మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాల ఇచ్చాం
రాష్ట్రంలో ప్రశ్నించాలంటే భయం రాయాలంటే భయం ఉండేది… అటువంటి ప్రభుత్వం ఇప్పుడు లేదని డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హామీ ఇచ్చిన గారెంటీలని అందిస్తున్నామని, మూడు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాల ఇచ్చామన్నారు. నేతలు చేసిన వాగ్దానాలు మార్చి పోయారని లేని పోని అభాండాలు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కరెంట్ పొకపోయిన పోయినట్లుగా ప్రభుత్వం పై విమర్శలు చేసి దిగజారుడు తనం బయట పడిందని ఆయన వ్యాఖ్యానించారు. వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని అవసరమైన ఏర్పాట్లు విద్యుత్ రంగంలో ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కోడ్ వల్ల కొన్నింటిని ప్రకటించడం లేదని, సీఎం రేవంత్, మంత్రి వర్గ సహచరులు 24 గంటలు ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను రాజకీయ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టము.. పెట్టలేమని ఆయన తెలిపారు. ఢిల్లీకి వెళ్ళేది రాష్ట్ర ప్రయోజనాల కోసమే వెళ్ళామని, 50 వేల కోట్ల విలువ చేసే కోల్ మైన్ ల గురించి పదేళ్లుగా బీఆర్‌ఎస్ పట్టించుకోలేదన్నారు భట్టి విక్రమార్క.
జూన్ 4న మళ్లీ అధికారంలోకి వస్తాం.. దానిపైనే మొదటి సంతకం!
ఏపీలో ఇంటింటికి అందుతున్న సంక్షేమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా తిరుపతి జిల్లా నాయుడుపేట బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. నాయుడుపేట జన సముద్రాన్ని తలపిస్తోందని సీఎం అన్నారు. మరో ఐదు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగనుందని.. ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు తిరుగుతున్న ఎన్నికలు కాదని.. అందరి భవిష్యత్తును నిర్ణయించేవి ఈ ఎన్నికలు అంటూ ముఖ్యమంత్రి తెలిపారు. వచ్చే ఐదేళ్లలో కుటుంబంలోని ప్రతి ఒక్కరి భవిష్యత్తును నిర్ణయించేవి ఈ ఎన్నికలని ఆయన వెల్లడించారు. జగన్‌ను ఓడించేందుకు వారు ప్రయత్నిస్తున్నారని.. ఈ ఎన్నికలు రెండు భావజాలాల మధ్య జరుగుతున్నాయన్నారు. ఒక పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం వద్దన్నవారికి..ఇంగ్లీష్ మీడియంతో పాటు నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చిన మనకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.
ఎండ తీవ్రత నేపథ్యంలో యాదాద్రిలో భక్తులకు సౌకర్యాల కల్పన
రాష్ట్రాల్లో పది, ఇంటర్ పరీక్షలు పూర్తయి పాఠశాలు, కళాశాలలకు సెలవులు ప్రకటించిన దృష్ట్యా రాష్ట్రంలోని పలు దేవాలయాలను సందర్శించే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో అన్ని దేవాలయాల్లో భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించాలని దేవాదాయ ధర్మాదాయ కమీషనర్ హనుమంత రావు ఆదేశించడంతో అన్ని ప్రధాన దేవాలయాల్లో భక్తులు ఎండబారిన పడకుండా షామియానాలు, ఆలయ ప్రాంగణంలో పలు చోట్ల తాగునీటి సౌకర్యాలు, చిన్న పిల్లలకు పాలిచ్చే లాక్టేషన్ గదులు, వృద్దులు, వికలాంగులకు వీల్ ఛైర్లు, క్యూ కాంప్లెక్స్ ల వద్ద షెడ్ తదితర ఏర్పాట్లను చేపట్టాయి. దీనిలో భాగంగా, రాష్ట్రంలోనే ప్రధాన ఆలయమైన యాదగిరి శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి ఆలయంలో భక్తులకు విస్తృత ఏర్పాట్లను కల్పించారు.
కాంగ్రెస్ కీలక నిర్ణయం..! అమేథీలో స్మృతి ఇరానీపై పోటీ చేసేదెవరంటే..!
ఈసారి అమేథీలో కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారంటూ దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి రేపింది. రాహుల్ గాంధీనే పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. తీరా.. కాంగ్రెస్ తొలి జాబితా వెలువడగానే ఆ ఉత్కంఠ వీడిపోయింది. రాహుల్ తిరిగి వయనాడ్ నుంచే బరిలోకి దిగారు. దీంతో బీజేపీ నేత, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై పోటీ చేసేదెవరంటూ తీవ్ర చర్చ సాగింది. మొత్తానికి ఆ ఉత్కంఠకు కాంగ్రెస్ తెరదింపుతున్నట్లు తెలుస్తోంది.
2019 ఎన్నికల్లో అమేథీలో కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, బీజేపీ నుంచి స్మృతి ఇరానీ పోటీ చేశారు. అనూహ్యంగా స్మృతి ఇరానీ విజయం సాధించారు. 2024లో కూడా మరోసారి ఇద్దరూ తలపడతారని అంతా భావించారు. కానీ రాహుల్ మాత్రం కేరళలోని వయనాడ్ నుంచే తిరిగి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో అక్కడినే రాహుల్ విక్టరీ సాధించారు. ఇక స్మృతి ఇరానీ అయితే అమేథీలోనే ఇల్లును నిర్మించుకున్నారు. మళ్లీ అమేథీ నుంచే పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారని రకరకాలైన ఊహాగానాలు వినిపించాయి. మొత్తానికి ఈ స్థానం నుంచి సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రాను బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్మృతి ఇరానీని ఎదుర్కోవాలంటే రాబర్ట్ వాద్రానే కరెక్ట్ అని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. తనను అమేథీ నుంచి పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని రాబర్ట్ వాద్రా తాజాగా వ్యాఖ్యానించారు. ఓ మీడియా ఛానల్‌తో వాద్రా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీ కాంగ్రెస్ మాత్రం వాద్రా వ్యాఖ్యల్ని తోసిపుచ్చింది. రాబర్ట్ పేరు పరిశీలనలో లేదని పేర్కొంది.
బీజేపీలో టీడీపీ దొంగలు పడ్డారు.. పురంధేశ్వరిపై పేర్ని నాని ఫైర్
టీడీపీ అధినేత చంద్రబాబును కాపాడేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎప్పుడూ ముందుంటారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పురంధేశ్వరి బీజేపీ నేతగా కంటే చంద్రబాబుకు మేలు చేసేలా పని చేస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్‌ను కూలదోసే సమయంలో బాబుకు పురంధేశ్వరి సపోర్టు చేశారని పేర్ని నాని ఆరోపించారు. చంద్రబాబు కోసం పురంధేశ్వరి బీజేపీని బాబు జనతా పార్టీగా మార్చేశారని తీవ్రంగా వ్యాఖ్యానించారు ఏపీలో బీజేపీలో బలం ఉందా లేదా అనే విషయం అందరికీ తెలుసన్నారు పేర్ని నాని. బీజేపీ టికెట్లను పురంధేశ్వరి ఎవరికి ఇప్పించారో చూస్తూనే ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు. బీజేపీలో ఒరిజినల్ నాయకులను ఇంట్లో కూర్చోబెట్టారని.. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న వారంతా టీడీపీ నేతలనేనని అన్నారు. దేశంలో దొంగలు పడ్డారో లేదో కానీ.. బీజేపీ మాత్రం టీడీపీ దొంగలు పడ్డారన్నారు. ఏపీలో బీజేపీకి ఓట్లు ఉన్నాయా లేదా అన్నది అందరికీ తెలుసన్నారు. అమిత్ షా దగ్గరకు చంద్రబాబును పురంధేశ్వరి తీసుకెళ్లారని పేర్ని నాని అన్నారు. మరిది కళ్లల్లో ఆనందం కోసం పోలీసు అధికారులపై పురంధేశ్వరి ఆరోపణలు చేశారని విమర్శించారు.
నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు కేటీఆర్
కేటీఆర్ ఎవడి తాటా తీస్తాడు.. మేము కూడా అదే చెప్తున్నా.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు కేటీఆర్ అని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. ఎక్కువ తక్కువ మాట్లాడేది మీరు.. మేము కౌంటర్ ఇవ్వగానే గోల చేస్తారని, ఫోన్ ట్యాపింగ్ చేసినం అనేది నువ్వే.. చేయలేదు అనేది నువ్వే.. సమంత.. నాగ చైతన్య విడిపోవడానికి ఫోన్ ట్యాపింగ్ కారణం అని అంతా కోడై కూస్తుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ ప్రభుత్వం అనుమత్జి లేకుండా చేయరన్నారు. అనుమతి ఇచ్చేది ప్రభుత్వం.. ప్రభుత్వంలో అప్పుడు ఎవరుంటే వాళ్ళు బాధ్యులు అని ఆమె అన్నారు. విచారణలో అన్నీ తెలుస్తాయని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకి డబ్బులు పంపిన విషయం బయటకు వచ్చిందన్నారు. దాని మీద ఏం చేయాలి అనేది సీఎం.. విచారణ అధికారులు చూసుకుంటారన్నారు. కేటీఆర్ నోటీసు నాకు అందలేదని, వాట్సప్ లోనే చూశా అన్నారు. ఆయనని పొగిడినట్టే ఉంది.. నోటీసు లెక్క లేదు అని ఆమె వ్యాఖ్యానించారు.
మళ్లీ ముగ్గురు కూటమిగా వస్తున్నారు.. ఒకసారి ఆలోచించండి!
చంద్రబాబు 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా చేశారని.. మరి ఆయన చేసిన ఒక మంచి పనైనా గుర్తుకు వస్తుందా సీఎం జగన్ ప్రశ్నించారు. ఆయన మార్క్ పథకం ఏదీ లేదని.. ఆయన పేరు చెబితే గుర్తుకు వచ్చేది వెన్ను పోట్లు.. అబద్ధాలు.. కుట్రలు, కుతంత్రాలు అని విమర్శించారు. అందుకే నా అనేవాళ్ళు కోట్ల మంది ఉంటే చంద్రబాబుకు మాత్రం పక్క రాష్ట్రంలో ఉన్నారన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా నాయుడుపేట బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. జగన్ మామ అని చిన్నారులు ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటారని.. ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీల భవిష్యత్ మార్చేందుకే 58 నెలలు కష్టపడ్డానని సీఎం తెలిపారు.
58 నెలల్లో మనం మంచి సమాజాన్ని నిర్మించామని.. ఈ సమయంలో మంచి చదువులు చదువుకోవడానికి మార్గం సుగమం చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండే నాణ్యమైన విద్యను అందరికీ అందించామన్నారు. తాను వేసిన విత్తనాలు మరో 15 సంవత్సరాల్లో పెద్ద వృక్షాలుగా ఎదుగుతాయన్నారు. పెద్దింటి పిల్లలకు అసూయ పుట్టేలా పేద పిల్లలు ఎదుగుతారన్నారు. కుట్రలు, పొత్తులు, ఎత్తులు, జిత్తులు తెలియవని.. కుటుంబాలకు మంచి జరిగింది కాబట్టే ధైర్యంగా మీ ముందుకు వస్తున్నామన్నారు. అందుకే మీ ఆశీస్సులు కోరుతున్నామన్నారు. 2024 ఎన్నికల్లో కూడా అబద్ధాలు చెప్పనని, మోసాలు చేయమన్న సీఎం జగన్.. అమలు చేయలేని హామీలను మేనిఫెస్టోలో పెట్టనన్నారు. జగన్ అమలు చేయలేని ఏ స్కీము కూడా చంద్రబాబు వల్ల కాదు.. ఎవరూ అమలు చేయలేరన్నారు. కిచిడీ మేనిఫెస్టోలో చంద్రబాబు చెప్పే మాదిరిగా పోటీ పడమన్నారు సీఎం జగన్. ఎప్పుడైనా నిజాయితీ, నిబద్ధతతోనే ఏదైనా హామీలు ఇస్తామన్నారు. చంద్రబాబు లాగా అబద్ధాలు.. మోసపు హామీలు ఇవ్వమన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు లీడర్ అనేవాడు ఆదర్శంగా ఉండాలన్నారు. రంగు రంగుల హామీలతో మేనిఫెస్టోను తీసుకు వచ్చి.. చెత్త బుట్టలో వేసే విధానం మనది కాదన్నారు. తాను అబద్ధం చెప్పనని, మాట ఇస్తే అమలు చేస్తామన్నారు. 58 నెలల పాలనలో మేనిఫెస్టోలో చెప్పనివి కూడా అమలు చేశామని సీఎం చెప్పారు. భవిష్యత్తులో కూడా అవసరాన్ని బట్టి ప్రతి ఇంటికి చేయగలిగిన మంచిని చేస్తామన్నారు.
నయీం కేసు మళ్లీ తెరిచి విచారణ జరిపించాలి
నయీం కేసు మళ్లీ తెరిచి విచారణ జరిపించాలన్నారు మాజీ ఎంపీ వి హనుమంత రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నయీం కేసులో ఇన్వాల్వ్ అయిన పోలీస్ అధికారులు ఎవరు? నాయకులు ఎవరనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసును నీరుగార్చారని, బయట పడ్డ వందల కోట్ల డబ్బులు, పేద ప్రజల దగ్గర లాక్కున్న భూములు ఎక్కడికి పోయినవని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ భూములు ఎన్ని, పేద ప్రజల భూములు ఎన్ని తేలాలన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని నయిమ్ కేసును విచారణ జరిపించాలని కోరుతున్నానన్నారు. పేద ప్రజల భూమిని వాళ్లకు తిరిగి ఇవ్వాలని రేవంత్ రెడ్డికి మనవి, ఆ భూమిలో పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇవ్వాలని విజ్ఞప్తి చేసున్నానని, ఫోన్ ట్యాపింగ్ ద్వారా పెద్ద కుంభకోణం జరిగిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దేశంలోనే సంచలనంగా మారిందని, ఫోన్ ట్యాపింగ్ లో పెద్ద నాయకులు అందరూ బయటకు వస్తున్నారన్నారు. ఇప్పటికే పోలీస్ అధికారులు జైలుకు పోయారని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ప్రభుత్వం ఎవ్వరిని వదిలి పెట్టదన్నారు వీహెచ్.
చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎమ్మిగనూరు ,మార్కాపురం,బాపట్ల సభల్లో చంద్ర బాబు ఎన్నికల ప్రచార ప్రసంగంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రచారంలో వైయస్ జగన్‌పై కోడ్‌ను ఉల్లంఘిస్తూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారని వైయస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. సీఈవో ముకేశ్ కుమార్ మీనాకు లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు ఫిర్యాదు చేసారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈసీ నోటీసులు ఇచ్చింది. చంద్రబాబు ప్రాథమికంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న అభిప్రాయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన ప్రసంగాలపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలనీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నోటీసు ఇచ్చారు.
