NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

ఏఐ (AI) కెమెరాలతో భారత సరిహద్దులో నిఘా..చొరబాటుదారుల కట్టడికి యత్నం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో కూడిన కెమెరాలతో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రత్యేక కెమెరాలను సరిహద్దు భద్రతా దళం (BSF) భద్రతను పెంచడానికి, చొరబాటుదారులను నిరోధించడానికి వినియోగిస్తోంది. కెమెరాలు, ఫేషియల్ రికగ్నిషన్ పరికరాలతోపాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సరిహద్దుల్లో నిఘా పెంచామని బీఎస్ఎఫ్ అధికారులు చెబుతున్నారు. ఇది చొరబాట్లు, నేరాలు, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధిస్తుంది. సరిహద్దు పోస్టుల వద్ద బలగాల సంఖ్యను పెంచామని, ఆ ప్రాంతాల్లోని బ్రోకర్లు, స్మగ్లర్ల నెట్‌వర్క్‌ను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు ప్రారంభించామని త్రిపుర ఫ్రాంటియర్‌లోని BSF ఇన్‌స్పెక్టర్ జనరల్ తెలిపారు. చోరబాటు కార్యకలాపాలకు వ్యతిరేకంగా జీరో-టాలరెన్స్ పాలసీని బీఎస్ఎఫ్ కలిగి ఉంది.

పవన్‌ కల్యాణ్‌తో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి భేటీ

జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. పవన్ కల్యాణ్ ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి పల్లా శ్రీనివాసరావు వెళ్లారు. గంటన్నర పాటు ఆత్మీయ సమావేశం సాగింది. రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం ద్వారా రాష్ట్రానికి అత్యంత ప్రయోజనం కలిగేలా వ్యవహరించాలని ఇరు పార్టీ నేతలు నిర్ణయించారు. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పార్టీ శ్రేణుల్లో ఎక్కడ పొరపొచ్చాలు లేకుండా నేతలు వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రజలు రాక్షస పాలన అంతమొందించాలని కూటమికి ఇచ్చిన ఆదరణను మరింత పెంపొందించుకొని నిలబెట్టుకునేలా క్షేత్రస్థాయిలో వ్యవహరించాల్సిన అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.

హెచ్‌ఐవీకి ఇంజెక్షన్..! రెండేళ్లలో వ్యాధి నుంచి విముక్తి..

హెచ్‌ఐవీలో ప్రపంచంలోనే అగ్ర స్థానంలో ఉన్న భారతదేశంలో లక్షల మంది బాధితులు ఉన్నారు. 2004 నుంచి భారతదేశం యాంటీ రెట్రోవైరల్ ఔషధాలను ఉచితంగా సరఫరా చేస్తోంది. ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసే ఎయిడ్స్ ఔషధాల పై కొన్ని వేల మంది హెచ్ ఐవీ బాధితులు ఆధారపడుతున్నారు. చాలా మంది ఈ వ్యాధి బారిన పడి ప్రాణాలు వదులుతున్నారు. దానికి సరైన డోస్ లేకపోవడమే కారణం. తాజాగా దక్షిణాఫ్రికా, ఉగాండాలో జరిగిన ఓ పెద్ద క్లినికల్ ట్రయల్లో కొత్త ఫ్రీ-ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ డ్రగ్‌ని సంవత్సరానికి ఒకసారి చొప్పున రెండేళ్లు తీసుకుంటే యువతులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ నుంచి విముక్తి లభిస్తుందని వెల్లడైంది.

పార్టీకి పవర్ లేదు కావచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీ బలమైన పార్టీ

మహిళ ప్రజాప్రతినిధులందరికి రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు ఉన్నాయని మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. నా చిన్నప్పటి నుండి నేను మంత్రులు ఎమ్మెల్యేల క్వాటర్స్ లో ఉండి పెరిగాను, ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని పొరపాట్లు జరిగాయని, టీఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ గా మార్చడం పట్ల నా తప్పు కూడా ఉంది రాబోయే రోజుల్లో మళ్ళీ తెలంగాణ అంశం లేవనెత్తే అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీకి పవర్ లేదు కావచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీ బలమైన పార్టీ అని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీలో యువకులకు మంచి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ ను కోరా అని వినోద్‌ కుమార్‌ తెలిపారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గులాబి జెండా ఎగరవేస్తమని, కేంద్రంలో పులి లా ఉన్న మోడీ పిల్లిలా మారిండన్నారు వినోద్‌ కుమార్‌. ప్రాంతీయ పార్టీల భవిష్యత్తును ఏ నాయకుడు మర్చలేదని ఆయన అన్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ పార్టీ కోసం నాయకులు పనిచేయాలని, ప్రతిపక్ష పార్టీలు మీదనే ఎక్కువ ఆశలు ప్రజలకు ఉంటాయన్నారు. అన్ని డ్యాములు ఎండిపోయాయని.. నీళ్లు లేక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. పార్టీలో ఉన్నవారిని ఆదుకుంటామని.. యువతకు పెద్దపీట వేస్తామన్నారు. కరీంనగర్ అంటే కేసీఆర్‌కు ఇష్టం, ప్రతి ఒక్కరూ కూడా కలిసి కట్టుగా పనిచేయాలని కోరారు.


జగన్నాథ రథయాత్ర ప్రారంభం..హాజరైన రాష్ట్రపతి..

ఒడిశాలోని పూరీధామ్‌లో జగన్నాథ రథయాత్ర కొనసాగుతోంది. జగన్నాథ స్వామివారితో పాటు సోదరుడు బలభద్ర.. సోదరి సుభద్ర ఉత్సవమూర్తులను రథం ఎక్కించారు. ఆలయం నుంచి బయలుదేరిన మూడు రథాల ఊరేగింపు ప్రారంభమైంది. మొదట స్వామివారి అత్త గుండిచా దేవి ఇంటికి రథాలు చేరుకుంటాయి. పూరీ జగన్నాథుని రథయాత్రను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రయాణానికి ముందు, మూడు రథాలు కూడా సింగ్ గేట్ అని కూడా పిలువబడే జగన్నాథ దేవాలయం తూర్పు ద్వారం ముందు ఆపివేయబడ్డాయి. ఇక్కడే శ్రీ మందిరం నుంచి దేవుడి విగ్రహాలను తీసుకొచ్చి రథాలపై ఎక్కించారు. ఇక్కడి నుంచి గుండిచా ఆలయానికి తీసుకెళ్తున్నారు. దీని తర్వాత స్వామి వారం రోజుల పాటు గుండిచా ధామ్‌లో ఉంటారు. ఎనిమిది రోజుల తర్వాత జగన్నాథుడు పూర్తిగా పూరీకి తిరిగి రావడంతో రథయాత్ర ముగుస్తుంది.


సీఎం రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి హరీష్‌ రావు బహిరంగ లేఖ

రాష్ట్రంలో గాడి తప్పుతున్న ప్రభుత్వ విద్యావ్యవస్థ, పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం అంటూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు బహింగలేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్టం చేయడానికి అనేక చర్యలు తీసుకున్నారని హరీష్‌ రావు అన్నారు. పాఠశాల విద్య మొదలుకొని ఉన్నతవిద్య వరకు సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యమిచ్చారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాత్రం, ప్రభుత్వ విద్యావ్యవస్థపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదన్నారు. అరకొర వసతులు, టీచర్ల కొరత, పాఠ్యపుస్తకాల కొరత, దుస్తుల కొరత, తాగునీటి కొరత, వేతనాల చెల్లింపు ఆలస్యం వంటి సమస్యలు తెలంగాణ విద్యావ్యవస్థను పట్టిపీడిస్తున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు.

నేపాల్‌లో భారీగా వరదలు.. 47 మంది మృతి

నేపాల్‌ను వరదలు ముంచెత్తాయి. నేపాల్‌లో ఒక నెలలోపే 47 మరణాలు నమోదయ్యాయి. వరదలు, కొండచరియలు విరిగిపడటం, పిడుగులు దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించాయి, నేపాల్ హోం మంత్రిత్వ శాఖ ప్రకారం ప్రాణనష్టంతో పాటు గణనీయ ఆస్తి నష్టం వాటిల్లింది. శుక్రవారం జరిగిన జాతీయ అసెంబ్లీ సమావేశంలో మంత్రి డోల్ ప్రసాద్‌ ఆర్యల్.. వరదల వల్ల సంభవించిన నష్టం గురించి వివరించారు. సమావేశంలో సామాజిక భద్రతా మంత్రి డోల్ ప్రసాద్ ఆర్యల్ మాట్లాడుతూ, “ఇప్పటి వరకు మొత్తం 55 వరద సంఘటనలు నమోదయ్యాయి. ఇందులో 4 మంది మరణించారు. ఒకరు వరదలో కొట్టుకుపోగా… ఇద్దరు గాయపడ్డారు, కొండచరియలు విరిగిపడటంతో 24 మంది వ్యక్తులు మరణించారు. 46 మంది గాయపడ్డారు. 36 ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయి, దేశంలోని 32 జిల్లాలు ప్రభావితమయ్యాయని మంత్రి తెలిపారు.

కార్పొరేట్ స్కూల్స్‌ విద్యార్థులకు ఈ-సిగరెట్స్ అమ్మకాలు

హైదరాబాద్‌ కార్పోరేట్‌ స్కూళ్లలో మైనర్ విద్యార్థులకు ఈ-సిగరేట్లు అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. పాతబస్తీలో యువకుడిని అరెస్ట్‌ చేశారు నార్కోటిక్‌ పోలీసులు. కాలాపత్తర్‌లో మైనర్ విద్యార్థులకు ఈ-సిగరెట్లు, వ్యాప్‌లు విక్రయిస్తున్న వ్యక్తిని నగర పోలీసులు అరెస్టు చేశారు. ఖాజా నగర్‌లోని ఆయన నివాసంలో రూ.8 లక్షల విలువైన ఈ-సిగరెట్లు, వ్యాప్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు మహ్మద్ జాఫర్ (25) రాపిడోలో రైడర్‌గా పనిచేస్తున్నాడు. అతను ఈ-సిగరెట్ల సరఫరాదారు అహ్మద్‌తో పరిచయం ఏర్పడి, అది లాభదాయకమైన వ్యాపారమని తెలుసుకున్నాడు. వివిధ బ్రాండ్ల ఈ-సిగరెట్ల జాబితాను వారి వాట్సాప్ నంబర్‌లకు పంపడం ద్వారా నిరుపేద కస్టమర్లు , విద్యార్థులను ఆకర్షించేవాడని పోలీసులు తెలిపారు. కస్టమర్ల నుండి ధృవీకరణను స్వీకరించిన తర్వాత అతను దానిని వారి ఎంపిక చేసిన ప్రదేశాలలో డెలివరీ చేస్తాడు , Paytm లేదా PhonePe ద్వారా డబ్బును స్వీకరిస్తాడు. ఈ-సిగరెట్స్‌ అమ్ముతున్న నిందితుడు జాఫర్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. రూ.లక్ష విలువైన 55 బాక్స్‌ల్లో 538 ఈ-సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు.

రేపటి నుంచి ఏపీలో ఉచిత ఇసుక.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రేపటి (సోమవారం) నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రాబోతుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు ఈ ఉచిత ఇసుక విధానానికి సంబంధించిన కార్యాచరణను రెడీ చేశారు. ముందుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంప్‌ల నుంచి ఇసుకను అందిస్తారు. అయితే, ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా ఇసుకను అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఉచిత ఇసుకపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రేపటి నుంచి ఉచిత ఇసుక అమ్మకంప్రారంభం అవుతుందని.. 43 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక సిద్ధంగా ఉందన్నారు. 3 నెలల్లో కోటి టన్నుల ఇసుకను అందించటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 120 స్టాక్ మార్కెట్లలో ఇసుక అందిస్తున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వం టన్ను 475కి ఆన్లైన్‌లో అమ్మిందని.. ఆ వెబ్ సైట్ పనిచేయక బ్లాక్ మార్కెట్‌లో ఇసుక దొరికే పరిస్థితి వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం ఉచితంగా ఇసుకను ఇస్తోందన్నారు. దీనిద్వారా నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.

6 ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి.. తక్కువ ఖర్చు.. రైతులకు మేలు

రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత తొందరగా వినియోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి సంకల్పించారు. ఇప్పటికే నిధులు ఖర్చు పెట్టినవి.. అసంపూర్తిగా ఉన్నవి.. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన సాగునీటి ప్రాజెక్టులను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటిలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. అటు గోదావరి బేసిన్ తో పాటు ఇటు కృష్ణా బేసిన్ లో అర్థాంతరంగా ఆగిపోయిన ​ ప్రాజెక్టుల వివరాలన్నీ ఇరిగేషన్​ ఇంజనీర్ల నుంచి ఆరా తీశారు. రైతులకు సాగునీటిని అందించాలంటే ఆయకట్టు భూములకు నీళ్లను పారించే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.