NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

తెలుగు భాషను కాపాడుకుందాం.. మన సాంస్కృతిక వైభవాన్ని నిలబెడతాం

9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు విచ్చేసిన తెలుగువారికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల తరపున మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు తెలిపారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఆంధ్ర కళా వేదిక ఖతార్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సదస్సుపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు భాషను కాపాడుకుంటాం.. తెలుగు సాంస్కృతిక వైభవాన్ని నిలబెడుతాం అంటూ సదస్సులో చేస్తున్న ప్రతిజ్ఞ ప్రతి ఒక్కరికీ దిశానిర్దేశం చేస్తుందన్నారు. విదేశాల్లో ఉంటూ తెలుగు భాష మీద మక్కువతో చేస్తున్న కార్యక్రమాలు అందరికీ మార్గదర్శకం అన్నారు.

ఫుడ్ క్వాలిటీలో హైదరాబాద్ లాస్ట్.. కల్తీ ఆహారంతో దెబ్బతిన్న హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్

బిర్యానీ అంటే హైదరాబాద్‌… హైదరాబాద్‌ అంటే బిర్యానీ అని చెప్పడం అతిశయోక్తి కాదు. హైదరాబాద్ ఫుడ్‌ అంటే ఇష్టపడని వారు దాదాపు లేరనే చెప్పాలి… ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌ బిర్యానీలకు ఉన్న క్రేజ్ అలాంటిది మరి.. అయితే.. ఈ క్రమంలోనే.. విదేశాల నుంచి వచ్చిన వారంతా ఇక్కడి ఫుడ్‌ను ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తుంటారు. ఈ క్రమంలో చాలామంది తమ అభిప్రాయాలను పంచుకున్నారు. గతంలో ఫుడ్‌ క్వాలిటీ పరంగా అనేక స్టార్ రేటింగ్స్‌ను హైదరాబాద్ దక్కించుకుంది. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హైదరాబాద్ బిర్యానీ కోసం దేశంలోని ఉత్తర ప్రాంతాల నుంచి వచ్చినవారే కాదు, విదేశీయులు కూడా ఇష్టంగా తింటూ కొనియాడుతుంటారు. అంతే కాదు, ఇక్కడి బిర్యానీ నిత్యం వేలాది పార్శిల్స్ రూపంలో ఇతర దేశాలకు వెళ్లడం సాధారణం. కానీ ఇప్పుడు పరిస్థితి ఆహార భద్రతపరంగా ఆందోళనకరంగా మారింది. రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్ తినడం ప్రమాదకరమైపోయినట్లు తెలుస్తోంది.

రిజర్వేషన్ల పేరుతో రాజకీయం చేసే వాళ్లకు బుద్ధి చెప్పాలి

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీయే కూటమి అభ్యర్థులకు మద్దతుగా నాందేడ్ జిల్లా పాలజ్ లలో నిర్వహించిన బహిరంగ సభలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలజ్ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. బోకర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి జయ చౌహాన్ ని, సంతుక్రవ్ అంబార్డేని గెలిపించాలని కోరారు. మన ఆశయాలు నెరవేర్చాలంటే ఎన్డీయే కూటమితోనే సాధ్యమని చెప్పుకొచ్చారు.

టీజీ సెట్ 2024 ఫలితాలు విడుదల

లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అవసరమైన తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష టీజీ సెట్ 2024 ఫలితాలను ఓయూ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగారంతో కలిసి ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి విడుదల చేశారు. పరీక్షకు మొత్తం 33వేల 494 మంది దరఖాస్తు చేసుకోగా 26వేల 294 మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో 1884 మంది అర్హత సాధించారు. పరీక్షకు హాజరైన వారిలో 7.17శాతం అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించగా ఇందులోనూ మహిళా అభ్యర్థులు 49.79శాతం కాగా పురుషులు 50.21 శాతం మంది అర్హత సాధించారు. ఫలితాలకోసం అభ్యర్థులు TGSET అధికారిక వెబ్‌సైట్ [www.telanganaset.org]లో చూసుకోవచ్చని సభ్యకార్యదర్శి ఆచార్య నరేష్ రెడ్డి తెలిపారు. దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయటం ద్వారా ఫలితాలను చూసుకోవచ్చని వెల్లడించారు.

తన తమ్ముడి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు

తన తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు మరణంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్న ఆయన.. తన తమ్ముడి పార్థివదేహానికి నివాళి అర్పించారు. నిర్జీవంగా ఉన్న తమ్ముడిని చూసిన చంద్రబాబు చలించిపోయారు. ఆ అనంతరం మాట్లాడుతూ… తమ్ముడు రామ్మూర్తి నాయుడు తనను విడిచి వెళ్లిపోయాడని వాపోయారు. తమ నుంచి దూరమై మా కుటుంబంలో ఎంతో విషాదాన్ని నింపాడన్నారు.

పదవ తరగతి పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

పదవ తరగతి విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షలకు ఫీజులు చెల్లించేందుకు ఇప్పటికే షెడ్యూల్‌ను విడుదల చేసింది తెలంగాణ విద్యాశాఖ. అయితే.. ఆ షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 18తో గడువు ముగియనుంది. ఈ క్రమంలో పదవ తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు తేదీని సవరిస్తూ విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 2025, SSC/OSSC/వొకేషనల్ పబ్లిక్ పరీక్షలకు హాజరు కావాలనుకునే రెగ్యులర్, ప్రైవేట్ ఒకసారి ఫెయిల్ అయిన అభ్యర్థులు, నవంబర్ 28 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్ష రుసుమును చెల్లించవచ్చని పేర్కొంది.

ఏపీలో ఆరు కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు.. రూ. 1.92 కోట్ల నిధులు రిలీజ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఆరు కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ఫీజిబిలిటీ స్టడీ కోసం 1.92 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో మరో ఆరు చోట్ల ఎయిర్ పోర్టులు కట్టాలని ఏపీ సర్కార్ ప్రతిపాదించింది. కుప్పం, శ్రీకాకుళం, నాగార్జున సాగర్, తుని-అన్నవరం, తాడేపల్లి గూడెం, ఒంగోలులో విమానాశ్రయాలను నిర్మించాలని ఎన్టీయే కూటమి ప్రభుత్వం భావిస్తుంది. అయితే, కుప్పంలో 1501, నాగార్జున సాగర్ లో 1670 ఎకరాలను, తాడేపల్లి గూడెంలో 1123 ఎకరాలు, శ్రీకాకుళంలోని పలాస డివిజన్ లో 1383 ఎకరాలు, తుని- అన్నవరంలో 787 ఎకరాలు, ఒంగోలులో 657 ఎకరాలను గుర్తించినట్టు స్పష్టం చేశారు.

టెట్ అభ్యర్థులకు అలర్ట్‌.. అప్లికేషన్ ఎడిట్‌కు అవకాశం

తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు అప్లికేషన్ లోని తప్పులను సవరిస్తేను అవకాశం కల్పించింది. టెట్ నోటిఫికేషన్‌ గతంలో విడుదల చేయగా, దరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, అభ్యర్థులు తమ అప్లికేషన్లలో జరిగే తప్పులను సరిదిద్దుకునేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ కొత్త అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఈ నెల 16 నుంచి 22వ తేదీ వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు.

నటి కస్తూరి అరెస్ట్!

గత కొంతకాలంగా పరారీలో ఉన్న నటి కస్తూరిని హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె కొద్ది రోజుల క్రితం చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో తెలుగువారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె మీద చెన్నై వ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాల వారు అనేక కేసులు పెట్టారు. పోలీసులు ఈ అంశం మీద కేసులు కూడా నమోదు చేశారు. అయితే అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆమె ఇంటికి కూడా రాకుండా పోలీసులు అందుబాటులోకి రాకుండా పరారీలో ఉన్నారు. అయితే కస్తూరి హైదరాబాదులో ఉన్న విషయం తెలుసుకున్న చెన్నై పోలీసులు హైదరాబాద్ వచ్చారు.

రేపు, ఎల్లుండి గ్రూప్‌-3 నియామక పరీక్ష..

తెలంగాణ రాష్ట్రంలో రేపు, ఎల్లుండి గ్రూప్‌-3 నియామక పరీక్ష జరగనుంది. ఇప్పటికే అధికారులు గ్రూప్-3 పరీక్ష కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు/సీపీలతో ఇప్పటికే సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ గ్రూప్‌-3 పరీక్షలకు దాదాపు 5.36 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1401 పరీక్షా కేంద్రాలను కేటాయించారు. 1375 పోస్ట్ లకు రేపు, ఎల్లుండి నియామక పరీక్ష జరగనుంది. రేపు రెండు పేపర్లు, ఎల్లుండి ఒక పేపర్ కు ఎగ్జామ్ ఉండనుంది.