బీఅర్ఎస్ విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతికి పాల్పడింది..
బీఅర్ఎస్ విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతికి పాల్పడిందన్నారు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయం మాట్లాడుతూ.. ఎన్టీపీసీలో చవకగా వచ్చే విద్యుత్తును కాదని కమీషన్ కోసమే ఇతర సంస్థల నుంచి బీఅర్ఎస్ విద్యుత్ కొనుగోలు చేసిందన్నారు. గతంలో బీఅర్ఎస్ విద్యుత్ అవినీతిపై రేవంత్ ఆరోపణలు చేశాడన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారం చేపట్టాక రేవంత్ ఎందుకు స్పందించడం లేదని, ఎన్టీపీసీ తో ppl కుదుర్చుకోవడానికి కాంగ్రెస్ ముందుకి ఎందుకు రావడం లేదు? అని ఆయన ప్రశ్నించారు. చవక విద్యుత్ కాదని కమిషన్ కోసం బీ అర్ ఎస్ బాటలో కాంగ్రెస్ నడవాలని చూస్తుందా? అని ఆయ వ్యాఖ్యానించారు. వేసవి ఇప్పుడిప్పుడే మొదలైంది..అప్పుడే కరెంట్ కోతలు స్టార్ట్ చేశారని, పగలు కరెంట్ లేక రాత్రి మోటార్ ఆన్ చేయడానికి వెళ్లి రైతులు పాము కాటుకు బలవుతున్నారన్నారు.
విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్ పై సమగ్రవిచారణ జరపాలి..
బ్రెజిల్ శాంటోష్ పోర్ట్ నుంచి విశాఖ పోర్టుకు చేరుకున్న 25వేల కిలోల డ్రగ్స్ రాకెట్ పై సమగ్ర విచారణకు ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వాన్ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి డిమాండ్ చేశారు. విశాఖ పోర్టులో తనిఖీలకు వచ్చిన సీబీఐ, కస్టమ్స్ అధికారులను కంటైనర్ తెరవకుండా ఆపడానికి పోలీసులు ఎందుకు ప్రయత్నం చేశారని ప్రశ్నించారు. డ్రగ్స్ దిగుమతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ప్రభుత్వ పెద్దల హస్తం లేకుండానే ఇన్ని వేల కోట్ల మాదకద్రవ్యాలను డ్రై ఈస్ట్ పేరుతో దిగువమతి చేశారా అని ప్రశ్నించారు.
ఈసీకి చేరిన విశాఖ డ్రగ్స్ రవాణా పంచాయతీ..
విశాఖ డ్రగ్స్ రవాణా పంచాయతీ ఈసీకి చేరింది. విశాఖ డ్రగ్స్ రవాణాకు.. తమకు లింకులున్నాయన్న టీడీపీ ఆరోపణలపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. టీడీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆధారాల్లేని ఆరోపణలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మరోవైపు.. చంద్రబాబు, పురంధేశ్వరి సన్నిహితులకే డ్రగ్స్ రవాణతో సంబంధం ఉందని వైసీపీ ఆరోపిస్తుంది. డ్రగ్స్ రవాణా విషయంలో చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ ఈసీకి కంప్లైంట్ చేసింది. సీబీఐ చెప్పిన అంశాల ఆధారంగానే తాము ఆరోపణలు చేస్తున్నట్లు టీడీపీ చెబుతుంది. అంతేకాకుండా.. తమ ఆరోపణలకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉందని తెలుపుతుంది. వైసీపీ నేతలే డ్రగ్స్ రవాణాలో కీలక పాత్ర పోషించారని టీడీపీ ఆరోపిస్తుంది. మరోవైపు.. చంద్రబాబు చేసిన ట్వీటులో తమ వద్దనున్న ఎవిడెన్సును కూడా జత చేశామని టీడీపీ చెబుతుంది.
ఈసీకి టీడీపీ ఫిర్యాదు.. కారణమేంటంటే..?
ఈసీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కొందరు పోలీసు ఉన్నతాధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా.. ఎన్డీఏ పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ మాట్లాడుతూ.. ఏపీలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని తెలిపారు. కొందరు ఐపీఎస్ అధికారులు ఈ తరహా అధికార దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి, ఏపీ సీఈఓకి ఫిర్యాదు చేశామని బోండా ఉమ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో నేతలపై నమోదు చేసిన కేసుల వివరాలివ్వాలని కోరినా ఇవ్వడం లేదన్నారు. ఈ అంశంలో డీజీపీ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ఎన్నిక సీఈఓకు ఫిర్యాదు చేశాం.. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించేలా సీఎం జగన్ ఆదేశాలిస్తున్నారని బోండా ఉమ తెలిపారు.
పిఠాపురం నుంచి జనసేన అధినేత ప్రచారం..
పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారని జనసేన ప్రకటించింది. వారాహి వాహనం నుంచి పవన్ కల్యాణ్ ప్రచారం మొదలు పెడతారని తెలిపింది. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్రవ్యాప్త ప్రచారం చేపట్టనున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ క్రమంలో.. పవన్ ఎన్నికల ప్రచారంపై జనసేన కసరత్తు ప్రారంభించింది. శక్తిపీఠం కొలువైన క్షేత్రం.. శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించిన పవిత్ర భూమి అయిన పిఠాపురం నుంచే ప్రచారం మొదలుపెట్టాలని పవన్ నిర్ణయం తీసుకున్నారు. పురుహూతిక దేవికి పూజలు నిర్వహించి వారాహి వాహనం నుంచి పవన్ కల్యాణ్ ప్రచారం ప్రారంభించనున్నారు. పిఠాపురంలో మూడు రోజుల పాటు పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనుండగా.. నియోజకవర్గ ముఖ్య నాయకులు, మండల నాయకులతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు.
కేజ్రీవాల్ అరెస్ట్‌పై మమత ఏమన్నారంటే..!
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఇండియా కూటమి సభ్యులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికే ఆయా పార్టీల నేతలు ఈడీ అధికారుల తీరును తప్పుపట్టారు. తాజాగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా స్పందించారు. కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని ఆమె తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను అడ్డంపెట్టుకుని బీజేపీ ఆడుతున్న డ్రామా అని మమత విరుచుకుపడ్డారు. ఇది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా ఆమె అభివర్ణించారు. ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం చేయిస్తున్న ఈ చర్యలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.
విజయవాడలో భారీగా నగదు పట్టివేత..
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు భారీగా నగదును సీజ్ చేశారు. ఓ కారులో నగదు తీసుకువెళుతుండగా అధికారులు పట్టుకున్నారు. పట్టుబడ్డ నగదు.. సుమారు కోటి 50 లక్షలు ఉన్నట్లు సమాచారం.
కేజ్రీవాల్ అరెస్టు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారి అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు అని బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ఏకైక సంకల్పంతో కేంద్రంలోని అధికార బీజేపీ వ్యవహరిస్తున్నదని ఇటీవల జరిగిన జార్ఖండ్ ముఖమంత్రి హేమంత్ సోరెన్ మరియు బిఆర్ ఎస్ ఎంఎల్సీ కవిత అరెస్టు ఘటనలు రుజువు చేస్తున్నాయన్నారు. ఇందుకోసం ఈడీ, సీబీఐ, ఐటీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం పావులుగా వాడుకుంటున్నదన్నారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో కీలక పరిణామం.. ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా
హిమాచల్‌ప్రదేశ్ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఇటీవల రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కసారిగా అలజడి జరిగింది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడడంతో అనూహ్యంగా బీజేపీ రాజ్యసభ సీటును తన్నుకుపోయింది. ఈ ఘటన ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురిచేసింది.
తాజాగా మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర అసెంబ్లీకి ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అసెంబ్లీ సెక్రటరీకి తమ రాజీనామాలను సమర్పించారు. ముగ్గరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఈ ముగ్గురు బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు.
బీజేపీకి బీ టీమ్ లీడర్‌గా రేవంత్ రెడ్డి తీరు
మద్యం పాలసీ కేసులో ఈడీ, సీబీఐ వ్యహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు స్పందిస్తున్న తీరుకు పూర్తి వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే బీజేపీకి బీ టీం లీడర్ లాగా మాట్లాడుతున్నట్టున్నది తప్ప.. జాతీయ కాంగ్రెస్‌కు రాష్ట్ర ప్రతినిధిగా వ్యవహరిస్తున్నట్టు ఏ కోశానా కనిపించడం లేదన్నారు. ఆయన ఖర్గే, రాహుల్ నాయకత్వంలో పనిచేయడం లేదని, కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా, బీజేపీకి, మోదీకి అనుకూలంగా పనిచేస్తున్నారని మరోసారి తేటతెల్లమయిందని ఆయన వ్యాఖ్యానించారు.
గవర్నర్ దిద్దుబాటు.. మంత్రిగా పొన్ముడి ప్రమాణస్వీకారం
మొత్తానికి సుప్రీంకోర్టు ఆదేశాలకు తమిళనాడు గవర్నర్ రవి తలొగ్గారు. గురువారం గవర్నర్ తీరును సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. డీఎంకే నేత పొన్ముడిని ప్రమాణస్వీకారానికి ఆహ్వానించకపోవడంపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 24 గంటల్లో ప్రమాణస్వీకారం చేయించకపోతే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించింది. ఎట్టకేలకు గవర్నర్ రవి.. పొన్ముడిని ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు. శుక్రవారం రాజ్‌భవన్‌లో పొన్ముడి చేత గవర్నర్ రవి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
విభజన చట్టానికి అనుగుణంగా సూపర్ పవర్ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేశారు..
విభజన చట్టానికి అనుగుణంగా సూపర్ పవర్ ప్రాజెక్ట్ ను జాతికి అంకితం చేశారని, RTI ద్వారా NTPC తాజా సమాచారం ప్రకారం తెలంగాణ కు NTPC నాలుగు సార్లు లేఖ రాసిందన్నారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత బీఅర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందన్నారు. తక్కువ ఖర్చుతో వచ్చే పవర్ ను కాదని కమిషన్ల కోసం వేరొక చోట కొన్నారన్నారు. ఈ విషయాన్ని గతంలో కాంగ్రెస్ కూడా ఆరోపించిందని, ఇప్పుడు అధికారంలో కి వచ్చాక కాంగ్రెస్ కూడా NTPCతో ఒప్పందం కుదుర్చుకోవడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా NTPC రెండు సార్లు లేఖ రాసిందని ఆయన పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని, ఒక వేళ తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోతే వేరొక రాష్ట్రానికి మళ్లిస్తామని ntpc హెచ్చరిస్తుందన్నారు.
