NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. మేయర్ సహా 15 మంది మృతి

లెబనాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి భీకరదాడులు కొనసాగించింది. దక్షిణ లెబనాన్‌లోని నబాటీహ్‌లోని మునిసిపాలిటీ భవనాలపై మంగళవారం అర్థరాత్రి ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో మేయర్ అహ్మద్ కహిల్ మరణించినట్లుగా నబాతియే ప్రావిన్స్ గవర్నర్ హువైదా టర్క్ ప్రకటించారు. మేయర్‌తో సహా 15మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికారిక వర్గాలు వెల్లడించాయి. దాడిలో కూలిన భవనాల శిథిలాల నుంచి 15 మృతదేహాలను వెలికి తీశామని.. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని లెబనాన్ సివిల్ డిఫెన్స్ పేర్కొంది.

తిరుమలలో భారీ వర్షాలు.. శ్రీవారి మెట్టు నడకదారి రేపటి వరకు మూసివేత

వాయుగుండం ప్రభావంతో తిరుమలలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో.. టీటీడీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. శ్రీవారి మెట్టు నడకదారి రేపటి వరకు మూసివేయనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. అంతేకాకుండా.. పాప వినాశనం, శిలాతోరణం, శ్రీవారి పాదాలు కూడా మూసివేయనున్నారు. భక్తులకు ఇబ్బంది కలిగించకుండా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని ఈవో ఆదేశించారు. మరోవైపు.. తిరుపతి, కాళహస్తి, సత్యవేడు, నగరిలోని శివారు ప్రాంతాలోని ఇళ్ళలోకి వర్షపు నీరు భారీగా చేరింది. అటు.. స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. పలుచోట్ల కాజ్‌వేలపై నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రేపు సాయంత్రం వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షాల వల్ల ప్లాష్ ప్లడ్ వచ్చే అవకాశం ఉందన్న సూచనలతో నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా.. రేపు తిరుపతి, చిత్తూరు జిల్లా ప్రభుత్వ ప్రైవేటు స్కూలు, కాలేజీలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాల కారణంగా జిల్లాలో 2500 హెక్టార్ల వరి పంట, 10 హెక్టార్ల కోత దశలోని వరి పంట, 4 హెక్టార్ల మొక్కజొన్న పంట‌‌‌లు దెబ్బతిన్నాయి.

ఖలీఫా రాజ్యం రావాలి..ఐసిస్ తరహా జెండాతో స్టూడెంట్స్ నిరసన.. మరో పాక్‌లా బంగ్లాదేశ్..

బంగ్లాదేశ్ పాకిస్తాన్‌లా తయారయ్యేందుకు ఎంతో కాలం పట్టేలా కనిపించడం లేదు. ఓ విధంగా చెప్పాలంటే పాకిస్తాన్‌ని మించి మతఛాందసవాద రాజ్యంగా మారేలా బంగ్లాదేశ్ పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా షేక్ హసీనా రిజర్వేషన్ హింసాత్మక అల్లర్ల సమయంలో ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు. అప్పటి నుంచి అక్కడ హిందువులు, మైనారిటీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు ప్రస్తుత తాత్కాలిక బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ జైళ్లలో ఉన్న తీవ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని రిలీజ్ చేస్తున్నారు. జమాతే ఇస్లామీ వంటి సంస్థలపై నిషేధం ఎత్తివేశారు.

ఆరు నూతన పాలసీలతో రాష్ట్ర అభివృద్ధి మారుతుంది..

రాష్ట్ర అభివృద్ధికి ఆరు నూతన పాలసీలు రూపొందించామని.. ఈ నూతన పాలసీలతో ఒక గేమ్ ఛేంజర్‌గా ఏపీ అభివృద్ధి మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నూతన పారిశ్రామిక విధానం 4.0, ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 4.0, ఏపీ గ్రీన్ ఎనర్జీ 4.0, టూరిజం, ఐటీ విధానాలలో పాటు అనేక కొత్త పాలసీలు తీసుకొచ్చారు. ఏపీలో ఉండే యువత ప్రపంచవ్యాప్తంగా ముందుకు వెళ్లాలి.. మారుమూల గ్రామంలో ఉన్నా కూడా ప్రపంచానికి అనుసంధానం కావాలని చంద్రబాబు కోరారు. 25 సంవత్సరాల క్రితం ఐటీ పాలసీ తీసుకొచ్చాం.. అనేక కంపెనీలు, ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చామన్నారు. హైటెక్ సిటీ కట్టాం.. అక్కడినుండి ఆన్‌స్టాపబుల్‌గా అభివృద్ధి సాధించామని సీఎం తెలిపారు. భారతదేశ ప్రజలు ప్రపంచవ్యాప్తంగా వెళ్లి అనేక రంగాల్లో పనులు చేస్తున్నారు.. ఈరోజు మనం తీసుకున్న ఆరు పాలసీలు భవిష్యత్తులో పెనుమార్పులు తీసుకొస్తాయని.. రాష్ట్ర ప్రగతిని మారుస్తుందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలి.. పరిశ్రమలు పెట్టడానికి వచ్చిన వారిని గౌరవించాలి.. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్.. ఇంటిగ్రిటీ హానెస్టితో వ్యాపారాలు చేసి సౌధాలు నిర్మించవచ్చని సీఎం చెప్పారు. ఆ విషయాన్ని రతన్ టాటా రుజువు చేశారు.. రతన్ టాటా నీతి నిజాయితీగా వ్యాపారం చేశారు.. యువతకు ఆయన స్ఫూర్తి అని కొనియాడారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతి కేంద్రంగా ఏర్పాటు చేస్తాం.. ఐదు జోన్లకు 5 ఇన్నోవేషన్ హబ్ వస్తాయన్నారు. రతన్ టాటా పేరుతో ఏర్పాటు చేసే ఇన్నోవేషన్ హబ్ చూసి యువత స్ఫూర్తి పొందాలని చంద్రబాబు పేర్కొన్నారు. మన రాష్ట్రంలో సంపద సృష్టిస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పానని సీఎం చెప్పారు. అభివృద్ధి జరగాలి.. పరిశ్రమలు రావాలి.. సంపద సృష్టించబడాలి.. ఆ సంపద పేద ప్రజలకి అందాలి.. దానికి తాను కట్టుబడి ఉన్నానని అన్నారు.

శబరిమల భక్తులకు గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్ బుకింగ్ లేకున్నా దర్శనం..

ఆన్‌లైన్ బుకింగ్ లేకుండా శబరిమల దర్శించుకునే యాత్రికులకు ప్రభుత్వం సజావుగా ప్రవేశం కల్పిస్తుందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంగళవారం తెలిపారు. అసెంబ్లీలో సీపీఐ(ఎం) నేత వీ జాయ్‌ సమర్పించిన సమర్పణపై సీఎం స్పందిస్తూ.. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోని శబరిమల యాత్రికుల దర్శనం సజావుగా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శబరిమల మండల-మకర యాత్రను సులభతరం చేసే చర్యలపై చర్చించేందుకు విజయన్ అధ్యక్షతన జరిగిన సమావేశం అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు.

అప్పులకు వడ్డీలు కట్టడానికి కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితిని తీసుకొచ్చింది మీరు

తొమ్మిద‌న్నరేళ్లలో మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితిని తీసుకొచ్చింది మీరు. అప్పుల వార‌సత్వానికి ఆద్యులే మీరని బీఆర్‌ఎస్‌ నేతలపై విమర్శలు గుప్పించారు మంత్రి సీతక్క. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మీ హయాంలో అక్షరాల రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేసారు. వాటికి కిస్తీలు, వడ్డీల కోసం ప్రతి రోజు టంచ‌న్ గా రూ. 207 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. అంటే ప్రతి నెల స‌గ‌టున 6 వేల కోట్ల ప్రజాధనాన్ని మీ అప్పుల కుప్పను కడగడానికే స‌రిపోతుందన్నారు. అప్పుల అప్పారావు లాగా అందిన కాడల్లా అప్పులు చేసి.. రాష్ట్రాన్ని తిప్పలు పెట్టి, వడ్డీలతో ఆర్థిక వ్యవస్థ నడ్డి విరిచిన మిమ్మల్ని దేనితో కొట్టాలన్నారు. అప్పులు చాల‌వ‌న్న‌ట్లు వేల కోట్ల బ‌కాయిల‌ను మీరు చెల్లించ‌లేదు. చేసిన ప‌నుల‌కూ బిల్లులు చెల్లించ‌లేదు. 5 వేల కోట్ల ఫీ రియంబ‌ర్స్ మెంట్ బ‌కాయిలు, ఆరోగ్య శ్రీ బ‌కాయిలు, కాంట్రాక్టర్ల‌కు పెండింగ్ బిల్లులు, సర్పంచుల‌కు పెండింగ్ బ‌కాయిలు, విద్యుత్ సంస్ద‌ల‌కు బకాయిలు, ఆర్టీసీకి బ‌కాయిలు, గురుకుల భ‌వ‌నాల ఓన‌ర్ల‌కు అద్దె బ‌కాయిలు, ఉద్యోగుల‌కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిధుల పెండింగ్..ఇలా ప్ర‌తి శాఖ‌లో వంద‌ల కోట్ల బ‌కాయిలు పెట్టి…ఇప్పుడు బుకాయిస్తే ఏలా? అని మంత్రి సీతక్క ప్రశ్నించారు.

ఉన్న పథకాలు బంద్ పెట్టడమే కాంగ్రెస్ తెచ్చిన మార్పు

ఉన్న పథకాలు బంద్ పెట్టడమే కాంగ్రెస్ తెచ్చిన మార్పు అని హరీష్‌ రావు అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఒక చీర కాదు.. రేవంత్ రెడ్డి రెండు చీరలు అన్నాడు, దసరా పండుగకు అక్క చెల్లెళ్ళను‌ ప్రభుత్వం నిరుత్సాహపరిచిందన్నారు. 15వేలు రైతుబంధు అన్నాడు .. గుండు‌ సున్నా చేశాడని ఆయన విమర్శించారు. కేసీఆర్ కిట్ కంటే మంచి కిట్ ఇస్తామని పేద గర్బిణి స్త్రీలను మోసం చేశాడని హరీష్‌ రావు మండిపడ్డారు. ముదిరాజ్, గంగపుత్రులంటే సీఎం రేవంత్ కు చిన్నచూపని, ఆగస్ట్ లో పోయాల్సిన చేప పిల్లలను అక్టోబర్ వచ్చినా పోయలేదన్నారు. మేము 100కోట్లు ఖర్చు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం చేప పిల్లల కోసం బడ్జెట్ లో పెట్టిందె 16కోట్లు అని హరీష్‌ రావు వ్యాఖ్యానించారు. చేప పిల్లలు డబుల్ పోస్తామని చెప్పి.. ఇప్పుడు చేప పిల్లలు సగమే పోయాలని అంటున్నారన్నారు. చెరువులు నిండుకుండలా ఉన్నప్పటికీ.. చేప పిల్లల సగమే పోయాలంటున్నారని, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మార్పు అంటూ ఆయన సెటైర్‌ వేశారు.

ఇసుక, లిక్కర్ పాలసీపై ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు..

ఇసుక, లిక్కర్ పాలసీపై ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఇసుక, లిక్కర్ పాలసీల్లో ఎవరు వేలు పెట్టడానికి లేదు.. ఉచిత ఇసుక ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందేనని అన్నారు. ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లతో ఇసుక తీసుకెళ్లే వాళ్ళ మీద కేసులు పెట్టొద్దు.. ఎడ్లబండితో ఇసుక తీసుకువెళ్లే వారిపై గ్రామాల్లో రైతులు మీద పెత్తనం చేయొద్దని సీఎం సూచించారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలకు పాల్పడుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రథాలు తగలబెట్టడం, ఆడవాళ్ళపై అఘాయిత్యానికి పాల్పడటం చేస్తున్నారు.. రాష్ట్రంలో ఉన్న 14 వేల సీసీ కెమెరాలు గత ప్రభుత్వం వాడలేదని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తిని కూడా వాడుకోలేని దుస్థితిలో ఉన్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వీధిలైట్లు అన్ని వెలగాలి.. అధికారులు కూడా అశ్రద్ధ వీడాలి.. గత ప్రభుత్వం చేసిన పాపాలు ప్రజలను వెంటాడుతున్నాయి.. తవ్విన కొద్దీ అవినీతి, అరాచకాలు బయటపడుతున్నాయన్నారు. అడవి పందులు, పంటను నాశనం చేసినట్లు, రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేశారని మండిపడ్డారు.

ఉద్యోగాల కల్పన, మాదక ద్రవ్యాలు అరికట్టడం, ధరల స్థిరీకరణ కోసం కేబినెట్ కమిటీలు..

రాష్ట్ర మంత్రులు చైర్మన్లుగా మూడు కేబినెట్ సబ్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఉద్యోగాల కల్పన, మాదక ద్రవ్యాలు అరికట్టడం, ధరల స్థిరీకరణ కోసం మూడు కేబినెట్ కమిటీల ఏర్పాటు చేయనున్నారు. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా.. ఆరుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. నారా లోకేష్ చైర్మన్ గా కేబినెట్ సబ్ కమిటీ పనిచేయనుంది. మాదక ద్రవ్యాలను అరికట్టడానికి ఐదుగురు మంత్రులతో మరొక ప్రత్యేక సబ్ కమిటీ ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

మూడు రోజుల పాటు ఇండియా మొబైల్ కాంగ్రెస్

దేశ రాజధాని ఢిల్లీలో మూడు రోజుల పాటు ఇండియా మొబైల్ కాంగ్రెస్ జరుగుతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. సదస్సుకు జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయి టెలికాం కంపెనీలు హాజరయ్యాయని, దాదాపు 33 దేశాల కు సంబంధించిన ప్రజాప్రతినిధులతో పాటు, వివిధ దేశాల నుంచి బహుళ జాతి సంస్థల ప్రతినిధులు హాజరయ్యారని ఆయన తెలిపారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న ప్రారంభించారని, అనేక టెలికాం కంపెనీలకు సంబంధించిన సంస్థల ప్రతినిధులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమావేశమై చర్చించామన్నారు. నిన్న కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా తో ప్రత్యేకంగా టెలికామ్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీని రాష్ట్రాలకు నిర్ణయం చేయొచ్చని పాలసీ నిర్ణయం చేయడం హర్షణీయమన్నారు. తెలంగాణ టెలికాం మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ తెలియజేయడం జరిగిందని మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు.