NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

ఏపీ ఫైబర్ నెట్ నూతన ఎండీగా ప్రవీణ్ ఆదిత్య.. ఉత్తర్వులు జారీ

ఏపీ ఫైబర్ నెట్ నూతన ఎండీగా ప్రవీణ్ ఆదిత్యను నియమితులయ్యారు. అందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రవీణ్ ఆదిత్య ఏపీ మారిటైం బోర్డ్ సీఈఓగా ఉన్నారు. కాగా.. ఫైబర్ నెట్ ఎండీగా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుత ఎండీ దినేష్ కుమార్‌ను జీఏడీకి అటాచ్ చేసింది ప్రభుత్వం. ఇదిలా ఉంటే.. దినేష్ వైఖరిపై నిన్న జీవీ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఏపీ ఫైబర్ నెట్ నూతన ఎండీగా ప్రభుత్వం ప్రవీణ్ ఆదిత్యను నియమించింది. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్‌, టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. టీడీపీకి, పార్టీ పదవులను కూడా వదులుకుంటున్నట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాలతో తెలుగు దేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం, జాతీయ అధికార ప్రతినిధి హోదా, ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవుల నుండి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్ర పునర్నిర్మాణమే మా లక్ష్యం.. ప్రతీ హామీ అమలుచేస్తాం

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానంపై చర్చలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. టీడీపీ జనసేన బీజేపీ కలవడం దగా పడ్డ రాష్ట్రం పునర్నిర్మాణం లక్ష్యంగా ఏర్పాటు జరిగిందని తెలిపారు. అసెంబ్లీలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు, ప్రస్తుతం గత ప్రభుత్వానికి సంబంధించి సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. స్వార్ధ ప్రయోజనాల కోసం కలిసి పోటీ చేయలేదు.. రాష్ట్ర అభివృద్ధే తమ లక్ష్యమని అన్నారు. గత పాలనలో ఏపీ ఆర్ధిక వ్యవస్థను నిర్వీర్యం చేశారని సీఎం ఆరోపించారు. రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి.. డబల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. మరోవైపు.. గౌరవ సభను గౌరవించలేని సంస్కారం లేని పార్టీ వైసీపీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు దుయ్యబట్టారు.

ఈనెల 27న SLBC టన్నెల్‌కు BRS బృందం.. మా పర్యటనకు పోలీసులు ఆటంకం కల్గించొద్దు

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కొనుగోలుకు భారీగా డబ్బు వెచ్చించారన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందేందుకు రూ.90 కోట్లు ఖర్చు చేశారని బీఆర్ఎస్ సీనియర్ నేత చిన్నారెడ్డి ఆరోపించారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అందజేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావు కూడా తెలిపారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈడీ (ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్), సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్), ఐటీ (ఇన్‌కమ్ ట్యాక్స్) వంటి కేంద్ర సంస్థలు ఎందుకు స్పందించడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల కమిషన్ కూడా ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

షాకింగ్: అల్లు అర్జున్ సన్నిహిత నిర్మాత మృతి..

టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన యంగ్ నిర్మాత అనూహ్య పరిస్థితుల్లో కన్నుమూశాడు. ఆనంద్ దేవరకొండ హీరోగా గం గం గణేశా అనే సినిమా నిర్మించిన నిర్మాత కేదార్ సెలగంశెట్టి దుబాయ్ లో మరణించారు. ఆయన మరణానికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈవెంట్‌కు హైదరాబాద్‌ నుంచి దుబాయ్ వెళ్లారు కేదార్ సెలగంశెట్టి. పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు కేదార్‌ సెలగంశెట్టి.. కేదార్ గుండెపోటుతో మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు దుబాయ్ అధికారులు.. చాలా యుక్త వయసులోనే ఆయన మరణించినట్లుగా చెబుతున్నారు. కేదార్ అల్లు అర్జున్ బన్నీ వాసు సహా విజయ్ దేవరకొండకు అత్యంత సన్నిహితుడు అని తెలుస్తోంది. బన్నీ వాసు ప్రోద్బలంతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన గతంలో ముత్తయ్య అనే సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరించారు.

వంశీ కస్టడీ వ్యవహారంలో కీలక పరిణామం..

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వంశీ సహా మరో ఇద్దరు నిందితుల పోలీస్ కస్టడీ ఆదేశాలు రద్దు చేయాలని ఏ7, ఏ8 తరఫు న్యాయవాది చిరంజీవి మెమో దాఖలు చేశారు. కస్టడీకి తీసుకున్న పోలీసులు ఎక్కడ వారిని విచారిస్తున్నారు అనే విషయాన్ని ముందుగానే వారి తరఫున న్యాయవాదులకు సమాచారం ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కస్టడీ సమయంలో మధ్యలో 3 నుంచి 4 సార్లు నిందితులతో వారి అడ్వకెట్లు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలు పోలీసులు పాటించలేదని అసలు తమకు సమాచారం ఇవ్వలేదని కస్టడీ ఆదేశాలు రద్దు చేయాలని మెమో దాఖలు చేశారు. విచారణ అధికారులపై చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు మెమోలో కోరారు. ఈ క్రమంలో రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.

ఎప్ సెట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ వాయిదా..

తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఎన్‌జినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG EAPCET) దరఖాస్తు ప్రక్రియకు మార్పులు చోటు చేసుకున్నాయి. అసలు షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 25 సాయంత్రం 4:45 గంటల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావాల్సి ఉండగా, అనివార్య సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రక్రియను నిర్వాహకులు వాయిదా వేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన పరీక్ష కన్వీనర్ డీన్ కుమార్, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వీలైనంత త్వరగా కొత్త షెడ్యూల్ ప్రకటించామని తెలిపారు.

తాజా షెడ్యూల్ ప్రకారం, టీజీ ఎప్ సెట్ 2024 దరఖాస్తు ప్రక్రియ మార్చి 1 నుంచి ప్రారంభమై మార్చి 4 వరకు కొనసాగనుంది. ఈ మార్పును విద్యార్థులు గమనించి సంబంధిత తేదీల్లో తమ దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేసుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షల తేదీలను ఖరారు చేసినట్లు తెలియజేశారు.

కిలాడీ లేడీస్.. సూట్‌కేస్‌లో మృతదేహంతో దొరికిన ఇద్దరు..

గుట్టు చప్పుడు కాకుండా శవాన్ని మాయం చేద్దామనుకున్న ఇద్దరు లేడీస్ అనూహ్య రీతిలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ సంఘటన కోల్‌కతాలో మంగళవారం జరిగింది. సూట్‌కేస్‌లో శవాన్ని తీసుకువచ్చిన ఇద్దరు మహిళలు, నగరంలోని కుమార్తులి సమీపంలోని గంగా నది ఘాట్‌లో పారేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే, రోజూ వారీ యోగా సెషన్‌కి వచ్చే వారు వీరిని పట్టుకున్నారు. సూట్‌కేస్‌లో మృతదేహాన్ని చూసి ఒక్కసారి భయాందోళనకు గురయ్యారు.

కుమార్తులి ప్రాంతం దుర్గా పూజ కోసం విగ్రహాలు నిర్మించే శిల్పులకు కేంద్రంగా ఉంది. దుర్గాపూజ సమయంలో తప్పితే, మిగతా సమయంలో జనసంచారం తక్కువగా ఉంటూ ప్రశాంతంగా ఉంటుంది. దీంతో ఈ ప్రాంతంలో నదిలో మృతదేహాన్ని పారేయాలని ఇద్దరు మహిళలు భావించినట్లు భావిస్తున్నారు. మంగళవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో, ఇద్దరు మహిళలు క్యాబ్ నుంచి ట్రాలీ సూట్‌కేస్ తో దిగడాన్ని అక్కడే ఉన్న స్థానికులు చూశాడు. ఇద్దరు మహిళల కదలికలపై అనుమానం వ్యక్తం చేశారు. సూట్‌కేస్‌ని నది వైపుగా లాగడానికి ప్రయత్నించారు. అయితే, వీరిద్దరు దానిని కదపలేకపోయారు. దీనిపై అక్కడే ఉన్న యోగా చేసేవారు అనుమానం వ్యక్తం చేశారు.

ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేత..

తెలంగాణ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను కలిశారు. జనగణన కుల ప్రాతిపదికన జరగాలని కోరారు. అలాగే డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి ప్రధాని మోడీతో సత్సంబంధాలు ఉన్నాయి.. కచ్చితంగా కుల ప్రాతిపదికన జనగణనపైన మోడీతో చర్చించాలని హనుమంతరావు కోరారు. తెలంగాణ సీఎంరేవంత్ రెడ్డి ఇప్పటికే తెలంగాణలో జనగణన ప్రారంభించారని గుర్తు చేశారు.

ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్‌లను కుల ప్రాతిపదికన జనగణన చేయాలని కోరడానికి కలిశానని తెలిపారు. బీసీలకు ప్రత్యేక అవకాశాలు కల్పించాలని అడిగానన్నారు. కర్నూలు దగ్గర పెదపాడు గ్రామానికి దామోదర సంజీవయ్య పేరు పెట్టాలి.. ఆ ప్రాంతంలో స్మృతి వనం కట్టాలని వీహెచ్ పేర్కొన్నారు. అందుకోసం పవన్ కళ్యాణ్ కోటి రూపాయల విరాళం ఇచ్చారని తెలిపారు. మరోవైపు.. జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని వీహెచ్ ఆరోపించారు. నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి.. చనిపోయినప్పుడు కూడా సొంత ఇల్లు లేదని అన్నారు. ఆయనకి న్యాయం జరగాలని వి.హనుమంతరావు కోరారు. రాజకీయలలో డబ్బులు సంపాదించడం ఒక సిస్టం అయ్యింది.. పవన్ చొరవ తీసుకోవాలి, సహకరించాలన్నారు. మరోవైపు.. జనగణనతో పాటు కులగణన కూడా జరగాలి పవన్‌ని కోరుతున్నానన్నారు. ఏపీలో కాంగ్రెస్ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందని వీహెచ్ తెలిపారు.

ఎల్లుండి ఎమ్మెల్సీ ఎన్నికలు.. భారీగా భద్రతా ఏర్పాట్లు

ఏపీలో గురువారం మూడు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ పోలింగ్‌తో పాటు ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అందుకోసం.. అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో మొత్తం 6,62,100 మంది ఓటర్లు ఉన్నారు. కాగా.. రెండు నియోజకవర్గాల్లో 60 మంది అభ్యర్ధులు పోటీలో నిలిచారు. మొత్తం 939 పోలింగ్ కేంద్రాల్లో పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలు జరుగనున్నాయి.

రేపు ప్రధాని మోడీతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి ముహూర్తం ఖరారయ్యింది. బుధవారం ఉదయం 10:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరుడు శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి, ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) కార్యదర్శి శేషాద్రి, రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) జితేందర్‌తో కలిసి ప్రధానిని కలవనున్నారు. ఈ భేటీలో ప్రధానంగా హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి కీలక అంశాలపై చర్చించనున్నారు.

హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు, మెట్రో రైలు పొడిగింపు ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం, ఐపీఎస్ అధికారుల సంఖ్య పెంపు వంటి కీలక అంశాలపై ప్రధానిని సీఎం మెమొరాండం ద్వారా విజ్ఞప్తి చేయనున్నారు. నగరాభివృద్ధిలో భాగంగా కేంద్రం నుంచి మరిన్ని సహాయ నిధులను కోరే దిశగా ఈ భేటీ కొనసాగనున్నట్లు సమాచారం.