NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

స్వర్ణాంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది..

ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీల్లో బీజేపీ తరపున సీనియర్ నాయకులు, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు నామినేషన్ వేశారని తెలిపారు. సీఎం చంద్రబాబు సహకారం ఆశీర్వాదం కోరడం జరిగింది.. బీజేపీ సిద్ధాంతంతో పార్టీ విస్తరణ కోరకు నిరంతరం సోము వీర్రాజు సేవలు అందిస్తున్నారు.. ఎమ్మెల్సీ స్థానానికి సరైన అభ్యర్థిగా అతడ్ని ఎన్నుకోవడం జరిగింది.. గతంలో శాసన మండలి సభ్యుడిగా ప్రజా సమస్యలపై పోరాటం చేశారు.. విశేష అనుభవంతో శాసన మండలిలో బీజేపీ అడుగు పెడుతుంది.. సంఖ్య బలం మండలిలో ఉందని వైసీపీ సభ్యులు వస్తున్నారు.. మండలిలో వారు చేస్తున్న అసత్య ప్రచారాన్ని మేము ఎండకడుతున్నాం.. అలాగే, సీనియర్ నాయకులు అయిన సోము వీర్రాజు మాతో పాటు గళం విప్పుతారు.. ఇక, స్వర్ణంధ్ర ప్రదేశ్ ని తీర్చిదిద్దెందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అని మంత్రి సత్య కుమార్ చెప్పుకొచ్చారు.

అసెంబ్లీ వేదికగా మీ బండారాన్ని బయటపెడతాం

మహిళా సంఘాల బ్యాంకు రుణాలకు ప్రజా ప్రభుత్వం వడ్డీలు చెల్లించడం లేదన్న మాజీ మంత్రి హరీష్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పరేడ్ గ్రౌండ్లో మహిళా సభ విజయవంతమైంది. అందుకే కడుపు మంటతో కళ్ళల్లో నిప్పులు పోసుకొని హరీష్ రావు అబద్ధాలు వల్లే వేస్తున్నారన్నారు. మీ ప్రభుత్వంలో మహిళలకు మీరేం చేయలేదని విషయం మహిళలందరికీ తెలుసు అని, వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. మహిళలు అప్పుల పాలవుతున్నారు.. ఆగం అవుతున్నారని హరీష్ రావు ఇప్పుడు మోసలి కన్నీరు కారుస్తున్నారని ఆమె మండిపడ్డారు. మహిళా సంక్షేమం పట్ల మీది దరిద్రమైన పాలన అని ఆమె మండిపడ్డారు. మీ పాలనలో మీ ఆడబిడ్డ కవిత ఒక్కరే ఎదిగారన్నారు మంత్రి సీతక్క. బతుకమ్మ వేడుకలు అయినా, బీసీ ఉద్యమం అయినా, మహిళా ఉద్యమమైనా కవితే హైజాక్ చేస్తారన్నారు. కవిత తప్ప ఏ ఆడబిడ్డ ముందుకు రావద్దు అన్నది టీఆర్ఎస్ లక్ష్యమని, అందుకే లక్ష మంది తరలివచ్చి మహిళా సభను సక్సెస్ చేస్తే మీరు ఓర్వ లేకపోతున్నారని, మీరు ఐదు సంవత్సరాలలో మహిళా సంఘాలకు 3485 కోట్లు చెల్లించాల్సి ఉండగా..కేవలం 409 కోట్లు మాత్రమే చెల్లించారన్నారు మంత్రి సీతక్క.

వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేసిన కోర్టు..

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వంశీని మరోసారి విచారణ చేసేందుకు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్ పై ఎస్సీ, ఎస్టీ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేసింది విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు. ఇక, విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది.

ఈ రాష్ట్రాలకు చల్లటి కబురు.. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు..!

ఎండాకాలం ప్రారంభమైంది. ఉదయం 10 గంటలు దాటిందంటే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. సాయంత్రం 4 గంటల వరకు ఎండలు దంచికొడుతున్నాయి. మార్చిలోనే భారీగా ఎండలు ఉంటే.. ఏప్రిల్, మే నెలలో ఇంకెలా ఉంటాయోనని ప్రజలు భయపడిపోతున్నారు. అయితే ఎండాకాలం ముందు వాతావరణ శాఖ తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌ ప్రాంతాలకు చల్లటి కబురు చెప్పింది. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు పడుతాయని సూచించింది. 2025 మార్చి 10, 12 మధ్య తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం ఉంటుందని తమిళనాడులోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (RMC) అంచనా వేసింది. మార్చి 10న తమిళనాడు తీరప్రాంతంలోని కొన్ని ప్రదేశాలలో తేలికపాటి నుండి మితమైన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మార్చి 11న తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లో చాలా ప్రాంతాల్లో వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. మార్చి 12 నాటికి దక్షిణ తమిళనాడులోని కొన్ని ప్రదేశాలలో వర్షాలు కురుస్తాయని.. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని (RMC) అంచనా వేసింది.

పోసాని కృష్ణ మురళి కస్టడీ పిటిషన్ డిస్మిస్

పోసాని కృష్ణ మురళి కస్టడీ పిటిషన్ ను జే ఎఫ్ సీఎం కోర్టు మేజిస్ట్రేట్ డిస్మిస్ చేశారు. పోసానిని కస్టడీకి ఇవ్వాలని 6వ తేదీ జే ఎఫ్ సీఎం కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. ఈ క్రమంలో 7వ తేదీ ఆదోని కోర్టులో కస్టడీ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది మేజిస్ట్రేట్ కోర్టు. ఇక ఇవాళ పిటిషన్ డిస్మిస్ చేస్తూ తీర్పు చెప్పారు. ఇక కాసేపట్లో బెయిల్ పిటిషన్ పై కూడా తీర్పు చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. పోసాని బెయిల్ పిటిషన్ పై నాలుగు రోజులపాటు విచారణ కొనసాగింది. గత ప్రభుత్వంలో పోసాని ఏపీ ఫిలిం టెలివిజన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పని చేశారు. ఆ సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తోపాటు వారి కుటుంబ సభ్యులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆయన. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో పోసానిపై పలువురు కంప్లైంట్స్ చేశారు. దీంతో పోసానిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా పాడి రైతులు ధర్నా చేస్తున్నారు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాడి రైతులు ధర్నా చేస్తున్నారు అని వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.. సహకార డైరీలను మూత వేయాలని టీడీపీ ప్రభుత్వం చూస్తుంది.. అలాగే, చిత్తూరు డైరీ మూత పడటానికి చంద్రబాబే కారణం అని ఆరోపించారు. మాక్స్ యాక్ట్ తో ప్రైవేటు డైరీలను సొంత వ్యక్తులకు కట్టబెట్టారు.. ఇంత జరుగుతున్నా మంత్రి అచ్చెన్నాయుడు స్పందించడం లేదు అని ఆయన మండిపడ్డారు. పశు సంవర్థక శాఖ మంత్రిని పశువు అని నేను మాట్లాడను.. ఆవులు అమ్మెయ్యాల అనే దానిపై ఒకసారి చర్చించండి అని పేర్కొన్నారు. కేబినెట్ లో కేసులు ఎవరిపై పెట్టలో అనే దానిపై చర్చిస్తారు తప్ప.. పది మంది రైతులకు మంచి చేద్దాం అనే దానిపై చర్చించడం లేదు అని సీదిరి అప్పలరాజు అన్నారు.

ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం కాదు రైతులను ఆదుకోవాలి..

అనకాపల్లి జిల్లాలోని చోడవరంలో గల షుగర్ ఫ్యాక్టరీ రైతులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చెరుకు రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, బుడి ముత్యాల నాయుడు, కరణం ధర్మశ్రీ, అదీప్ రాజ్. ఇక, వైఎస్ఆర్సీపీ నేతల ముందు తమ కష్టాలను రైతులు వినిపించారు. కాగా, మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతుల కోసం వైఎస్సార్ సీపీ నిరసన దీక్ష చేస్తామన్నారు. శాసన మండలలో రైతుల సమస్యలను లేవనెత్తుతాం.. రైతుల బకాయిలను ఆణా పైసాతో సహా చెల్లించాలని డిమాండ్ ఆయన డిమాండ్ చేశారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ పరిధిలో లక్ష 70 వేల టన్నుల చెరకు పండింది.. ఇప్పటి వరకు కనీసం 70 టన్నుల చెరకు కూడా క్రస్సింగ్ చేయలేదు అని ఆరోపించారు. షుగర్ ఫ్యాక్టరీ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది అని బొత్స అన్నారు.

మీ పాలనంత 20-20 విధానంతో నడుస్తుంది

జనగామ జిల్లా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. హరీష్ రావు మాట్లాడుతూ, ఇది ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యం వల్లే పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. దేవాదుల ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో మోటార్లు పనిచేయలేదని, చెరువులు నింపుకోలేకపోవడంతో రైతుల పంటలు తీవ్ర నష్టానికి గురయ్యాయని ఆరోపించారు. “ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గ్రహం పట్టినట్లుంది,” అంటూ హరీష్ రావు విమర్శించారు. పాలనలో అనుభవం లేకపోవడం వల్ల, వ్యవస్థలను కూల్చేసే విధంగా ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. “మీ పాలన 20-20 విధానంతో నడుస్తోంది. ఏ పని కావాలన్నా 20% కమిషన్ కట్ చేయాలి,” అంటూ ఆయన ఆరోపించారు.

13 మందికి భూకేటాయింపులు రద్దు చేస్తున్నాం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో భూ కేటాయింపులపై సబ్ కమిటీలో కీలక చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాజధానిలో సంస్థలకు భూ కేటాయింపులపై ప్రధానంగా చర్చ జరిపారు. ఈ సందర్భంగా పురపాలక , పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కేటాయించిన భూములను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక, ఆ 13 సంస్థలకు కేటాయించిన భూములను క్యాన్సిల్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం రాజధానిని పక్కన పడేసిందని ఆరోపించారు. అలాగే, గతంలో అప్లై చేసుకున్న 31 మందికి భూ కేటాయింపులు చేస్తామన్నారు. న్యాయపరమైన చిక్కులు తొలిగిన తర్వాత పనులు జరుగుతాయి అన్నారు. దీంతో పాటు మరో 16 సంస్థలకు చెందిన భూములకు లొకేషన్, ఎక్స్ టెన్షన్ మార్పులు చేసినట్లు చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం కక్షసాధింపుతో రాజధానిపై మూడు ముక్కలాట ఆడిందని మంత్రి నారాయణ ఆరోపించారు.

నేను చేసిన సేవలకు ఇది ప్రజలు ఇచ్చిన గుర్తింపు

తెలంగాణలో ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. కాంగ్రెస్ పార్టీ తరఫున అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్, విజయశాంతి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడిన అద్దంకి దయాకర్, తనకు ఎమ్మెల్సీగా అవకాశం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. “నా ఎంపికను ఎంతో మంది వారి కుటుంబాల్లో ఓ విజయంగా భావిస్తున్నారు. నేను చేసిన సేవలకు ఇది ప్రజలు ఇచ్చిన గుర్తింపు,” అని వ్యాఖ్యానించారు. అయితే, తనకు ఈ అవకాశం ఆలస్యంగా వచ్చినా, ప్రజా సేవను అదనపు బాధ్యతగా స్వీకరిస్తానని పేర్కొన్నారు. “ఎమ్మెల్సీ అవకాశం రాకపోయినా నేను ప్రజల కోసం పోరాడుతూనే ఉంటా. ప్రజల ప్రేమ, అండ లేకుండా నేను బతకలేను” అని స్పష్టం చేశారు. “మంత్రి పదవి దక్కుతుందా?” అనే ప్రశ్నకు అద్దంకి దయాకర్ స్పందిస్తూ, “ఇది కేవలం వార్తల వరకే పరిమితం. మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం అధిష్టానం చేతిలో ఉంది” అని అన్నారు.