మైలవరం టీడీపీలో ఆసక్తికర పరిణామాలు
మైలవరం టీడీపీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దేవినేని ఉమాను కలుస్తానని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రకటించారు. టీడీపీ కేడర్‌ను మొత్తాన్ని కలుపుకుని ముందుకు వెళ్తానన్నారు. బొమ్మసాని సుబ్బారావు కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నపుడు తాను టీడీపీ కార్యకర్తలు, నాయకులపై కేసులు పెట్టించలేదని పేర్కొన్నారు. కొండపల్లిలో మాత్రం అనుకోకుండా ఒకసారి అలా జరిగిన మాట వాస్తవమే.. అందులోనూ తన ప్రమేయం లేదన్నారు. తన పేరు ప్రకటించాక కూడా ఉమా ర్యాలీ చేయడంపై అది తనపై ఆయన వ్యతిరేకిస్తున్నట్లుగా చూడనన్న వసంత.. త్వరలోనే దేవినేని ఉమా మహేశ్వరరావును కూడా కలుస్తానన్నారు. ఆయన కూడా కలిసి వస్తారని ఆశిస్తున్నానన్నారు.
యువతిపై అత్యాచారం, హత్య కేసు.. నిందితుడిని పట్టించిన ‘చూయింగ్ గమ్’’
అమెరికాలోని ఓరెగాన్‌లోని 19 ఏళ్ల యువతిపై లైంగిక దాడి, హత్య కేసులో నిందితుడిని పట్టుకునేందు ‘‘చూయింగ్ గమ్’’ సాయం చేసింది. 1980లో 19 ఏళ్ల బార్బరా టక్కర్ అనే యువతిని ఓ వ్యక్తి అత్యాచారం చేయడంతో పాటు హత్య చేశాడు. ఆమె మృతదేహం క్యాంపస్ పార్కింగ్ స్థలంలో దొరికింది. ఆమె మౌంట్ హుడ్ కమ్యూనిటీ కాలేజీలో విద్యార్థిగా ఉంది. మరుసటి రోజు కళాశాలకు వచ్చిన విద్యార్థులు బార్బరా మృతదేహాన్ని చూశారు. ముల్ట్నోమా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ప్రకారం.. జనవరి 15, 1980న రాబర్ట్ ప్లింప్టన్ అనే వ్యక్తి బార్బరాను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడి, హత్య చేసినట్లు ఆరోపించింది.
సీఎన్ఎన్ నివేదిక ప్రకారం.. 60 ఏళ్ల వ్యక్తి గత వారం ఈ హత్య కేసులో దోషిగా నిర్ధారించబడ్డాడు. అయితే, తాను నిర్దోషి అని అతను చెబుతున్నారు. ఈ కేసును అప్పీల్ చేయాలనుకుంటున్నట్లు ఆయన తరుపు న్యాయవాదులు చెప్పారు. అతని నేరారోపణలు తారుమారు చేయబడ్డాయని అతని తరుపు న్యాయవాది జాకబ్ హౌజ్ చెప్పారు.
ఏపీలో ఎన్డీఏ కూటమికి మద్దతివ్వాలని ఎమ్మార్పీఎస్ నిర్ణయం
టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కలిశారు. ఎస్సీ వర్గీకరణ, మాదిగలకు రాజకీయ ప్రాధాన్యతపై సుదీర్ఘంగా చర్చించారు. 35 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని చంద్రబాబుకు మందకృష్ణ మాదిగ అందజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమికి మద్దతివ్వాలని ఎమ్మార్పీఎస్ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. దళితులకు వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన పథకాలు తిరిగి ప్రారంభించాలని చంద్రబాబును మందకృష్ణ కోరారు.తెలుగుదేశం పార్టీతో మాదిగలది శాశ్వత బంధమని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ గెలుపుతోనే మాదిగల గెలుపు అంటూ ఆయన అన్నారు. తెలుగుదేశం విజయంలో మాదిగలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. 40 ఏళ్లుగా పార్టీని మాదిగ సామాజిక వర్గం ఆదరిస్తోందన్నారు. అలాంటి మాదిగ వర్గాన్ని పైకి తెచ్చేందుకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తామన్నారు.దళితులపై వైసీపీ ప్రభుత్వ దమనకాండను ఎదుర్కోవడంలో మందకృష్ణ చక్కగా పోరాడుతున్నారని చంద్రబాబు కొనియాడారు.
కాంగ్రెస్ పార్టీ గెలుపే మాదిగల ధ్యేయం
బీజేపీ అనుసరిస్తున్న విధానాలు నచ్చకే ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరినట్టు సతీష్ మాదిగ తెలిపారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరులతో సతీష్ మాదిగ మాట్లాడుతూ తాను బీజేపీ కార్యవర్గ సభ్యుడిగా పని చేశానని, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశానని ఆయన తెలిపారు. ఇటీవల బీజేపీ అనుసరిస్తున్న విధానాలు నచ్చక బీజేపీ కి రాజీనామ చేసి కాంగ్రెస్ లో చేరడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ మాదిగ వర్గాలకు మేలు చేస్తా అని మాయమాటలు చెబుతున్నారని, కాకినాడ ఒక ఓటు రెండు రాష్ట్రాలు తీర్మానం మాత్రమే చేసింది. కానీ తెలంగాణ ఇవ్వలేదన్నారు. ఎస్సీ వర్గీకరణ మీద కూడా బీజేపీ అదే విధంగా వ్యవహరిస్తుందని ఆయన తెలిపారు.
పవన్ కల్యాణ్‌తో పిఠాపురం టీడీపీ నేతల భేటీ.. సీటుపైనే చర్చ!
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జ్ వర్మ, మాజీ మంత్రి సుజయ కృష్ణా రంగారావులు కలిశారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. పిఠాపురంలో రాజకీయ పరిణామాలపై పవన్-వర్మ మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. పవన్ గెలుపునకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని వర్మ తెలిపారు. గతంలో పిఠాపురం సీటు కోసం వర్మ పట్టుపట్టారు. చంద్రబాబు నచ్చజెప్పడంతో మెత్తబడ్డ వర్మ.. పవన్ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.
హాస్య బ్రహ్మ గొప్ప మనసు.. అతని కుటుంబానికి రూ. 2 లక్షలు సాయం
హాస్య బ్రహ్మ బ్రహ్మానందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నేటి ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామి వారి దర్శనం చేసుకొని బ్రహ్మానందం బయటికి రాగానే భక్తులు ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారు. అయితే తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర చిత్రార్చన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బ్రహ్మీ .. ముందు స్వామివారిని దర్శించుకొని అనంతరం పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వెళ్లారు. అంతేకాకుండా అక్కడ మరణించిన కళాకారుడు కుటుంబానికి రెండు లక్షలా 17వేలు అందించి గొప్పమనసు చాటుకున్నారు.
ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఆరు సీట్లే వస్తాయి.. విజయసాయి కీలక వ్యాఖ్యలు
నెల్లూరు లోక్‌సభ వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో పలువురు జన సేన నేతలు, కార్యకర్తలు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టసభల్లో ఎక్కడా జనసేన పార్టీకి ప్రాతినిధ్యం లేదన్నారు. కేవలం చట్ట సభల్లోకి రావడానికే టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. 2009లో నెల్లూరు లోక్‌సభ స్థానం జనరల్ కేటగిరికి కేటాయించారని.. సొంత ప్రాంతం నుంచి పోటీ చేయడం సంతోషంగా ఉందన్నారు. తనకున్న అనుభవంతో నెల్లూరు లోక్ సభ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తమకు వస్తున్న ఆదరణ చూసి టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు.
చంద్రయాన్ 3 ల్యాండింగ్ సైట్‌కి అధికారికంగా ‘‘శివశక్తి’’గా నామకరణం..
గతేడాది భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అయింది. చంద్రుడి దక్షిణ ధృవంపై దిగిన తొలి అంతరిక్ష నౌకగా చంద్రయాన్-3 చరిత్ర సృష్టించింది. గతేడాది ఆగస్టు 23న చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతానికి ‘‘శివశక్తి’’ పాయింట్‌గా ప్రధాని నరేంద్ర మోడీ పేరు పెట్టారు. అయితే, ఈ పేరుకు ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్(IAU) ఆమోదం తెలిపింది. దీంతో 7 నెలల తర్వాత అధికారికంగా విక్రమ్ దిగిన ప్రాంతానికి ‘‘శివశక్తి’’ పాయింట్‌గా నామకరణం చేసినట్లు అయింది.
మూహూర్తం ఫిక్స్.. బీజేపీలో చేరబోతున్న గాలి జనార్థన్ రెడ్డి..
మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి సొంతూగూటికి తిరిగి వస్తున్నారు. గతంలో బీజేపీ పార్టీలో ఉన్న ఆయన కర్ణాటక రాజ్య ప్రగతిపక్ష(కేఆర్పీపీ) పేరుతో కొత్త పార్టీ స్థాపించి, గతేడాది కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాడు. అయితే, లోక్‌సభ ఎన్నికల ముందు ఆయన బీజేపీలో చేరుతున్నారు. మార్చి 25న కాషాయ కండువా కప్పుకోనున్నారు. ‘‘నా మద్దతుదారులను సంప్రదించిన తర్వాత, నేను నిర్ణయం తీసుకున్నాను. రేపు ఉదయం 10 గంటలకు నేను తిరిగి బిజెపిలో చేరుతున్నాను’’ అని మీడియాకు వెళ్లడించారు.
