NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

“వక్ఫ్ బిల్లు”పై పార్లమెంటరీ కమిటీ చైర్‌పర్సన్‌గా జగదాంబికా పాల్ నియామకం..

వక్ఫ్ బోర్డు ‘అపరిమిత అధికారాలని’ నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల వక్ఫ్ సవరణ బిల్లుని లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది రాజ్యాంగంపై దాడిగా, మతస్వేచ్ఛని హరిస్తున్నాయంటూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఈ బిల్లుపై ఆందోళన చేశాయి. దీంతో ఈ బిల్లుని చర్చించేందుకు ‘‘ జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)’’ని నియమించింది. 21 మంది అధికార, ప్రతిపక్షకు చెందిన లోక్‌సభ ఎంపీలను, 10 మంది రాజ్యసభ ఎంపీలు, మొత్తంగా 31 మందితో జేపీసీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్‌ని చైర్‌పర్సన్‌గా నియమిస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారు.

ఆర్టీసీ బస్సులో ప్ర‌యాణికుడికి ఫిట్స్.. డ్రైవ‌ర్ ఉదార‌త

టీజీఎస్ఆర్టీసీ బ‌స్సులో ఫిట్స్ వ‌చ్చిన ప్ర‌యాణికుడిని ఆస్ప‌త్రిలో చేర్పించి డ్రైవ‌ర్ ఉదార‌త చాటుకున్నారు. బ‌స్సును నేరుగా ఆస్ప‌త్రికి తీసుకెళ్లి ప్ర‌యాణికుడి ప్రాణాల‌ను కాపాడారు. వ‌రంగ‌ల్-2 డిపోన‌కు చెందిన సూపర్ లగ్జరీ బస్సు హైదరాబాద్ నుంచి హన్మకొండకు సోమవారం వెళ్తోంది. హైదరాబాద్ శివారు ఘట్ కేసర్ దాట‌గానే సంతోష్ అనే ప్ర‌యాణికుడికి బస్సులో ఒక్కసారిగా ఫిట్స్ వ‌చ్చాయి. ఈ విషయాన్ని గమనించిన తోటి ప్రయాణికులు డ్రైవర్ బి.వెంకన్న దృష్టికి తీసుకెళ్లారు. వెంటేనే బస్సును పక్కకి ఆపి ఫిట్స్ వచ్చిన ప్రయాణికుడిని డ్రైవర్ పరిశీలించారు. ఆరోగ్య పరిస్థితి విషమిస్తుందని గుర్తించి.. తోటి ప్ర‌యాణికుడు శ్రీనివాస్ స‌హ‌కారంతో సమీపంలో ఉన్న బీబీనగర్‌లోని ఎయిమ్స్ ఆస్పత్రికి బస్సును తీసుకెళ్లారు. సంతోష్‌ను ఆస్ప‌త్రిలో చేర్పించారు. స‌కాలంలో ఆస్ప‌త్రికి తీసుకువెళ్ల‌డంతో సంతోష్ కు ప్రాణాప్రాయం త‌ప్పింది.

తెలంగాణ డీఎస్సీ ప్రిలిమినరీ కీ విడుదల

తెలంగాణ రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించిన ఆన్ లైన్ డీఎస్సీ ప్రిలిమినరీ కీ విడుదల అయింది. ప్రిలిమినరీ కీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్ ను పాఠశాల విద్యా శాఖ అధికారులు వెబ్ సైట్ లో పెట్టారు. ఈ పరీక్షలు జూలై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ జరిగాయి. ఒక వేళా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 20వ తేదీ వరకు ఆన్ లైన్ లో తెలిపేందుకు అవకాశం ఇచ్చారు. ఇక, డీఎస్సీకి మొత్తం 2, 79,957 దరఖాస్తులు రాగా.. 2,45,263 మంది ( 87.61 శాతం ) హాజరయ్యారు. 34,694 మంది పరీక్షలు రాయలేదు.. అత్యధికంగా సెకండరీ గ్రేట్ టీచర్ ( ఎస్జీటీ) పోస్టులకు 92.10 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.

తెలంగాణ ఉద్యోగులను రిలీవ్‌ చేస్తూ.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు..!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను ఏపీ సర్కార్ రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తిరిగి వారి స్వరాష్ట్రానికి పంపేలా ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్ధన మేరకు 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను తెలంగాణాకు రిలీవ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. మొత్తం 122 మంది తెలంగాణ స్థానికత కలిగిన నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేస్తున్నట్ల ఎన్డీయే కూటమి ప్రభుత్వం పేర్కొనింది. ప్రస్తుతం వేర్వేరు విభాగాల్లో పని చేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను రిలీవ్ చేసే ముందు వారి నుంచి అంగీకారం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణాకు రిలీవ్ అవుతున్న ఉద్యోగులు తమ కేడర్ లోని చివరి ర్యాంక్ లో మాత్రమే విధుల్లో చేరతారని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది.

సీఎం రేవంత్‌ రెడ్డికి కిషన్‌ రెడ్డి లేఖ

తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లులేని పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) ఫలాలను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి లేఖ రాశారు. గ్రామీణ భారతదేశంలోని ప్రతి ఒక్కరి సొంతింటి కలను సాకారం చేయడానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ పథకాన్ని 2016 లో ప్రారంభించిందన్నారు. పథకం ప్రారంభ సమయంలో గ్రామీణ భారతదేశంలోని సొంతిల్లు లేని పేద కుటుంబాలకు ఆయా రాష్ట్రప్రభుత్వాల సహకారంతో మార్చి, 2024 నాటికి 2.95 కోట్ల పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుందన్నారు కిషన్‌ రెడ్డి. మొదటి విడత గడువు ముగిసిన ఈ పథకాన్ని కొనసాగిస్తూ రెండవ విడతలో భాగంగా ఏప్రిల్, 2024 నుండి మార్చి, 2029 మధ్య కాలంలో మరో 2 కోట్ల పక్కా ఇళ్లను సొంతిల్లు అవసరమున్న గ్రామీణ ప్రాంత పేద కుటుంబాలకు నిర్మించి ఇవ్వాలని తద్వారా కనీసం 10 కోట్ల మందికి లబ్ధిని చేకూర్చాలని 09.08.2024 న జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారన్నారు.

హైదరాబాద్‌లో పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లో పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కామాటిపురాలోని ఓ డెకరేషన్‌ షాపులో మంటలు చెలరెగాయి.. దీంతో.. క్షణాల్లో ఫ్యాక్టరీ మొత్తం మంటలు వ్యాపించాయి. అయితే.. వెంటనే గోదాం సిబ్బంది అగ్ని మాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో నిమిషాల వ్యవధిలో 5 ఫైరింజన్లు ఘటనా స్థలికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఎంత శ్రమిస్తున్నప్పటికీ, మంటలు అదుపులోకి రావడం లేదు. కెమికల్ గోదాం కావడంతో డబ్బాలు ఒక్కొక్కటిగా పేలుతున్నాయి. దాంతో, మంటలు మళ్లీ మళ్లీ చెలరేగుతున్నాయి. ఘటన జరిగిన గోదాం పక్కనే మరికొన్ని కెమికల్ గోదాంలు ఉండటంతో స్థానికుల్లో ఏం జరుగుతుందో అన్న భయం నెలకొంది. అయితే ప్రమాద స్థలంలో ఉన్న రెండు సిలిండర్‌లు పేలడంతో పక్కనే ఉన్న మరో గోదాంకు మంటలు వ్యాపించారు. దట్టంగా పొగ అలుముకోవడంతో ఫైర్‌ సిబ్బంది సహాయక చర్యల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇరిగేషన్ ప్రాజెక్టులను, ఇరిగేషన్ శాఖను నాశనం చేశారు

ఈనెల 15న సీతారామ ప్రాజెక్టులోని 3 పంపులను ముఖ్యమంత్రి రేవంత్ ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 2026 ఆగస్టు 15కు పూర్తి చేయబోతున్నామని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను, ఇరిగేషన్ శాఖను నాశనం చేశారని, ఇరిగేషన్ శాఖను గాడిలో పెట్టె ప్రయత్నం చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పదేళ్లలో 1.81లక్షల కోట్లు ఇరిగేషన్ శాఖకు ఖర్చు చేసి నామమాత్రంగా పనులు చేశారని, కాళేశ్వరంకు లక్ష కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాల కొత్త ఆయకట్టు కొత్తగా సాగులోకి తీసుకు రాలేదన్నారు ఉత్తమ్‌. పదేళ్లు అధికారంలో ఉన్నా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలేదని, మేము కొంత బడ్జెట్ కేటాయింపులు చేసి ప్రాజెక్టుల పనులు చేస్తున్నామన్నారు. రాజీవ్, ఇందిరా సాగర్ కలిసి 3505 కోట్లతో పూర్తి కావాల్సి ఉంటే 18286 కోట్లకు పెంచారు. అయినా 349 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటే ఇప్పుడు రెండింతలు పెరిగింది. భూసేకరణ కూడా పెరిగింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందిరా, సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కు 1500 కోట్లు ఖర్చు చేస్తే 4 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు వచ్చేదన్నారు ఉత్తమ్‌.

వైద్యురాలి హత్యాచార ఘటనపై జేపీ నడ్డా కీలక వీడియో విడుదల

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పందించారు. ఈ ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం విచారకరమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు జేపీ నడ్డా వీడియో విడుదల చేశారు. వైద్యురాలి హత్యాచార ఘటన హృదయాన్ని కలిచి వేస్తోందన్నారు. యావత్ దేశాన్ని కదిలించిందన్నారు. ఈ అమానవీయ సంఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు. సంఘటనను దాచిపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నిస్తోందని నడ్డా ఆరోపించారు. పశ్చిమబెంగాల్‌లో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని ఆరోపించారు. అన్యాయం తారాస్థాయికి చేరిందని.. అందుకే మహిళలపై నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. హత్యాచార ఘటన కోల్‌కతా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. దీన్ని జేపీ నడ్డా స్వాగతించారు. సీబీఐ విచారణ ద్వారా నిజం బయటపడుతుందని తెలిపారు. తనను అనేక మంది వైద్య సంఘాల ప్రతినిధులు కలిశారని చెప్పారు. వైద్యులకు రక్షణ కల్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చినట్లుగా వెల్లడించారు.

పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష..!

పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓడరేవులు, ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధిపై చర్చ జరిగింది. రాష్ట్రంలో ఆహారశుద్ధి, ఆక్వా రంగాల ఆధారిత ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఒక్కో పార్క్ 100 ఎకరాల విస్తీర్ణంలో 100 పార్కులు ఏర్పాటు లక్ష్యంగా ముందుకు సాగుతుంది. విజయవాడ- మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులో పూర్తి స్థాయి కార్యకలాపాలు జరగాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఉపాధి అవకాశాలు, సంపద సృష్టి కేంద్రాలుగా పోర్టుల నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.

హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు జీఎస్టీ అధికారులపై సీబీఐ కేసు

హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు జీఎస్టీ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. జీఎస్టీ సూపరింటెండెంట్ ఆనంద్ కుమార్ తో పాటు ఇన్స్పెక్టర్ మనీష్ శర్మ పై కేసు నమోదు చేసింది సీబీఐ. ఓ వ్యక్తి నుండి జీఎస్టీ అధికారులు లంచం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బాధితుడు సీబీఐని ఆశ్రయించాడు. ఐరన్ స్క్రాప్ గోదాం లో అక్రమాల పై ఫైన్ విధించిన జీఎస్టీ అధికారులు… బాధితుడు నుండి ఐదు లక్షల రూపాయలు లంచం డిమాండ్‌ చేశారు. ఇవ్వకపోవడంతో స్క్రాప్ గోదామును సీజ్ చేశారు అధికారులు. సీజ్ చేసిన గోదాంను ఓపెన్ చేసేందుకు మరో 3 లక్షలు డిమాండ్ చేశారు జీఎస్టీ అధికారులు. దీంతో.. బాధితుడు సీబీఐ అధికారులు విన్నవించుకోవడంతో.. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. రెండు ప్రాంతాల్లో సోదాల నిర్వహించిన సీబీఐ అధికారులు.. సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.