ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం.. అందులో జోక్యం చేసుకోలేం
ఇజ్రాయెల్- హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి సంబంధించిన అంశంపై దాఖలైన పిటిషన్‌ను ఇవాళ (సోమవారం) సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఇజ్రాయెల్‌కు భారత్ ఆయుధాలు, మిలిటరీ పరికరాల ఎగుమతి చేయడాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. దేశవిదేశాంగ విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొనింది.
పవన్ కళ్యాణ్ ‘వినాయకుడు’.. మీ అభిమానం సల్లగుండా!!
ఈ మధ్యకాలంలో ట్రెండ్ అవుతున్న సినిమాల్లో హీరోని పోలినట్లుగా వినాయకుడి విగ్రహాలు చేసి వినాయక చవితి ఉత్సవాలు జరుపుతూ రావడం ఆనవాయితీగా మారింది. ఒక్కరని కాదు తెలుగులో చాలామంది హీరోలను అనుకరిస్తూ వినాయకుడి విగ్రహాలు చేశారు. అయితే ఆ విషయంలో హిందూ సంఘాల వారు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో జరుపుకున్న వినాయక చవితి ఉత్సవాలలో పవన్ కళ్యాణ్ ను పోలిన వినాయకుడిని ప్రతిష్టించారు. గతంలో జాలర్ల కోసం పవన్ కళ్యాణ్ ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఒక చేతిలో వల మరో చేతిలో జాలరి గంప పెట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇప్పుడు అదే ఫోటోను ఆధారంగా చేసుకుని ఒక విగ్రహాన్ని తయారు చేసి వినాయక చవితి ఉత్సవాలు జరిపారు అక్కడి ఫిషింగ్ హార్బర్ వర్కర్లు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుంటే మరికొందరు మాత్రం ఇదేం పిచ్చి అని అంటూ కామెంట్ చేస్తున్నారు. దేవుడికి ఇలాంటి వింత ఆకారాల్లో విగ్రహాలు పెట్టడం తగదని కామెంట్ చేస్తున్నారు,
రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హత కల్గిన రైతులందరికీ రుణమాఫీ
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హత కల్గిన రైతులందరికీ రుణమాఫీ అవుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో ఆయన పర్యటించారు.. మండలంలో ఇంటివల మరణించిన పలువురి మృతుల కుటుంబాలను పరామర్శించారు. గంగారం మోడల్ స్కూల్, ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెల్సుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..రుణమాఫీ పై కొంత మంది ప్రతిపక్ష నాయకులు సాంకేతిక పరంగా బ్యాంక్ లలో ఏర్పడిన సమస్యలను అనువుగా చేసుకొని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని,అలాంటివి మానుకోవాలని అన్నారు.
హైడ్రా వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
కాకినాడ జిల్లా గొల్లప్రోలు ముంపు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఏలేరు వరద ముంపు కారణంగా గొల్లప్రోలులో నీట మునిగిన జగనన్న కాలనీ , పంట పొలాలను ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించారు. ముఖ్యంగా ఏలేరుకు దిగువన గల సుద్దగడ్డవాగుకు వరద పోటెత్తడంతో స్థానిక కాలనీలు అన్నీ నీటిలో మునిగిపోయాయి. పడవలో వెళ్లి ముంపు ప్రాంతాలను పవన్ పరిశీలించారు. సుద్ధగడ్డ వాగు సమస్యకు ఇక్కడి ఎమ్మెల్యేగా పూర్తి స్థాయి పరిష్కారం చూపుతానని పవన్ కల్యాణ్ స్థానికులకు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో చేసిన తప్పులకు ప్రజలు నష్టపోయారన్నారు. ఆ తప్పులను కూటమి ప్రభుత్వంలో మేము సరి చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఏలేరు రిజర్వాయర్ వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించి తగు సూచనలు ఇస్తున్నామన్నారు. ప్రజల బాధలు స్వయంగా పరిశీలించేందుకే ఆరోగ్యం సరిగా లేకపోయినా క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చానని చెప్పారు. గత ప్రభుత్వంలో పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం అయ్యే పరిస్థితి వచ్చిందని.. కష్టాల్లో ఉన్న పంచాయతీలను ఆదుకోవడం బాధ్యతగా తీసుకున్నానని పవన్ పేర్కొన్నారు.
రేపు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పు..
లిక్కర్ సీబీఐ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై రేపు తీర్పు వెలువడనుంది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పును జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ల ధర్మాసనం వెలువరించినుంది. కాగా.. ఇంతకుముందు ఢిల్లీ లిక్కర్ సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.. గతవారం కేజ్రీవాల్ పిటిషన్ పై సుదీర్ఘంగా వాదనలు సాగాయి. ఇంకా ఏమైనా వాదనలు వినిపించాల్సి ఉంటే, లిఖిత పూర్వకంగా కోర్టుకు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో.. కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. సిబీఐ తరపున ఎస్వీ రాజు (అడిషనల్ సొలిసిటర్ జనరల్) వాదనలు వినిపించారు. ఈ క్రమంలో.. ఈ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వద్దంటూ సీబీఐ వాదనలు వినిపించింది. దీంతో.. ఆగస్టు 5న కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. కాగా.. లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కేజ్రీవాల్ జూన్ 26న అరెస్ట్ అయ్యారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తోంది
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. PAC చైర్మన్ పదవి ప్రధాన ప్రతిపక్షంకి ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆర్కె పూడికి ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. లోక్ సభలో PaC చైర్మన్ KC వేణుగోపాల్ కి ఇవ్వలేదా అని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ భారత రాజ్యాంగాన్ని పట్టుకుని లోక్ సభలో మాట్లాడతారని, రాహుల్ గాంధీకి రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల గురుంచి 16 వ ఆర్థిక సంఘానికి నివేదిక ఇచ్చామని, కేసీఆర్ హయంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని వివరించామన్నారు హరీష్ రావు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావల్సిన 41 శాతం వాటలో 31 శాతం మాత్రమే వస్తుందన్నారు హరీష్ రావు. నిబంధనల ప్రకారం రావాల్సిన నిధులు కూడా రావడం లేదని కమీషన్ కు వివరించామన్నారు. ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం కేంద్రం నిధులు కేటాయించిక పోవడం రాజ్యాంగాన్ని తక్కువ చేయడమే అని ఆయన అన్నారు.
సహాయక చర్యల్లో గాయపడిన కానిస్టేబుల్‌కు రూ.2 లక్షల ఆర్థిక సాయం
విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొని, రోడ్డు ప్రమాదంలో గాయపడిన సెబ్ కానిస్టేబుల్ మొరు నాగరాజుకు రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. విజయవాడ ఆయుష్ ఆస్పత్రికి వెళ్లి ఐసీయూలో చికిత్స పొందుతున్న నాగరాజును మంత్రి పరామర్శించారు. వైద్యులను అడిగి చికిత్స వివరాలు తెలుసుకున్నారు. నాగరాజు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. వరద బాధితులకు అండగా నిలిచేందుకు వెళ్లి ప్రమాదం బారిన పడడం బాధాకరమన్నారు. గాయపడిన నాగరాజుకు అన్ని రకాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని నాగరాజు కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయం ఇప్పట్లో లేనట్లే..?
ఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన 54వ జీఎస్టీ కౌన్సిల్ భేటీలో దీనిపై విస్తృతంగా చర్చ జరిగింది. హెల్త్, లైఫ్ ఇన్సురెన్స్ ప్రీమియంలపై జీఎస్టీని తగ్గించే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత కీలక ప్రకటన చేసే ఛాన్స్ కనిపిస్తుంది. వీటిపై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీని కేంద్ర సర్కార్ విధించింది. దీనిని తగ్గించే విషయంపై జీఎస్టీ కౌన్సిల్‌లో ఏకాభిప్రాయం వచ్చింది.. అయితే తదుపరి భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, కేంద్ర, రాష్ట్రాలకు చెందిన పన్ను అధికారులతో కూడిన ఫిట్‌మెంట్ కమిటీ ఈరోజు లైఫ్, హెల్త్, రీ ఇన్సురెన్స్ ప్రీమియంలపై జీఎస్టీని తగ్గిస్తే కలిగే లాభ నష్టాలను జీఎస్టీ కౌన్సిల్ ముందుకు తీసుకొచ్చింది. జీఎస్టీ తగ్గింపుపై ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ తదుపరి సమావేశంలో తుది నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉందని సంబంధిత వర్గాల అధికారులు తెలిపారు. అలాగే, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో హెలికాప్టర్ సేవలపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని సమాచారం.
తెలుగు సినిమా పాటతో కమలా హారిస్ ఎన్నికల ప్రచారం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తెలుగు సినిమాలోని పాట మార్మోగుతోంది. ఏడాది చివరిలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ బరిలో ఉన్నారు. నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక కమలా హారిస్ వ్యూహాత్మకంగా ప్రచారంలోకి దూసుకెళ్తున్నారు. దక్షిణాసియా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆమె సరికొత్త వ్యూహం రచించారు. ఆమె ప్రచారం బృందం తెలుగు పాటతో రూపొందించిన ఓ వీడియోను విడుదల చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ పాట హిందీ వెర్షన్ మ్యూజిక్ ట్రాక్ ఆధారంగా కమలా హారిస్ ప్రచార గీతాన్ని రూపొందించారు. వీడియోను ఇండియన్-అమెరికన్ వ్యవస్థాపకుడు అజయ్ భూటోరియా సోషల్ మీడియాలో విడుదల చేశారు.
గణేష్ నిమజ్జనంలో అపశృతి.. ముగ్గురు మృతి
దేశంలో అన్ని పండగల కన్నా గణేష్ చతుర్థిని అందరూ చాలా ఇష్టంగా జరుపుకుంటారు. నవరాత్రుల ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు ఎంతో హడావిడిగా ఉంటుంది. ఈ పండుగ వేళ కొన్ని ప్రాంతాల్లో అపశృతి చోటుచేసుకుని.. కొన్ని కుటుంబాలకు తీరని శోకం మిగులుతోంది. తాజాగా కొన్ని ప్రాంతాల్లో అపశృతి చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా పెద్దమండెం మండలం పాపేపల్లి వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. వినాయకుడి నిమజ్జనానికి వెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి చెందగా.. 10 మంది తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.