Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

తినే ఆహారంలో చనిపోయిన కప్ప.. చూసి కంగుతున్న విద్యార్థులు

ఒడిశాలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. రాజధాని భువనేశ్వర్‌లోని కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ ఫుడ్‌లో చనిపోయిన కప్ప దర్శనమిచ్చింది. ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు వడ్డించిన ఆహారంలో చనిపోయిన కప్ప కనిపించడంతో విద్యార్థులు కంగుతిన్నారు. అయితే ఈ విషయాన్ని ఓ విద్యార్థి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ సంఘటన జరిగిన KIIT భువనేశ్వర్ భారతదేశంలోని ఇంజనీరింగ్ కాలేజీలలో 42వ స్థానంలో ఉందని ఆయన పోస్ట్‌లో రాశారు. ఇక్కడ తల్లిదండ్రులు తమ పిల్లలకు డిగ్రీ చదివించేందుకు దాదాపు రూ.17.5 లక్షలు వెచ్చిస్తున్నారని తెలిపాడు. ఆ విద్యార్థి పోస్ట్ చేసిన ఫోటోలో ఆహారంలో కప్ప పడి ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.

పాకిస్తాన్‌లో గూడ్స్ రైల్‌ని ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు..

పాకిస్తాన్ లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది.ఆదివారం పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్సులో ప్యాసింజర్ రైలు ఆగి ఉన్న గూడ్సు రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 31 మంది గాయపడినట్లు మీడియా పేర్కొంది. అయితే మరణాల గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదు. షేక్ పురా జిల్లాలోని ఖిలా సత్తార్ షా స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

మియాన్‌వాలి నుంచి లాహోర్ వెల్లే ప్యాసింజర్ రైలు, గూడ్సు రైలు ఉన్న అదే ట్రాకులోకి రావడంతో ప్రమాదం జరినట్లు జియో న్యూస్ నివేదించింది. ట్రాకులో ఉన్న గూడ్సు రైలును చూసిన ప్యాసింజర్ రైలు డ్రైవర్, రైలును ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ప్రమాదంలో 31 మంది ప్రయాణికులు గాయపడినట్లు, అందులో ఐదుగురు ప్రయాణికులను జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించినట్లు రెస్క్యూ సిబ్బంది వెల్లడించింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

చంద్రబాబు కస్టడీ, రిమాండ్‌ పొడిగించాలని కోరిన సీఐడీ

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు సీఐడీ విచారణ ముగిసింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబును రెండు రోజుల్లో 12 గంటల పాటు సీఐడీ అధికారులు విచారించారు. విచారణ అనంతరం చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సీఐడీ విచారణతో పాటు రిమాండ్ గడువు కూడా ముగిసింది. వర్చువల్ విధానంలో టీడీపీ అధినేత చంద్రబాబును విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు సీఐడీ అధికారులు ప్రవేశపెట్టారు. కస్టడీ ముగియడంతో సీఐడీ అధికారులను చంద్రబాబు దగ్గర నుంచి వెళ్లిపోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇదిలా ఉండగా.. చంద్రబాబు కస్టడీ, రిమాండ్‌ను పొడిగించాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని సీఐడీ కోరింది. చంద్రబాబు కస్టడీని పొడిగించాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేయగా.. చంద్రబాబు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. రిమాండ్‌ పొడిగింపు పిటిషన్‌ పైనా చంద్రబాబు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాసేపట్లో చంద్రబాబుతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వర్చువల్‌గా మాట్లాడనున్నారు.

“మీ ప్రాణాలు జాగ్రత్త”.. నిజ్జర్ హత్య తర్వాత ఖలిస్తానీలకు ఎఫ్‌బీఐ వార్నింగ్

ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ని గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఈ ఏడాది జూన్ నెలలో కెనడాలోని సర్రే ప్రాంతంలో కాల్చి చంపారు. ఇప్పుడు ఈ హత్య కెనడా, ఇండియా మధ్య దౌత్యపరమైన వివాదానికి కారణమైంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడా భారత దౌత్యవేత్తను బహిష్కరిస్తే , భారత్ కూడా దెబ్బకు దెబ్బ అన్నట్లుగా కెనడియన్ దౌత్యవేత్తను బహిష్కరించింది.

ఇదిలా ఉంటే హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత పలువురు సిక్కు వేర్పాటువాదులు సైలెంట్ అయ్యారు. గురుపత్వంత్ సింగ్ పన్నూ లాంటి వారు కొన్ని నెలలుగా కనిపించలేదు. ఇదిలా ఉంటే ఈ హత్య తర్వాత కెనడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ‘ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) అమెరికాలోని ఖలిస్తానీ వేర్పాటువాదులకు హెచ్చరికలు జారీ చేసిందని ది ఇంటర్‌సెప్ట్ ఓ నివేదికలో పేర్కొంది.

హాలీవుడ్ నుంచి కాల్ వచ్చింది..త్వరలోనే స్పానిష్ మూవీ చేయొచ్చు..

బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జవాన్.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఈ సినిమా సెప్టెంబర్ 7న గ్రాండ్ గా విడుదల అయింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1000కోట్ల కలెక్షన్స్ సాధింపు దిశగా సాగుతోంది.తమిళ దర్శకుడు అట్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఫుల్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా జవాన్ మూవీని అట్లీ తెరకెక్కించారు. జవాన్సినిమా భారీ హిట్ అవటంతో ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. బాలీవుడ్‍లో అడుగుపెట్టడంతో అట్లీ పాన్ ఇండియా రేంజ్ డైరెక్టర్ అయ్యారు. దీంతో అట్లీ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.జవాన్ సినిమా తర్వాత తనకు హాలీవుడ్ నుంచి కాల్ వచ్చిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు డైరెక్టర్ అట్లీ.జవాన్ వంటి సినిమా చూడలేదని తనతో హాలీవుడ్‍కు చెందిన వారు చెప్పారని ఆయన అన్నారు. “నేను తర్వాత స్పానిష్ సినిమా చేయొచ్చు. వారు నాకు కాల్ చేసి ఒకవేళ మీరు హాలీవుడ్‍లో పని చేయాలనుకుంటే మాకు చెప్పండి అన్నారు.

3 అడుగుల భూమి కోసం గొడవ.. ఓ వ్యక్తి చెవి కోసేసిన రౌడీలు

బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. 3 అడుగుల భూమి విషయంలో ఓ వ్యక్తిని చితకబాది.. అనంతరం చెవి కోసేశారు. గ్రామానికి చెందిన కొందరు బడా బాబులు తన భూమిని కబ్జా చేసేందుకు యత్నించారు. దీంతో బాధితుడు నిరసన తెలపడంతో అతనిపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన విజయ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొరియా గ్రామంలో చోటుచేసుకుంది. గాయపడిన బాధితుడు నింబు లాల్ గోండ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తన మూడెకరాల భూమిని ఆక్రమించుకున్నారని బాధితుడు ఆరోపించాడు. అప్పుడు కూడా తనపై దాడి చేశారని తెలిపాడు. తాజాగా తన ఇంటి స్థలం విషయంలో మరోసారి దాడి చేసి చెవి కోసేశారు. ఇంటి పక్కనే 3 అడుగుల భూమి ఉందని.. దానిని కొందరు బడా నేతలు కబ్జా చేశారు. అయితే తన భూమిని ఎందుకు తీసుకుంటున్నారని అడిగినందుకు ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇదిలా ఉంటే.. రౌడీలపై చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశాడు. అయితే ఈ వ్యవహారంపై పోలీసులు ఎలాంటి ఫిర్యాదు నమోదు చేయకపోగా. నిందితులను ఎవరినీ అరెస్టు చేయలేదు. మరోవైపు ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్వర్ణ్ ప్రభాత్ తెలిపారు.

చంద్రబాబుకు మరో బిగ్‌ షాక్‌.. రిమాండ్ పొడిగింపు

స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్‌ తగిలింది. మరో 11 రోజుల పాటు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చంద్రబాబుకు రిమాండ్‌ పొడిగించారు. ఆయన రిమాండ్‌ను అక్టోబర్‌ 5 వరకు ఏసీబీ కోర్టు పొడిగించింది. ఇప్పుడే అంతా అయిపోయిందని మీరు భావించాల్సిన అవసరం లేదని చంద్రబాబుతో జడ్జి చెప్పారు. మీరు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారని చంద్రబాబుతో చెప్పిన న్యాయమూర్తి. విచారణ ప్రక్రియ ఇంకా చేయాల్సి ఉందని చంద్రబాబుతో అన్నారు.

కస్టడీలో మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా అని న్యాయమూర్తి చంద్రబాబును ప్రశ్నించగా.. ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని ఆయన సమాధానమిచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించారా అని అడిగిన ప్రశ్నకు.. నిర్వహించారని చంద్రబాబు బదులిచ్చారు. బెయిల్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉందని.. సోమవారం బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు వింటామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు.

కడియంతో నేను ఇంకా కలిసిపోలేదు.. రాజయ్య కీలక వ్యాఖ్యలు

ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి ఎమ్మెల్యే టికెట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన జనగామ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. కడియంతో నేను ఇంకా కలిసిపోలేదని, కార్యకర్తలు అపోహ పడవద్దన్నారు. కేటీఆర్ నీ కలిశాను కేటీఆర్ తో మాట్లాడానని, కేటీఆర్ దగ్గర కొందరు ఎమ్మెల్యే లు ఎమ్మెల్సీలు ఉంటే అందరం కలిసి ఫోటో మాత్రమే దిగారన్నారు. కడియంకి నాకు మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని, కార్యకర్తలు ఎలాంటి అపోహ పడొద్దన్నారు తాటికొండ రాజయ్య. అధిష్టానం నిర్ణయాన్ని అందరం శిరసా వహించాల్సి ఉంటుందని, 2018లో ఎలా అయితే స్టేషన్‌ఘన్‌పూర్‌ కార్యకర్తలను కలిపే కార్యక్రమం జరిగిందో అలాంటి కార్యక్రమం ఉంటుందన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో కార్యకర్తలు ఆదోళనలు చెందొద్దని సీఎం కేపీఆర్ 115 టికెట్లు కేటాయించడం జరిగిందని, నివేదికలు, సర్వే రిపోర్ట్ లు తెచ్చుకొని చేర్పులు మార్పులు ఉంటాయని చెప్పడం జరిగిందన్నారు.

బిగ్‏బాస్ హౌస్‏లో ‘స్కంద’ టీమ్ సందడి..

బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు మూడోవారం ఈరోజుతో పూర్తి కావొస్తుంది.. సోమవారం నుంచి శనివారం వరకు ఎలా ఉన్నా కూడా వీకెండ్ వచ్చింది అంటే ఆ సందడి వేరేలా ఉంటుంది.. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఇంట్లో సేఫ్ గేమ్ ఆడిన కంటెస్టెంట్లకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు నాగ్. ఇప్పటివరకు హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.. ఈరోజు హౌస్ నుంచి మరొకరు బయటకు వెళ్తున్నారు.. మొత్తం ఏడుగురు నామినేట్ కాగా.. ప్రిన్స్ యావర్ సేఫ్ అయినట్లు శనివారం నాగ్ ప్రకటించారు. ఇక ఇప్పుడు ఆరుగురిలో ఒకరు బయటకు రాబోతున్నారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో స్కంద మూవీ టీమ్ సందడి చేసింది..

హీరో రామ్ నటించిన స్కంద మూవీ ప్రమోషన్ లో భాగంగా రామ్ బిగ్ బాస్ హౌస్ కు వచ్చినట్లు తెలుస్తుంది.. అలా రామ్ వచ్చి రాగానే రామ్ కు ఓ పంచ్ ఇచ్చారు నాగ్. ఇప్పటివరకు నాతో మాట్లాడుతున్నప్పుడు కళ్లద్ధాలు పెట్టుకున్నావ్.. ఆడపిల్లలు కనిపించగానే తీసేశావ్ కదయ్యా అంటూ డైలాగ్ వేశారు. ఇక ఆ తర్వాత శివాజీ మాట్లాడుతూ త్వరగా పెళ్లి చేసుకో రామ్.. చాలా చేయాల్సి ఉంటుంది కదా.. లేట్ అయిపోతుందంటూ అన్నారు. ఈ మాట ఇష్టంతో చెబుతున్నారా లేక బాధగా అంటున్నారా అని రామ్ అడగ్గా.. ఊబిలో ఉన్నోళ్లకు అందరినీ అందులోకి లాగాలని ఉంటుందంటూ కౌంటరిచ్చాడు నాగ్.. కాసేపు హౌస్ లో నవ్వులు పూసాయి..

15 ఏళ్ల బాలిక కిడ్నాప్.. 3 నెలల పాటు అత్యాచారం

దేశంలో రోజు రోజుకు కిడ్నాప్ లు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇలాంటి వాటిని అరికట్టేందుకు పోలీసులు ఎన్ని కేసులు పెట్టి శిక్షించినా.. మార్పు రావడం లేదు. క్రూర మృగాలు చేసే ఈ పనులకు అమాయక ప్రజలు బలవుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఓ సంఘటన వెలుగు చూసింది. 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి మూడు నెలల పాటు అత్యాచారం చేశాడు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మే 28న బాధితురాలిని పవన్ బైండ్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమేను గుజరాత్‌లోని సూరత్‌కు తీసుకెళ్లినట్లు గుర్తించి.. ఆగస్టు 28న బల్లియాలో ఉన్న ఆమెను రక్షించినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ఐపీసీ, పోక్సో చట్టం కింద అత్యాచారం, కిడ్నాప్‌ ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో.. నిందితుడు తనను గుజరాత్‌కు తీసుకెళ్లాడని, అక్కడ అతను అక్రమంగా వివాహం చేసుకున్నాడని.. అంతేకాకుండా మూడు నెలల పాటు తనపై అత్యాచారం చేశాడని బాలిక పేర్కొన్నట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. అయితే ఈ కేసులో తాజాగా నిందితుడిని శనివారం అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

“కెనడాలోనే ఖలిస్తాన్ ఏర్పాటు చేయండి”.. ట్రూడోకు వ్యతిరేకంగా ఆందోళన

ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియాల మధ్య తీవ్ర దౌత్య ఉద్రిక్తతలకు దారి తీసింది. దీనిపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇండియా ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపించాడు. ఇదే కాకుండా కెనడాలోని భారత సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరించారు. దీనికి ప్రతిగా భారత్ కూడా కెనడియన్ దౌత్యవేత్తను 5 రోజుల్లో దేశం వదిలి వెళ్లాలని ఆదేశించింది. కెనడా ఆరోపణలు అసంబద్ధమైన, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా, కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని ఇండియా ధ్వజమెత్తింది.

ఇదిలా ఉంటే జస్టిన్ ట్రూడోకు వ్యతిరేకంగా యునైటెడ్ హిందూ ఫ్రంట్ ఆదివారం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపింది. ఖలిస్తాన్ వేర్పాటువాదులకు మద్దతుగా ట్రూడో వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపట్టారు. ‘‘కెనడాలోనే ఖలిస్తాన్ ఏర్పాటు చేయాలి’’ అని ట్రూడోకు సూచించారు.

డానిష్ అలీపై చర్య తీసుకోవాలి..స్పీకర్ని కోరిన రేసుగుర్రం విలన్..

బీజేపీ ఎంపీ నటుడు రవికిషన్ అన్‌పార్లమెంటరీ చట్టాన్ని పరిశీలించాలని డానిష్ అలీపై చర్య తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ కి లేఖ రాశారు. బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారనే వివాదం కొనసాగుతోంది. మతప్రాతిపదికన బిధూరి, డానిష్ అలీపై వ్యాఖ్యానించాడు. ఈ వివాదం బీజేపీ వర్సెస్ ప్రతిపక్షాలుగా మారింది. చంద్రయాన్ -3 చర్చ సందర్భంగా రమేష్ బిధూరి అతనిపై పార్లమెంట్ లో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీలు కూడా తగ్గడం లేదు. ఇప్పటికే బిధూరితో పాటు మరో ఎంపీ నిషికాంత్ దూబే, డానిష్ అలీ వ్యవహారాన్ని తప్పుపట్టాడు. గోరఖ్ పూర్ బీజేపీ ఎంపీ రవికిషన్ కూడా ఈ వ్యవహారంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ డిసెంబర్ 9, 2022న నేను జనాభా నియంత్రణపై ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడుతున్న సమయంలో బీఎస్పీ ఎంపీ కున్వర్ డానిష్ అలీ అన్‌పార్లమెంటరీ చర్యలు, పదాలు వినియోగించడాన్ని పరిశీలించాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను’’ అంటూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు రవికిషన్ లేఖ రాశారు.

గుండెపోటుతో సింహం మహేశ్వరి మృతి

విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూలాజికల్‌ పార్క్‌లో 18 ఏళ్ల ఆడసింహం వృద్ధాప్యం కారణంగా గుండెపోటుతో మృతి చెందినట్లు ఆదివారం ఓ అధికారి తెలిపారు. ఆడసింహం మహేశ్వరి శనివారం అర్థరాత్రి మృతి చెందింది. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ సమర్పించిన పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం.. వృద్ధాప్యం కారణంగా మరణానికి తీవ్రమైన మయోకార్డియల్ ఇన్‌ఫ్రాక్షన్‌ (గుండెపోటు) కారణమని వైజాగ్ జూ క్యూరేటర్ నందనీ సలారియా ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.

2006లో జన్మించిన ఈ ఆడసింహం మహేశ్వరిని.. 2019లో గుజరాత్‌లోని సక్కర్‌బాగ్ జూపార్క్‌ నుండి వైజాగ్ జూ పార్క్‌కు తీసుకువచ్చారు. లక్షలాది మందికి ఆసియాటిక్ సింహాలపై విద్యను అందించి పరిరక్షణకు దోహదపడింది. సలారియా ప్రకారం, సింహాలు అడవిలో సుమారు 16 నుంచి 18 సంవత్సరాల వరకు జీవిస్తాయి. అయితే ఆడసింహం మహేశ్వరి తన జీవితంలో 19వ సంవత్సరంలోకి ప్రవేశించగలిగింది.ఈ ఏడాది అరుదైన జంతువులు మృత్యువాత పడినట్లు జూ క్యూరేటర్ వెల్లడించారు. రెండు పులులు, ఒక జిరాఫీ, ఒక జీబ్రా మృతి చెందినట్లు చెప్పారు.

రేపు అసెంబ్లీలో 9 బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

రేపు(సోమవారం) మూడో రోజు ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రైతు రుణాలు, 9,10వ షెడ్యూల్‌లో ఆస్తులు, తూర్పు కాపులకు బీసీ ధృవ పత్రం, చంద్రన్న బీమా పథకం, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు, ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజ్‌లు, విద్యా దీవెన, వసతి దీవెన అంశాలపై ప్రశ్నోత్తరాలను చేపట్టనున్నారు. రేపు అసెంబ్లీలో 9 కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సవరణ బిల్లు -2023, గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ సవరణ బిల్లు -2023, ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ సవరణ బిల్లు-2023 ఆంధ్రప్రదేశ్ భూదాన్ అండ్ గ్రామ దాన్ సవరణ బిల్లు, ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీస్ సవరణ బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది.

 

Exit mobile version