NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

గుండెపోటుతో 8 ఏళ్ల బాలిక మృతి.. స్కూల్‌లోనే కుప్పకూలిన చిన్నారి..

ఒకప్పుడు గుండెపోటు అంటే వయసు పైబడిన వారికి వస్తుందని అనుకునే వాళ్లం. కానీ, ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా రావడం ఆందోళనలు పెంచుతోంది. ఇటీవల పలు సందర్భాల్లో యుక్త వయస్కులు గుండెపోటుకు గురై మరణించారనే వార్తలు వింటూనే ఉన్నాం. చివరకు స్కూల్ పిల్లలు మరణించడం సమస్య తీవ్రతను పెంచుతోంది.

ఈ దాడి రేవంత్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ ప్లానే

ఇవాళ బీజేపీ కార్యాలయంలోపై కాంగ్రెస్‌ శ్రేణులు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ దాడిపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై గూండాలు రౌడీషీటర్లు కాంగ్రెస్ కార్యకర్తల ముసుగులో దాడి చేశారని, ఈ దాడికి రేవంత్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ బాధ్యత వహించాలన్నారు రఘునందన్‌ రావు. నిన్న ఒకే వేదికపై ఓవైసీ సోదరులతో వేదిక పంచుకోగానే రేవంత్ రెడ్డి అక్కడే ఈ దాడికి పథకాన్ని రచించారని, గతంలో తమ సొంత ముఖ్యమంత్రిని దించడం కోసం చెప్పులు వేయడం మత కల్లోలాలు సృష్టించడం వారి చరిత్రలో భాగమే అని ఎంపీ రఘునందన్‌ రావు ఆరోపించారు. బీజేపీ కార్యాలయంపై పోలీసులే దగ్గరుండి దాడి చేయించినట్టుగా కనబడుతున్నదని, ఢిల్లీలో మా మాజీ ఎంపీ పొరపాటున దొర్లిన ఒక పదానికి వెంటనే వెనక్కి తీసుకొని తన హుందాతనాన్ని ప్రదర్శించారన్నారు.

సీఎం బంగ్లా మరోసారి రద్దు.. ప్రజల ఇళ్లల్లోనే ఉంటానన్న అతిషి

దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల నగారా మోగింది. మంగళవారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 5న ఒకే విడతలో హస్తినలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు విడుదలకానున్నాయి. అయితే ఢిల్లీలో షెడ్యూల్‌కు ముందు నుంచే ఎన్నికల ఫీవర్ వచ్చేసింది. ప్రధాన పక్షాలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ముఖ్యమంత్రి అతిషి.. కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు కేటాయించిన బంగ్లాను మరోసారి కేంద్రం రద్దు చేసిందని ఆరోపించారు. మూడు నెలల కాలంలో ఇది రెండోసారని చెప్పారు. మంగళవారం అతిషి మీడియాతో మాట్లాడుతూ.. బంగ్లా ఖాళీ చేయాలంటూ సోమవారం నోటీసులు వచ్చాయని తెలిపారు. బంగ్లా ఖాళీ చేయాలంటూ నోటీసులు పేర్కొన్నారని చెప్పారు. ఇక తన కుటుంబ సభ్యుల్ని బీజేపీ లక్ష్యంగా చేసుకుందని.. తాను సీఎంగా ఎన్నికైన తర్వాత.. తన వస్తువులన్నింటినీ బీజేపీ కార్యకర్తలు బయటకు విసిరేశారని తెలిపారు. ఢిల్లీ ప్రజల అభివృద్ధి కోసం పని చేయకుండా.. మా ఇండ్లు గుంజుకుంటున్నారని ఆరోపించారు. అవసరమైతే ఢిల్లీ ప్రజల ఇళ్లల్లో ఉండి వాళ్ల కోసం పని చేస్తానని అతిషి చెప్పుకొచ్చారు.

కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి వరాల జల్లు..

చిత్తూరు జిల్లా ఎన్టీఆర్ స్టేడియంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభం, శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వ ప్రత్యేక నిధులు రూ.10 కోట్లతో కుప్పం మున్సిపాలిటీలో అర్బన్ ప్రాజెక్టుల నిర్వహణ, అధికారుల అతిథి గృహాల నిర్మాణం కోసం సమీకృత కాంప్లెక్స్, కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మాణం చేపట్టనున్నారు. రూ.60.20 కోట్లతో కుప్పంలో ఏర్పాటు చేసిన డీకే పల్లి పార్కుల అభివృద్ధి, సుందరీకరణ, కుప్పం ఏరియా అభివృద్ధిలో రోడ్డు జంక్షన్లు, వీధి దీపాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే.. రూ.110.21 కోట్లతో కుప్పం నియోజక వర్గంలోని 451 డ్రైనేజీ వర్కులను జీఎస్‌హెచ్ 11- ఎస్‌డిపి నిధుల ద్వారా చేపట్టిన పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభోత్సవం చేశారు.

జీవితంలో ఏదైనా సాధించాలంటే ఎన్నిసార్లు పడినా లేచి నిలబడాలి..

విజయవాడ లబ్బీపేటలోని ఎస్.ఎస్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన పాలిటెక్ ఫెస్ట్ 2024-25 కార్యక్రమంలో విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన 24 స్టాల్స్‌ను లోకేష్ సందర్శించారు. ప్రతి స్టాల్ దగ్గర ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్నారు. అనంతరం.. విద్యార్ధుల పరిజ్ఞానం అడిగి తెలుసుకుంటూనే వారికి సూచనలిచ్చారు. స్టాల్స్ పెట్టిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్‌లో భాగంగా ఇలాంటి టెక్ ఫెస్ట్ లను మరింతగా ప్రోత్సహిస్తామని మంత్రి లోకేష్ నిర్వాహకులతో చెప్పారు. ఏపీ సాంకేతిక విద్యాశాఖ ఏర్పాటు చేసిన పాలిటెక్ ఫెస్ట్ 2025.

హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన కేటీఆర్‌

ఫార్ములా ఈ-కార్‌ రేస్ కేసులో హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏసీబీ కేసును కొట్టివేయాలని కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత, ఆ తీర్పుపై న్యాయ నిపుణులతో సలహాలు తీసుకుని సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో, ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించింది. కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్న నేపథ్యంలో, తమ వాదనలు కూడా వినాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ పిటిషన్‌ను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ పిటిషన్‌గా దాఖలు చేసింది. ఫార్ములా ఈ-కార్‌ రేస్ కేసులో పరిస్థితులు గంటగంటకూ మారిపోతున్న నేపథ్యంలో, రాష్ట్ర రాజకీయాల్లో ఇది మరింత హాట్ హాట్ టాపిక్‌గా మారింది.

ప్రణబ్ ముఖర్జీ స్మారకంపై కేంద్రం కీలక నిర్ణయం..

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్మారక చిహ్నం కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని రాజ్‌ఘాట్ కాంప్లెక్స్‌లోని రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో భూమిని కేటాయించింది. తన తండ్రి స్మారకం కోసం భూమిని కేటాయించినందుకు ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఆమె పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ల్యాండ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్ (ఎల్‌అండ్‌డిఓ) భూమి కేటాయించిన లేఖను ఆమె షేర్ చేశారు.

కేటాయించిన స్థలం రాజ్‌ఘాట్‌ రాష్ట్రీయ స్మృతి కాంప్లెక్స్‌లో భాగంగా ఉంటుంది. ‘‘ మేము స్మారకం కోసం అడగలేదు. పీఎం చేసిన ఈ పని చాలా విలువైనంది. రాష్ట్ర గౌరవాలను అడగకూడదు, వాటిని అందించాలని బాబా చెప్పేవారు. బాబా స్మృతిని గౌరవించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు’’ అని శర్మిష్ట చెప్పింది.

నామీద కేసు పెట్టి శునకానందం పొందుతున్నారు

ఫార్ముల ఈ రేస్‌ కేసు సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఒక పాత సామెత చిన్నప్పటి నుంచి వింటున్నామని, అవినీతి పరులు ప్రతిచోటా అదే జరుగుతుంది అనుకుంటారన్నారు. ఉదయం నుంచి కాంగ్రెస్ నాయకులు ఏదో హడావుడి చేస్తున్నారని, ఏమి లేకున్నా నా మీద లొట్టపీసు కేస్ పెట్టారని ఆయన విమర్శించారు. అవినీతి లేదని తెలిసి కూడా నామీద కేసు పెట్టి శునకానందం పొందతున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. రాజ్యాంగపరంగా ప్రతి హక్కును వినియోగించుకుంటా అని ఆయన స్పష్టం చేశారు. నా మీద కేస్ పెట్టిన చిట్టి నాయుడు కి ఒక విషయం చెప్పాలని, నేను ఏసీబీ ఆఫీసుకు వెళ్లినా నన్ను ప్రశ్నించడానికి భయపడ్డారన్నారు. మేము కోర్టు కు వెళ్ళామని, హై కోర్టులో మేము వేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేశారన్నారు. మేము సుప్రీంకోర్టు కు వెళ్ళామని, రెండు మూడు రోజుల్లో విచారణ కు వస్తుందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు.. ఎక్కడంటే..!

హైదరాబాద్‌ విపత్తు స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ ఏజెన్సీ (హైడ్రా) విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరింత పటిష్ఠ చర్యలకు దారితీసింది. ఈ క్రమంలో హైడ్రా కోసం ప్రత్యేక పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తూ మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. బుద్ధభవన్‌ భవనంలోని B-బ్లాక్‌లో ఈ పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. హైడ్రాకు విస్తృతమైన అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నగరంలోని జలాశయాలు, చెరువులు, మరియు ఇతర ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ ఏజెన్సీని ఏర్పాటు చేసింది. అయితే, ఈ సంస్థ ఏర్పాటుకు సంబంధించి చట్టపరమైన అధికారం గురించి వివాదాలు తలెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం నిబంధనలను మరింత స్పష్టంగా రూపొందించింది.

విషాదం.. భోజనం చేస్తుండగానే యూఎస్ ఇన్‌ఫ్లుయెనర్స్ హఠాన్మరణం

చావు ఎప్పుడు.. ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. కళ్ల ముందు తిరిగిన వాళ్లే.. అంతలోనే మాయమైపోతున్నారు. నేటి కాలంలో చావులు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. ఒకప్పుడు పెద్ద వాళ్లకు గుండెపోటులు వచ్చిన వార్తలు వినేవాళ్లం. ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా గుండెపోటులు రావడం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇలా ఎందుకు జరుగుతున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 6 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న ప్రముఖ అమెరికా ఇన్‌ఫ్లుయెనర్స్ కరోల్ అకోస్టా(27) అకాల మరణం చెందింది. న్యూయార్క్‌లో కుటుంబంతో కలిసి విందు భోజనం చేస్తుండగా శ్వాస తీసుకోవడానికి ఉక్కిరిబిక్కిరికి గురైంది. అంతలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో కుటుంబం షాక్‌కు గురైంది. ఆమె మరణాన్ని కరోల్ అకోస్టా సోదరి కాట్యాన్ సోషల్ మీడియా వేదికగా ధృవీకరించింది. ‘‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను.’’ అని హృదయపూర్వక నివాళి అర్పించింది. ‘‘నీలాంటి సోదరిని నాకు ఇచ్చినందుకు నేను దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను, నా సోదరి శాంతితో ఉండాలి.’’ అంటూ పేర్కొంది.

 

Show comments