NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

కోల్‌కతా హాస్పిటల్ దాడి బీజేపీ, లెఫ్ట్ పార్టీల పనే..

కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం-హత్య ఘటన ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపలనకు కారణమైంది. మమతా బెనర్జీ సర్కారుపై బీజేపీ, లెఫ్ట్ పార్టీలు విరుచుకుపడుతున్నాయి. గత వారం కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల పీజీ ట్రైనీ మహిళా డాక్టర్‌పై అత్యంత పాశవికంగా అత్యాచారం జరిగింది. మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో ఆమెపై సంజయ్ రాయ్ అనే వ్యక్తిని దారుణానికి ఒడిగట్టానే ఆరోపణల్ని ఎదుర్కొంటున్నాడు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా వైద్యులు రోడ్డెక్కారు. బాధితురాలికి మద్దతుగా ధర్నాలు, నిరసనలు తెలిపారు. ఇప్పటికే ఈ కేసును కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించింది.

ఇదిలా ఉంటే, గురువారం వైద్యులు నిరసన తెలుపుతున్న సందర్భంలో కొందరు దుండగులు ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిపై దాడి చేశారు. ఈ ఘటనలో సీపీఎం, బీజేపీ దాని మిత్రపక్షాల ప్రమేయం ఉందని సీఎం మమతా బెనర్జీ ఈ రోజు అన్నారు. ఈ రోజు బాధిత వైద్యురాలికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. నిందితుడిని ఉరితీయాలని ఆమె డిమాండ్ చేశారు. అత్యాచారం, హత్య వెనక ఉన్న నిజాన్ని మరుగునపరిచేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.

సీఎం మమతా బెనర్జీ.. న్యాయం చేయాల్సిందిపోయి, న్యాయం కోసం రోడెక్కింది.. ఇదే విచిత్రం..

కోల్‌కతా లేడీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలను రాజేసింది. ప్రభుత్వ ఆధీనంలోని నగరం నడిబొడ్డున ఉన్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న వైద్యురాలు అత్యంత పాశవికంగా రేప్, హత్యకు గురైంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా మెడికోలు, మహిళలు, సాధారణ ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తీరు, పోలీసుల నిర్లక్ష్యంపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టు సీబీఐకి కేసుని బదిలీ చేసింది.

ఇదిలా ఉంటే, ఈ రోజు(శుక్రవారం) పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కోల్‌కతాలో ర్యాలీ చేపట్టారు. వైద్యురాలికి మద్దతు నిరసన తెలుపుతున్న సమయంలో కొందరు దుండగులు ఆస్పత్రిలోకి చొరబడి దాడి చేశారు. దీనిని ఈ రోజు విచారించిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రోజే మమతా ఈ ర్యాలీ చేసింది. ఈ ఘటన జరిగిన తర్వాత మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బీజేపీ, సీపీఎంలు దీనిని చౌకబారు రాజకీయాల కోసం వాడుకుంటున్నాయని ఆరోపించారు. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుని పదవులు పంచుకున్న చరిత్ర ఆ పార్టీల సొంతం

బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని, అందులో భాగంగానే కవితకు బెయిల్ రాబోతుందంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. కవితకు బెయిల్ ఇవ్వాలా? వద్దా? అనేది న్యాయ స్థానం పరిధిలోని అంశం. కవిత బెయిల్ కు, బీజేపీకి ఏం సంబంధం? అని ఆయన వ్యాఖ్యానించారు. ఆప్ పార్టీని విలీనం చేసుకుంటేనే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిందా? ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ రాజకీయ లబ్ది కోసం గౌరవ న్యాయస్థానంపై బురద చల్లి కోర్టుల ప్రతిష్టను తగ్గించడం దుర్మార్గం. బీజేపీని బదనాం చేసేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.

సీఎం చంద్రబాబుతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధుల భేటీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు భేటీ అయ్యారు. అమరావతిలో ఇంటర్నేషనల్ లా యూనివర్శిటీ ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. బెంగళూరులోని NLSIU , గోవాలోని IIULER స్థాయిలో అమరావతిలో ప్రీమియర్ లా యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని ప్రతినిధుల టీమ్ పేర్కొనింది. సీఆర్డీఏ పరిధిలో బీసీఐకి అనువైన స్థలాన్ని ఎంపిక చేయాల్సిందిగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కునార్ సింఘాల్ కు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. లా యూనివర్శిటీ ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందుకు రావడం సంతోషంగా ఉంది.. న్యాయ సంబంధిత రంగాల్లో నైపుణ్యం సాధించేందుకు బీసీఐ ఏర్పాటు చేసే యూనివర్శిటీల ఆవశ్యకత ఎంతో ఉంది.. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన అర్బిట్రేషన్ సెంటర్ల ఏర్పాటుకు బీసీఐ దోహదపడుతుంది అని సీఎం చంద్రబాబు తెలిపారు.

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్నే కలచివేస్తోంది

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ ఘటన దేశాన్నే కలచివేస్తుందన్నారు. లైంగిక వేధింపులు, అత్యాచారాలు, మహిళలపై క్రూరత్వం వంటి ఘటనలు సిగ్గు పడేలా ఉన్నాయని తెలిపారు. స్త్రీ సమానత్వం దేశంలో కొరవడిందన్నారు. ఒక సమాజంగా కలిసి అభివృద్ధి చెందాలని.. చిన్నతనం నుంచి ఆడపిల్లలను అబ్బాయిలతో సమానంగా పెంచాలని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే భారత్ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. ఇలాంటి తరుణంలో మహిళల పట్ల ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం అన్నారు.

పేదల ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశాం..

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో అన్న క్యాంటీన్లను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి అంజలి ఘటించిన తర్వాత మంత్రి మాట్లాడుతూ.. శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో 2 అన్న క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. డొక్కా సీతమ్మ నాడు ప్రతి ఒక్కరి కడుపు నింపారు.. టీటీడీలో ఉచిత అన్నదాన ట్రస్టు ఏర్పాటు చేసింది ఎన్టీఆర్.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా నేటికీ చాలా మంది పేదలు మూడు పూటలా భోజనం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పుకొచ్చారు. పేదల ఆకలి తీర్చడానికే అన్న క్యాంటీన్లు నాడు ఏర్పాటు చేశాం.. వాటిలో మూడు పూటల నాణ్యమైన భోజనాన్ని అందించాం.. కానీ, గత ప్రభుత్వం పేదల కడుపు కొట్టి అన్న క్యాంటీన్లు మూసేశారు అంటూ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

రాహుల్ గాంధీ భారత పౌరసత్వం రద్దు చేయాలి.. హైకోర్టులో బీజేపీ నేత పిటిషన్..

లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై ఢిల్లీ హైకోర్టులో బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి శుక్రవారం ఓ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ భారత పౌరసత్వాన్ని రద్దు చేసేలా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖని ఆదేశించాలని ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. వివరాల ప్రకరాం.. 2003లో యునైటెడ్ కింగ్‌డమ్‌లో బ్యాకాప్స్ లిమిటెడ్ అనే సంస్థ రిజస్టర్ చేయబడిందని, రాహుల్ గాంధీ దాని డైరెక్టర్లు, దాని సెక్రటరిల్లో ఒకరని, 2019లోనే హోం మంత్రిత్వ శాఖకు సుబ్రమణ్య స్వామి లేఖ రాశారు. అక్టోబర్ 10, 2005 మరియు అక్టోబర్ 31, 2006 న దాఖలు చేసిన సంస్థ వార్షిక రిటర్న్స్‌లో రాహుల్ గాంధీ తన జాతీయతను బ్రిటిష్‌గా ప్రకటించుకున్నారని స్వామి ఆరోపించారు. ఫిబ్రవరి 17, 2009న బ్యాకప్స్ లిమిటెడ్ రద్దు అప్లికేషన్‌లో కూడా మళ్లీ ఆయన తన జాతీయతను బ్రిటిష్‌గా ప్రకటించుకున్నట్లు ఆయన పేర్కొన్నారని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారని తెలుస్తోంది.

మంత్రి సీతక్క… నిత్య విద్యార్థి

శాఖ సమీక్షలు, జిల్లా పర్యటనలు, అధికార కార్యక్రమాలు, సమావేశాలు, సభలు, అభివృద్ధి పనుల పరిశీలన, ప్రజా సేవ, సందర్శకుల సమస్యల పరిష్కారం, పార్టీ ప్రోగ్రాముల్లో నిత్యం బిజీగా ఉండే మంత్రి సీతక్క నిత్య విద్యార్థిగా నిలుస్తున్నారు. సారం లేని భూమి చదువు లేని జీవితం ఒక్కటే అని బలంగా నమ్మే సీతక్క..అధ్యయనం పోరాటం అనే సూత్రాన్ని అనుసరిస్తున్నారు. అధికార బాధ్యతలు నిర్వర్తిస్తూనే చదువుకు ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రజా సేవలోనే ఉంటూ ఎల్ఎల్బి, రాజనీతి శాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేసిన సీతక్క తాజాగా నేటి నుంచి ప్రారంభమవుతున్న ఎల్.ఎల్.ఎమ్ రెండో సంవత్సర పరీక్షలకు హాజరవుతున్నారు. తన అధికార నివాసమైన ప్రజాభవన్లో ఎల్.ఎల్. ఏం పుస్తకాలను చదువుతున్నారు. అడవి నుంచి అధికారం వరకు ఆదివాసీ పల్లెల నుంచి పీహెచ్​డీ వరకు ఆమె ప్రస్తానంలో ఎన్నో మలుపులు, మరెన్నో కష్టాలు. ప్రజల కోసం ప్రజల పక్షాన అడవి బాట పట్టిన ఒకప్పటి సీతక్క ఇప్పుడు ఆ అడవి బిడ్డల ఆశలకు, వారి అభివృద్ధికి వారధి. ఆమెది చిన్నపటి నుంచి తమ ఉద్యమ ప్రభావిత ప్రాంతం. ఛత్తీస్​గఢ్ నుంచి తెలంగాణకు వచ్చిన గుత్తికోయలు ఎదుర్కొంటున్న సమస్యలపై పీహెచ్​డీ చేశారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన ఆరోగ్య సేవలను అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ..

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆడిటింగ్ నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శానిటేషన్, ఆస్పత్రుల నిర్వహణ, ఎక్విప్మెంట్, డయాలసిస్ కేంద్రాలు లాంటి వాటిపై ఆడిటింగ్ చేపడతామన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన వైద్యారోగ్య శాఖలోని నాడు-నేడు పనుల పైనా ఆడిటింగ్ చేయబోతున్నాం.. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల మెరుగైన పని తీరు కోసం 30 అంశాల కార్యాచరణ చేపడుతున్నాం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సానుకూల వాతావరణం కల్పించేందుకు చర్యలు చేపడతామని చెప్పుకొచ్చారు. సరైన నిర్వహణ, పారిశుధ్యం, అవాంతరాలు లేని ఓపీ సేవలు, హాజరుపై దృష్టి పెట్టాలి అని మంత్రి సత్య కుమార్ పేర్కొన్నారు.

కేటీఆర్‌ ట్విట్టర్, ప్రెస్ మీట్‌లో మహిళలకు క్షమాపణ చెప్పినంత మాత్రాన ప్రాయశ్చిత్తం కాదు

తెలంగాణ మహిళలను నోటికొచ్చినట్లు దుర్భాషలాడి యథాలాపంగా చేసిన వ్యాఖ్యలంటూ విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసి, ప్రెస్ మీట్ లో విచారం వ్యక్తం చేసినంత మాత్రాన తెలంగాణ మహిళా సమాజం ఆ వ్యాఖ్యలను మరిచిపోదని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ మంత్రి కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని ఉద్దేశించి నిన్న పార్టీ మీటింగ్ లో తెలంగాణ మహిళలను బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకొమ్మని బిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యల పై మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ వ్యాఖ్యల పై తెలంగాణ వ్యాప్తంగా మహిళలు బాధతో పాటు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. పార్టీనేతల ముందు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలకు బహిరంగంగానే మీడియాముఖంగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని మంత్రి సురేఖ డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ నిరంకుశ విధానాలతో విసిగి వేసారిన ప్రజలు అధికారాన్ని దూరం చేసిన బీఆర్ఎస్ నాయకులకు అహంకారం తగ్గలేదని అన్నారు.