NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

14 రోజుల తర్వాత ప్రశాంత్ కిషోర్ నిరాహార దీక్ష విరమణ

బీపీఎస్సీ అభ్యర్థులకు మద్దతుగా 15 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జన్ సూరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ గురువారం విరమించారు. జనవరి 2 నుంచి ఈ దీక్ష చేస్తున్నారు. బీహార్‌లోని మెరైన్ డ్రైవ్‌లోని సత్యాగ్రహ స్థలంలో నిరాహార దీక్షను విరమించారు. బీపీఎస్సీ పరీక్షల్లో జరిగిన అవకతవలను నిరసిస్తూ అభ్యర్థులకు మద్దతుగా నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఎట్టకేలకు 14 రోజుల తర్వాత నిరాహార దీక్ష విరమించి.. విద్యార్థులకు అండగా ఉంటానని వెల్లడించారు. దీక్ష విరమణ అనంతరం ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడారు. 14 రోజులుగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపినట్లు వెల్లడించారు. విద్యార్థులపై లాఠీఛార్జ్ జరిగినప్పుడు తాను గార్దానీబాగ్‌కు వెళ్లి తన గొంతు విప్పినట్లు చెప్పారు. అయినా ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లను పట్టించుకోకుండా లాఠీఛార్జ్ చేసిందన్నారు. పలుమార్లు లాఠీఛార్జ్ చేయడం వల్లే నిరాహార దీక్షకు కూర్చోవల్సి వచ్చిందన్నారు.

నార్సింగి జంట హత్యల కేసులో నివ్వెరపోయే విషయాలు

నార్సింగి జంట హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నగ్న వీడియోలు తీసేందుకు నిరాకరించినందుకు మహిళను చంపినట్లు పోలీసులు గుర్తించారు. నగ్న వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని అంకిత్‌ అనే వ్యక్తికి మహిళ చెప్పడంతో.. ఉద్దేశపూర్వకంగానే మహిళని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దుండగులు హతమార్చారు. ఈ కేసులో నిందితులు రాహుల్ కుమార్ సాకేత్, రాజ్ కుమార్ సాకేత్, సుఖీంద్ర కుమార్ సాకేత్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. బిందు అనే మహిళతో రెండు సార్లు లైంగికంగా రాహుల్ కుమార్ సాకేత్ కలిశాడు. అయితే.. ఆ సమయంలో వీడియో తీసేందుకు యత్నించాడు రాహుల్ కుమార్. దీంతో.. రాహుల్‌ను హెచ్చరించి ఇదే విషయాన్ని మృతడు అంకిత్ సాకేత్‌కి చెప్పింది బిందు. ఇదే విషయంపై రాహుల్ కుమార్ సాకేత్ కు అంకిత్ కుమార్ కు గొడవ జరిగింది.

సంక్రాంతి పండగకు భారీ లాభాల్లో ఏపీఎస్ఆర్టీసీ.. ఎన్ని కోట్లో తెలుసా..?

సంక్రాంతి పండగకు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడిపించింది. జనవరి 8 నుంచి 13 వరకు 3400 సర్వీసులు, జనవరి 16 నుంచి 20వ తేదీ వరకు 3800 సర్వీసులు నడిపించింది ఏపీఎస్ఆర్టీసీ.. సంక్రాంతి పండుగకు నడిపే బస్సులో ప్రయాణీకులపై ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయమని సంస్థ ఎండీ ప్రకటించారు. అలాగే.. రానూపోనూ టికెట్లు ఒకేసారి ఆన్ లైన్ బుకింగ్ చేసుకున్న వారికి 10 శాతం రాయితీ కూడా కల్పించింది. ఇదిలా ఉంటే.. ఈ సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులను అధిక సంఖ్యలో తమ గమ్యస్థానాలకు చేరవేసి రికార్డు సాధించింది. దీంతో సంస్థను లాభాల్లోకి వెళ్లింది.

ప్రకాశం జిల్లా పాకల బీచ్‌లో ముగ్గురు మృతి.. మంత్రి దిగ్భ్రాంతి

సంక్రాంతి సెలవుల్లో విహారయాత్రకు వచ్చిన స్నేహితులు మృత్యువాత పడ్డారు. సముద్ర స్నానాలకు వెళ్లి ప్రమాదవశాత్తు అలల తాకిడికి ఐదుగురు గల్లంతు అయ్యారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లో సముద్ర స్నానాలకు వెళ్లి ప్రమాదవశాత్తు అలల తాకిడికి ఐదుగురు గల్లంతు అయ్యారు. అలల తీవ్రతను అంచనా వేయని వీళ్లు.. ఐదుగురు కెరటాలకు కొట్టుకుపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరిని స్థానిక మత్స్యకారులు కాపాడారు. మృతులు పొన్నలూరు మండలం తిమ్మపాలెంకి చెందినవారిగా గుర్తించారు. కాగా.. మృతదేహాలను కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతులు మాధవ, జెస్సికా, యామినిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసింది ఇతడే.. సీసీకెమెరా వీడియో వైరల్..

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై అతడి ఇంట్లోనే దుండగుడు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన యావత్ చిత్రపరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మరోవైపు రాజకీయ విమర్శలకు కూడా కారణమవుతోంది. దొంగతనం పాల్పడేందుకు వచ్చిన దుండగుడు, సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సైఫ్‌ 6 కత్తిపోట్లకు గురయ్యాడు. మెడ, వెన్నుముక ప్రాంతంలో తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ఆయనను లీలావతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు సర్జరీలు జరిగాయి. ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు చెప్పారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే దుండగుడిని పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు 10 బృందాలను ఏర్పాటు చేశారు. గురువారం తెల్లవారుజామున 2.33 గంటలకు సైఫ్ ఇంటికిలో దుండగుడు మెట్ల మార్గంలో వెళ్తున్న వీడియో సీసీటీవీలో రికార్డయ్యింది. దుండగుడి ఫోటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. టీ షర్ట్, జీన్స్ ధరించిన వ్యక్తి మెట్లు దిగుతున్న వీడియో రికార్డ్ అయింది. వెళ్లిపోయే క్రమంలో అతను సీసీకెమెరా వైపు చూడటం గమనించవచ్చు.

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 17 మంది మావోల హతం

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గురువారం ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ బస్తర్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 17 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. బీజాపూర్ జిల్లా ఊసూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పూజారీ కాంకేర్‌, మారేడుబాక ప్రాంత అడవుల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇరుపక్షాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ నెలలో ఇది రెండో ఎన్‌కౌంటర్‌. మూడు జిల్లాలకు చెందిన డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్ (డీఆర్‌జీ), ఐదు బెటాలియన్ల సీఆర్పీఎఫ్‌, కోబ్రా, సీఆర్పీఎఫ్‌ 229వ బెటాలియన్‌ బలగాలు నక్సల్స్‌ ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టి కాల్పులు జరిపాయి. ఇదే జిల్లాలో ఈ నెల 12న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా మావోలతో పాటు ఐదుగురు మావోయిస్టులు మరణించారు.

జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు 5 లక్షల ప్రమాద బీమా చెక్కులు పంపిణీ..

జనసేన పార్టీ క్రియా శీలక సభ్యత్వం చేయించుకొని ప్రమాదవశాత్తు మృతి చెందిన క్రియాశీలక మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు బకాయి పెట్టి వెళ్ళిపోయిన ప్రభుత్వం ఒక్క వైసీపీ మాత్రమేనని ఆరోపించారు. సూపర్ సిక్స్ హామీలో భాగంగా ఉచిత గ్యాస్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చాం.. తల్లికి వందనం త్వరలోనే అమలు చేయబోతున్నామని తెలిపారు. పవన్ కళ్యాణ్ తనకు అప్పగించిన బాధ్యత నిర్వర్తిస్తూ సమర్ధవంతంగా ముందుకు వెళ్తున్నారని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు.

లై డిటెక్టర్ పరీక్ష జరిపిద్దాం… మీడియాలో లైవ్ చూపిద్దాం…

ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈడీ విచారణ పూర్తయింది. ఉదయం 10:40 గంటలకు ప్రారంభమైన ఈ విచారణ సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగింది. దాదాపు 7 గంటలపాటు ఈడీ అధికారులు కేటీఆర్‌ను వివిధ అంశాలపై ప్రశ్నించారు. ఈడీ విచారణ తరువాత కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ కక్ష సాధిస్తున్నారని, నేను నిజాయతీ పరుడినన్నారు. ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్ష పెట్టండని, రేవంత్ రెడ్డి ఇంట్లో అయిన, న్యాయమూర్తులు సమక్షంలో లై డిటెక్షన్ రెడీ అని ఆయన అన్నారు. ఎన్ని పరీక్షలకయినా సిద్ధమని, విచారణకి 5కోట్ల నుండి 10కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. విచారణ సంస్థలను గౌరవించి ఏసీబీ, ఈడీ విచారణ కి హాజరు అయ్యానని, రెండు సంస్థలు ఒకే రకమైన ప్రశ్నలు ఆడిగారన్నారు కేటీఆర్‌. ఎన్ని ప్రశ్నలు అడిగిన చెబుతా అని, ఎన్ని సార్లు రమ్మని చెప్పిన వస్తా అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

నితీష్ కుమార్ రెడ్డికి త్వర‌లో ఇంటి స్థలం.. సీఎం హామీ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి కలిశారు. ఆయనతో పాటు ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని), ఏసీఏ కార్యద‌ర్శి, రాజ్యస‌భ ఎంపీ సానా స‌తీష్ కూడా ఉన్నారు. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివ‌నాథ్ ప్రక‌టించిన రూ.25 ల‌క్షల చెక్కును నితీష్ కుమార్ రెడ్డికి సీఎం చంద్రబాబు బ‌హుక‌రించారు. నితీష్ కుమార్ రెడ్డికి అతి త్వర‌లో ఇంటి స్థలం కేటాయిస్తామ‌ని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అంత‌ర్జాతీయ క్రీడాకారుల‌కు అండ‌గా ఉండి అన్ని విధాలుగా ప్రోత్సాహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నితీష్ కుమార్ రెడ్డి భవిష్యత్తులో మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని ఆకాంక్షించారు సీఎం చంద్రబాబు.. ఆస్ట్రేలియాతో జ‌రిగిన‌ బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో తన బ్యాటింగ్‌తో నితీష్ కుమార్‌ రెడ్డి స‌త్తా చాటాడు. దీంతో.. నితీష్ కుమార్ రెడ్డిని సీఎం చంద్రబాబు అభినందించారు. అనంతరం.. నితీష్ కుమార్ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్‌లో బీదర్ దొంగలు.. పోలీసుల్ని చూసి కాల్పులు

కర్ణాటకలోని బీదర్ పట్టణంలో గురువారం పట్టపగలు ఏటీఎం వాహనంపై దోపిడీకి పాల్పడ్డ దొంగలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. బీదర్ నుంచి  హైదరాబాద్ అఫ్జల్‌గంజ్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి బీదర్ పోలీసులు దొంగలను వెంటాడుతూ వచ్చారు. అయితే అఫ్జల్‌గంజ్‌లో బీదర్ పోలీసులను చూసి దుండగులు కాల్పులకు తెగబడ్డారు. రోషన్ ట్రావెల్స్‌లో రెండు టికెట్లు కొనుగోలు చేశారు. బస్సులో కూర్చున్నాక పట్టుకుందామని చూస్తే.. ఇంతలోనే పోలీసులపై 3 రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. హైదరాబాద్ నుంచి రాయ్‌పూర్‌కు పారిపోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులతో కలిసి కర్ణాటక పోలీసులు.. నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు.