NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

“నిందితులను రక్షించే ప్రయత్నం”.. కోల్‌కతా డాక్టర్ ఘటనలో మిత్రపక్షంపై విమర్శలు..

కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనపై కాంగ్రెస్ నేతలు మెల్లిగా స్పందిస్తున్నారు. ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించిన ఒక రోజు తర్వాత ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా స్పందించారు. మిత్రపక్షం తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సుతిమెత్తగా విమర్శలు చేశారు. ఈ దారుణ ఘటనపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘బాధితురాలికి న్యాయం చేయడానికి బదులుగా నిందితులను రక్షించే ప్రయత్నం. ఆస్పత్రి, స్థానిక పరిపాలనపై తీవ్రమైన ప్రశ్నల్ని లేవనెత్తుతోంది’’ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

‘‘మెడికల్ కాలేజీ లాంటి చోట్ల కూడా డాక్టర్లకు భద్రత లేకపోతే తల్లిదండ్రులు తమ కూతుళ్లను చదువు కోసం ఎలా బయటకు పంపుతారని ఈ సంఘటన ఆలోచించేలా చేపింది. నిర్భయ కేసు తర్వాత చేసిన కఠిన చట్టాలు కూడా ఇలాంటి నేరాలను నిరోధించడంలో ఎందుకు విఫలమవుతున్నాయి..? హత్రాస్ నుంచి ఉన్నావ్, కథువా నుంచి కోల్‌కతా వరకు నిరంతరం పెరుగుతున్న మహిళలపై జరుగుతున్న సంఘటనలపై ప్రతీపక్షం, సమాజాంలోని ప్రతీ వర్గం తీవ్రమైన చర్చలు జరపాలి. ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి’’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్లోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో పాము కలకలం..

విశాఖ స్టీల్ ప్లాంట్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో పాము కలకలం రేపింది. బ్యాంకులో పాము కనిపించడంతో సిబ్బంది, ఖాతాదారులు కలవరపడ్డారు. వదలపూడిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌లో ఇవాళ జరిగిన ఈ సంఘటన చోటు చేసుకుంది. సకాలంలో పాము పట్టుకునే కిరణ్ అనే వ్యక్తి బ్యాంకులోని రికార్డు రూమ్ లో ఉన్న పాముతో బయటకు రావడం వీడియోలో కనిపిస్తుంది. ఇక, పామును పట్టుకున్న తర్వాత కిరణ్ దానిని సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వదిలి పెట్టాడు. ఆ తర్వాత స్నేక్ మ్యాన్ కిరణ్ కి బ్యాంక్ ఆప్ బరోడా మేనేజర్ ప్రశంసా పత్రం అందజేశారు.

దులీప్ ట్రోఫీ 2024 స్క్వాడ్స్ ప్రకటన.. కెప్టెన్స్ వీళ్లే..!

దులీప్ ట్రోఫీ 2024 మొదటి రౌండ్ మ్యాచ్‌ల కోసం జట్లను ప్రకటించింది బీసీసీఐ. ఈ జట్లకు కెప్టెన్లుగా శుభ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్ ఉండనున్నారు. టీమ్ ‘A’కి గిల్, టీమ్ ‘B’కి ఈశ్వరన్, టీమ్ ‘C’కి గైక్వాడ్, టీమ్ ‘D’కి అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. రెడ్ బాల్ టోర్నమెంట్ అయిన దులీప్ ట్రోఫీతో భారత దేశవాళీ సీజన్ ప్రారంభం కానుంది. ఈసారి చాలామంది అంతర్జాతీయ ఆటగాళ్లు ఈ టోర్నమెంట్‌లో ఆడబోతున్నారు. ఇదిలా ఉంటే.. భారత సీనియర్ ఆటగాళ్లు కనిపించరు.. ఎందుకంటే భారత్ 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు జట్టును ప్రకటించి.. జట్టులో ఎంపికయ్యే ఆటగాళ్లను దులీప్ ట్రోఫీకి దూరంగా ఉంచనున్నారు. ఈ క్రమంలో.. కొంతమంది యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించనున్నారు. ఈ టోర్నీ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు జరుగుతాయి.

డిపోలు ప్రైవేట్‌పరమంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు

తమ డిపోలను ప్రైవేట్‌పరం చేస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్‌ఆర్టీసీ) యాజమాన్యం స్పష్టం చేసింది. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా కొందరు చేస్తోన్న ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ ప్రకారమే పర్యావరణహితమైన ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి సంస్థ తీసుకువస్తోందని పేర్కొంది. డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులతో సహా అన్ని బస్సుల ఆపరేషన్స్‌ నిర్వహణ పూర్తిగా టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని, అందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని వెల్లడించింది.

కేంద్రప్రభుత్వ ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మ్యానుపాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌(ఫేమ్‌)-1 స్కీమ్‌లో భాగంగా 2019 మార్చిలో 40 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను ఇదే విధానంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఒలెక్ట్రా కంపెనీతో గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్(జీసీసీ) పద్దతిన ఒప్పందం చేసుకుని పుష్ఫక్‌ పేరుతో హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మార్గంలో ఈ బస్సులను సంస్థ నడుపుతోంది. హైదరాబాద్‌లోని కంటోన్మెంట్‌, మియాపూర్‌-2 డిపోల నుంచి వాటిని తిప్పుతోంది. బస్సుల మెయిన్‌టనెన్స్‌, చార్జింగ్‌ మినహా ఆపరేషన్స్‌ అంతా టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతోంది.

భారత్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్‌లు నిర్వహించొద్దు- హిందూ మహాసభ

14 ఏళ్ల తర్వాత గ్వాలియర్‌లో బంగ్లాదేశ్‌-భారత్‌ల మధ్య అంతర్జాతీయ టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో.. ఇప్పటికే నిరసనలు మొదలయ్యాయి. గ్వాలియర్‌లో భారత్-బంగ్లాదేశ్ మధ్య అంతర్జాతీయ మ్యాచ్‌ను నిర్వహించేందుకు అనుమతించబోమని హిందూ మహాసభ ప్రకటించింది. గ్వాలియర్‌ వీధుల్లో నిరసనలు తెలుపుతూ స్టేడియంలోని పిచ్‌ను తవ్వుతామన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై ఊచకోతకు పాల్పడుతున్నారని హిందూ మహాసభ పేర్కొంది. హిందువుల ఇళ్లు, దేవాలయాలకు నిప్పు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. హిందూ మహిళలను కూడా హింసిస్తున్నారని వారు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాలో బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లు ఆడడం హిందువులకు ద్రోహం అని అన్నారు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ అంటే అస్సలు సహించేది లేదని.. బంగ్లాదేశ్‌ జట్టును గ్వాలియర్‌కు రాణించొద్దని హిందూ మహాసభ పేర్కొంది.

22 ఏళ్ల మహిళపై స్నేహితుల సామూహిక అత్యాచారం..

తమిళనాడు తంజావూరులో దారుణం జరిగింది. యువతిపై ఆమె స్నేహితులే సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. 22 ఏళ్ల బాధిత యువతి ఇంటికి సమీపంలోనే ఆమెపై ఈ దారుణం జరిగింది. యువతి స్నేహితుడితో పాటు అతడి సహచరులు ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. చెన్నైలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న సదరు యువతి సొంతూరికి వచ్చిన కొద్ది రోజులకే ఈ దారుణం జరిగింది. మహిళ మూడు రోజుల క్రితం ఇంటికి వచ్చిన సందర్భంలో, ప్రైవేట్‌గా కలవాలని ఆమె స్నేహితుడు అభ్యర్థించాడు. అందుకు ఆమె అంగీకరించింది. బాధితురాలి ఇంటికి ఎదురుగా ఉన్న షెడ్డు వద్దుకు వెళ్లింది. అక్కడే ఉన్న ఆమె స్నేహితుడు, అతని సహచరులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ఒరటనాడు ఆల్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా కవిదాసన్, దివాకర్, ప్రవీణ్ అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారం, నేరపూరిత బెదిరింపులు, నేరాన్ని ఫోన్‌లో చిత్రీకరించిన ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో 17 ఏళ్ల బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రాణాలతో బయటపడిన యువతి ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఏపీకి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది..

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే ఐదేళ్లు సీఎం చంద్రబాబుకు పెను సవాల్ అన్నారు. 14 ఏళ్ళు సీఎంగా చేసిన అనుభవం చంద్రబాబుకి కలిసి వచ్చే అంశం.. మాజీ ముఖ్యమంత్రిగా ప్రభుత్వానికి వ్యక్తిగతంగా సూచనలు ఇస్తాను.. అమరావతి, పోలవరంకు కేంద్రం సహకరిస్తుంది.. గత ప్రభుత్వంలో అరాచకాలు జరిగాయి అని ఆరోపించారు పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలి అని కోరారు. ఒడిస్సా, ఛత్తీస్ గఢ్ తో పోలవరంకు ఉన్న అంతరాష్ట్ర సమస్యలను పరిష్కరించుకోవాలి అని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్‌ మను సింఘ్వీ

తెలంగాణలో జరగనున్న రాజ్యసభ ఉపఎన్నికకు తమ అభ్యర్థిగా సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీని కాంగ్రెస్ బుధవారం నామినేట్ చేసింది. బీఆర్‌ఎస్ ఎంపీ కె. కేశవరావు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడంతో ఆ స్థానం ఖాళీ అయింది. అయితే.. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్‌ మను సింఘ్వీ అధికారికంగా ప్రకటించింది ఏఐసీసీ. మరో రెండేళ్ల పదవీకాలం మిగిలి ఉన్నందున, సింఘ్వీకి సీటు కోసం తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ తన బలంపై ఆధారపడే అవకాశం ఉంది. సెప్టెంబరు 3న ఉప ఎన్నిక జరగనుంది. రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ఉన్న మెజారిటీ ప్రకారం, ఖాళీగా ఉన్న సీటును గెలుచుకుని, రాజ్యసభలో తన ఖ్యను 27 వరకు కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ ధీమాగా ఉంది.

బీహార్‌లో దారుణం.. ఐదుగురు కుటుంబ సభ్యులు హత్య

బీహార్‌లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు. ఈ ఘటన భాగల్‌పూర్‌లోని ప్రభుత్వ క్వార్టర్‌లో చోటుచేసుకుంది. ఒకేసారి ఐదుగురు హత్యకు గురికావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బీహార్‌ భాగల్‌పూర్‌లోని ప్రభుత్వ క్వార్టర్‌లో ఒక మహిళా పోలీస్ కుటుంబం నివాసం ఉంటుంది. మహిళా పోలీస్ నీతూ కుమారి, భర్త పంకజ్, పిల్లలు శివాంశ్ (నాలుగున్నరేళ్లు), శ్రేయ (మూడున్నరేళ్లు), నీతు అత్తగారు ఆశాదేవి (65) నివాసం ఉంటున్నారు. అయితే నీతూ కుమారి తన పిల్లలను, అత్త గారును చంపేసింది. దీంతో కోపోద్రేకుడైన పంకజ్.. నీతూ కుమారి పీకకోసి చంపేశాడు. అనంతరం ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు పంకజ్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. నీతూ కుమారికి అక్రమ సంబంధం ఉందని పంకజ్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.

తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. 36 వేల కోట్ల రికార్డు

ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటన విజయవంతమైంది. పెట్టుబడుల లక్ష్య సాధనలో సరికొత్త రికార్డు నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణకు భారీగా పెట్టుబడులు వెల్లువెత్తాయి. అమెరికా పర్యటనలో రూ.31502 కోట్ల పెట్టుబడులు రాగా.. చివరి రెండు రోజుల దక్షిణ కొరియా పర్యటనలోనూ అదే స్పందన వెల్లువెత్తింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచస్థాయి కంపెనీలు ముందుకు వచ్చాయి. రూ.4500 కోట్ల పెట్టుబడులకు అక్కడి కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. దీంతో అమెరికా, దక్షిణ కొరియా పర్యటనతో మొత్తం రూ.36 వేల కోట్ల పెట్టుబడులను తెలంగాణ సాధించింది. మొత్తం 25 కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఆయా రంగాల్లో కొత్త సంస్థలు, కొత్త పరిశ్రమలతో వేలాది కొత్త ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.