NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

మద్యం పాలసీ రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీ నియామకం

ఏపీలో మద్యం పాలసీ రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐదుగురు మంత్రులతో మద్యం విధానంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఈ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవి కుమార్‌లు ఉండనున్నారు. ప్రస్తుతమున్న మద్యం పాలసీని కేబినెట్ సబ్ కమిటీ సమీక్షించనుంది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న మద్యం పాలసీలను మంత్రి వర్గ ఉపసంఘం అధ్యయనం చేయనుంది. మద్యం దుకాణాలు, బార్లు, బేవరేజెస్ కంపెనీల వంటి వాటిల్లో వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను పరిశీలించనుంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేసి ఇచ్చిన అధికారుల నివేదికను మంత్రి వర్గం ఉప సంఘం పరిశీలించనుంది. మద్యం పాలసీ రూపకల్పనలో భాగంగా వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు కూడా తీసుకోనుంది.

“అత్యాచారాలను చిన్నచూపు చూడటం సర్వసాధారణమైంది”

నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై పంజాబ్‌ మాజీ ఎంపీ, శిరోమణి అకాలీదళ్‌ (అమృత్‌సర్‌) నేత సిమ్‌రంజిత్‌ సింగ్‌ మాన్‌ గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో మాజీ ఎంపీపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు దీనిపై కంగనా రనౌత్ ప్రకటన కూడా బయటకు వచ్చింది. అకాలీదళ్ నేతపై ఎదురుదాడికి దిగిన ఆమె.. అత్యాచారాలను చిన్నచూపు చూడటం సర్వసాధారణమైందని ఎక్స్ లో పేర్కొన్నారు. నిజానికి, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో.. కంగనా రైతుల ఉద్యమం సమయంలో అత్యాచారం, హత్య ఆరోపణలు చేశారు. దీనిపై మీడియా అకాలీదళ్‌ నేత సిమ్‌రంజిత్‌ సింగ్‌ మాన్‌ని ప్రశ్నించగా.. ‘నేను చెప్పక్కర్లేదు. కానీ రనౌత్‌ సాహెబ్‌కు రేప్‌లో చాలా అనుభవం ఉంది. రేప్‌లు ఎలా జరుగుతాయో ప్రజలు ఆమెను అడగవచ్చు.” అని అనుచిత వ్యాఖ్యలు చేశారు.

హరీష్‌రావు చిట్ చాట్.. సోది చాట్‌లాగా ఉంది

హరీష్ రావు చిట్.. చాట్ సోది చాట్ లాగ ఉందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హరీష్‌ రావు చీప్ పాలిటిక్స్ కు తెరలేపుతుండు అని ఆయన ఆరోపించారు. మూసి నదిపై ఆక్రమంగా కట్టిన కట్టడాలను కూలగొడితే బీఆర్ఎస్ నాయకులకు వచ్చిన నష్టం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ పది ఏండ్లలో చేయలేని పని.. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నాడని ఈర్శ తో హరీష్ రావు మాట్లాడుతుండు అని ఆయన మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో అక్రమంగా బుల్డోజర్లు పెట్టి కూలగొడితే ఈటెల రాజేందర్ ఎందుకు మాట్లాడలేదని, సీఎం రేవంత్ రెడ్డి ఎనిమిది నెలల్లో 70వేల కోట్లు పెట్టుబడులు తెచ్చిండన్నారు ఆది శ్రీనివాస్‌. వరంగల్‌లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట తెలంగాణలో నెరవేరుతుందని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ విశ్వాసం పొందాడు కాబట్టే రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు అని, వరంగల్ లో రాహుల్ గాంధీ సభ ఖచ్చితంగా ఉంటది అని ఆయన వెల్లడించారు.

పింఛన్‌దారులకు శుభవార్త.. ఈ నెల 31నే పింఛన్లు

పింఛనుదారులకు ఏపీ ప్రభుత్వ శుభవార్త తెలిపింది. ఈ నెల 31వ తేదీ నాడే పింఛనుదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం రావడంతో వృద్ధాప్య, వితంతువు, ఇతర పింఛన్లను ఈ నెల 31వ తేదీనే ఇస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. “1వ తేదీన పింఛన్‌ ఇచ్చే క్రమం ఆదివారం వచ్చింది. పింఛన్‌దారులకు ఇబ్బంది కలగకుండా చూడటమే ప్రభుత్వ విధి. గవర్నమెంటు ఉద్యోగులకు ఆదివారం సెలవు కావున పెన్షన్ పంపిణీ వాయిదా వేయకుండా ఒక రోజు ముందుగానే శనివారం 31నే ఇచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు . కావున ఈ నెల 31వ తేదీన పింఛన్‌ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా 31వ తేదీన పెన్షన్ తీసుకోని వారు ఉంటే వారికి 2వ తేదీన పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయం పింఛన్‌దారులందరూ గమనించాలి. పింఛన్‌దారులు 31వ తేదీన పింఛన్‌ తీసుకొనే ప్రయత్నం చేయాలి. లేనిపక్షంలో 2వ తేదీన పింఛన్‌ తీసుకునే అవకాశం ఉంది. 31న, 2వ తేదీన పింఛన్‌ తీసుకునే పరిస్థితులున్నాయి. పింఛన్‌దారులు ఈ రెండు రోజుల్లో ఏదో ఒక రోజు పెన్షన్ తీసుకునే అవకాశం కల్పించుకోవాలి. సాధ్యమైనంతవరకు 31వ తేదీనే పెన్షన్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా 1వ తేదీన ఆదివారం వస్తే 31వ తేదీన పింఛన్ ఇచ్చే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది. కావున ప్రస్తుతం31 లేదా 2వ తేదిన ఎప్పుడైనా పెన్షన్ తీసుకోవచ్చు.” అని మంత్రి తెలిపారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన!

రాష్ట్రంలో జరిగిన భూ కుంభకోణాలపై సిసోడియా నివేదికపై వచ్చే కేబినెట్‌లో చర్చించి లెక్కలన్నీ బయటపెడతామని, అక్రమాలకు బాధ్యులైన అందరి పైనా చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. వైసీపీ పాలనలో విశాఖలో రాజారెడ్డి రాజ్యంగా అమలైందని ఆయన ఆరోపించారు. బెదిరించి భూముల దోపిడీ చేశారని.. ఆ క్రమంలో నేరాలు జరిగాయన్నారు.విశాఖ పట్టణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు కేంద్రంగా మారుస్తామని మంత్రి పేర్కొన్నారు. ఆ దిశగా పెట్టుబడిదారులతో చర్చిస్తున్నామన్నారు. ఎన్డీఏకు ప్రజాక్షేత్రంలో మంచి తీర్పు వచ్చింది…ఇక కోర్టులో తీర్పు పెండింగ్‌లో ఉందన్నారు. ఓ పత్రిక తనపై తప్పుడు కథనాలు ప్రచురించిందని.. తప్పు చేసినట్టు ఆ పత్రిక ఒప్పుకోలేదని.. అందుకే 75కోట్లకు పరువు నష్టం దావా వేశానన్నారు.

సబ్ ప్లాన్ చట్టాన్ని వంద శాతం అమలు చేయాల్సిందే

ఎస్సీ ఎస్టీల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని వంద శాతం పూర్తి స్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి  విక్రమార్క అధికారులను ఆదేశించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు- ప్రణాళికల గురించి వివిధ శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు.  సబ్ ప్లాన్ చట్టాన్ని తీసుకొచ్చిన స్ఫూర్తిని కొనసాగించే విధంగా అధికారుల పని విధానం ఉండాలని దశ దిశా నిర్దేశం చేశారు.  అన్ని శాఖల్లో ఉన్న అధికారులు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని అర్థం చేసుకొని చట్టం ప్రకారం వారి నిధులను వారికే ఖర్చు పెట్టాలని సూచించారు.  ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని సీరియస్ గా అమలు చేయడానికి ఉన్నత అధికారులు సాధ్య సాధ్యాల ను దృష్టిలో పెట్టుకొని మేధోమధనం చేసి యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశాన్ని అమలు చేసి దళిత గిరిజన జీవితాల్లో మార్పు తీసుకువస్తేనే ఆ చట్టానికి అర్థం, పరమార్థం ఉంటుందని అన్నారు. ఎస్సీ ఎస్టీ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి సబ్ ప్లాన్ చట్టాన్ని ఎంత సీరియస్ గా అమలు చేయాలో ఉన్నత అధికారులు మనసుపెట్టి ఆలోచన చేయాలన్నారు.

ఎన్నికల్లో ఓటమి వల్ల పార్టీ పని అయిపోదు.. పేర్ని నాని కీలక వ్యాఖ్యలు

జగన్‌ను రాజకీయంగా అడ్డు తొలగించుకోవడం కోసం మొదటి నుంచి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాజకీయ ఆషాఢ భూతి అని.. నమ్ముకున్న వాళ్లను ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళని ఆషాఢ భూతి అంటారని ఆయన అన్నారు. టీడీపీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలని చంద్రబాబు అంటున్నారని.. 2014 నుంచి 2019 వరకు ఎంత మందిని రాజీనామా చేయించారో చెప్పాలని ప్రశ్నించారు. విశాఖ, ప్రకాశం, బెజవాడలో కార్పొరేటర్లు, మేయర్లు రాజీనామా చేయకుండా ఎలా కండువా కప్పుకున్నారని ప్రశ్నలు గుప్పించారు. టీడీపీలో వైసీపీ వారిని చేర్చుకోవటం ద్వారా జగన్‌కు రాజకీయంగా అంగుళం కూడా ఏం కాదన్నారు. ఎన్నికల్లో ఓటమి వల్ల ఆ పార్టీ పని అయిపోదన్నారు. ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు ఎవరో ఒకరి సపోర్ట్ ద్వారానే ప్రభుత్వం ఏర్పాటు చేశారని.. చంద్రబాబుకి ఎవరో ఒకరు సాయం ఉంటే తప్ప గెలవటం కుదరదని విమర్శించారు. జగన్‌కు పార్టీ మారే ఇలాంటి నేతలు అవసరం లేదని, జనం ఉంటే జగన్‌కు చాలన్నారు. జగన్ పదవి ఇచ్చిన వాళ్ళని మాత్రమే చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని పేర్కొన్నారు. 2029లో టీడీపీపై ప్రజల తిరుగు బాటు ఉంటుందని జోస్యం చెప్పారు పేర్ని నాని.. రాజీనామాల తర్వాత సతీష్, రాజేష్ అనే వారు రాజ్యసభలోకి వస్తున్నారనే విషయం అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు ఈ రాజీనామాలు, కొనుగోళ్ల డ్రామాలు ఎందుకు చేస్తున్నారో అందరికీ తెలుసని పేర్ని నాని చెప్పారు. చంద్రబాబు జన్మలో ఒక్క బీసీని రాజ్యసభకు పంపలేదన్నారు.

హైడ్రా సంచలన నిర్ణయం

హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అస్సెట్స్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ (హైడ్రా) నిర్ణయం తీసుకుంది. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్‌ కేసులకు సిద్ధమైంది. ఆరుగురు అధికారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్‌ కమిషనర్‌కు సిఫారసు చేసింది హైడ్రా. హెచ్‌ఎండీఏలో అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారుల జాబితాను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అక్రమ నిర్మాణదారులకే కాదు.. నిబంధనలకు నీళ్లొదిలిన అధికారులకూ హైడ్రా సెగ తగిలింది. చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా పెద్దఎత్తున కూల్చివేయిస్తున్న విషయం తెలిసిందే. అయితే కూల్చివేతలు చేపట్టిన ప్రాంతాల్లో నాటి నుంచి విధులు నిర్వహించిన సంబంధిత అధికారుల వివరాలను సేకరిస్తున్నట్టు సమాచారం. ఇప్పటివరకు 18 ప్రాంతాల్లో చిన్నా పెద్దవి కలిపి సుమారు 200కి పైగా నిర్మాణాలు కూల్చివేసినట్లు అధికారుల సమాచారం. 50 ఎకరాల వరకు ప్రభుత్వ, చెరువుల భూములను పరిరక్షించినట్లు హైడ్రా అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, రెవెన్యూ అధికారుల పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు.

ఆస్తుల కేసులో ఊరట.. డిప్యూటీ సీఎంపై దాఖలైన పిటిషన్లు కొట్టివేత

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు న్యాయస్థానంలో ఊరట లభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో  దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయనకు గురువారం బిగ్ రిలీఫ్ లభించింది. సీబీఐ దర్యాప్తునకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఆదేశాలను ప్రస్తుత సిద్ధరామయ్య ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం సాధారణ క్లాజుల చట్టంలోని సెక్షన్ 21 కింద అనుమతిని రద్దు చేసింది. డీకే శివకుమార్‌‌పై విచారణను కొనసాగించాలంటూ న్యాయస్థానంలో రెండు పిటిషన్లలు దాఖలు అయ్యాయి. ఒకదాన్ని సీబీఐ దాఖలు చేయగా.. మరొకటి బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాల్‌ దాఖలు చేశారు. వీటిని తాజాగా పరిశీలించిన ధర్మాసనం విచారణను కొసాగించేందుకు వీలు లేదంటూ రెండు పిటిషన్లను కొట్టివేసింది. దీంతో ఉప ముఖ్యమంత్రికి కోర్టులో ఊరట లభించినట్లయింది. కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు డీకే.శివకుమార్ తెలిపారు. ఇది దేవుడు ఇచ్చిన తీర్పుగా భావిస్తున్నట్లు చెప్పారు.

ఇద్దరు వైసీపీ ఎంపీల రాజీనామా ఆమోదం

రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేశారు. పార్లమెంట్‌లో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్‌ ధన్‌కడ్‌కు రాజీనామా పత్రాలను సమర్పించారు. వీరి రాజీనామా లేఖలను రాజ్యసభ ఛైర్మన్‌ ఆమోదించినట్లు ప్రకటన వెలువడింది. రెండు స్థానాలు ఖాళీగా ఉన్నట్లు రాజ్యసభ బులిటెన్ విడుదల చేసింది. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రకటన విడుదల చేశారు. ఈ రోజు మధ్యాహ్నం వెంకటరమణ, మస్తాన్ రావులు రాజీనామా చేశారు. ఖాళీ అయిన రెండు స్థానాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇద్దరు ఎంపీలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ విషయంలో మోపిదేవి ఇప్పటికే క్లారిటీ ఇవ్వగా… బీద మస్తాన్ రావు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రెండేళ్లుగా వైసీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నానని, వ్యక్తిగత కారణాలతో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు బీదమస్తానరావు తెలిపారు. కుటుంబసభ్యులు, మిత్రులతో చర్చించిన తర్వాత రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తానని చెప్పారు. మోపిదేవి టీడీపీలో చేరనున్నట్లు ధ్రువీకరించారు. మోపిదేవి వెంకటరమణకు రాజ్యసభ సీటుపై ఆసక్తి లేకపోవడంతో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించే అవకాశం ఉంది. స్థానిక ప్రజలను వీడి ఢిల్లీకి రావడం ఇష్టం లేదని ఆయన మొదటి నుంచి చెబుతున్నారు. మోపిదేవికి ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. బీద మస్తాన్ రావు కూడా టీడీపీలో చేరుతారని తెలుస్తోంది.