NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

భక్తుల సమస్యలు తెలుసుకునేందుకు ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ.. టీటీడీ కీలక నిర్ణయాలు

టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా టీటీడీ కార్యక్రమాలు నిర్వహించడానికి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ప్రతి రాష్ర్ట రాజధానిలో టీటీడీ ఆలయాలు నిర్మిస్తామని ఆయన వెల్లడించారు. స్విమ్స్ హస్పిటల్‌కు జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామన్నారు. తిరుమల పర్యటనలో భక్తుల ఆరోగ్య సమస్యలు గుర్తించి సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. దర్శనం, వసతి సౌకర్యాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తులకు అందించే సేవలపై, వారి సమస్యలను తెలుసుకునేందుకు ఫీడ్‌ బ్యాక్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

సంధ్య థియేటర్‌ కేసులో A1 నుంచి A18వరకు ఎవరెవరంటే..?

సంధ్య థియేటర్‌ ఘటన సంచలన రేపుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ బెయిల్‌పై ఉన్నారు. అయితే.. అల్లు అర్జున్‌ను ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో మూడు గంటలకు పైగా విచారించారు. పోలీసులు, కట్టుదిట్టమైన భద్రతతో, సెషన్ తర్వాత నటుడిని తిరిగి అతని నివాసానికి తీసుకెళ్లారు. అల్లు అర్జున్ మీడియాకు ఎలాంటి ప్రకటనలు చేయలేదు. విచారణ ముగిసిన వెంటనే తన కారులో ప్రాంగణం నుండి వెళ్లిపోయాడు. అయితే.. అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన 11 గంటలకు విచారణ ప్రారంభమైంది. తన న్యాయవాది అశోక్ రెడ్డితో పాటు, అల్లు అర్జున్‌ దర్యాప్తు అధికారుల నుండి వరుస ప్రశ్నలను ఎదుర్కొన్నారు.

‘‘పాకిస్తాన్ నుంచి దిగుమతులు చేసుకోవాలి’’.. వ్యాపారులపై బంగ్లాదేశ్ ఒత్తిడి..

షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ వచ్చిన తర్వాత అక్కడి మహ్మద్ యూనస్ ప్రభుత్వం పాకిస్తాన్‌తో స్నేహాన్ని పెంపొందించుకుంటోంది. అక్కడి తాత్కాలిక ప్రభుత్వంలోని మెజారిటీ వర్గం భారత్‌ని వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం యూనస్ ప్రభుత్వంలో ఉన్న మెజారిటీ వర్గం మతోన్మాద సంస్థలైన జమాతే ఇస్లామీ, బీఎన్‌పీ పార్టీలకు చెందిన వారే. 1971 బంగ్లాదేశ్ ఊచకోతని మరిచి పాక్‌కి దగ్గరవుతోంది. ఇదిలా ఉంటే, పక్కన ఉన్న భారత్‌ని కాదని పాకిస్తాన్ నుంచి దిగుమతులు పెంచుకోవాలని బంగ్లా ప్రభుత్వం అనుకుంటోంది. దశాబ్ధాల తర్వాత తొలిసారి పాకిస్తాన్ కరాచీ నుంచి బంగ్లాదేశ్ చిట్టగాంగ్‌కి కార్గో షిప్ నవంబర్ నెలలో వచ్చింది. ఇది భారత్‌లో ఆందోళల్ని పెంచింది. ఇదిలా ఉంటే ఈ వారంలో కరాచీ నుంచి కార్గో షిప్ చిట్టగాంగ్ రేవుకు చేరినట్లు బంగ్లా మీడియా పేర్కొంది. పనామా జెండాతో ఉన్న ఓడ ఎంవీ యువాన్ జియాంగ్ ఫా ఝాన్ ఆదివారం బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించింది. కరాచీ, దుబాయ్ మీదుగా ప్రయాణించిన ఈ ఓడలో 811 కంటైనర్లు ఉన్నాయి. వీటిలో పారిశ్రామిక పదార్థాలైన సోడా యాష్, డోలమైట్, మార్బుల్ బ్లాక్స్, వస్త్రాల ముడి పదార్థాలు, చక్కెర, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి బంగ్లాదేశ్ వర్తకులు అక్కడి ప్రభుత్వం ఒత్తిడి కారణంగా బలవంతంగా పాకిస్తాన్ నుంచి సరకులు దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది.

శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్‌రాజు.. సమస్యను పరిష్కరించేందుకు బాధ్యత తీసుకుంటా

సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుమారుడు శ్రీతేజ కిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. అయితే.. ఇవాళ శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు పరామర్శించారు. ఈ సందర్భంగా దిల్‌ రాజు మాట్లాడుతూ.. పుష్ప ప్రీమియర్ షో సమయంలో జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. ఇలాంటివి సినిమా ఇండస్ట్రీ లో అప్పుడప్పుడు చూస్తుంటామన్నారు. ప్రభుత్వానికి, సినిమా కి వారధిలా ఉండాలని నన్ను FDC చైర్మన్ గా ఈమధ్య నియమించారని, యూఎస్‌లో ఉన్నాను వేరే ప్రోగ్రాంలో.. నిన్న వచ్చాను… ఇవ్వాళ సీఎం రేవంత్ నీ కలిశాను… రేవతి భర్త భాస్కర్ నీ ఇండస్ట్రీ కి తీసుకుని వచ్చి ఏదోక జాబ్ ఏర్పాటు చేస్తాం అని దిల్‌ రాజు వెల్లడించారు. వాళ్ల బాధ్యత నేను తీసుకుంటానని ఆయన అన్నారు. మరోసారి సీఎం రేవంత్ రెడ్డి వద్దకు సినిమా పెద్దలతో కలిసివెళ్తామన్నారు.

అంబేద్కర్ అంశంపై రగడ.. కొట్టుకున్న కౌన్సిలర్లు

అంబేద్కర్‌‌పై రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గత వారం నుంచి దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ అంశంపై చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. అమిత్ షాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళన చేపట్టగా.. బదులుగా జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో బీఆర్‌ అంబేద్కర్‌కు అవమానం జరిగిందంటూ బీజేపీ ఆరోపించింది. ఇలా ఇరువర్గాల మధ్య రగడ చోటుచేసుకుంది. దీంతో కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్ సైడ్ నుంచి సపోర్ట్ ఉంది.. కేసు వాపస్‌ తీసుకుంటా..!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ క్రమంగా కోలుకుంటున్నాడు. రోజుకు రోజుకు అతని ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. కిమ్స్ వైద్యులు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్లు విడుదల చేస్తున్నారు. ఈ మధ్య, శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తన కుమారుడి ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడారు. నిన్నమొన్నటి నుంచి కొంచం బెటర్ గా ఉన్నాడని ఆయన తెలిపారు. 48 గంటలు అయ్యింది వెంటిలేటర్ తీసేశారని, గత కొన్ని రోజులుగా చాలా దారుణంగా ఉంది అతని హెల్త్ కండిషన్, రెండ్రోజులుగా కదలికలు ఉన్నాయన్నారు శ్రీతేజ్ తండ్రి భాస్కర్‌.

ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్ ఎవరు?.. సీఎం చంద్రబాబు ఆలోచన ఏంటి?

ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్ ఎవరు?.. సీఎం చంద్రబాబు ఆలోచన ఏంటి?.. ప్రస్తుతం ఉన్న ఆర్ధిక పరిస్థితి పాలనా వ్యవహారాలకు సంబంధించి సీఎం చంద్రబాబు సీఎస్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఇదే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు.. సూపర్ సిక్స్ అమలు, రాజధాని నిర్మాణం ఈ అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో సీఎస్ పాత్ర చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం ఉన్న సీఎస్ పదవీకాలం ఈ నెల 31తో ముగుస్తుంది. దీంతో కొత్త సీఎస్ ఎవరు.. సీనియారిటీ ప్రకారం ఎవరికి ఇవ్వాలి.. అనే చర్చ జరుగుతోంది.

వైసీపీ మీద కోపం ఉంటే మాతో పోరాడండి.. ఉద్యోగాలు పీకేయకండి..

ఎన్నికల సమయంలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ఉద్యోగాల నుంచి తొలగిస్తోందని.. 410 మంది ఉద్యోగులను ఫైబర్ నెట్ నుంచి తొలగిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు. నిరుద్యోగులకు ఇస్తాం అని చెప్పిన భృతి ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. వైసీపీ మీద కోపం ఉంటే మాతో పోరాడండి.. అంతే కాని మా ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు పీకేయకండి అంటూ అంబటి రాంబాబు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ముప్పై లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. వాలంటీర్లను, ఉద్యోగాలు లేకుండా చేశారని విమర్శలు గుప్పించారు. ఈ నెల 27న పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా విద్యుత్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రతి దానికి వైఎస్ జగన్‌పై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ అమలు చేయకపోవడానికి ఎవరు కారణమని ఆయన ప్రశ్నించారు.

పోలీసుల విచారణలో అల్లు అర్జున్ ఎమోషనల్..

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనపై ఈ రోజు అల్లు అర్జున్‌ను విచారించారు పోలీసులు. అయితే.. అల్లు అర్జున్ పోలీసుల విచారణలో ఘటనకు సంబంధించిన వీడియో చూసి అల్లు అర్జున్ ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. మూడు గంటల 35 నిమిషాలు అల్లు అర్జున్ ని పోలీసులు విచారించారు. కొన్ని వాటికి తనకు తెలియదని.. థియేటర్ లోపల చీకటిగా ఉన్ననందున అర్ధం కాలేదు అని సమాధానం చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. తన వల్ల కొన్ని మిస్టేక్స్ జరిగినట్లు ఒప్పుకున్న అల్లు అర్జున్.. మళ్ళీ విచారణ పిలిస్తే ఎప్పుడైనా హాజరు అవుతానని చెప్పినట్లు తెలిపారు పోలీసులు. పూర్తి విచారణను వీడియో రికార్డ్ చేసిన పోలీసులు.. విచారణ సమయంలో అల్లు అర్జున్‌ టీ, బిస్కట్స్, డ్రై ఫ్రూట్స్ తిన్నట్లు తెలిపారు. విచారణ సమయంలో కేవలం మూడు సార్లు వాటర్ తాగినట్లు.. అల్లు అర్జున్ తను వాహనంలో ఉన్న బిస్కెట్స్, డ్రై ఫ్రూట్స్, తిని టీ తాగినట్లు తెలిపారు.

సిరియాలో కారు బాంబు దాడి.. ఇద్దరు మృతి!

సిరియాలో కారు బాంబు దాడి బీభత్సం సృష్టించింది. ఉత్తర సిరియాలోని టర్కీ మద్దతుగల సిరియన్ నేషనల్ ఆర్మీ నియంత్రణలో ఉన్న మన్బిజ్ నగరంలో కారు బాంబు దాడి జరిగింది. రిక్రూట్‌మెంట్ స్ట్రీట్‌లో పేలుడు జరిగింది. ఈ ఘటనలో పౌరులు సహా టర్కీ మద్దతు గల ఇద్దరు యోధలు చనిపోయారని తెలుస్తోంది. బాంబు ఘటనతో సమీప పరిసరాలు భీతావాహంగా మారాయి. వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అయితే ఈ దాడికి పాల్పడింది ఏ గ్రూప్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే అమెరికా మద్దతు ఉన్న గ్రూపే సిరియాలో శాంతికి విఘాతం కలిగిస్తోందని స్థానికంగా నివేదిక అందుతోంది.

 

Show comments