Site icon NTV Telugu

Top Headlines @9AM : టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

నేడు ఖమ్మంకు రేవంత్.. ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం..

కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తుంది.. ఇందులో భాగంగానే మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా.. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు ఇవాళ (సోమవారం) కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. భద్రాచలంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మైదానంలో నేటి మధ్యాహ్నం 1 గంటకు నిర్వహించనున్న కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ పథకం కింద సొంత జాగా ఉన్న వారు ఇళ్లు నిర్మించుకోవడానికి 5లక్షల రూపాయల ఆర్థిక సాయం, ఇళ్లు లేని నిరుపేదలకు స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది.

ఉత్తమ సహాయ నటుడిగా రాబర్ట్‌ డౌనీ జూనియర్‌!

సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డ్‌ల వేడుక అట్టహాసంగా మొదలైంది. కాలిఫోర్నియాలోని లాస్‌ ఏంజిల్స్‌ డాల్బీ థియేటర్‌ వేదికగా 96వ అకాడమీ అవార్డ్‌ల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమం హోస్ట్‌గా జిమ్మీ కిమ్మెల్ ఉన్నాడు. క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన బయోగ్రాఫికల్‌ ‘ఒపెన్‌ హైమర్’ అత్యధిక నామినేషన్‌లతో (13) ఆస్కార్‌ అవార్డ్ 2024కు వచ్చింది. పూర్ థింగ్స్ (11), కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ (10) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

‘ఓపెన్‌ హైమర్’ ఈ సీజన్‌లో అత్యధిక అవార్డులను అందుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు సహా ఉత్తమ నటుడి ట్రోఫీని ఆస్కార్‌ అవార్డ్‌ 2024లో సొంతం చేసుకుంటుందని అందరూ భావించారు. ఒపెన్‌ హైమర్‌లో తన నటనకు ఉత్తమ సహాయ నటుడిగా రాబర్ట్ డౌనీ జూనియర్ ఎంపికయ్యారు. ఇదే చిత్రంకు గాను ఉత్తమ ఎడిటింగ్‌ విభాగంలో జెన్నిఫర్‌ లేమ్‌కు అవార్డు దక్కింది. పూర్ థింగ్స్‌ సినిమాకు గాను బెస్ట్‌ హెయిర్‌ స్టయిల్‌ అండ్‌ మేకప్‌ (నడియా స్టేసీ, మార్క్‌ కౌలియర్‌), ఉత్తమ కాస్టూమ్‌ డిజైన్‌ (హోలి వెడ్డింగ్‌టన్‌), బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ (జేమ్స్‌ ప్రైస్‌, షోనా హెత్‌) అవార్డులు వచ్చాయి. అవార్డుల కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు వచ్చిన అవార్డుల జాబితా ఇదే.

మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర.. ఎంతంటే?

బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కాస్త కష్టమే.. నిన్న పెరిగిన ధరలు, ఇవాళ తగ్గుముఖం పట్టాయి.. స్వల్పంగా ధరలు తగ్గాయి.. 10 గ్రాముల గోల్డ్ పై రూ. 10 మేర ధర తగ్గగా.. కిలో వెండిపై రూ.100 మేర తగ్గింది. సోమవారం నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,740, 24 క్యారెట్ల ధర రూ.66,260 గా ఉంది. వెండి కిలో ధర రూ.75,600 లుగా కొనసాగుతోంది… ఇక ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉంటాయో చూద్దాం..

ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.60,890 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.66,410 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.60,740, 24 క్యారెట్ల ధర రూ.66,260, బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.60,740, 24 క్యారెట్ల రేటు రూ.66,260, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.61,490, 24 క్యారెట్ల ధర రూ.67,090గా ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.60,740 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.66,260 గా ఉంది..

నేడు పులివెందుల, ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..!

నేడు పులివెందుల, ఇడుపులపాయలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( Y.S. Jagan Mohan Reddy ) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేయనున్నారు. దాదాపు 1000 కోట్ల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

ఇక, సీఎం పర్యటన వివరాలు ఇలా..
• నేటి ఉదయం 10. 20 కడప ( Kadapa ) ఎయిర్ పోర్టుకు సీఎం జగన్ చేరుకోనున్నారు.. అక్కడి నుంచి 10.25 గంటలకు హెలికాప్టర్లో బయలు దేరి 10.40 పులి వెందులలోని భాకరాపురం హెలిప్యాడ్ కు చేరుకుంటారు. ఇక, 10.45 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలు దేరి 10.55 గంటలకు డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకు చేరుకుంటారు. అక్కడి నుంచి 11.35 వరకు డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత 11.35 గంటలకు రోడ్డు మార్గాన బయలు దేరి 11.45 గంటలకు బనాన ఇంటి గ్రేటెడ్ ప్యాక్ హౌస్ వద్దకు చేరుకుని.. మధ్యాహ్నం 12 గంటల వరకు ప్యాక్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ ఉండనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 12.10 గంటలకు డాక్టర్
వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ వద్దకు చేరుకుని.. 12.25 వరకు కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం గడపనున్నారు.

ఒక పరుగు తేడాతో బెంగళూరు ఓటమి.. ప్లేఆఫ్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌!

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) 2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఆదివారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఒక్క పరుగు తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై ఢిల్లీ గెలుపొందింది. ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇది ఐదో విజయం కాగా.. బెంగళూరుకు నాలుగో ఓటమి. 7 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లతో ఢిల్లీ ప్లేఆఫ్స్‌లో ప్రవేశించింది. ఏడాది ఢిల్లీ రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పటికే ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 5 వికెట్లకు 181 పరుగులు చేసింది. మెగ్‌ లానింగ్‌ (29), షెఫాలీ వర్మ (23) తొలి వికెట్‌కు 54 పరుగులు చేశారు. స్వల్ప వ్యవధిలో లానింగ్‌, షెఫాలీ ఔటైనా.. ఢిల్లీ జోరు తగ్గలేదు. జెమీమా రోడ్రిగ్స్‌ (58; 36 బంతుల్లో 8×4, 1×6), అలీస్‌ క్యాప్సీ (48; 32 బంతుల్లో 8×4) చెలరేగారు. ఇద్దరు ఫోర్లు, సిక్స్‌లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. జెమీమా 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ అందుకుంది. జెమీమా అవుట్ కావడంతో ఢిల్లీ 200 స్కోరు చేయలేకపోయింది. బెంగళూరు బౌలర్ శ్రేయంక పాటిల్‌ (4/26) రాణించింది.

నేడు టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ఉమ్మడి సమావేశం..

ఇవాళ ( సోమవారం ) టీడీపీ – బీజేపీ – జనసేన ( TDP-BJP-Janasena ) కూటమికి చెందిన పార్టీల ఉమ్మడి సమావేశం జరగబోతుంది. ఈ మీటింగ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu ) హాజరుకానున్నారు.. నేటి ఉదయం హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లనున్నారు. ఇక, ఉదయం 11 గంటలకు కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ ( Gajendra singh Shekawat )తో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan kalyan ) సమావేశం కానున్నారు. ఈ భేటీలో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై తీవ్ర కసరత్తులు చేసే అవకాశం ఉంది. ఇక, ఇవాళ మూడు పార్టీల అగ్ర నేతల సమావేశంలో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సైతం పాల్గొనబోతున్నారు.

జేసన్‌ రాయ్‌ ఔట్.. కేకేఆర్‌లోకి విధ్వంసకర ఆటగాడు!

ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్ వ్యక్తిగత కారణాలతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 నుంచి వైదొలిగాడు. దాంతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) ఫ్రాంచైజీ ఎదురుదెబ్బ తగిలింది. రాయ్ స్థానంలో ఇంగ్లండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్‌ను కేకేఆర్‌ జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని ఐపీఎల్‌ తన ఎక్స్‌ ఖాతాలో తెలిపింది. మరోవైపు కేకేఆర్‌ కూడా ఫిలిప్‌ సాల్ట్‌ జట్టులోకి వస్తున్నాడని ట్వీట్ చేసింది.

ఫిల్ సాల్ట్‌ను అతడి రిజర్వ్‌ ధర రూ.1.50 కోట్లకు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టులోకి తీసుకుంది. సాల్ట్‌కు ఇది ఐపీఎల్‌లో రెండో సీజన్‌. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున అతడు ఆడాడు. 2023లో 9 మ్యాచ్‌లు ఆడిన సాల్ట్‌ 218 పరుగులు చేశాడు. సాల్ట్‌కు విధ్వంసకర ఆటగాడిగా పేరుంది. ఇంగ్లండ్‌ తరఫున, లీగ్‌ క్రికెట్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇంగ్లండ్‌ తరఫున సాల్ట్‌ 19 వన్డేలు, 21 టీ20లు ఆడాడు. రెండు ఫార్మాట్‌లో కలిపి 1258 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 5 అర్ద సెంచరీలు ఉన్నాయి. టీ20 ఫార్మాట్‌లో రెండు సెంచరీలు చేయడం విశేషం.

యూఎస్ఏలో అదరగొడుతున్న గామి.. సరికొత్త రికార్డ్ ను అందుకున్న విశ్వక్..

ఇటీవల చిన్న సినిమాగా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి.. అంతేకాదు బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తూ కలెక్షన్స్ ను అందుకుంటున్నాయి.. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సినిమా కూడా దూసుకుపోతుంది.. టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన మూవీ గామి.. చాందిని హీరోయిన్ గా నటించింది.. గతంలో ఎన్నడూ కనిపించని విధంగా ఈ సినిమాలో కనిపించాడు విశ్వక్.. దర్శకుడు విద్యాధర్ కటిగ ఈ సినిమాను చాలా చక్కగా తెరాకెక్కించారు.. ఈ సినిమా కోసం అతడు ఆరేళ్లుగా పని చేశాడు. మొత్తానికి అనుకున్నది సాధించాడు..

ఈ సినిమాను మహా శివరాత్రి కానుకగా విడుదల అయ్యింది.. మొదటి షో తోనే మంచి టాక్ ను అందుకుంది.. కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా అదరగొడుతుంది.. ఇక టీజర్, ట్రైలర్స్ గామి సినిమా అంచనాలు పెంచగా మొదటి షో నుంచే ప్రేక్షకులని మెప్పించింది. ఓ సరికొత్త ప్రయోగాత్మక చిత్రంగా, హాలీవుడ్ విజువల్స్ తో అందర్నీ ఆకట్టుకుంటుంది ఈ సినిమా. ఈ రేంజ్ విజువల్స్ సినిమాని తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కించారు.. ఈ సినిమా ప్రస్తుతం వసూళ్ల సునామి సృష్టిస్తుంది.. తాజాగా ఈ సినిమా వరల్డ్ వైడ్ రెండో రోజు కలెక్షన్స్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే..

నిర్బంధాలతో పాలన సాగిస్తామనుకోవడం వారి భ్రమ

ఎంసీహెచ్ఆర్డీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్లుగా మీ సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం రాలేదు.. ఆవేదన వినేవారు లేక ఇబ్బందులు పడ్డారన్నారు. మీ సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో పొందుపరిచిందని, వాటిని పరిష్కరించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఇన్నాళ్లు సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా ఉన్నది, అధికారంలో ఉన్నది కేసీఆర్ కుటుంబమేనని, నిర్బంధాలతో పాలన సాగిస్తామనుకోవడం వారి భ్రమ అని ఆయన వ్యాఖ్యానించారు. సమస్యలకు పరిష్కారం నిర్బంధాలు కాదు.. చర్చలే.. అని, మీకు విశ్వాసం కల్పించడానికే మీతో చర్చలు జరిపామన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఇప్పటికే మీ సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించామని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచితంగా విద్యుత్ ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానిదని ఆయన పేర్కొన్నారు.

 

Exit mobile version