NTV Telugu Site icon

Top Headlines @ 9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

లోకేష్ బరితెగించి అబద్ధాలు మాట్లాడాడు.. పేర్ని నాని ఫైర్ : పేర్ని నాని

తన పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భయం, బెరుకు లేకుండా లోకేష్ బరితెగించి అబద్ధాలు మాట్లాడాడని ఫైర్ అయ్యారు. బందర్ పోర్ట్, కడప స్టీల్ ప్లాంట్‌ను టీడీపీ హయాంలో పూర్తి చేశారని, 5 ఏళ్ళల్లో 5 లక్షల ఉద్యోగాలను వాళ్ళ నాన్న ఇచ్చాడని, అమరావతిని పూర్తి చేయడంతో పాటు మోడీ మెడలు చంద్రబాబు వంచాడంటూ లోకేష్ పచ్చి అబద్ధాలు చెప్పాడని మండిపడ్డారు. లోకేష్ చెప్పినట్లు ఇవన్నీ చంద్రబాబు చేస్తే.. మరి ప్రజలెందుకు మిమ్మల్ని కైమా కైమా చేసి ఇంటికి పంపించారు? అని పేర్ని నాని ప్రశ్నించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడే చంద్రబాబు చెత్త నాయకుడని, ఎందుకు పనికి రాడని, అధికారంలోకి రాగానే కార్యకర్తలను పక్కన పెట్టేస్తాడని అంటున్నాడని చెప్పారు. పోలీసుల మధ్య బతికిన బతుకు చంద్రబాబు, లోకేష్‌ది అని దుయ్యబట్టారు. పోలీసుల లేకుండా వాళ్లిద్దరు అడుగు కూడా బయటకు పెట్టలేరని విమర్శించారు. అయినా పోలీసుల్ని కించపరుస్తూ మాట్లాడడానికి వాళ్లకు సిగ్గు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమైక్య వాద నాయకులు తెలంగాణ అడ్డుకున్నారు… నేను శత్రువు అయ్యాను : విజయశాంతి

బీజేపీ నాయకురాలు విజయశాంతి రాజకీయాల్లోకి అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమెను సన్మానించారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. 25 ఏళ్లు సుదీర్ఘ ప్రయాణం.. బీజేపీ సిద్దాంతం, క్రమశిక్షణ నచ్చి 1998 లో పార్టీ లో చేరానన్నారు. తెలంగాణకు ఏదో చేయాలని తపన ఎప్పుడు ఉండేదని, సోనియా గాంధీకి పోటీగా ఉండాలని అద్వానీ చెప్పారన్నారు. సమైక్య వాద నాయకులు తెలంగాణ అడ్డుకున్నారు… నేను శత్రువు అయ్యానని ఆమె వివరించారు. కేంద్ర ప్రభుత్వం కూలి పోయే పరిస్థితి వచ్చిందని, బ్లాక్ మెయిల్ చేశారన్నారు. సమైక్య వాదుల ఒత్తిడి వల్ల 2005లో నేను బీజేపీకి రాజీనామ చేశానని, తల్లి తెలంగాణ పార్టీ పెట్టానని, ఎన్నో వ్యయ పర్యవసానాలు ఎదుర్కొన్నానన్నారు. ఆ సమయంలో ఒక రాక్షసుడు కేసీఆర్‌ ఎంటర్ అయ్యాడని, నమ్మదగ్గ వ్యక్తి కాదని నాకు అప్పుడే అర్థం అయిందన్నారు. లొంగదీసి పార్టీలో విలీనం చేసుకోవాలని చూసాడన్నారు.

నాకు గుర్తింపు వచ్చింది మీడియాతోనే : సీపీ సీవీ ఆనంద్‌

బాల్యంలో ఓ క్రీడాకారుడిగా, ఆతర్వాతా సివిల్స్ లో ర్యాంకు సాధించిన విద్యార్థిగా, పోలీసు అధికారిగా మీడియాతోనే సమాజంలో తనకు గుర్తింపు లభించిందని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సి.వి.ఆనంద్ అన్నారు. శుక్రవారం రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ హాలులో హైదరాబాద్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రూపొందించిన 2023 మీడియా డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సీపీ మాట్లాడుతూ, మీడియాతో తనకు దాదాపు 40యేండ్ల అనుబంధం ఉందన్నారు. విధి నిర్వహణలో కొన్ని సందర్భాల్లో తమ నుండి దొర్లే తప్పులను తాము గ్రహించకపోవచ్చని, మీడియా ద్వారానే వాటిని గుర్తించి సరిచేసుకుంటామన్నారు. ఇదే క్రమంలో పోలీసుల పనితీరుపై పనిగట్టుకొని చేసే అసత్య ప్రచారాల్ని తాము అస్సలు పట్టించుకోమని, వాస్తవాలు ఉండే కథనాలనే పరిగణలోకి తీసుకుంటామని సీపీ ఆనంద్ స్పష్టం చేశారు. ఒకప్పుడు మీడియా సమాజానికి దిక్చూసిగా నిలబడేదని, ప్రస్తుతం దాని స్వరూపం మారిపోవడమే కాకుండా లక్ష్మణరేఖ దాటి పనిచేస్తున్నదన్నారు. ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లకుండా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాల్సిన బాధ్యతా మీడియా సంస్థలపై ఉంటుందన్నారు. సమగ్ర సమాచారంతో డైరీని రూపొందించిన హెచ్.యు.జెను ఆయన అభినందించారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్షులు కే.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, పవిత్రమైన మీడియా పెడదారి పడుతుండడంతో ప్రజల్లో విశ్వాసం తగ్గిపోతుందన్నారు.

తెలంగాణలో ప్రభుత్వ మార్పు ఖాయం : ఈటల

సొంత నియోజకవర్గం లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు రాలేదని ఆత్మహత్య కోసం ప్రయత్నించారు ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ వల్ల కలెక్టర్ ల చుట్టూ తిరగలేక ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ పల్లెల్లో కరెంట్ ఉండటం లేదని, గిరిజన,హరిజన కాలనీలల్లో మీటర్లు లేవని కరెంట్ కట్ చేస్తున్నారన్నారు ఈటల రాజేందర్‌. ఢిల్లీలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు కనపడటం లేదని ఈటల రాజేందర్‌ అన్నారు. ట్రేడ్ ఫేర్ లో కూడా తెలంగాణ భాగం కావడం లేదని, తెలంగాణ ప్రత్యేక దేశం ..భారత్ లో భాగం కాదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు ఈటల రాజేందర్‌. గవర్నర్ ను అవమానించడం మానుకోవాలని ఆయన సీఎం కేసీఆర్‌కు హితవు పలికారు ఈటల రాజేందర్‌. గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత నరేంద్ర మోడీదని, కానీ తెలంగాణా ముఖ్యమంత్రికి గవర్నర్ ను గౌరవించే సంస్కారం లేదని ఈటల రాజేందర్‌ విమర్శించారు.

అదానీ గ్రూపులో దర్యాప్తు చేయాల్సిందే.. కాంగ్రెస్ డిమాండ్

అదానీ గ్రూపు అవకతవకలకు పాల్పడుతోందంటూ అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ పరిశోధనా సంస్థ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అటు స్టాక్ మార్కెట్లలపై ఈ వ్యవహారం ప్రభావం చూపించగా.. ఇటు రాజకీయాల్లోనూ అగ్గి రాజేసుకుంది. దీనిపై సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (SEBI), రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (RBI)తో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండు చేస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, భద్రతలను నిర్దారించే బాధ్యత ఈ రెండు సంస్థలకు ఉంది కాబట్టి.. అదాని వ్యవహీరం మీద సీరియస్ దర్యాప్తు అవసరమని కాంగ్రెస్ పేర్కొంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరా రమేశ్ మాట్లాడుతూ.. ‘‘అదానీ సంస్థకు, ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న సన్నిహిత సంబంధాల గురించి అందరికీ తెలుసు. అయితే.. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సెబీ, ఆర్బీఐ సంస్థలు అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణల మీద పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నాం. మోదీ ప్రభుత్వం అణచివేతకు ప్రయత్నించవచ్చేమో కానీ, తప్పుడు పద్ధతిలో వ్యాపారం చేసే వాటిపై హిండెన్‌బర్గ్‌ వంటి సంస్థలు ఇచ్చే నివేదికను పక్కనపెట్టగలమా?’’ అని ఆయన చెప్పారు.

లోకేష్ పాదయాత్ర ఒక జోక్.. మంత్రి కాకాని విసుర్లు

లోకేష్ పాదయాత్ర ఒక జోక్ అంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు చేశారు. సమాజంలో అనేక అవకాశాలను అందిపుచ్చుకున్నా.. లోకేష్ వాటిని ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేదని విమర్శించారు. వైఫల్యం చెందిన ఓ నేత చేస్తున్న పాదయాత్ర ఇదని కౌంటర్ వేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఎలాంటి సమస్యలు లేవన్నారు. లోకేష్‌కు ప్రజా జీవితం గురించి తెలియదని.. అమెరికాకు వెళ్లి అక్కడ ఎలాంటి నిర్వాకాలు చేశాడో మీడియాకు తెలుసని అన్నాడు. మంత్రిగా ఉన్నపుడు మూగపోయిన గొంతును ఇప్పుడు తెరిచేందుకు వస్తున్నాడని సెటైర్ వేశారు. లోకేష్ ఏం మాట్లాడుతాడోనని టీడీపీ శ్రేణులు భయపడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబుకు వయసు అయిపోయిందని, అందుకే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. లోకేష్ పాదయాత్ర గురించి వైసీపీ భయపడటం లేదన్నారు. చంద్రబాబు ఎన్నో హామీలిచ్చి నెరవేర్చలేదని.. అందుకు లోకేష్ పాపపరిహార యాత్ర చేయాలని గోవర్ధన్ రెడ్డి సూచించారు.

ఆత్మను పోగొట్టుకున్న సూర్య.. ఎమోషనల్ ట్వీట్

చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. నేటి ఉదయం సీనియర్ నటి జమున కన్నుమూశారు. ఈ వార్తను జీర్ణించుకోనేలోపే మరో మరణవార్త టాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసింది. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి నేటి ఉదయం చెన్నెలో కన్నుమూశారు. తెలుగులో సూర్య, విక్రమ్, అజిత్ చిత్రాలకు డబ్బింగ్ చెప్పి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు శ్రీనివాసమూర్తి. ముఖ్యంగా సూర్యకు ఆత్మ ఆయనే అని చెప్పొచ్చు. తెలుగులో సూర్య హావభావాలకు, ఆ కట్ అవుట్ కు బేస్ వాయిస్ ఇచ్చిన వ్యక్తి శ్రీనివాస్ మూర్తి. యముడు సినిమాలో సూర్యకు డబ్బింగ్ చెప్పి బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అవార్డును కూడా అందుకున్నారు. ఇక ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హీరో సుత్ర్య.. శ్రీనివాసమూర్తి మృతిపై ఎమోషనల్ అయ్యారు. ట్విట్టర్ ద్వారా ఆయన తన సంతాపాన్ని తెలిపారు.

“శ్రీనివాసమూర్తి మరణం నాకు పర్సనల్ గా తీరని లోటు.. తెలుగులో నా సినిమాలకు శ్రీనివాసమూర్తి వాయిస్ ప్రాణం పోసింది. మిమ్మల్ని కోల్పోవడం నిజంగా బాధాకరం. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆయన ఒక్క సూర్యకు మాత్రమే కాదు.. మోహన్ లాల్, మమ్ముట్టి, అజిత్, విక్రమ్ లాంటి వారందరికీ తన గొంతును అందినచారు. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. ఇకనుంచి ఆయన వాయిస్ తో కాకుండా సూర్య వాయిస్ ను ఎవరితో రీప్లేస్ చేస్తారో చూడాలి.

లోకేష్ పాదయాత్రతో టీడీపీ అధికారంలోకి వచ్చే సీన్ లేదు : కొడాలి నాని

ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తాజాగా లోకేష్ పాదయాత్రపై సెటైర్లు వేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదాలో ఉండి పాదయాత్రలు చేశారని.. ఏ అర్హతతో లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడని ప్రశ్నించారు. లోకేష్ మొదటగా ఎమ్మెల్యేగా గెలవాలని.. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పాదయాత్ర చేయాలని అభిప్రాయపడ్డారు. 2024 ఎన్నికల్లో టీడీపీకి జీరో సీట్లు వస్తాయని అన్నారు. అప్పుడు లోకేష్, చంద్రబాబును తన్ని బయటకు తరిమి.. ఎన్టీఆర్ వారసులు పార్టీని మళ్లీ హస్తగతం చేసుకుంటారని పేర్కొన్నారు. లోకేష్ పాదయాత్రతో టీడీపీకి ఎలాంటి ఉపయోగం లేదని.. అతని పాదయాత్రతో టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చే సీన్ లేదని తేల్చి చెప్పారు.