NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

ప్రపంచవ్యాప్తంగా లైంగిక దాడులకు బలవుతున్న 37 కోట్ల మంది బాలికలు..

ప్రపంచవ్యాప్తంగా 37 కోట్ల మందికి పైగా బాలికలు మరియు మహిళలు తమ చిన్నతనంలో అత్యాచారం లేదా లైంగిక వేధింపులకు గురైనట్లు యూనిసెఫ్ నివేదిక వెల్లడించింది. 18 ఏళ్ల లోపు ప్రతీ 8 మందిలో ఒక బాలిక లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిపింది. పిల్లలపై లైంగిక హింసపై మొట్టమొదటిసారిగా ప్రపంచ, ప్రాంతీయ స్థాయిలో రిపోర్ట్ వెలుబడింది. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న బాలికలకు ఈ వేధింపులు జీవితకాల చిక్కుల్ని తెచ్చిపెడుతున్నాయని రిపోర్ట్ వెల్లడించింది.

‘‘నాన్-కాంటాక్స్’’ లైంగిక వేధింపులు.. అంటే ఆన్‌లైన్, మాటరూపంలో వేధింపులకు పాల్పడటం వంటి వాటిని చేర్చితే, వేధింపులు ఎదుర్కొన్న వారి సంఖ్య 65 కోట్లకు పెరుగుతుందని రిపోర్ట్ వెల్లడించింది. ఇలాంటి వేధింపులను ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఐదుగురు బాలికల్లో ఒకరు ఎదుర్కొంటున్నారు. వీటిని నివారించేందుకు సమగ్రమైన నివారణ, వ్యూహాలు, తక్షణ అవసరం అవసరమని నివేదిక నొక్కి చెప్పింది. అన్ని రకాల హింసలు, దుర్వినియోగాలను అరికట్టాలని సూచించింది.

జగన్ పై ఉన్న కోపాన్ని లడ్డూపై చూపించారు.. నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరులో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతల అహంభావం వల్లే సులభంగా విజయం సాధించాల్సిన హర్యానాలో ఆ పార్టీ ఓడిపోయిందన్నారు. జాతీయ రహదారుల సర్వీస్ రోడ్డు కోసం రైతులు భూములు ఇచ్చారుని తెలిపారు. ఆ రైతులు తమ పొలాలకు వెళ్లకుండా రోడ్డుకు గోడ కడుతున్నారు.. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. మరోవైపు.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలే అయింది.. చంద్రబాబు దగ్గర మాయలు, మంత్రాలు లేవు.. అపుడే కూటమి ప్రభుత్వం హడావిడి చేయడం కరెక్ట్ కాదని నారాయణ పేర్కొన్నారు.

డీఎస్పీగా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ బాధ్యతలు స్వీకరణ..

డీఎస్పీ (DSP)గా టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం తెలంగాణ డీజీపీకి రిపోర్టు చేసిన తర్వాత.. సిరాజ్ అధికారికంగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు స్వీకరించారు. సిరాజ్‌కు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా.. మహ్మద్ సిరాజ్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన సంగతి తెలిసిందే.. హైదరాబాద్కు చెందిన స్టార్ బౌలర్ సిరాజ్ కూడా ప్రపంచకప్లో టీమిండియా సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన సిరాజ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా.. సిరాజ్‌కు క్రికెటర్ మహ్మద్ సిరాజ్కు తెలంగాణ ప్రభుత్వం జూబ్లీహిల్స్‌లో 600చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది. అంతర్జాతీయ క్రికెట్లో భారత దేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవాన్ని తెచ్చిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ క్రమంలో.. మహ్మద్ సిరాజ్కు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పుడు.. ఈ రెండు హామీలను ప్రభుత్వం నెరవేర్చింది.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు జీవో విడుదల

ప్రభుత్వం, ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులను ఎంపిక చేయడానికి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు అధికారులను శనివారం సాయంత్రం లోగా కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారిని చైర్మన్‌గా నియమించనున్నారు. కమిటీలో ఇద్దరు స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు, ముగ్గురు పురుషులు సభ్యులుగా ఉంటారు. ఇందులో ఒకరు బీసీ, మరొకరు ఎస్సీ లేదా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు తప్పనిసరిగా ఉండాలి. ఈ కమిటీకి పంచాయతీ కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. మునిసిపాలిటీల్లో కమిటీల వ్యవస్థ కూడా అదే తరహాలో ఉంటుంది. వార్డు ఆఫీసర్ చైర్మన్‌గా పనిచేస్తారు. ఇక్కడ కూడా సభ్యులు, బీసీ , ఎస్సీ సామాజిక వర్గాలకు చెందినవారు తప్పనిసరిగా ఉండాలి.

పిఠాపురం నియోజకవర్గంలో అధికారులు క్షేత్ర స్థాయిలో పని చేయాలి.. ఆదేశం

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌.. తాను ప్రతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. పిఠాపురం నియోజకవర్గంలోని మూడు మండలాల పరిధిలోని 52 గ్రామ పంచాయతీలలో పాఠశాలలు, వైద్యశాలలు, హాస్టల్స్, త్రాగునీరు మరియు పారిశుద్ధ్య సౌకర్యాలపై క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ కు దిశానిర్దేశం చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో అన్ని శాఖలకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలను క్షేత్ర స్థాయిలో అధికార యంత్రాంగం పాల్గొని తనిఖీలు చేపట్టాలని, సమస్యలను గుర్తించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ క్రమంలో.. కాకినాడ జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం, యు.కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల్లోని అన్ని గ్రామాల్లో క్షేత్ర స్థాయి పరిశీలనలో అన్ని విభాగాలకు చెందిన అధికారులు పాల్గొని అక్కడ పరిస్థితుల తనిఖీ చేస్తూ, సమస్యలను గుర్తిస్తూ నివేదికను సిద్ధం చేసేందుకు పనిచేస్తున్నారు. ఈ నివేదికను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలిస్తారు.

ఏపీలో ముగిసిన మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మద్యం షాపులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం.. కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో.. మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తుల ద్వారా స్వీకరించింది. అయితే.. నేటికి దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. గడువు ముగిసే సమయానికి 87,116 దరఖాస్తులు దాఖలయ్యాయి. మద్యం దరఖాస్తుల ద్వారా రూ. 1742.32 కోట్ల మేర ఆదాయం వచ్చింది. 3396 మద్యం షాపులకు వెల్లువలా దరఖాస్తులు అందాయి. మరోవైపు.. జిల్లాల నుంచి ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు సమాచారాన్ని క్రోడీకరిస్తున్నారు. పూర్తి లెక్క తేలేసరికి 86-87 వేల మధ్యన దరఖాస్తులు దాఖలయ్యే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు.

ఈ నెల 16న ఏపీ కేబినెట్ భేటీ..

ఈ నెల 16వ తేదీన ఏపీ కెబినెట్ భేటీ కానుంది. ఈ నెల 10వ తేదీన జరగాల్సిన కెబినెట్‌ అజెండా వాయిదా పడటంతో.. ఆరోజు కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. నిన్న జరిగిన కేబినెట్ రోజు.. రతన్ టాటా చనిపోవడంతో అజెండాను మంత్రి వర్గం వాయిదా వేసింది. కాగా.. ఈ భేటీలో చెత్తపన్ను రద్దు, పీ-4 విధానం అమలు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి అంశాలపై చర్చించనున్నారు. అంతేకాకుండా.. స్వర్ణకారుల కార్పోరేషన్ ఏర్పాటుపై చర్చించి కేబినెట్ ఆమోదం తెలపనుంది. మరోవైపు.. దేవాలయ పాలక మండళ్లల్లో ఇద్దరు బ్రహ్మాణులకు తప్పనిసరిగా చోటు కల్పిస్తూ కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. పోలవరం, అమరావతి నిర్మాణాల పైన కూడా కెబినెట్లో ప్రస్తావించే అవకాశం ఉంది.

తెలంగాణ ప్రజల జీవితాల్లో దసరా పండుగకు ప్రత్యేక స్థానముంది

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని చెడు మీద నిత్యపోరాటం చేస్తూ మంచి దిశగా విజయం సాధించాలనే జీవన తాత్వికతను విజయ దశమి మనకు తెలియజేస్తుందని కేసీఆర్ తెలిపారు. దసరా నాడు శుభసూచకంగా పాలపిట్టను దర్శించి, షమీ వృక్షానికి పూజ చేసి, జమ్మి ఆకును బంగారంలా భావించి పెద్దలకు సమర్పించుకుని వారి ఆశీర్వాదం తీసుకోవడం, గొప్ప భారతీయ సాంస్కృతిక ఆచారమని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో దసరా పండుగకు ప్రత్యేక స్థానమున్నదని అన్నారు. అలాయ్ బలాయి తీసుకుని పరస్పర ప్రేమాభిమానాలను పంచుకోవడం ద్వారా దసరా పండుగ సందర్భంగా ప్రజల నడుమ సామాజిక సామరస్యం ఫరిడ విల్లుతుందని కేసీఆర్ అన్నారు.

హమ్మయ్య.. సేఫ్‌గా ల్యాండ్ అయిన విమానం..141 మంది క్షేమం..

తమిళనాడు తిరుచిరాపల్లి నుంచి షార్జా వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం హైడ్రాలిక్స్ ఫెయిల్యూర్ సమస్యని ఎదుర్కొంది. తాజాగా విమానం తిరుచ్చిలో సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుచ్చి నుంచి టేకాఫ్ అయిన వెంటనే పైలట్ సమస్యను గుర్తించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రకటించారు. విమానంలో మొత్తం 141 మంది ప్రయాణికులతో సాయంత్రం 5.40 గంటలకు టేకాఫ్ అయింది. విమానంలో ఇంధనం భారీగా ఉండటంతో సేఫ్ ల్యాండింగ్ వెంటనే సాధ్యం కాకపోవడంతో తిరుచ్చికి సమీపంలో దాదాపుగా 2.30 గంటలు ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. విమానంలోని ఇంధనాన్ని తగ్గించారు. ఈ లోపు గ్రౌండ్ సిబ్బంది ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కి సిద్ధమయ్యారు. ఎయిర్ పోర్టులో పెద్ద సంఖ్య పారామెడిక్ సిబ్బంది, 20 ఫైర్ ఇంజన్లు, 20 అంబులెన్సులు రెడీ చేశారు. ఎలాంటి ప్రమాదం లేకుండా పైలట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.

సమగ్ర కులగణనపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

తెలంగాణలో సమగ్ర కులగణనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఇప్పటికే ఈ కులగణనకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, శుక్రవారం సమగ్ర కులగణనకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సర్వేను ఇంటింటి కుటుంబాల రిజిస్ట్రేషన్ ద్వారా నిర్వహించనున్నట్లు జీవో విడుదల చేసింది. ఈ సర్వేను ప్రణాళికశాఖకు అప్పగిస్తూ, ముఖ్య కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సర్వేను 60 రోజుల్లో పూర్తి చేయాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సమగ్ర కులగణన ద్వారా రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజల వాస్తవ స్థితిగతులు, వారి వివరాలను శాస్త్రీయంగా సేకరించడం ముఖ్య ఉద్దేశం. ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి మరియు రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించడానికి ఈ కులగణన కీలకమైనది. ఈ ప్రక్రియ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు అవకాశాలను రూపొందించుకోనున్నది. తద్వారా, కులగణన ద్వారా సమాజంలోని అందరికీ సమానమైన అభివృద్ధిని అందించడానికి ముఖ్యమైన దిశగా అడుగు వేయబడింది. ఈ కులగణన ముఖ్యంగా న్యాయమైన విధానం ద్వారా సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలకు నిధులను కేటాయించడానికి ఉపయోగపడనుంది, ఇది రాష్ట్రంలోని పేద వర్గాలకు మరియు పునరావాస పథకాలకు మరింత సహాయపడుతుంది.