NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Ntv Top Hl 9pm

Ntv Top Hl 9pm

తెలంగాణ ప్రజలను మొత్తం 30 వేల కోట్లు ముంచిండు

పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలంటూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా మీద పోటీ చేసినందుకు కవిత భయపడుతుందని, నా మీద పోటీ చేసే దమ్ము లేక మరొక అభ్యర్థిని బరిలో ఉంచి కవిత నన్ను ఓడిస్తుందట అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచ అవినీతిపరురాలు కవిత అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం జైలు పాలయ్యిండని, ఆయనను చూసేందుకు ఇక కవితక్క పోతది అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

జీవన్ రెడ్డి నాకు తండ్రితో సమానమన్న ఎంపీ అర్వింద్‌.. జీవన్ రెడ్డి అంకులు అంటే నాకు ఇష్టమే కానీ కాంగ్రెస్ పని అయిపోయింది అంకుల్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పేద మహిళలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను కట్టిస్తనన్న వాగ్దానాన్ని సీఎం కేసీఆర్ తుగ్గలో తొక్కిండని ఆయన మండిపడ్డారు. 2020-21లో పదివేల కోట్లు… 21-22లో 10.80 వేల కోట్లు బడ్జెట్ ప్రకటించి ఇండ్ల నిర్మాణం మాత్రం చేపట్టలేదని, తెలంగాణ ప్రజలను మొత్తం 30 వేల కోట్ల రూపాయలు ముంచిండంటూ అర్వింద్‌ తీవ్రంగా ఆరోపించారు. డబుల్ బెడ్ రూమ్ లో అవినీతి సొమ్ము, కాళేశ్వరం అవినీతి సొమ్ముతో మహారాష్ట్రలో పార్టీ ప్రచారం చేస్తున్న అవినీతిపరుడు కేసీఆర్ అని, కవిత 100 కోట్లు లిక్కర్ స్కాంలో కీలకమన్నారు. కారు.. చెయ్యి వద్దు బీజేపీ కమలం పువ్వు ను గెలిపించాలని ఆయన కోరారు.

లైకుల కోసం రైల్వే ట్రాక్ పై రీల్స్.. షాక్ ఇచ్చిన పోలీసులు..

సోషల్ మీడియాకు క్రేజ్ పెరగడంతో, రీల్స్‌ను రూపొందించడానికి, వాటిని ఆన్‌లైన్‌లో షేర్ చేయడానికి రిస్క్ స్టంట్‌లు చెయ్యడంతో పాటు అజాగ్రత్త చర్యలకు పాల్పడే అనేక సందర్భాలు ఉన్నాయి. మొన్నటి వరకు కొండల పై రీల్స్ చేసేవారు.. నిన్న ట్రైన్స్ లలో ఇక ఇప్పుడు రైల్వే ట్రాక్ లను కూడా వదలడం లేదు.. తాజాగా ఓ మహిళ రీల్స్ కోసం రైల్వే ట్రాక్ ఎక్కింది.. తాను ఒక్కటే ఏం బాగుంటుంది అనుకుందేమో కూతురును కూడా రీల్స్ చేసేందుకు తీసుకెళ్ళింది.. పోలీసులకు అడ్డంగా దొరికింది.. రైల్వే ట్రాక్‌పై డ్యాన్స్ రీల్‌ను చిత్రీకరిస్తున్న తల్లి-కూతురు వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది…

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.. ఆ మహిళ రైలు పట్టాల గుండా నడుస్తూ, ‘అబ్ తేరే బిన్ హమ్ భీ జీ లేంగే’ పాటకు డ్యాన్స్ వేస్తున్నట్లు కనిపిస్తుంది.. రైలు పట్టాలపై తల్లి తన డ్యాన్స్ స్కిల్స్ ప్రదర్శిస్తుండగా.. కూతురు రీల్ ను వీడియో తీస్తుందని తెలుస్తుంది. వైరల్ వీడియోలో ఆమె మొదట్లో రైల్ ట్రాక్‌పై నడుస్తున్నట్లు చూపించింది మరియు తన డ్యాన్స్ స్టెప్పులను కొనసాగించడానికి అక్కడ మోకరిల్లింది. ఈ ఘటన ఆగ్రా ఫోర్ట్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది..

బీఆర్‌ఎస్‌ మాకు మిత్రులే.. కానీ హరీష్ ఆ మాట ఎందుకు అన్నారో తెలియదు

బీఆర్‌ఎస్‌ మాకు మిత్రులు గానే చూస్తున్నామన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ కూడా మాకు మిత్రులేనని, కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారనే మాట హరీష్ ఎందుకు అన్నారో తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. మునుగోడులో గెలిచినప్పుడు తెలియదా..? అని ఆయన ప్రశ్నించారు. కమ్యూనిస్టులు లేకుంటే మునుగొడులో గెలిచే వారా..? అని ఆయన ప్రశ్నించారు. మునుగొడులో మేము లేకుంటే.. బీజేపీ గెలిచేదని, బీజేపీని కట్టడి చేయడం బీఆర్‌ఎస్‌ వల్ల అయ్యేదా..? అని ఆయన మండిపడ్డారు. ఎన్నికల్లో కలిసి పని చేస్తామా లేదా అనేది చెప్పలేమని ఆయన వెల్లడించారు.

సీపీఐ, సీపీఎం పార్టీలు అయితే కలిసే పని చేస్తాయని, హరీష్ అన్నట్టు మాకు ప్రతి నియోజకవర్గంలో అంగన్ వాడీ.. ఆశ కార్యకర్తలు అయినా ఉంటారు కదా..? అని ఆయన అన్నారు. మేము ప్రభావం చూపే జిల్లాలు లేవా..? అని ఆయన అన్నారు. తెలంగాణలో ఏ గ్రామం వెళ్ళినా, ఏ నియోజకవర్గం వెళ్ళినా ఇప్పటికీ కూడా కమ్యూనిస్టులు లేని ప్రాంతం ఒక్కటైన చూపెట్టగలుగుతారా అని ప్రశ్నించారు. డబ్బు రాజకీయాల్లో కమ్యూనిస్టు పార్టీల ప్రాతినిధ్యం తగ్గవచ్చునేమోగాని, కమ్యూనిస్టులు లేని సమాజాన్ని హరీష్‌రావు కూడా ఊహించుకోలేరని పేర్కొన్నారు. సమస్య ఎక్కడ ఉంటే కమ్యూనిస్టులు అక్కడ ఉంటారని, ఆ సమస్య పరిష్కారానికై ప్రశ్నిస్తారని వారు అన్నారు. ఆవిధంగా ప్రశ్నించే ప్రతిఒక్కరూ కమ్యూనిస్టే అని కూనంనేని ఇవాళ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మెక్‌ డొనాల్డ్స్‌ దారిలోనే సబ్‌వే.. మెనూలో టమోటా అవుట్..

టమోటా పేరు వినగానే సామాన్యులకు వణుకు పుడుతుంది.. రోజు రోజుకు ధరలు ఆకాశానికి నిచ్చెణలు వేస్తున్నారు.. టమోటా లేకుండానే కూరలు చేసుకొని తింటున్నారు.. సాదారణ ప్రజల గురించి పక్కన పెడితే ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్ లు సైతం టమోటా కూరలను మెనూ నుంచి తీసేస్తున్నారు.. ఇక ప్రముఖ ఫుడ్‌ కంపెనీలు కూడా బ్యాన్‌ చేశాయి. ఇప్పటికే మెక్‌ డొనాల్డ్స్‌ టమాటా లేకుండానే తమ ఐటమ్స్‌ ఉంటాయని ప్రకటించింది. ఇదంతా తాత్కాలికమే అయినా.. టమాటా తినడం అంటేనే భారమవుతోంది. తాజాగా మెక్‌ డొనాల్డ్స్‌ దారిలోనే సబ్‌వే నడిచింది.. మెనూలోంచి టమోటా లను ఎత్తేసింది..

సబ్‌వే కూడా తమ ఔట్‌లెట్స్‌లో సలాడ్స్, శాండ్‌విచ్‌లలో టమాటా వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నిత్యావసర కూరగాయలు, అందులోనూ టమాటా ధర ఏకంగా 400 శాతం పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. ఇప్పటి టమాట ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయినా.. కూడా ఇప్పటికీ టమాటా ధర రూ.200 పలుకుతుంది..

నేను అల్లు అర్జున్ ఫ్యాన్..ఒక్క సినిమా కూడా వదల్లేదంటున్న ధోనీ భార్య

మ‌హేంద్ర సింగ్ ధోని చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారన్న సంగతి తెలిసిందే. ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై LGM సినిమాను రూపొందించగా ఆ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ చేయనున్నారు. హ‌రీష్ క‌ళ్యాణ్‌, ఇవానా, న‌దియా, యోగిబాబు కీల‌క పాత్ర‌ల్లో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని ర‌మేష్ త‌మిళ్ మ‌ణి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌టంతో పాటు సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సాక్షి ధోని, వికాస్ హ‌స్జా నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబందించిన తెలుగు ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ కొద్దిరోజుల క్రితమే రిలీజ్ చేశారు. త్వరలో రిలీజవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు హైదరాబాద్ లో సినిమా యూనిట్ సమావేశం నిర్వహించింది. ఈ క్రమంలో పాల్గొన్న సాక్షి ధోని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రెస్ మీట్ లో సాక్షి ధోనిమాట్లాడుతూ నేను అల్లు అర్జున్ ఫ్యాన్, అల్లు అర్జున్ నటించిన అన్ని సినిమాలు చూశానని ఆమె పేర్కొన్నారు. ఇక ఇది విన్న బన్నీ ఫాన్స్ అయితే కాలర్ ఎగరేస్తున్నారు. ఇదిరా మా బన్నీ రేంజ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇండియా మొత్తం ప్రేమించే ధోనీ భార్య మా హీరోను అభిమానిస్తున్నారు అని అంటూ కామెంట్లు చేస్తున్నారు.

పెళ్ళికి, పేరంటానికి తేడా తెలియని వ్యక్తి పవన్.. మంత్రి కారుమూరి ధ్వజం

జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌పై పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు స్క్రిప్టులను చదివే పవన్ గురించి తాను మాట్లాడనని అన్నారు. శ్రార్ధానికి – తద్దినానికి, పెళ్ళికి – పేరంటానికి తేడా తెలియని వ్యక్తి పవన్ అని ఎద్దేవా చేశారు. పవన్ చేసిన వ్యాఖ్యలతో వాలంటీర్ల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టే ఆయనపై కేసులు వేస్తున్నారని తెలిపారు. ఈ కాలంలో మనం చాలాచోట్ల మన వివరాలను ఇస్తున్నామని.. పవన్ ముందుకు వెళ్తున్నాడా? వెనక్కి వెళ్తున్నాడా? అర్థం కావడం లేదని విమర్శించారు. జగన్, కారుమూరి వివరాలు కావాలన్నా.. చిన్న క్లిక్‌తో వస్తాయన్నారు. గజదొంగలు అనే పదం టీడీపీ నేతలకే వర్తిస్తుందని ధ్వజమెత్తారు. ఆలీబాబా చంద్రబాబు, నలభై దొంగల లోకేష్‌తో కలిపి.. వాళ్ళే గాదె కింద పందికొక్కుల్లా తిన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లటమే మీ పనా? అని ప్రశ్నించారు. చంద్రబాబు సమావేశాలు పెడితే ఏమీ జరిగేది కాదని.. కానీ జగన్ సమావేశం పెడితే ఒక సంక్షేమం జరుగుతుందని పేర్కొన్నారు. ఏపీలో ఇప్పుడు ధనికులు ఎక్కువయ్యారన్నారు.

ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. పడవ మునిగి 15 మంది మృతి

ఇండోనేషియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సులవేసి ద్వీపంలో ప్రమాదవశాత్తు పడవ మునిగి 15 మంది మృతి చెందారు. మరికొందరు గల్లంతైనట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. మొత్తం ఆ పడవలో 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అందులో 19 మంది గల్లంతయ్యారనీ, ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారని ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. గల్లంతైన ప్రయాణికుల కోసం అధికారులు గాలిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించామనీ.. గాయ‌ప‌డిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ అధికారులు తెలిపారు.

ఆగ్నేయ సులవేసి ప్రావిన్స్ రాజధాని కెండారికి దక్షిణంగా 200 కిలోమీటర్ల దూరంలోని మునా ద్వీపంలోని అఖాతం గుండా పడవ వెళ్లినట్లు గుర్తించారు. 17,000 కంటే ఎక్కువ ద్వీపాల ద్వీపసమూహమైన ఇండోనేషియాలో ఫెర్రీలు ఒక సాధారణ రవాణా మార్గంగా ఉన్నాయి. ఇక్కడ పడవ ప్రమాదాలు సాధారణం, ఎందుకంటే భద్రతా ప్రమాణాలు బలహీనంగా ఉండటం.. ప్రాణాలను కాపాడే పరికరాలు లేకుండా నౌకలను ఓవర్లోడ్ చేయడానికి అనుమతిస్తాయి. దీంతో త‌ర‌చు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇంతకు ముందు.. 2018లో సుమత్రా ద్వీపంలోని ప్రపంచంలోని లోతైన సరస్సులలో ఒక ఫెర్రీ మునిగిపోవడంతో 150 మందికి పైగా మృతిచెందారు. గత సంవత్సరం మేలో, 800 మందికి పైగా ప్రజలను తీసుకువెళుతున్న ఫెర్రీ తూర్పు నుసా టెంగ్‌గారా ప్రావిన్స్‌లోని నీటిలో మునిగిపోయింది. అయితే లోతు త‌క్కువ‌గా ఉండ‌టంతో ప్రాణ‌న‌ష్టం ఏమీ జరగలేదు.

నా కూతురు భవిష్యత్ లో సైంటిస్ట్ కావాలని కోరుకుంటున్నాను.

అలియా భట్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటన తో బాలీవుడ్ ప్రేక్షకులని ఎంతగానో మెప్పించింది.నటి గా మంచి గుర్తింపును కూడా పొందింది.ఈమె రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన ఆర్.ఆర్.ఆర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయింది.. ఇలా తెలుగులో మొదటి సినిమాతో నే మంచి సక్సెస్ అందుకున్నఈ భామ తెలుగు లో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదలైన తరువాత అలియా నటించిన బ్రహ్మాస్త్ర సినిమా కూడా తెలుగు లో విడుదల అయింది.ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత అలియా భట్ ప్రియుడు రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకుంది.పెళ్లైన ఏడాది కే బిడ్డకు జన్మనివ్వడం తో అలియా సినిమాల కు కాస్త దూరంగా ఉన్నారు. ప్రస్తుతం తన కుమార్తె రాహా భాద్యత చూసుకుంటూనే మరోవైపు సినిమా ఇండస్ట్రీ లో బిజీగా గడుపుతున్నారు. రణ్ వీర్ సింగ్,అలియా భట్ జంటగా నటించిన రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ జూలై 28 న విడుదల కాబోతుంది.ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యం లో భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

జబర్దస్త్ నటుడికి యాక్సిడెంట్.. భార్య చేసిన పనికి బూతులు తిడుతున్న నెటిజన్స్

జబర్దస్త్ నటుడు యాదమ్మ రాజు గురించి అందరికి తెల్సిందే. తనదైన యాసతో అమాయకుడిగా కనిపిస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటాడు. ఇక జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా మంచి పేరు తెచ్చుకున్న యాదమ్మ రాజుకు యాక్సిడెంట్ అయ్యిందని తెలుస్తోంది. ఈ విషయాన్నీ అతని భార్య స్టెల్లా సోషల్ మీడియాద్వారా తెలిపింది. యాదమ్మ రాజుకు చిన్న యాక్సిడెంట్ అయ్యింది. కాలు విరిగింది.. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న అభిమానులందరికి థాంక్స్ అంటూ చెప్పుకొచ్చింది. హాస్పిటల్ లో యాదమ్మరాజు చికిత్స పొందుతున్నాడు. కాలు విరిగినట్లు తెలుస్తోంది.

ఇక ఈ వీడియో చూసిన అభిమానులు యాదమ్మ రాజు త్వరగా కోలుకోవాలని కోరుతుండగా .. మరికొందరు స్టెల్లా చేసిన పనికి బూతులు తిడుతున్నారు. మొదటి నుంచి కూడా స్టెల్లా, యాదమ్మ రాజు రీల్స్ చేస్తూ ఫేమస్ అయిన విషయం తెల్సిందే. అయితే భర్త హాస్పిటల్ లో ఉన్నా కూడా ఆమె రీల్స్ చేయడం.. దాన్ని కూడా లైక్స్ కోసం వాడుకోవడంతో కొంతమంది అభిమానులు ఆమెను బూతులు తిడుతున్నారు.

అత్యాచారానికి గురై మృతిచెందిన మైనర్ బాలిక కుటుంబానికి 10 లక్షల ఆర్థికసాయం

కృష్ణా జిల్లా పామర్రు మండలం నిబానుపూడిలో అత్యాచారానికి గురై, మృతి చెందిన మైనర్ బాలిక కుటుంబ సభ్యుల్ని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత, మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, కలెక్టర్ రాజాబాబు పరామర్శించారు. బాధిత కుటుంబానికి మనో ధైర్యం చెప్పి, ప్రభుత్వం తరఫున తక్షణ సహాయంగా రూ.10 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. మైనర్ బాలిక అత్యాచారం గురై మరణించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు ఏ కుటుంబానికీ రాకూడదన్నారు. దుర్మార్గంగా అత్యాచారం చేసిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని.. ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి తానేటి వనిత చెప్పారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న సీఎం జగన్.. తక్షణమే స్పందించారన్నారు. ఇలాంటి దారుణ ఘటనలు ఎక్కడా జరగకూడదని ఆకాంక్షించారు.