Site icon NTV Telugu

Top Headlines @9AM : టాప్ న్యూస్

Top Headlines@9am

Top Headlines@9am

నేడే పాలమూరుకు కేసీఆర్.. ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్న సీఎం

బీఆర్‌ఎస్ అధినేత త్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో పర్యటించనున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట, వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసిన సీఎం కేసీఆర్. అనివార్య కారణాల వల్ల నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వాయిదా పడింది. ఆ వెంటనే వనపర్తి నియోజకవర్గంలో సభకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. మండలాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని ఆదేశించారు. కాగా, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో గులాబీ దళం వ్యూహాత్మకంగా ప్రచారంలో దూసుకుపోతోంది. అసలు విషయానికి వస్తే సీఎం కేసీఆర్ మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. మిగతా చోట్ల ఎన్నికల ప్రచార సమయాన్ని కూడా ఖరారు చేస్తున్నారు. ప్రచారానికి సమయం దొరుకుతుందో లేదోనని విపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. ఎన్నికలకు ఇంకా 35 రోజులు మాత్రమే మిగిలి ఉండగానే కారు టాప్ గేర్ లో దూసుకుపోతోంది. బీఫారం పొందిన అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు.

నేడు గజ్వేల్ లో ఈటల పర్యటన.. భారీ బహిరంగ సభ

హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నేడు గజ్వేల్ కు రానున్నారు. గజ్వేల్ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆయన మొదటిసారి నియోజకవర్గానికి రానున్నారు. దీంతో ఆయనకి భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒంటి మామిడి నుంచి గజ్వేల్ కోట మైసమ్మ ఆలయం వరకు బీజేపీ నిర్వహించే ర్యాలీలో ఈటెల రాజేందర్ పాల్గొననున్నారు. ముట్రాజ్ పల్లిలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అయితే, ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీ పార్టీలోకి గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్, బీఆర్ఎస్ అసంతృప్త నాయకులు చేరనున్నారు. అయితే, తెలంగాణ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ను ఓడించటమే లక్ష్యంగా తాను పోటీ చేస్తానని బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ప్రకటించారు.

జైలర్ దెబ్బకి అరవై లక్షల టికెట్స్ అవుట్

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా థియేట్రికల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. రిలీజ్ అయిన రోజు నుంచి దాదాపు నెల రోజుల పాటు బాక్సాఫీస్ దగ్గర ఊచకోత సాగించిన జైలర్ సినిమా రజినీకాంత్ కి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. ఈ రేంజ్ సినిమా ఈ మధ్య కాలంలో పడకపోవడంతో ప్రతి ఒక్కరూ రజినీకాంత్ టైమ్ అయిపొయింది అనే కామెంట్స్ చేసారు. రజినీ ఇప్పుడు నంబర్ 1 కాదు అని కోలీవుడ్ సినీ అభిమానులు కూడా మాట్లాడుకునే సమయంలో జైలర్ సినిమా బయటకి వచ్చి 650 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. రజిని కెరీర్ లోనే కాదు కోలీవుడ్ బాక్సాఫీస్ హిస్టరీలోనే సెకండ్ హయ్యెస్ట్ గ్రాస్డ్ సినిమాగా జైలర్ నిలిచింది. ఈ సినిమా బుక్ మై షోలో దాదాపు 6 లక్షలకి పైగా టికెట్ బుకింగ్స్ ని సొంతం చేసుకుంది. విడుదలైన మొదటి వారానికే కావడం విశేషం. అసలు అంచనాలు లేని ఒక సినిమా కేవలం మౌత్ టాక్ తో ఈ రేంజ్ బుకింగ్స్ ని రాబట్టింది. డే 1 కన్నా డే 3, 4, 5ల్లో జైలర్ సినిమా ఎక్కువ బుకింగ్స్ రాబట్టింది. ఈ 6 మిలియన్ టికెట్స్ లో 1.5 మిలియన్ టికెట్స్ జైలర్ సినిమాని రెండో సారి చూడడానికి బుక్ చేసుకున్నారు.

నేడు తూ.గో జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి నేడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంట వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరుకానున్నారు. ఉదయం 10.15 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి రాజానగరం మండలం దివాన్‌చెరువుకు చేరుకోనున్నారు. డి.బి.వి.రాజు లే–అవుట్‌లో జరగనున్న వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం సీఎం జగన్ బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం దివాన్‌ చెరువుకు రానున్నారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్‌ కోఆర్డినేటర్‌ జక్కంపూడి గణేష్‌ వివాహ రిసెప్షన్‌కు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టరు కె. మాధవీలత, ఎస్పీ జగదీష్‌, తదితర అధికారులు భద్రతా ఏర్పాట్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇక్కడి డీవీబీ రాజు లేఅవుట్‌లో సోదరుడు గణేష్‌ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జక్కంపూడి రాజా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

నేటి నుంచి వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర

మొత్తం 175 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అక్టోబర్ 26 నుంచి సామాజిక సాధికార యాత్ర పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బస్సుయాత్ర చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.ప్రతిపాదిత బస్సు యాత్ర ఉత్తర ఆంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతంతో సహా మూడు ప్రాంతాల నుండి ప్రారంభమవుతుంది. ఇది డిసెంబర్ చివరి వరకు కొనసాగుతుంది.అందులో భాగంగానే ఉత్తరాంధ్రలోని ఇచ్ఛాపురం, రాయలసీమలోని సింగనమల, కోస్తా ప్రాంతంలోని తెనాలి నుంచి యాత్రను ప్రారంభించేందుకు పార్టీ బస్సులను సిద్ధం చేసింది. మూడు ప్రాంతాల్లో ఏకకాలంలో బస్సు యాత్రలు ప్రారంభంకానున్నాయి. ఉత్తరాంధ్రలోని ఇచ్ఛాపురం, కోస్తా ఆంధ్రలోని తెనాలి, రాయలసీమలోని సింగనమల నుంచి బస్సు యాత్రలు ప్రారంభమవుతాయి. నాలుగున్నరేళ్ల అభివృద్ధి, సంక్షేమంపై ప్రచారం చేపట్టనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరిస్తామన్నారు. ప్రతిరోజూ మూడు ప్రాంతాల్లో మూడు సమావేశాలు నిర్వహించనున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, సమన్వయకర్తల ఆధ్వర్యంలో బస్సుయాత్రలు ప్రారంభం కాగా.. 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా బస్సుయాత్రలు నిర్వహించనున్నారు.

వన్డే ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన గ్లెన్ మ్యాక్స్‌వెల్!

ఆస్ట్రేలియా విధ్వంసక ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. ప్రపంచకప్‌ 2023లో భాగంగా బుధవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నెదర్లాండ్స్‌పై 40 బంతుల్లోనే మ్యాక్స్‌వెల్ శతకం బాదాడు. మ్యాక్సీ ఇన్నింగ్స్‌లో 8 సిక్సులు, 9 ఫోర్లు ఉండడం విశేషం. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 44 బంతులు ఎదుర్కొన్న మ్యాక్స్‌వెల్ 106 పరుగులు చేశాడు.

దక్షిణాఫ్రికా స్టార్ ఐడెన్ మార్‌క్రమ్‌ రికార్డును గ్లెన్ మ్యాక్స్‌వెల్ బద్దలు కొట్టాడు. వన్డే ప్రపంచకప్‌ 2023లో శ్రీలంకపై మార్‌క్రమ్‌ 49 బంతుల్లో సెంచరీ చేశాడు. ఆ రికార్డును తాజాగా మ్యాక్స్‌వెల్ బ్రేక్ చేశాడు. 2023 ప్రపంచకప్‌కు ముందు ఈ రికార్డు ఐర్లాండ్ క్రికెటర్ కెవిన్ ఓబ్రియన్ పేరిట ఉంది. 2011లో ఇంగ్లండ్ జట్టుపై ఓబ్రియన్ 50 బంతుల్లో శతకం చేశాడు. 2015లో మ్యాక్స్‌వెల్ 51 బంతుల్లో, ఏబీ డివిలియర్స్ 52 బంతుల్లో శతకాలు చేశారు. 2023 ప్రపంచకప్‌లోనే అత్యధిక సెంచరీలు నమోదు కావడం విశేషం.

రైతులకు కేంద్ర దీపావళి కానుక.. రబీ సీజన్లో ఎరువులపై రాయితీ విడుదల

దీపావళికి ముందే రైతులకు కేంద్ర ప్రభుత్వం కానుక ప్రకటించింది. రబీ సీజన్‌లో ఎరువులపై రాయితీని కేబినెట్‌ విడుదల చేసింది. 2023-24 రబీ సీజన్‌కు ఫాస్ఫాటిక్, పొటాసిక్ ఎరువుల సబ్సిడీ రూ.22,303 కోట్లకు కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. క్యాబినెట్ ఆమోదించిన సబ్సిడీలో పెద్ద తగ్గుదల ఉంది. గతేడాదితో పోలిస్తే 57 శాతం సబ్సిడీ తగ్గిందని, దీంతో ఎరువుల ధరలు తగ్గాయన్నారు. 2022-23 సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్‌లకు విడుదల చేసిన మొత్తం సబ్సిడీ రూ.1.12ట్రిలియన్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో యూరియాయేతర భారం 46 శాతం తగ్గి రూ.60,303 కోట్లకు చేరుకోవచ్చని అంచనా.

కిలో నత్రజని రూ.47.02, భాస్వరం రూ.20.82, పొటాష్‌ రూ.2.38, సల్ఫర్‌ రూ.1.89 చొప్పున అక్టోబర్‌ 1 నుంచి కేబినెట్‌ ఆమోదించింది. గత ఆర్థిక సంవత్సరంలో కిలో నత్రజని రూ.98.2, ఫాస్పరస్ రూ.66.93, పొటాష్ రూ.23.65, సల్ఫర్ రూ.6.12 చొప్పున సబ్సిడీ మంజూరైంది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఈసారి కూడా గత ఆర్థిక సంవత్సరం మాదిరిగానే రైతులకు ఎరువులు అందజేస్తామన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో వీటి ధరలు పెరుగుతూనే ఉన్నందున రైతులకు ఎల్లవేళలా సబ్సిడీ లభిస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులపై ఎలాంటి ప్రభావం చూపకూడదని ప్రభుత్వం భావిస్తోంది.

నేటి నుంచి గోవాలో జాతీయ క్రీడలు.. 43 క్రీడా విభాగాల్లో 10 వేల మంది పోటీ!

ఇండియన్ ఒలింపిక్స్‌గా పిలిచే ‘నేషనల్ గేమ్స్‌’ నేటి నుంచి ఆరంభం కానున్నాయి. జాతీయ క్రీడలకు (నేషనల్ గేమ్స్‌) తొలిసారిగా గోవా ఆతిథ్యం ఇస్తోంది. 37వ ఎడిషన్‌ జాతీయ క్రీడలు అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9 వరకు జరగనున్నాయి. నేడు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా నేషనల్ గేమ్స్‌ ఆరంభం కానున్నాయి. దేశంలోని అత్యుత్తమ క్రీడాకారులను, అథ్లెట్లను వెలుగులోకి తెచ్చే ప్రయత్నమే ‘నేషనల్ గేమ్స్’ అన్న విషయం తెలిసిందే.

గోవాలోని ఐదు ప్రధాన నగరాల్లో రెండేసి ప్రదేశాల చొప్పున మొత్తంగా 10 ప్రాంతాల్లో 2023 జాతీయ క్రీడలు జరుగనున్నాయి. మపుసా, మార్గావ్‌, పంజిమ్‌, పోండా, వాస్కో నగరాలు ఈ క్రీడల కోసం క్రీడా గ్రామాలుగా మారిపోయాయి. 37వ ఎడిషన్‌ జాతీయ క్రీడల్లో 10 వేల మంది ఆటగాళ్లు 43 క్రీడా విభాగాల్లో పోటీ పడనున్నారు. సుమారు 2.5 లక్షల మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంది. గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ ప్రధానితో పాటు నేషనల్ గేమ్స్‌ ఆరంభ వేడుకల్లో పాల్గొంటారని తెలుస్తోంది.

మళ్లీ షాక్ ఇచ్చిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంత ఉందంటే?

దేశంలో బంగారం ధరలు రోజు రోజుకు పరుగులు పెడుతున్నాయి.. నిన్న కాస్త పెరిగిన ధరలు ఈరోజు కూడా పైకి చేరాయి.. ఈరోజు ప్రతీరోజూ బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తోంది. నిన్న రూ.200 పెరిగిన ధరలు.. ఈరోజు ఇంకాస్త పెరిగాయి.. మరో వంద పెరిగింది.. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 పెరిగి రూ. 56,650 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారంపై రూ. 110 పెరిగి, రూ. 61,800కి చేరింది. ఇక దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. మరి ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

*. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,550గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,690వద్ద కొనసాగుతోంది.

* ముంబయిలో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650 వద్ద కొనసాగుతోంది.

* ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,800 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,950గా ఉంది.

* కోల్‌కతాలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.
* ఇక బెంగుళూరులో కూడా 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800గా ఉంది..
* తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో ధరలు ఎలా ఉన్నాయంటే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్స్ తులం గోల్డ్‌ ధర రూ. 61,800గా ఉంది..

Exit mobile version