అన్నయ్య మూసేస్తే తమ్ముడొచ్చాడు.. మంత్రి తీవ్ర విమర్శలు..
ఏపీలో త్వరలో ఎన్నికలు జరుగనున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు. కాగా అధికార వైసీపీ పార్టీ.. సిద్ధం పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తుంటే.. టీడీపీ, జనసేన కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో.. ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి చెల్లుబోయిన వేణు మండిపడ్డారు. చిరంజీవి పార్టీ పెట్టి తన వల్ల కాదని మూసేశాడని.. అన్నయ్య మూసేస్తే 2012లో తమ్ముడు వచ్చాడని విమర్శించారు మంత్రి వేణు. 2014లో ఓటమిని ఎన్నికల ముందే ఒప్పుకుని.. పోటీ నుంచి పవన్ కళ్యాణ్ తప్పుకున్నాడని అన్నారు. 2014లో జగన్ ఓడిపోయిన ధైర్యంగా నిలబడ్డారని.. 2019లో 151 స్థానాల్లో గెలిచి చూపించాడని మంత్రి వేణు పేర్కొన్నారు.
రామ మందిరంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మణిశంకర్ అయ్యర్ కుమార్తెపై కేసు..
కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ కుమార్తె సురణ్య అయ్యర్ అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టను ఖండిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని ఉద్దేశిస్తూ, జనవరి 20న సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ పెట్టింది. దీనిపై ఢిల్లీలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో సుప్రీంకోర్టు న్యాయవాది, బీజేపీ నాయకుడు అజయ్ అగర్వాల్ శనివారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సురణ్య అయ్యర్ ఫేస్‌బుక్, యూట్యూబ్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తీవ్రమైన అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారు. సెక్షన్ 153-A (మత ప్రాతిపదికన వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), ఐపీసీలోని ఇతర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. రామమందిరం, జాతీయవాదం పేరుతో అయోధ్యలో చేస్తున్న దానికి తాను “భారత ముస్లింలకు” మద్దతుగా నిరాహారదీక్ష చేస్తానని అన్నారు.
మూడో రోజు ముగిసిన ఆట.. ఇంగ్లండ్ స్కోరు ఎంతంటే..!
వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. 339 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ కోల్పోయి 67 పరుగులు చేసింది. కాగా.. ఆట ముగిసే సమయానికి క్రీజులో క్రావ్లే (29), రెహాన్ అహ్మద్(9) పరుగులతో ఉన్నారు. ఓపెనర్ బెన్ డకెట్ వికెట్‌ను స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీశాడు. వ్యక్తిగత స్కోరు 28 పరుగుల వద్ద కీపర్ శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. అయితే ఇంగ్లండ్ ఈ టెస్ట్ లో గెలువాలంటే.. 332 పరుగులు చేయాల్సి ఉంది. అంతేకాకుండా.. ఆట ఇంకో 2 రోజులు మిగిలివుండగా ఆ పరుగులు చేయాల్సి ఉంది. అటు.. భారత్ గెలవాలంటే 9 వికెట్లు తీయాలి. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 255 పరుగులకు చేసి.. ఇంగ్లండ్ ముందు 398 పరుగుల ఆధిక్యాన్ని ఉంచింది. 399 పరుగుల విజయలక్ష్యంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించింది.
రాష్ట్రపతి ప్రసంగం కొత్త ఒరవడికి నాంది పలికింది
రాష్ట్రపతి ప్రసంగం కొత్త ఒరవడికి నాంది పలికిందన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విపక్షాలు అనాలోచితంగా విమర్శలు చేస్తున్నారని, ఇండి కూటమి చీలికలతో కొట్టుమిట్టాడుతోందన్నారు లక్ష్మణ్. కాంగ్రెస్ ఎంపీ దక్షిణ భారత ను విభజించాలని మాట్లాడుతున్నాడని, నారీ శక్తి కి ప్రోత్సాహించేలా ప్రసంగం ఉందన్నారు లక్ష్మణ్. అంతేకాకుండా.. మోడీకి ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ప్రసంశలను తట్టుకోలేక పోతుంది కాంగ్రెస్ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ యాత్ర భారత్ జోడో చేస్తుంటే మరోవైపు కూటమి పార్టీ లు కాంగ్రెస్ చోడో అంటున్నారని, కూటమికి ఒక ఎజెండా లేదు నీతీ లేదన్నారు లక్ష్మణ్. పార్లమెంట్ ఎన్నికల్లో అభివృద్ధి, అబద్ధాలకు పోరు జరుగుతుందని, మోడీ హయాం లో అనేక కార్యక్రమాలు విజయవంతం గా నిర్వహించుకున్నామన్నారు. అసాధ్యమైన అనేక అంశాలను పార్లమెంట్ లో చట్టాలు చేయడం ద్వారా అమలులోకి తీసుకుని వచ్చామని, అన్ని వర్గాల అభ్యున్నతికి దోహదపడే బడ్జెట్ ను నిర్మళా సీతారామన్ ప్రవేశపెట్టారన్నారు ఎంపీ కే.లక్ష్మణ్.
లక్నో జైలులో హెచ్ఐవీ కలకలం.. 47 మంది ఖైదీలకు పాజిటివ్..
లక్నో జైలులో హెచ్ఐవీ కలకలం రేపుతోంది. జైలులో కొత్తగా 36 మందికి హెచ్ఐవీ ఉన్నట్లుగా తేలింది. వీరందరు హెచ్ఐవీ పాజిటివ్‌గా పరీక్షించబడ్డారు. దీంతో జైలులో మొత్తం 47 మంది ఖైదీలకు హెచ్ఐవీ సోకింది. ప్రస్తుతం ఈ వ్యాధి సోకిన రోగులందరికీ లక్నోలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. డిసెంబర్ 2023లో ఉత్తర ప్రదేశ్ ఆరోగ్య శాఖ నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో ఈ రోగ నిర్ధారణ జరిగింది. వ్యాధి సోకిన ఖైదీలకు కౌన్సిలింగ్ ప్రారంభించారు. ఖైదీలకు హెచ్ఐవీ సోకుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాధి సోకిన వారికి ఆహార మార్పులను అనుమతించారు. అలాగే, పాజిటివ్‌గా తేలిన ఖైదీలందరినీ వైద్యుల పరిశీలనలో ఉంచారు. రోగులకు యాంటీ రెట్రో వైరల్ థెరపీ(ART) సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు ఖైదీల ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని జైలు సూపరింటెండెంట్ ఆశిష్ తివారీ చెప్పారు. తాజాగా తేలిన 36 కేసులకు ముందు 11 ఖైదీలకు హెచ్ఐవీ ఉంది.
వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి రాజీనామా చేయనున్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే..
ఎన్నికల వేళ వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జున రావు. ఈ మేరకు ఆయన తన అనుచరులతో సమావేశమై.. ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఎవరూ అధైర్యపడొద్దని, త్వరలో రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. కాగా.. ఇప్పటికే కొందరు నేతలు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఎన్నికల ముందు పార్టీలు మారడం లాంటివి పార్టీకి పెద్దదెబ్బ అని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ తమ రాజకీయ భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు నేతలు చెబుతున్నారు.
హైదరాబాద్ నుంచి రాంచీకి ఎమ్మెల్యేలు.. రేపు అసెంబ్లీలో బల నిరూపణ
జార్ఖండ్ రాజకీయాలు కీలక దశకు చేరుకున్నాయి. హేమంత్ సొరెన్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో చంపై సొరెన్ ఆ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు. ఇదిలా ఉంటే, ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకునేందుకు సోమవారం ‘ఫ్లోర్ టెస్ట్’ ఉంది. దీంతో ఎమ్మెల్యేలంతా ఆదివారం హైదరాబాద్ నుంచి రాంచీకి బయలుదేరారు. జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 మంది ఎమ్మెల్యేలు ఉంటే అధికార జేఎంఎం-కాంగ్రెస్ కూటమికి 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మెజారిటీ మార్క్ 41, అయితే, 43 మంది ఎమ్మెల్యేల మద్దతు చంపై సొరెన్‌కి ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు, ఏజేఎస్‌యూ లేదా ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్‌కు ముగ్గురు ఉన్నారు. ఎన్సీపీ, ఒక లెఫ్ట్ పార్టీకి ఒక్కొక్కరు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఆకలి బాధ.. పిల్లి పచ్చి మాంసం తిన్న వ్యక్తి..
కేరళలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆకలి బాధతో ఉన్న ఓ వ్యక్తి చనిపోయిన పిల్లిని పచ్చి మాంసం తిన్నాడు. ఈ ఘటనను చూసిన ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దిగ్భ్రాంతికరమైన ఈ ఘటన ఉత్తర కేరళ జిల్లాలోని కుట్టిప్పురంలో జరిగింది. అస్సాంకు చెందిన ఓ వ్యక్తి రోజుల తరబడి ఆహారం లేక పిల్లి పచ్చి మాంసాన్ని తింటూ కనిపించాడు.
శనివారం సాయంత్రం రద్దీగా ఉండే బస్టాండ్ ఆవరణలో కూర్చుని, పిల్లి మాంసాన్ని తినడం అక్కడి ప్రజలు గమనించారు. సదరు వ్యక్తిని అస్సాం రాష్ట్రం ధుబ్రి జిల్లాకి చెందిన 27 ఏళ్ల వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. బస్టాండ్ మెట్లపై కూర్చుని చనిపోయిన పిల్లి మాంసాన్ని తింటున్నట్లు స్థానికులు గమనించారని ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. సమాచారం అందుకున్న తర్వాత తాము సంఘటన స్థలానికి చేరుకున్నామని, అతడిని విచారిస్తే.. గత 5 రోజులుగా ఎలాంటి ఆహారం తీసుకోలేదని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. సదరు వ్యక్తి అస్సాంలోని ఓ కళాశాల విద్యార్థి అని.. కుటుంబానికి చెప్పకుండా ట్రైన్ ఎక్కి డిసెంబర్‌లో కేరళకు వచ్చాడని తెలిసింది. విచారణలో చెన్నైలో పనిచేస్తున్న అతని సోదరుడి మొబైల్ నెంబర్ ఇచ్చినట్లు, అతడిని సంప్రదించి, వివరాలు ధ్రువీకరించుకున్నట్లు పోలీసులు తెలిపారు.
వికసిత్ భారత్ లక్ష్యంగా మోడీ ప్రభుత్వ అడుగులు
వికసిత్ భారత్ లక్ష్యంగా మోడీ ప్రభుత్వ అడుగులు పడుతున్నాయన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్. ఇవాళ ఆయన కరీంనగర్‌లో మాట్లాడుతూ.. దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టేలా చర్యలు .. ప్రపంచంలోనే ఇండియాను 3వ స్థానానికి తీసుకెళ్లడానికి నిరంతర కృషి చేశారన్నారు. బీజేపీ ప్రభుత్వం పదేళ్లుగా దేశాభివృద్ధి కోసం శ్రమిస్తుందని, దేశ ప్రజలంతా మోడీ ప్రభుత్వంపై విశ్వాసంతో ఉన్నారన్నారు. దేశంలో రాబోయేది.. ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ బీఆర్ఎస్ అవినీతి ప్రభుత్వం పోయినా .కాంగ్రెస్ రూపేనా మరో అవినీతి ప్రభుత్వము వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి సర్కార్ జాతీయ కాంగ్రెస్ కి ఫండింగ్ చేస్తోందని, రాహుల్ యాత్ర కోసం రేవంత్ రెడ్డి విలువైన బస్సును ఏర్పాటు చేశారన్నారు. దేశంలో అధికారంలోకి రాని కాంగ్రెస్, బి ఆర్ఎస్ ల కు ఓటు వేయడం దండగ అని ఆయన వ్యాఖ్యానించారు.
జగన్ మళ్లీ సీఎం కావడం చారిత్రక అవసరం..
మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా నా తలరాత రాసింది జగన్మోహన్ రెడ్డి.. ఆయన బంటుగా వైసీపీ విజయం కోసం త్యాగానికి సిద్ధం అని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. పార్టీ తీసుకొనే ఎలాంటి నిర్ణయానికైనా తాను సిద్దమని తెలిపారు. జగన్ చెప్పిన స్టార్ క్యాంపెయినర్ లో అమర్నాథ్ ఒకడు అని అన్నారు. జగన్ మళ్లీ సీఎం కావడం చారిత్రక అవసరం అని చెప్పారు. జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేస్తూ.. సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభల్లో విజయోత్సవ కళ కనిపిస్తోందని అన్నారు. ఈ విజయోత్సవ స్పందనను దారి మరల్చే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు.
చంద్రబాబు, లోకేష్, సోమిరెడ్డి నాపై నిందలు వేశారు..
నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. నేరం జరిగిన తీరు పట్ల మంత్రి కాకాణికి అవగాహన లేదని, ఫైళ్ల మిస్సింగ్ కేసులో ఆయన పాత్ర లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ తేల్చింది. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, సోమిరెడ్డిపై మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తాను మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రెండు రోజుల్లోనే నెల్లూరు కోర్టులో బ్యాగు చోరీకి గురైందని తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను గుర్తించారన్నారు. కోర్టులో చోరీ జరిగిన వెంటనే తనపై దాడి ప్రారంభించారని మంత్రి కాకాణి పేర్కొన్నారు.
గెలుపు ఓటములు హుందాగా తీసుకోవాలి
మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ నియోజక వర్గ స్థాయి సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గెలుపు ఓటములు హుందాగా తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ ఒక దిగజారుడు పార్టీ. వెకిలి చేష్టలతో వికృతానందం పొందుతుందన్నారు. ఓడిన వాళ్లపై దుష్ప్రచారం చేయడం కుసంస్కారమన్నారు నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్య స్ఫూర్తి కనుమరుగై పోయిందన్నారు. కాంగ్రెస్కు ఎందుకు ఓటేసామని రెండు నెలల్లోనే ప్రజలు బాధపడే దుస్థితికి కాంగ్రెస్ వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 420 హామీలను నెరవేర్చేలా ఒత్తిడి తీసుకొస్తామని, ప్రజలు అడగకుండానే అన్ని పథకాలు అందించిన వ్యక్తి కేసీఆర్ అని ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకులు పద్ధతి ప్రకారం దుష్ప్రచారం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. అబద్ధమే నిజమనేలా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మీడియా ప్రచారం చేసిందని, అనవసర విషయాలను వార్తలుగా మలిచాయన్నారు.
సీఎం పదవి స్థాయి తగ్గించి పోకిరిలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు
సీఎం పదవి స్థాయి తగ్గించి పోకిరిలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల్లో రాజనీతిజ్ఞుడిగా మాట్లాడారన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని, అబద్దపు పునాదులు, అలవికానీ హామీల మీద ఏర్పాటైంది ప్రభుత్వం కాంగ్రెస్ అని ఆయన విమర్శించారు. రైతుబంధు కోసం గత ప్రభుత్వంలో విడుదల చేసిన రూ. 7,700 కోట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి రాఘవ కన్‌స్ట్రక్షన్‌కి, కాంగ్రెస్ కంట్రాక్టర్లకి జేబుల్లోకి వెళ్లాయన్నారు. బంగారు పళ్లెంలో సుసంపన్నమైన రాష్ట్రన్ని అభివృద్ధి చేసి కాంగ్రెస్ పార్టీకి అప్పగించామని ఆయన తెలిపారు. డిసెంబర్ 9న చేస్తామన్న రుణమాఫీ, 4 వేల రూపాయల పెన్షన్, 5వందల రూపాయల గ్యాస్, మెగా డీఎస్సీ. జాబ్ క్యాలెండర్ ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదని, గత ఎన్నికల్లో చెన్నూరు అభ్యర్థి వివేక్ ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలన్నారు. వివేక్‌ను చెన్నూరు నియోజకవర్గానికి నిధులు తీసుకురమ్మంటే, తన కొడుకు ఎంపీ సీటు కోసం ఢిల్లీ, హైదరాబాద్లో బిజీగా ఉంటున్నాడని, చెన్నూరుకు నిధులు రాకుండా, రాహుల్ జోడో యాత్రకు అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నాడన్నారు.
పాలమూరులో కాషాయ జెండా ఎగరడం ఖాయం
మహబూబ్ నగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ప్రవాస్ యోజన సమావేశం లో భాగంగా కార్యకర్తలను క్షేత్ర స్థాయిలో కలిసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ పార్టీ కి అడ్డా…పాలమూరు లో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు బండి సంజయ్. తెలంగాణ లో 10 కి పైగా పార్లమెంట్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని, బీఆర్ఎస్ పార్టీ దగాకోరు పార్టీ… ప్రజలను ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురించేసింది…కబ్జాలకు పాల్పడిన నాయకులందరు కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళ్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
