NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

సోమశిల జలాశయాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు.. అధికారులపై ఆగ్రహం

నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం వద్ద దెబ్బ తిన్న ఆఫ్రాన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఆఫ్రాన్ పరిస్థితి, మరమ్మతులు చేయాల్సిన తీరును అధికారులు వివరించారు. సోమశిల నుంచి కండలేరు జలాశయానికి నీరు వెళ్లే కాలువను చంద్రబాబు పరిశీలించారు. కాలువ నీటి సామర్థ్యాన్ని పెంచాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి అధికారులకు వివరించారు. అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్ సౌండ్ లేకపోవడంతో అధికారుల తీరులో మార్పు రాలేదని అసహనం వ్యక్తం చేశారు. అధికారులలో నిర్లక్ష్యాన్ని సహించనన్నారు. ఇక నుంచి చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

కోర్టులో వాదిస్తుండగా న్యాయవాదికి గుండెపోటు.. సీపీఆర్ చేసిన దక్కని ప్రాణం

ఇటీవల నాగ్‌పూర్ జిల్లా కోర్టులో న్యాయమూర్తి చేసిన పని చర్చనీయాంశమైంది. జడ్జి ఎస్‌బి పవార్ కోర్టులో ఒక కేసు చర్చిస్తుండగా.. అదే సమయంలో 65 ఏళ్ల సీనియర్ న్యాయవాది తలత్ ఇక్బాల్ ఖురేషీ తన కేసులో న్యాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలోనే న్యాయవాది ఖురేషీ ఉన్నట్టుండి కింద పడిపోయాడు. అది చూసిన జడ్జి పవార్.. ఒక్కసారిగా తన కుర్చీలోంచి లేచి వెంటనే అతని దగ్గరకు వచ్చారు. అంతేకాకుండా.. జడ్జి పవార్ వెంటనే న్యాయవాదికి సీపీఆర్ (CPR) చేశారు. అయినప్పటికీ ఖురేషీలో ఏ మాత్రం చలనం లేదు.

అంతా కలిసి రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలి

మనం అందరం కలిసి రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఎస్పీడీసీఎల్ లో పదోన్నతులు పొందిన అధికారులు, ఉద్యోగులు డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లును పెద్ద ఎత్తున అభినందించగా ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజల జీవితాల్లో మార్పు అంటే వారి జీవనస్థితిగతులు మారడం, కొనుగోలు శక్తి పెరగడం, రాష్ట్ర సంపదలో అంతా భాగస్వాములు కావడం ఆ మార్పు వచ్చినప్పుడే పోరాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రానికి ఫలితం ఉంటుంది అన్నారు. లేకపోతే కోరి తెచ్చుకున్న కొత్త రాష్ట్రంలో న్యాయం చేయలేని వారిగా నిలబడిపోతాం అన్నారు. గత ఏడు, ఏడున్నర సంవత్సరాలుగా పదోన్నతులు లేకుండా ఎదురుచూస్తున్న విద్యుత్ ఉద్యోగులందరినీ ప్రజా ప్రభుత్వం గుర్తించి పదోన్నతుని ఇవ్వాలని నేను, సీఎం, మంత్రిమండలి సభ్యులు నిర్ణయించామని తెలిపారు. మీరంతా కూడా ఈ రాష్ట్రం నాది, ఈ ప్రభుత్వం నాది, ఈ రాష్ట్ర ప్రజలు నా వాళ్ళు, వాళ్ల సేవ కోసమే నేను నియమించబడ్డారని మీరంతా భావించాలని ఉద్యోగులు, అధికారులకు సూచించారు.

గురుకుల పాఠశాలల స్థల సేకరణ, డిజైన్స్ త్వరగా పూర్తి చేయాలి

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ స్కూల్ భవనాల నిర్మాణాల కోసం ఆయా నియోజకవర్గాల్లో కావలసిన స్థలాన్ని  సంబంధిత జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని స్థలాన్ని సేకరించి డిజైన్స్ వేయించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ వార్షిక సంవత్సరం రూ. 5 వేల  కోట్లతో 30 కాంప్లెక్స్ లో 120 గురుకుల పాఠశాల భవనాల నిర్మాణం చేపట్టడానికి కావలసిన అన్ని చర్యలను తీసుకోవాలని సూచించారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల పాఠశాలల ఉన్నత అధికారులతో  రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ రాజ్యంలోని ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థులను తెలంగాణ , దేశ సంపదగా భావిస్తున్నదని  చెప్పారు. మానవ వనరులను అద్భుతంగా అభివృద్ధి చేసుకోవడానికి ఈ బడ్జెట్ లో విద్య కు  పెద్దపీట వేశామని గుర్తు చేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళుతున్నదని అందుకు తగ్గట్టుగా అధికారుల పనితీరు ఉండాలని సూచించారు.  గ్రామీణ ప్రాంతాల్లో 15 నుంచి 25 ఎకరాలు పట్టణ ప్రాంతాల్లో 10 నుంచి 15 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో ఏర్పాటు కోసం స్థల సేకరణ చేయాలన్నారు. 8 నెలల్లో ఈ భవనాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని వివరించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల పాఠశాలలో  ఈ విద్యా సంవత్సరం 100% అడ్మిషన్లు పూర్తి చేయాలన్నారు.

శిశు విక్రయాల కేసులో సంచలన విషయాలు

రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న శిశు విక్రయాల కేసులో అంతరాష్ట్ర ముఠా ఉన్నట్లు విశాఖ సిటీ పోలీసులు గుర్తించారు. పిల్లలను ఎత్తుకెళ్లి లక్షల రూపాయలకు అమ్ముతున్న ముఠాలు దేశం అంతా నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఢిల్లీ, ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో ఈ ముఠా ఉన్నట్లు విశాఖ సీపీ శంకబ్రత బాగ్చి తెలిపారు. ఇప్పటి వరకు 17 మంది నిందితులను అరెస్టు చేసి ఆరుగురు పిల్లలను రెస్క్యూ చేశామని సీపీ వెల్లడించారు. ఈ కేసు లోతుల్లోకి వెళితే అనేక మంది చిన్నారులు అపహరణకు గురవడం వంటి ఘటనలు వస్తున్నాయని సీపీ చెప్పారు. ఆసుపత్రుల్లో, క్లినిక్‌లలో ఇలాంటి నేరాలు చేసిన అనుభవం వున్న వాళ్లే నిందితులుగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ఆరు కారణాలతో పిల్లల అమ్మకాలు జరుగుతున్నాయని.. డిమాండ్ ఆధారంగా పిల్లలను ఎత్తుకెళ్లి అమ్ముతున్నట్టు తేల్చారు.

మంకీపాక్స్‌పై ముందస్తు చర్యల్లో భాగంగా ఉన్నత స్థాయి సమీక్ష

రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో మంకీ ఫాక్స్ పై ముందస్తు, నివారణ చర్యల్లో భాగంగా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో దేశంలో ఢిల్లీ కేరళ రాష్ట్రాలలో స్వల్ప కేసులు 15+15(30) నమోదు అయ్యాయని మంత్రి దామోదర్ నరసింహ గారి దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని వెల్లడించారు. రాష్ట్రంలో మంకీ ఫాక్స్ నివారణ చర్యల్లో భాగంగా అవసరమైన మెడికల్ కిట్స్, మందులు, ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

పోలాండ్, ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోడీ..

ప్రధాని మోడీ పోలాండ్, ఉక్రెయిన్ పర్యటనలకు వెళ్లబోతున్నారు. ఆగస్టు 21న పోలాండ్ దేశంలో, ఆగస్టు 23న ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇటీవల రష్యాలో పర్యటించిన మోడీ, తాజాగా ఉక్రెయిన్ వెళ్లబోతున్నారు. పోలాండ్ పీఎం డొనాల్డ్ టస్క్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ పంపిన ఆహ్వానాల మేరకు ప్రధాని మోడీ ఆయా దేశాల్లో పర్యటించనున్నారు. 30 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని తొలిసారిగా ఉక్రెయిన్ పర్యటనకు వెళ్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఇటీవల రష్యాకి వెళ్లిన ప్రధాని మోడీ ‘‘రష్యాని అన్ని కాలాల మిత్రుడు’’గా పేర్కొన్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చర్చలు, దౌత్య మార్గాల ద్వారా ఇరు దేశాలు సమస్యని పరిష్కరించుకోవాలని పదేపదే భారత్ చెబుతోంది. యుద్ధం ప్రస్తుత కాలంలో పరిష్కారం కాదని ప్రధాని మోడీ పలుమార్లు వ్యాఖ్యానించారు. అయితే, ఇటీవల ప్రధాని మోడీ రష్యా పర్యటనపై అమెరికాతో పాటు వెస్ట్రన్ దేశాలు గుర్రుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా, పాశ్చాత్య దేశాలతో భారత్ సంబంధాలను నార్మల్ చేయడానికి ప్రధాని ఉక్రెయిన్ పర్యటన సహకరిస్తుందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.

పండగపూట రాజకీయ లబ్ధి కోసం కేటీఆర్ అవాస్తవాలు చెబుతున్నారు

రాఖీ పండుగ రోజు కూడా మహిళా మంత్రిని, మహిళా కమిషన్ చైర్పర్సన్ ను నిందించడం కేటీఆర్ కే చెల్లిందని మంత్రి సీతక్క ఫైర్‌ అయ్యారు. పండగపూట రాజకీయ లబ్ధి కోసం కేటీఆర్ అవాస్తవాలు చెబుతున్నారని, మహిళా భద్రతకి మేము పెద్ద పీట వేస్తున్నామన్నారు. నేరాలకు కారణం అవుతున్న డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల వినియోగం పై ఉక్కు పాదం మోపామని, ఎనిమిది నెలల తర్వాత మహిళలపై అఘాయిత్యాలు మాకు గుర్తుకువచ్చాయని కేటీఆర్ చెప్పడం ఆయన అజ్ఞానానికి అద్దం పడుతుందన్నారు. మహిళలపై ఎక్కడ అఘాయిత్యం జరిగినా.. వెంటనే మా ప్రభుత్వం వాయు వేగంతో స్పందించిందని ఆమె తెలిపారు. గంటల వ్యవధిలోని నిందితులను అరెస్టు చేసిందని, నిoధితులపై చట్టపరంగా చర్యలు చేపట్టామన్నారు. లైంగిక దాడుల కేసుల్లో 24 మంది దోషులకు శిక్షలు పడేలా చేశామని మంత్రి సీతక్క తెలిపారు. 20 సంవత్సరాల పాటు జైలు శిక్ష నుంచి యావజ్జివ కారగార శిక్ష వరకు దోషులకు శిక్షలు పడేలా చేశామని, మిగిలిన కేసుల్లోనూ న్యాయవిచారన కొనసాగుతోందన్నారు. ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే బాధితులను పరామర్శించి భరోసా కల్పించామని, ఏలాంటి జాప్యం లేకుండా మంత్రులు, ఎంఎల్ఏ లు, అధికారులు, కార్పొరేషన్ చైర్మన్ లలో ఎవరో ఒకరు ప్రభుత్వం తరఫున వెళ్లి బాధిత కుటుంబానికి అండగా నిలిచారన్నారు మంత్రి సీతక్క.

స్కూటీపై వెళ్తుండగా యువతికి పోకిరీలు వేధింపులు.. వీడియో వైరల్

ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఓ వైపు కోల్‌కతా ఘటనతో దేశం అట్టుడుకుతోంది. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా కూడా కామాంధుల అరాచకాలు మాత్రం ఆగడం లేదు. కనీస భయం లేకుండా విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. అది కూడా బుల్డోజర్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా రాత్రివేళ ఒంటరిగా స్కూటీపై వెళ్తున్న యువతిని పోకిరీలు వేధింపులకు గురిచేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉతరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మంత్రి నారా లోకేష్‌తో ఫాక్స్‌కాన్‌ ప్రతినిధుల భేటీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్‌కాన్‌ సంస్థ ముందుకొచ్చింది. సోమవారం ఫాక్స్‌కాన్‌ ప్రతినిధులతో భేటీ అయిన మంత్రి నారా లోకేష్‌.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉ్న అవకాశాలను వివరించారు. వి లీ నేతృత్వంలోని ఫాక్స్‌కాన్‌ సీనియర్ ప్రతినిధి బృందంతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఎలక్ట్రిక్ వాహానాలు, డిజిటల్ హెల్త్ వంటి రంగాల్లో ఫాక్స్ కాన్ ప్రణాళికలపై చర్చించారు. త్వరలోనే ఏపీలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈవీ, ఎలక్ట్రానిక్ పాలసీలు తీసుకురాబోతున్నట్లు లోకేష్ వెల్లడించారు. ఏపీలో ఫాక్స్‌కాన్‌ మెగా మాన్యూఫ్యాక్చరింగ్ సిటీ ఏర్పాటు చేయాలని లోకేష్ వారిని కోరారు.