Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

ఇరాన్‌లో ఓ కొడుకు ఘాతుకం.. తుపాకీ కాల్పుల్లో 12 మంది మృతి

ఇరాన్‌లో (Iran Firing) ఓ వ్యక్తి ఘాతుకానికి తెగబడ్డాడు. తుపాకీతో కాల్పులకు తెగబడడంతో తండ్రితో సహా 12 మంది బంధువులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం నిందితుడ్ని భద్రతా బలగాలు కాల్చి చంపాయి. కుటుంబంలో కలహాలు చోటుచేసుకోవడంతో ఓ కుమారుడు విచక్షణ కోల్పోయి రైఫిల్‌ తీసుకుని కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో తండ్రి, సోదరులు.. మొత్తం 12 మంది బంధువులు ప్రాణాలు వదిలారు. అనంతరం ఇరాన్‌లోని దక్షిణ-మధ్య ప్రావిన్స్ కెర్మాన్‌లో భద్రతా బలగాలు నిందితుడ్ని కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఓ మారుమూల గ్రామీణ ప్రాంతంలో కుటుంబ కలహాల కారణంగా నిందితుడు ఈ కాల్పులకు తెగబడినట్లు వారు తెలిపారు.

రెండేళ్ల క్రితం పశ్చిమ ఇరాన్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ప్రభుత్వ సంస్థ నుంచి తొలగించబడిన ఓ ఉద్యోగి ముగ్గురిని కాల్చి చంపాడు. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

విజయసాయి రెడ్డికి “సంసద్ మహారత్న” అవార్డు

వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డికి “సంసద్ మహారత్న” అవార్డు వరించింది. తెలంగాణ గవర్నర్ తమిళ్ సై, జాతీయ బిసి కమిషన్ చైర్మన్ హాన్స్ రాజ్ అహిర్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఈ అవార్డును ప్రదానం చేశారు. టూరిజం, రవాణా, సాంస్కృతిక శాఖ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా విజయసాయి రెడ్డి అత్యుత్తమ పనితీరుకు గాను అవార్డు దక్కింది. మాజీ చైర్మన్ టీజీ. వెంకటేష్ తో కలిపి అవార్డు అందుకున్నారు ఎంపీ విజయసాయి రెడ్డి. మహారాష్ట్ర సదన్ లో జరిగిన కార్యక్రమంలో ఎంపీలు అధిర్ రంజన్ చౌదరి, సుప్రియ సులే, శ్రీకాంత్ ఏక్ నాథ్ షిండే, హీనా గవిట్, జయంత్ సిన్హా తదితరులు అవార్డులు అందుకున్నారు.

ఈ సారి తెలంగాణలో అధికారంలోకి వస్తాం

ఢిల్లీలో బీజేపీ జాతీయ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. ఈ సారి తెలంగాణలో అధికారంలోకి వస్తామన్నారు. కొన్ని సార్లు ఓటమిలో కూడా గెలుపు ఉంటుందని, తెలంగాణలో ఆ మేరకు విజయం సాధించామని ఆయన అన్నారు. గతంలో తెలంగాణ లో బీజేపీకి ఒక శాసనసభ్యుడే ఉన్నాడు.. బీజేపీ ఓటు శాతం అప్పుడు 7.1 శాతం కాగా, ఇప్పుడది రెట్టింపై 14 శాతానికి పెరిగి 8 మంది శాసనసభ్యులు గెలుపొందారన్నారు జేపీ నడ్డా. తెలంగాణలో ఈ సారి వదలిపెట్టేది లేదని, తెలంగాణలో కూడా ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు జేపీ నడ్డా. అందుకు సన్నద్దమవుతున్నామని, మోడీ నాయకత్వానికి ప్రజలు మద్దతివ్వడం వల్లనే అన్ని రాష్ట్రాల్లో ఇంతటి గొప్ప ఫలితాలు రావడానికి కారణమన్నారు జేపీ నడ్డా.

GSLV-F14 రాకెట్‌ ప్రయోగం విజయవంతం..

GSLV-F14 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. ఈ వాహననౌక ఇన్సాట్‌-3డీఎస్‌ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. అనంతరం 2,275 కిలోల బరువు ఉన్న ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశ పెట్టింది. తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి సాయంత్రం 5.35 గంటలకు ప్రయోగించారు.

ఇన్సాట్‌-3డీఎస్‌ను వాతావరణ పరిశీలనలను మెరుగుపరచడానికి, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి రూపొందించారు. తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరుస్తుంది. ఈ ఉపగ్రహం పదేళ్లపాటు సేవలందించనుంది. కాగా.. ఇన్సాట్‌-3డీఎస్‌ ఉపగ్రహం విపత్తులపై ముందే హెచ్చరించనుంది. ఇదిలా ఉంటే.. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బందికి ఛైర్మన్ సోమనాథ్ అభినందనలు తెలిపారు.

తెలంగాణలో 12 మంది ఏఎస్పీల బదిలీ..

తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతోంది. తెలంగాణ పోలీసు శాఖలో బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారీగా డీఎస్పీలు, ఏఎస్పీలను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో 12 మంది అడిషనల్‌ ఎస్పీలకు స్థానచలనం కలిగించింది. ఈ మేరకు డీజీపీ రవిగుప్తా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. నిజామాబాద్‌ అడిషనల్‌ డీసీపీగా ఎస్‌ రమేశ్‌, ఆదిలాబాద్‌ అడిషనల్‌ ఎస్పీగా సురేందర్‌ రావు, హైదరాబాద్‌ ట్రాఫిక్‌-3 అడిషనల్‌ డీసీపీగా రామారావు, సైబరాబాద్‌ క్రైమ్‌ అడిషనల్‌ డీసీపీగా శ్రీనివాసులు, మెదక్‌ అడిషనల్‌ ఎస్పీగా రెహ్మాన్‌, నిర్మల్‌ అడిషనల్‌ ఎస్పీగా శివకుమార్‌ నియమితులయ్యారు. బుధవారం హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో కొనసాగుతున్న డీఎస్పీలను, ఏసీపీలను బదిలీ చేశారు. రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులను బదిలీ చేశారు. మూడేళ్లుగా ఒకేచోట పని చేస్తోన్న, సొంత జిల్లాల్లో పని చేస్తోన్న అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ గత డిసెంబర్‌లో ఆదేశించింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం అధికారులను బదిలీ చేసినట్లు తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మార్చిలో గుడ్‌న్యూస్.. డీఏ 4 శాతం పెరిగే ఛాన్స్..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. మార్చిలో డీఏ 4 శాతం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పెంపుతో డియర్ నెస్ అలవెన్స్(డీఏ), డియర్‌నెస్ రిలీఫ్ 50 శాతానికి పెరుగుతాయి. ఇండస్ట్రియల్ లేబర్ వినియోగదారుల ధరల సూచి(CPI-IW) 12 నెలల సగటు 392.83గా ఉంది. దీని ప్రకారం చూస్తే డీఏ 50.2 శాతానికి పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

డీఏ, డియర్‌నెస్ రిలీఫ్ (DR) పెంపుదల పరిమితిని అఖిల భారత CPI-IW డేటా ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ఇస్తే, పెన్షనర్లకు డీఆర్ ఇస్తారు. ఈ రెండింటిని ఏడాదికి రెండుసార్లు జనవరి, జూలైలో పెంచుతారు. చివరిసారిగా అక్టోబర్ 2023లో డీఏని 4 శాతం పెంచడం ద్వారా, 46 శాతానికి చేరుకుంది. ప్రస్తుత ద్రవ్యోల్భణ రేటుని పరిగణలోకి తీసుకుంటే తదుపరి డీఏ పెంపు 4 శాతంగా అంచానా వేయబడుతోంది. అధికారిక లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 47.58 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69.76 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. డీఏ పెంపు ద్వారా వీరికి లబ్ధి చేకూరనుంది.

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఎల్లుండి నుంచి మే నెల దర్శన టిక్కెట్లు

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శుభవార్త చెప్పింది. ఎల్లుండి నుంచి ఆన్లైన్లో మే నెల దర్శన టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. మే నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, అంగ ప్రదక్షిణం, వసతి గదుల కోటా విడుదలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. మే నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం రిజిస్ట్రేషన్‌ ఈ నెల 19న ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపింది.

గుల్జార్, జగద్గురు రాంభద్రాచార్యలకు జ్ఞానపీఠ్ అవార్డు

2023కి గానూ ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్, సంస్కృత పండితుడు జగద్గురు రాంభద్రాచార్యలకు 58వ జ్ఞానపీఠ్ అవార్డులను కమిటీ శనివారం ప్రకటించింది. గుల్జార్ హిందీ సినిమాల్లో సినీగేయ రచయితగా ప్రసిద్ధి చెందారు. ప్రస్తుతం ఉన్న ప్రసిద్ధ ఉర్దూ కవుల్లో ఒకరిగా ఉన్నారు. అంతకుముందు గుల్జార్‌కి 2002లో ఉర్దూ సాహిత్య అకాడమీ అవార్డు, 2013లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2004లో పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు. ఐదుసార్లు జాతీయ చలనచిత్ర అవార్డుల్ని సొంతం చేసుకున్నారు.

గుల్జార్‌తో పాటు సంస్కృత సాహిత్యవేత్త జగద్గురు రాంభద్రాచార్యకు కూడా అవార్డును ప్రకటించింది. చిత్రకూట్ లోని తులసీ పీఠం వ్యవస్థాపకుడిగా, ప్రఖ్యాత హిందూ ఆధ్యాత్మికవేత్తగా, విద్యావేత్తగా 100 కంటే ఎక్కువ పుస్తకాలను రచించారు. 2022లో గోవా రచయిత దామోదర్ మౌజో ఈ అవార్డును అందుకున్నారు.

జ్ఞానపీఠ్ అవార్డు భారతదేశ అత్యున్నత సాహిత్య పురస్కారం. భారతీయ సాహిత్యానికి విశేష కృషి చేసినందుకు భారతీయ జ్ఞానపీఠ్ ట్రస్ట్ ఈ అవార్డులను అందిస్తుంది. ఈ అవార్డును మొదటిసారిగా 1965లో మలయాళ కవి జి. శంకర్ కురుప్ తన ఒడక్కుఝల్ అనే కవితా సంకలనానికి పురస్కారం పొందారు. ఈ అవార్డును అందుకున్న వారికి రూ. 11 లక్షలతో పాటు, వాగ్దేవి కాంస్య విగ్రహాన్ని బహూకరిస్తారు.

ప్రజల్లో జగన్ రెడ్డి పై తీవ్ర అసహనం కనిపిస్తుంది..

బాపట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వహించిన రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. వైసీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ నీ పని, నీ పార్టీ పని ఫినిష్ అని విమర్శించారు. ఈ సభకు వచ్చిన జనాన్ని చూస్తే నీకు నిద్ర పట్టదు.. నీ అవినీతి డబ్బు, అధికార దుర్వినియోగం ఆపుతుందా అని దుయ్యబట్టారు. ప్రజల్లో జగన్ రెడ్డి పై తీవ్ర అసహనం కనిపిస్తుందని తెలిపారు. ఇదిలా ఉంటే.. ఈ సభ కోసమని.. సభా ప్రాంగణానికి ఓ రైతు భూమి ఇస్తే నోటీసులు ఇస్తారని మండిపడ్డారు. మీటింగ్ జరగటానికి వీలు లేదు అంటారా.. మేము చట్ట ప్రకారం పోతున్నామని చంద్రబాబు తెలిపారు. మరోవైపు జగన్ రెడ్డికి అభ్యర్ధులు దొరక్క సందిగ్ధంలో పడిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Exit mobile version