరగొడుతోన్న చిన్న బడ్జెట్ మూవీ:
గేమ్ ఛేంజర్ లాంటి పాన్ ఇండియన్ మూవీస్ దండయాత్ర చేసినా.. ఐడెంటిటీ లాంటి సొంత ఇండస్ట్రీ స్టార్ హీరో మూవీస్ రేసులో ఉన్నప్పటికీ.. ఓ సినిమా మాత్రం మలయాళ బాక్సాఫీసు దగ్గర వసూళ్లు రాబట్టుకొంటుంది. చిన్న సినిమాగా వచ్చి.. ప్రభంజనం సృష్టిస్తోంది. జస్ట్ 6 కోట్లతో సినిమా తీస్తే.. ఇప్పటిదాకా 30 క్రోర్స్ కలెక్ట్ చేసింది. ఇంత పోటీలో కూడా కాసుల కురిపించుకుంటున్న ఆ మూవీ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మాలీవుడ్ మినిమం గ్యారెంటీ హీరోల్లో ఒకరైన ఆసిఫ్ అలీ నుండి 2025లో వచ్చిన ఫస్ట్ మూవీ రేఖా చిత్రం. గేమ్ ఛేంజర్ పాన్ ఇండియన్ మూవీతో పాటు అప్పటికే రిలీజైన ఓన్ ఇండస్ట్రీ మూవీ ఐడెంటిటీ రేసులో ఉన్నప్పటికీ రిస్క్ చేసి జనవరి 9న రిలీజ్ చేశారు మేకర్స్.
అశ్విన్ కీలక వ్యాఖ్యలు:
ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్ ముఖ్యమైన పాత్ర పోషించాడని భారత జట్టు మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు. బోలాండ్‌ను జట్టులో ఎంపిక చేయకపోయి ఉంటే.. భారత జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుని ఉండేదని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 1-3 తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో భారత్ 295 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన పెర్త్ టెస్టులో.. ఆస్ట్రేలియా బోలాండ్‌ను ప్లేయింగ్ 11లో చేర్చలేదు. అయితే అడిలైడ్ టెస్టులో జోష్ హేజిల్‌వుడ్ గాయపడడంతో స్కాట్ బోలాండ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.