ఇజ్రాయిల్ అతిపెద్ద ఎయిర్‌పోర్టుపై హౌతీ క్షిపణి దాడి.. వైరల్ అవుతున్న వీడియో..
హౌతీ ఉగ్రవాదులు ఆదివారం రోజు ఇజ్రాయిల్‌పై బాలిస్టిక్ మిస్సై్ల్‌తో దాడి చేశారు. ఇజ్రాయిల్‌లో అతిపెద్ద విమానాశ్రయమైన టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంపైకి మిస్సైల్‌ని ప్రయోగించారు. దీంతో ఒక్కసారిగా ఇజ్రాయిల్ ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 3 నుంచి కేవలం 75 మీటర్ల దూరంలోనే క్షిపణి పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇజ్రాయిల్‌కి ఉన్న బలమైన 4 అంచెల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని దాటి క్షిపణి దాడి జరగడం సంచలనంగా మారింది. క్షిపణి విమానాశ్రయం సమీపంలో పడకుండా అడ్డగించిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) తెలిపింది. ఒక్కసారిగా మిస్సైల్ దాడి జరగడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఈ దాడిలో కనీసం 8 మంది గాయపడినట్లు ఇజ్రాయిల్ అధికారులు తెలిపారు.
తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పనకు అతిపెద్ద ముందడుగు
తెలంగాణ రాష్ట్రంలో రహదారి మౌలిక వసతుల కల్పనకు ఒక విప్లవాత్మక ముందడుగు పడిందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక , ఉత్తరాద్య విధానాల మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆదివారం తన అధికారిక సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర రోడ్లు, రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 5న తెలంగాణ రాష్ట్రానికి వస్తారని, ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.5,413 కోట్ల విలువైన వివిధ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయబోతున్నారని వివరించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలోని రవాణా వ్యవస్థ మరింత బలపడుతుందనీ, పారిశ్రామిక వృద్ధికి ఇది కీలకంగా మారుతుందనీ, పలు వేల ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని కిషన్ రెడ్డి తెలిపారు. మోదీ ప్రభుత్వ కట్టుదిట్టమైన భద్రతా, అభివృద్ధి లక్ష్యాల ప్రకారం భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణకు మౌలిక వసతుల రంగంలో నిరంతర సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఇజ్రాయిల్ ఎయిర్‌పోర్ట్‌పై క్షిపణి దాడి.. ఎయిర్ ఇండియా విమానాలు రద్దు..
ఇజ్రాయిల్‌లో వాణిజ్య నగరమైన టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయం టార్గెట్‌గా హౌతీ తీవ్రవాదులు ఆదివారం క్షిపణి దాడి చేశారు. విమానాశ్రయం మూడో టెర్మినల్‌కి అతి తక్కువ దూరంలో క్షిపణి పడింది. దీంతో ఒక్కసారిగా ఇజ్రాయిల్ వ్యాప్తంగా ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ దాడి చేసిన వారు 7 రెట్లు దాడులు ఎదుర్కొంటారని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కాట్జ్ హెచ్చరించారు. ఈ దాడి నేపథ్యంలో ఎయిర్ ఇండియా టెల్ అవీవ్ విమానాలను వచ్చే రెండు రోజు పాటు నిలిపేసింది. మే 6 వరకు విమానాలు నడపడం లేదని చెప్పింది. ఢిల్లీ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న విమానాన్ని అబుదాబికి మళ్లించామని ఎయిర్ ఇండియా ప్రకటించింది. ప్రయాణికులకు టికెట్ డబ్బుల్ని రీఫండ్ చేస్తామని చెప్పింది. ప్రయాణీకులు మరియు సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.
తెలంగాణలో ముగిసిన టీజీ ఎప్‌సెట్ పరీక్షలు.. 93% పైగా హాజరు
తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ టీజీ ఎప్‌సెట్) – 2025 విజయవంతంగా ముగిసింది. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్‌టీయూహెచ్) ఈ పరీక్షను నిర్వహించింది. అయితే.. తాజాగా విడుదలైన ప్రకటన ప్రకారం, ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. మే 4, 2025న జరిగిన ఈ పరీక్షలకు సుమారుగా 93 శాతం పైగా హాజరు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఫోర్‌నూన్ సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆఫ్టర్‌నూన్ సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించారు.
తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
తెలంగాణ రాష్ట్రంలో రాగల కొద్ది గంటల్లో వాతావరణం పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ నగరంతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (ప్రస్తుత హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలు), మెదక్, మహబూబ్‌నగర్, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా, ఈ ప్రాంతాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈదురు గాలుల కారణంగా చెట్లు విరిగిపడే ప్రమాదం, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఉత్కంఠ పోరులో 1 పరుగు తేడాతో కేకేఆర్ విజయం.. రియాన్ పరాగ్ మెరుపులు వృధా!
ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుత విజయం సాధించింది. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు ఉత్కంఠగా జరిగగా.. చివరికి 1 పరుగు తేడాతో కేకేఆర్ గెలుపొందింది. చివరి బంతికి మూడు రన్స్ అవసరం కాగా.. శుభమ్ దుబే ఒకే రన్ తీశాడు. ఛేదనలో ఆర్ఆర్ 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఈ విజయంతో కోల్‌కతా ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు రాజస్థాన్ ఇప్పటికే ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.. ఆండ్రీ రస్సెల్ (57 నాటౌట్ ; 25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రెహ్మనుల్లా గుర్బాజ్ (35; 25 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌లు), అజింక్య రహానే (30; 24 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), అంగ్‌క్రిష్ రఘువంశీ (44; 31 5 ఫోర్లు),రాణించారు. ఇనింగ్స్ చివర్లో రింకు సింగ్ (19 నాటౌట్; 6 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, యుధ్విర్ సింగ్, మహీశ్ తీక్షణ, రియాన్ పరాగ్ ఒక్కో వికెట్ తీశారు.
‘‘ప్రధాని గురించి మీరందరికి తెలుసు’’ యుద్ధంపై రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..
26 మంది ప్రాణాలను బలితీసుకున్న ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’తో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకున్నాయి. ఈ దాడి వెనక పాక్‌కి చెందిన లష్కరే తోయిబా ఉగ్రసంస్థతో పాటు పాక్ ఆర్మీ, ఐఎస్ఐ ఉన్నట్లు తెలిసింది. అయితే, ఈ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని సగటు భారతీయులు కోరుకుంటున్నాడు. ఇప్పటికే పాకిస్తాన్‌పై దౌత్య చర్యలు, ఆర్థిక చర్యలు ప్రారంభమయ్యాయి. త్వరలోనే సైనిక చర్యలు కూడా ఉంటాయనే వార్తలు వినిపిస్తున్నాయి. వరసగా ప్రధాని మోడీ, టాప్ మినిస్టర్స్, త్రివిధ దళాల అధిపతులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
దంచికొడుతున్న వర్షం.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..
ఏపీలో వర్షం దంచికొడుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంది. గంటకు 60-85 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని సంస్థ వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి పలుచోట్ల అరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు పడ్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
తృటిలో తప్పిన పెనుప్రమాదం.. ల్యాండ్ అవుతుండగా గోడను ఢీకొన్న శిక్షణ విమానం
ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. పయనీర్ అకాడమీ శిక్షణ విమానం ల్యాండ్ అవుతుండగా.. ఒక్కసారిగా కూలిపోయింది. రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా, విమానం రన్‌వే సరిహద్దును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానం వేగం తక్కువగా ఉండడంతో అదృష్టవశాత్తూ పైలట్ తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసినట్లు విమానయాన శాఖ డైరెక్టర్ ఎస్ఎస్ అగర్వాల్ తెలిపారు. అందిన సమాచారం ప్రకారం, పయనీర్ అకాడమీ శిక్షణ విమానం నేడు (ఆదివారం) అలీఘర్ లోని ధనిపూర్ ఎయిర్‌స్ట్రిప్‌లో ల్యాండ్ అవుతోంది. ఈ సమయంలో సాంకేతిక లోపం కారణంగా.. విమానం బ్యాలన్స్ కోల్పోయి రన్‌వేపై నుంచి వెళ్లి పక్కన ఉన్న గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విమానం తీవ్రంగా దెబ్బతింది. ఇక ప్రమాదం జరిగిన సమయంలో విమానాశ్రయ అధికారులు, భద్రతా సిబ్బంది అక్కడే ఉండడంతో.. వారు పరిగెత్తి విమానంలో చిక్కుకున్న పైలట్‌ను సురక్షితంగా రక్షించారు. ఈ సోలో పైలట్ విమానం పయనీర్ అకాడమీకి చెందినదని విమానయాన శాఖ డైరెక్టర్ ఎస్ఎస్ అగర్వాల్ తెలిపారు. ఈ విమానంలో కొత్త పైలట్లకు శిక్షణ ఇస్తారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, కానీ విమానం పూర్తిగా దెబ్బతిందని ఆయన అన్నారు. ఈ ఘటన వెనుక గల కారణాలను పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు. ఈ ప్రమాదం ఎందుకు, ఎలా జరిగిందో దర్యాప్తు తర్వాతే తెలుస్తుందని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో పాయల్ పర్వేష్ జైన్ విమానాన్ని ల్యాండ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
రైతులకు గుడ్‌న్యూస్.. ఈ నెలలోనే అన్నదాత పథకాన్ని ప్రారంభిస్తామ్న సీఎం
టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గంతో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మే 18 నాటికి రాష్ట్ర కమిటీలు మినహా అన్ని కమిటీలు పూర్తి చేయాలని ఆదేశించారు. కడపలో 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు మహానాడు నిర్వహించనున్నారు. మిగిలిన నామినేటెడ్ పదవులు త్వరలోనే భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమం విజయవంతంలో కార్యకర్తల కృషి అభినందనీయమన్నారు. ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం చేసినా వైసీపీ చౌకబారు విమర్శలు చేస్తోందని.. తిప్పికొట్టండని శ్రేణులకు సూచించారు.
