ఎప్పుడూ మమ్మల్ని తలుచుకోనిదే కేసీఆర్ నిద్రపోడు
తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విజయవాడకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కోదాడకు బయల్దేరి వెళ్లారు. ఆయనతో పాటు ఏపీ కాంగ్రెస్ నేతలు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు.. తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఉన్నారు. డీకే శివకుమార్ కోదాడ, హుజుర్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. మూడు అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం చేస్తానని తెలిపారు. తెలంగాణ మొత్తం మార్పుకోసం చూస్తోందని.. సోనియాకు కృతజ్ఞత చెప్పాలని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. ఇక ఈ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఫాంహౌస్‌లో రెస్ట్ తీసుకోవాల్సిందేనని డీకే శివకుమార్ విమర్శించారు.
కాంగ్రెస్‌కు సంబాని చంద్రశేఖర్ బై..బై
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సంబాని చంద్రశేఖర్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. నాలుగున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధితో, చిత్తశుద్ధితో సేవలందించానని, అయితే పార్టీలో జరుగుతున్న అవమానకర పరిణామాల నేపథ్యంలో బరువెక్కిన మనసుతో పార్టీని వీడాల్సి వచ్చిందని టీపీసీసీ చీఫ్ ఏ రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. పూర్వ ఖమ్మం జిల్లాలో దళిత నాయకుడు చంద్రశేఖర్, కాంగ్రెస్ ప్రభుత్వంలో నాలుగు సార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు మంత్రిగా ఉన్నారు.
ఆయన పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అతను గతంలో SCCL లో క్లర్క్‌గా పనిచేశాడు. వచ్చే ఎన్నికల్లో సత్తుపల్లి అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడారు. తిరస్కరణ టీపీసీసీ నాయకత్వానికి మనస్తాపం కలిగించింది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు గురువారం సత్తుపల్లిలో చంద్రశేఖర్‌ను కలుసుకుని బీఆర్‌ఎస్‌లోకి స్వాగతం పలికారు. త్వరలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో చంద్రశేఖర్ బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. మాజీ ఎమ్మెల్యే వూకే అబ్బయ్య, టీపీసీసీ కార్యదర్శి ఆడవెల్లి కృష్ణ, ఆ పార్టీ నేత రామచంద్రనాయక్‌లు కూడా బీఆర్‌ఎస్‌లో చేరాలని భావిస్తున్నట్లు సమాచారం.
హమాస్ కీలక కమాండర్లను హతమార్చిన ఇజ్రాయిల్.. గాజాలోని అతిపెద్ద ఆస్పత్రిపై దాడి..
హమాస్ మిలిటెంట్ సంస్థను పూర్తిగా నాశనం చేసేదాకా ఇజ్రాయిల్ నిద్రపోయే పరిస్థితి కనిపించడం లేదు. అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై దాడికి తెగబడి భారీ మూల్యాన్ని చెల్లించుకుంటోంది హమాస్. ఆ దాడిలో 1400 మంది ఇజ్రాయిలీ పౌరులను ఊచకోత కోసింది. 200 మందిని బందీలుగా పట్టుకుంది. అప్పటి నుంచి గాజా స్ట్రిప్ పై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) నిప్పుల వర్షం కురిపిస్తోంది. భూతల దాడులతో విరుచుకుపడుతోంది.
తాజాగా గాజాలోని అతిపెద్ద ఆస్పత్రిపై ఇజ్రాయిల్ బలగాలు దాడి చేశాయి. ఈ దాడిలో 13 మంది మరణించినట్లు గాజాలోని హమాస్ ప్రభుత్వం, అల్-షిఫా ఆస్పత్రి డైరెక్టర్ చెప్పారు. అయితే ఈ దాడిపై ఇజ్రాయిల్ వెంటనే స్పందించలేదు. గురువారం ఇజ్రాయిల్ ఈ ఆస్పత్రి సమీపంలో భారీ పోరాటం చేసింది. పదుల సంఖ్యలో హమాస్ మిలిటెంట్లను చంపింది. హమాస్‌కి కీలక స్థావరాలుగా ఉన్న సొరంగాలను నాశనం చేసినట్లు ఇజ్రాయిల్ సైన్యం పేర్కొంది. హమాస్ ఆస్పత్రి మాటున కార్యకలాపాలు నిర్వహిస్తోందని ఇజ్రాయిల్ సైన్యం ఆరోపిస్తోంది. గాజా స్ట్రిప్ పై ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 10,500 మంది కన్నా ఎక్కువ మంది పాలస్తీనియన్లు చనిపోయారు.
బీఆర్ఎస్‌కు బీజేపీకి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది
కోరుట్లో నేడు ధర్మపురి అర్వింద్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. అయితే.. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కు బీజేపీకి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. తెలంగాణ వచ్చిన వెంటనే షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తానని మాట ఇచ్చిన కేసీఆర్… ఇక్కడి రైతులకు మాట ఇచ్చి తప్పారన్నారు. బీఅర్ఎస్ పార్టీ బతికున్నంత వరకు కేసిఆర్, కేటీఆర్ లేదా ఆయన మనుమడు మాత్రమే ముఖ్యమంత్రి అని ఆయన వ్యాఖ్యానించారు.
బీజేపీ 2 శాతం ఓట్లు లేవు ముఖ్యమంత్రి ఎలా అవుతారు అని రాహూల్ గాంధీ అంటాడని, హుజరాబాద్ లో ఎన్ని ఓట్లు వచ్చాయి, దుబ్బాక లో కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాలేదన్నారు. సచ్చి పోయిన కాంగ్రెస్ పార్టీని కొన్ని మీడియా సంస్థలు లేపుతున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాలు పాలించిన పార్టీ కాంగ్రెస్ బీసీ ముఖ్యమంత్రి గానీ ఎస్సీ ముఖ్యమంత్రిని చేయలేదన్నారు ఈటల రాజేందర్. పేరుకే అన్ని వర్గాల పార్టీ అంటారు.. అధికారం మాత్రం ఒకే వర్గానికి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే.. ఈటల రాజేందర్ మాట్లాడుతుండగా సీఎం, సీఎం అంటూ కార్యకర్తల నినాదాలు చేశారు.
రాహుల్ సిప్లిగంజ్ ఆస్ట్రేలియా టూర్..
రాహుల్ సిప్లిగంజ్ ప్రత్యేకంగా పరిచయం అక్కరలేని పేరు. నాటునాటు సాంగ్‌తో ఏకంగా ఆస్కార్ అవార్డ్ విజేతగా నిలిచి భారత సినీలోకానికి పరిచయమయ్యారు. ఆయన ఆస్ట్రేలియాలో భారీ లైవ్ ఫెర్ఫామెన్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఓల్డ్ మాంక్ ఎంటర్‌టైన్‌మెంట్స్, హ్యాష్‌ట్యాగ్ ఇండియా మ్యాగజైన్ మరియు వాసవి గ్రూప్ సహకారంతో రాహుల్ సిప్లిగంజ్ ఆస్ట్రేలియాలో తన మొట్టమొదటి అంతర్జాతీయ ప్రత్యక్ష ప్రదర్శనను ఈ నవంబర్ 25న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోని టింబర్ యార్డ్‌లో ఇవ్వనున్నారు.
ఆస్ట్రేలియాలో దాదాపుగా 2 లక్షల మంది తెలుగు కమ్యూనిటీ ఉంది. వీరికి రాహుల్ సంగీత ప్రదర్శన మరుపురాని అనుభూతి ఇవ్వనుంది. ‘‘ చిచా కా ఆస్ట్రేలియా టూర్’’ పేరుతో అక్కడ అభిమానులతో ఇంటరాక్ట్ అవ్వనున్నారు. ఈ కార్యక్రమం కోసం తాను ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని, తనతో పాటు 17 మంది ఆర్టిస్టుల టీం ఆస్ట్రేలియా వెళ్తున్నామని, ఇది ప్రేక్షకులకు ఒక రకమైన అనుభూతిని ఇస్తుందని రాహుల్ సిప్లిగంజ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ ఈవెంట్‌కి సంబంధించి వాసవి గ్రూప్ ఒక స్పాన్సర్‌గా ఉంది. వాసవి గ్రూప్ తరుపున మార్కెటింగ్ హెడ్ కుస్లవ్ రెడ్డి ప్రెస్ మీట్‌కి హాజరయ్యారు.
దీపావళి రోజు ఆ సమయంలోనే క్రాకర్స్ పేల్చాలి.. హైదరాబాద్ పోలీస్ ఆదేశాలు
దీపావళి సందర్భంగా పటాకులు పేల్చడంపై హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రజలకు మార్గదర్శకాలు జారీ చేశారు. పర్యావరణ అనుకూలమైన, సురక్షితమైన దీపావళిని జరుపుకోవడానికి ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని.. చట్ట అమలుకు సహకరించాలని కోరారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో దీపావళి రోజు రాత్రి 8 నుండి 10 గంటల వరకు క్రాకర్లు పేల్చాలని నోటీసుల్లో తెలిపారు. అంతేకాకుండా.. రోడ్లు, పబ్లిక్ ప్రాంతాలలో రాత్రి 8 నుంచి 10 మధ్య తప్పితే మిగతా సమయాల్లో పరిమితికి మించి శబ్ధం వచ్చే టపాసులు కాల్చొద్దని చెప్పారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలెవరూ మామూలు టపాసులు కాల్చొద్దని కోరారు. దీని వల్ల వాయు, శబ్ద కాలుష్యం పెరుగుతుందని తెలిపారు. బదులుగా గ్రీన్ కాకర్స్ తోనే పండుగ చేసుకోవాలని సూచించారు. ఈనెల 12 నుంచి 15 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపారు. పై ఆదేశాలను ఉల్లంఘించిన ఎవరైనా హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం, 1348 ఫాస్లీ (నం. IX) అమలులో ఉన్న ఇతర సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎవరికి వాళ్లు సీఎం అంటారు ఏంది..? ఇది తప్పు
కామారెడ్డిలో శుక్రవారం కాంగ్రెస్ విజయభేరి యాత్ర – బీసీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎవరికి వాళ్లు సీఎం అంటారు ఏంది..? ఇది తప్పు.. హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాయకులు ఎవరికి వారు సీఎం అని చెప్పుకోవడం మానేయండని ఆయన అన్నారు. ముందు గెలిచి రండి.. తర్వాత సోనియాగాంధీ.. రాహుల్ నిర్ణయిస్తారన్నారు వీహెచ్. కామారెడ్డి లో రేవంత్ ని గెలిపించండని, మజా వస్తుందన్నారు వీహెచ్.
మనం అందరం కలిశామని, బలగం లెక్క విజయం సాధిస్తామన్నారు. ప్రజల్లో ఎవరికి క్రేజు ఉందొ.. ఎవరు పార్టీ కోసం పని చేస్తున్నారో అధిష్టానం చూస్తుందన్నారు వీహెచ్. తెలంగాణ ఉద్యమం సమయంలో కోదండరాం కూడా ఎన్నో ఉద్యమాలు చేస్తే క్రెడిట్ కేసీఆర్ తీసుకున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం మేం కూడా కొట్లాడామన్నారు. తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్, ఆయన కుటుంబం నాంపల్లి దర్గా వద్ద కూర్చొని అల్లాకే నామ్ పే దేదా బాబా… అని అడుక్కునే వారన్నారు. బీసీ డిక్లరేషన్ గురించి మాట్లాడుతూ.. తాము 52 శాతానికి పైగా ఉన్నామని, కాస్త లెక్కతో నిధులు ఇవ్వాలన్నారు.
ఓటు అడగను, మీకు ఇష్టం ఉంటే వేయండి.. ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు
ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం రాలేదు.. పెద్దపాడులో ఓటు అడగనన్నారు. మీకు ఇష్టం ఉంటే వేయండి… అలాగని మీ పనులు ఆపనని మంత్రి ధర్మాన తెలిపారు. నన్ను కాదని మీరు ఓటు వేస్తారా… మే వరకూ నేను ఉంటాను వేయండి చూద్దాం అని అక్కడి జనాలను ఉద్దేశించి అన్నారు. మీరు టీడీపీని గెలిపిస్తే జూన్ నుండి వాలంటీరు రాడు…. ఫించను రాదని తెలిపారు. టీడీపీకి ఓటు వేసేద్దాం అని చెబుతున్నారు.. పెద్దలు ఏమి పెద్దలు రా మీరు అని దుయ్యబట్టారు. త్రీ ఫేజ్ కరెంటు మీ ఊరికి వేయించుకోలేకపోయారని విమర్శించారు. తెలిసి తెలియని పనులు చేయకండి.. మీరు టీడీపీ వాళ్ల మాటల వినకండి అని మంత్రి ధర్మాన తెలిపారు.
కర్ణాటక బీజేపీ కొత్త చీఫ్‌గా యడియూరప్ప కుమారుడు..
కర్ణాటక బీజేపీకి కొత్త చీఫ్ నియమితులయ్యారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర యడియూరప్పను బీజేపీ అధిష్టానం కర్ణాటక కొత్త అధ్యక్షుడిగా ప్రకటించింది. ప్రస్తుతం విజయేంద్ర కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న నళిన్ కటీల్ స్థానంలో విజయేంద్రని కొత్త అధ్యక్షుడిగా బీజేపీ నియమించింది. బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్న విజయేంద్ర అధ్యక్ష నియామకం తక్షణమే అమలులోకి వచ్చేలా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నియామక పత్రంలో పేర్కొన్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తు్న నేపథ్యంలో ఈ మార్పు చోటు చేసుకుంది. అధ్యక్ష పదవిని సీటీ రవి, సునీల్ కుమార్, బసనగౌడ పాటిల్ యత్నాల్ ఆశించారు. వీరితో పోలిస్తే రేసులో విజయేంద్ర ముందున్నారు.
42 మంది ఎమ్మెల్యేలను.. ఎమ్మెల్సీలను కొన్నది కేసీఆర్
ఎమ్మెల్యేలను రేవంత్ కొనాలి అని చూశాడు అని కేసీఆర్ అంటున్నాడని, కొనుగోళ్ల మీద చర్చ కు సిద్ధమా అని సవాల్ విసిరారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. 42 మంది ఎమ్మెల్యేలను.. ఎమ్మెల్సీలను కొన్నది కేసీఆర్ అని ఆయన విమర్శించారు. సబితా ఇంద్రారెడ్డి.. తలసాని ఏ పార్టీలో గెలిచారు.. ఎక్కడ మంత్రి అయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. వాళ్ళందరిని ఎన్ని పెట్టి కొన్నావు కేసీఆర్.. నేను సీబీఐ.. ఈడీకి లేఖ రాస్తా.. నా కేసు.. నువ్వు కొన్న కేసుల మీద విచారణకు సిద్ధమా..? కేసీఆర్ మొగోడే అయితే.. ఎమ్మెల్యే.. ఎంపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ కొనుగోళ్ల పై విచారణకి లేఖ రాయి. లేకపోతే కామారెడ్డి లో ముక్కు నేలకు రాయి అని రేవంత్ రెడ్డి అన్నారు.
నా మీద పోటీకి టీడీపీ నాయకులను వెతుక్కుంటుంది
వైసీపీ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి జరిగిందని పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్ రావు అన్నారు. రూ.149 కోట్లతో అమరావతి – బెల్లంకొండ రోడ్ నిర్మిస్తున్నామని తెలిపారు. గత టీడీపీ హయాంలో సదావర్తి భూములు కాజేయాలని చూసారని… అమరావతి దేవుడి సాక్షిగా ఆ భూములను కాపాడానన్నారు. అంతేకాకుండా.. అచ్చంపేట మండలం సత్తెమ్మ తల్లి ఆలయాన్ని అభివృద్ధి చేశామని.. అటవీ శాఖ అనుమతులు తెచ్చి రోడ్ వేస్తున్నామని తెలిపారు. వైకుంఠపురం ఆలయానికి ఘాట్ రోడ్డు నిర్మాణం చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
గత ఏ ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధి సీఎం జగన్ ఆశీస్సులతో చేస్తున్నామని ఎమ్మెల్యే శంకర్ రావు అన్నారు. అందుకోసమని రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగన్ సీఎం కావాలని ఆయన తెలిపారు. జరుగుతున్న అభివృద్ధి మరింత ముందుకు వెళ్ళాలని కోరారు. గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ, కొమ్మాలపాటి నియోజక వర్గానికి చేసింది ఏం లేదని విమర్శించారు. నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని అన్నారు. తాను చేసిన అభివృద్ధిలో పావలా వంతు కూడా టీడీపీ చేయలేక పోయిందని వ్యాఖ్యానించారు. పులిచింతల బ్యాక్ వాటర్ నుండి క్రోసూరు, అచ్చంపేట, బెల్లంకొండ మండలాలకు తాగు, సాగు నీరు ఇచ్చి తీరుతామని ఎమ్మెల్యే తెలిపారు. తన మీద పోటీ చేయించడానికి టీడీపీ నాయకులను వెతుక్కుంటుందని శంకర్ రావు విమర్శించారు.
కాషాయమయమైన ఎల్బీనగర్.. భారీ జన సంద్రం నడుమ నామినేషన్
ఎల్బీనగర్ కాషాయమయంగా మారింది. భారీ జన సంద్రంతో ఎల్బీనగర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి నామినేషన్ వేశారు. నామినేషన్ కు ముందు హయత్ నగర్ లోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. అనంతరం బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజాసింగ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. బీజేపీ శ్రేణులు, మిత్ర పక్షం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. దీంతో నియోజకవర్గం మొత్తం కాషాయపు జెండాలతో జన సంద్రోహంగా మారింది.
బీసీ, ఎస్సీలను భుజం తట్టి నడిపిస్తున్న వ్యక్తి జగన్…
పల్నాడు జిల్లాలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో మంత్రి విడదల రజనీ, అలీ పాల్గొన్నారు. అందులో భాగంగా మంత్రి మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీలను భుజం తట్టి నడిపిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను రాష్ట్రానికి నాలుగు దిక్కులుగా సీఎం జగన్ భావిస్తారని తెలిపారు. అలాంటి జగన్ ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసే బాధ్యత అణగారిన వర్గాలు తీసుకోవాలని మంత్రి చెప్పారు. మహిషాసురుని సంహరిస్తే దసరా చేసుకుంటాం… నరకాసురుని వదిస్తే దీపావళి చేస్తాం… తరతరాల అణచి వేతను సంహరిస్తే చేసేదే సామాజిక సాధికార యాత్ర అని పేర్కొన్నారు. అమ్మఒడి, జగనన్న గోరు ముద్ద, విద్యా కానుకలు ఇస్తున్నామని.. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారయ్యాయని మంత్రి తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని.. మూడు వేలకు పైగా వ్యాధులకు ఆరోగ్య శ్రీ వర్తింప చేశామని మంత్రి పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంతో ఇంటి వద్దకే వైద్యం అందిస్తున్నామని మంత్రి విడదల రజనీ తెలిపారు.