NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

వన మహోత్సవం.. మొక్కలు నాటి ప్రారంభించిన సీఎం, డిప్యూటీ సీఎం..

మంగళగిరి ఎకో పార్కులో వన మహోత్సవాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు కలిసి ప్రారంభించారు. ఎకో పార్కులో మొక్కలు నాటి వన మహోత్సవాన్ని ప్రారంభించారు. ఎకో పార్కుకు చేరుకున్న సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌లు స్వాగతం పలికారు. చెట్ల మధ్య డిప్యూటీ సీఎం, కేంద్రమంత్రితో కలిసి సీఎం చంద్రబాబు నడిచారు. ప్రశాంతమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటున్నామని చంద్రబాబు అన్నారు. చెట్లు.. మొక్కల జాతులను అడిగి సీఎం, డిప్యూటీ సీఎం తెలుసుకున్నారు. ఎకో పార్కులో ఏర్పాటు చేసిన వివిధ పక్షి జాతుల ఫొటోలను తిలకించారు.

మంత్రి నిమ్మల, ఎమ్మెల్యేలకు తృటిలో తప్పిన ప్రమాదం

ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పలువురు ఎమ్మెల్యేలకు తృటిలో ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశానికి మంత్రి నిమ్మల రామానాయుడు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. జిల్లా పరిషత్ ప్రాంగణంలో మంత్రి నిమ్మల రామానాయుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న సమయంలో స్టేజీ ఒక్కసారిగా కుంగింది. ఆ స్టేజీని కర్రలతో కట్టారు. ఆ సమయంలో స్టేజీపై ఉన్న మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు ఉన్నారు. స్టేజీ పూర్తిగా పడిపోకుండా అక్కడ ఉన్న కార్మికులు అడ్డుకోవడంతో అధికారులు, పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం తప్పడంతో నేతలు ఊపిరి పీల్చుకున్నారు.

స్పీడ్‌ ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష

స్పీడ్ ప్రాజెక్టులపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీ రూపొందించండని, ఇతర రాష్ట్రాల్లోని బెస్ట్ పాలసీలను అధ్యయనం చేయండన్నారు సీఎం రేవంత్‌. ఎకో, టెంపుల్ టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించండని, వీటితోపాటు హెల్త్ టూరిజంను అభివృద్ధి చేయాలన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. హైదరాబాద్ బయట మరో జూపార్క్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించండని, మనకున్న వనరుల అభివృద్ధికి అవసరమైనచోట పీపీపీ విధానాన్ని అవలంభించండన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. అవకాశం ఉన్నచోట హెలీ టూరిజం అభివృద్ధికీ ప్రణాళికలు రూపొందించండన్నారు. అంతేకాకుండా.. యాదగిరిగుట్ట అభివృద్ధిపై అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

ప్రకృతి విపత్తులు పోవాలంటే చెట్లు నాటడమే ఏకైక మార్గం

కోటి చెట్లు పెట్టాలని సంకల్పించామని.. కోటి చెట్లు పెడితే 0.33 శాతం మేర గ్రీన్ కవర్ పెరుగుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. చెట్లు నాటే కార్యక్రమాన్ని మహోద్యమంగా చేపట్టాలని సూచించారు. మంగళగిరిలోని ఎకోపార్క్‌లో వనమహోత్సవాన్ని మొక్కలు నాటి ప్రారంభించిన అనంతరం సీఎం ప్రసంగించారు. స్కూళ్లల్లో చెట్లకు నీళ్లు పోయడమనేది అలవాటు చేసేవారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పచ్చదనం పెరిగితే స్వర్ణాంధ్ర ప్రదేశ్ కావడం ఖాయమన్నారు. భూమినే జలాశయంగా మార్చేలా ఇంకుడు గుంతల ద్వారా ప్రణాళికలు రచించామన్నారు. అడవుల్లో చెక్ డ్యాములు నిర్మించి.. భూగర్భ జలాలు పెంచేలా చేసేవాళ్లమని.. గత ప్రభుత్వం చెక్ డ్యాముల్లో మట్టిని కూడా తీయలేదన్నారు.

జీఏడీ స్పెషల్ సీఎస్‌గా రజత్ భార్గవ నియామకం

ఏపీ సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) స్పెషల్ సీఎస్‌గా రజత్ భార్గవ నియామకమయ్యారు. దాదాపు రెండు నెలల నుంచి రజత్ భార్గవకు పోస్టింగ్ దక్కకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా.. రజత్ భార్గవ నేడు రిటైర్‌ కానున్నారు. ఎలాంటి పోస్టింగ్ లేకుండా రిటైరయ్యేలా చేయడం సరి కాదని ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది. గతంలో పూనం మాల కొండయ్యకు ఇదే తరహాలో సర్వీస్ చివరి రోజున ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. అదే తరహాలో రజత్ భార్గవకు పోస్టింగ్ ఇవ్వడం విశేషం.

ప్రత్యామ్నాయం చూపకుండా పేదల ఇళ్లు కూల్చొద్దు..

ప్రత్యామ్నాయం చూపకుండా పేదల ఇళ్లు కూల్చొద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరుతో చెరువులు, నాలలలో వున్న నిర్మాణాలను తొలగిస్తున్న సందర్భంగా పేదలు, మధ్యతరగతి ప్రజానీకం దీనికి సమిధలు కాకుండా ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో జలవనరుల సంరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకువచ్చిన హైడ్రా వ్యవస్ధ ఆహ్వానించదగ్గదేనన్నారు. అయినప్పటికీ చెరువులు, నాలల పక్కన సంవత్సరాలుగా నివసిస్తున్న పేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా వారి ఇళ్లను కూల్చవద్దని సిపిఐ(యం) తెలంగాణ రాష్ట్రకమిటీ ప్రభుత్వాన్ని కోరుతున్నదని, మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో 12 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం 78 మంది వికలాంగులకు ఇళ్లపట్టాలు ఇచ్చిందన్నారు తమ్మినేని వీరభద్రం. ఆ ఇళ్లను ఆక్రమణల పేరుతో గురువారం తెల్లవారుజామున బుల్డోజర్లతో కూల్చివేశారని, సంవత్సరాలు తరబడి అక్కడే నివాసముంటూ కాయకష్టం చేసుకుంటూ బ్రతుకుతున్న పేదలు బజారున పడ్డారు. వీరిని తక్షణం ఆదుకోవాలన్నారు. హైడ్రా పేరుతో హైదరాబాద్‌ లోని హస్మత్‌పేట్‌, ఆల్వాల్‌ తదితర బస్తీలలో కూడా పేదల ఇళ్లు నేలమట్టం చేశారు. ఆక్రమణలు, ఎఫ్‌టిఎల్‌, బఫర్‌జోన్‌ల పేరుతో ప్రత్యామ్నాయం చూపకుండా పేదలు, మధ్యతరగతి వారిని బజారుపాలు చేయవద్దని సిపిఐ(ఎం) రాష్ట్రప్రభుత్వాన్ని కోరుతున్నదని ఆయన వ్యాఖ్యానించారు.

తప్పు చేసిన పోలీసులు ఏ స్థాయిలో ఉన్నా క్షమించేది లేదు

వైసీపీలో ఇమడలేక చాలా మంది మా వైపు వస్తామంటున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అందరినీ కాకుండా మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే చూసి తీసుకుంటామని మీడియా చిట్‌చాట్‌లో ఆయన తెలిపారు. పార్టీకి, నేతలకు, కార్యకర్తలకు ఇబ్బంది లేకుండానే చేరికలు ఉంటాయన్నారు. ముంబై నటి వ్యవహారంలో అప్పటి పోలీసులు వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రతిష్ఠను మంటగలిపిందన్నారు. తప్పు చేసిన పోలీసులు ఏ స్థాయిలో ఉన్నా క్షమించేది లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. మహిళలు, ఆడబిడ్డల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని సీఎం పేర్కొన్నారు. గుడ్లవల్లేరు కళాశాలలో జరిగిన ప్రచారం పట్ల అంతా భయాందోళనలకు గురయ్యారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. అందరి సమక్షంలోనే ఇప్పటి వరకూ హాస్టల్ మొత్తం చేసిన తనిఖీల్లో ఎలాంటి పరికరాలు లభించలేదని తెలిపారు. అయినా దర్యాప్తు ఆపమని, సమగ్ర విచారణ కొనసాగుతుందన్నారు. కొన్ని ప్రచారాల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ధైర్యంగా ఉండాలన్నారు. తప్పు చేసిన ఎవరినీ ప్రభుత్వం ఉపేక్షించదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

ఏడు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గం

ఏడు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాన్ని నియమిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్, జగిత్యాల జిల్లాలోని వెలగటూరు, కామారెడ్డి జిల్లాలోనే గాంధరి, సదాశివనగర్, ఎల్లారెడ్డి, ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి, మద్దులపల్లి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు చైర్ పర్సన్ లను, వైస్ చైర్ పర్సన్లతో పాటు నూతన పాలకవర్గాలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. మహబూబ్ నగర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కరి అనితారెడ్డి, వైస్ చైర్ పర్సన్ గా గడుగు విజయ్ కుమార్, వెలగటూరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా గుండటి గోపిక, వైస్ చైర్ పర్సన్ గా గొల్ల తిరుపతి, గాంధరి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా బండారి పరమేశ్వర్, వైస్ చైర్ పర్సన్ గా ఆకుల లక్ష్మణ్, సదాశివనగర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా మాలోతు సంగ్య, వైస్ చైర్ పర్సన్ గా జక్కుల రాజారెడ్డి, ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ మారెడ్డి రజిత, వైస్ చైర్ పర్సన్ గా జొన్నల రాజు, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా వెన్నపూసల సీతరాములు, వైస్ చైర్ పర్సన్ గా కొండపర్తి సురేష్, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా బైరు హరినాథ బాబు, వైస్ చైర్ పర్సన్ గా వనవాసం నరేందర్ రెడ్డి నియామకమయ్యారు.

ప్రధాని మోడీ నుంచి నన్ను విడదీయలేరు..

కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ బీజేపీతో విభేదాలను తోసిపుచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ నుంచి తనకు విడదీయరాని బంధం ఉందని, తనను విడదీయలేరని అన్నారు. బీజేపీ కోరుకుంటే రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వామిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. నరేంద్రమోడీపై తన ప్రేమ చెక్కుచెదరలేదని , ఆయన ప్రధానిగా ఉన్నంత కాలం తనను ఆయనతో విడదీయలేరు అని చెప్పారు. వక్ఫ్ బోర్డు సంస్కరణలు, బ్యూరోక్రసీలో లాట్రల్ ఎంట్రీ వంటి వాటి గురించి అడిగిన సందర్భంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి తన అభిప్రాయాలు ఎల్లప్పుడూ ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబిస్తాయి, వక్ఫ్ బిల్లుని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపడం దీనికి ఒక ఉదాహరణ అని అన్నారు. ఇటీవల కాలంలో బీజేపీకి సొంత బలం లేకుండా మిత్ర పక్షాల సహకారంతో అధికారంలోకి రావడంతో చిరాగ్ పాశ్వాన్ తన అభిప్రాయాలను బీజేపీకి వ్యతిరేకంగా చెబుతున్నాడనే ఊహాగానాలు చెలరేగాయి.