NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

అన్నీ ప్రజల ముందు పెడతా.. రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై సీఎం కీలక వ్యాఖ్యలు

రుషికొండ నిర్మాణాలు చూస్తే గుండె చెదిరే నిజాలు వెలుగు చూస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అధికారం అడ్డు పెట్టుకొని చేసే తప్పులకు ఇదో కేస్ స్టడీ అంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటివి సాధ్యమా అనిపించిందని.. కలలో కూడా ఊహించలేమన్నారు. ఇటువంటి నేరాలు చెయ్యాలంటే చాలా తెగించాలి.. ఒక వ్యక్తి విలాసాల కోసం ఇంత దారుణమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చాలా దేశాలు తిరిగానని, పాలకులను చూశాను కానీ ఒక సీఎం విలాసం కోసం పర్యావరణ విధ్వంసం చేసి ప్యాలెస్ నిర్మించుకోవడం చేయలేదన్నారు. రుషికొండ ప్యాలెస్ చూస్తే మొదట ఆశ్చర్యం, తర్వాత ఉద్వేగం కలుగుతుందన్నారు. ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కోసం 400కోట్లు ఖర్చు పెట్టలేదు కానీ రుషికొండ కోసం 420 కోట్లు పెట్టారన్నారు.

అంబటి రాంబాబుకు మంత్రి నిమ్మల స్ట్రాంగ్ కౌంటర్

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ట్విట్టర్‌లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అబద్దాలు ఆడడంలో అంబటిది అందె వేసిన చెయ్యి అని.. ప్రాజెక్టు ఎత్తు తగ్గించినట్లు ఆధారాలు ఉంటే చూపాలన్నారు. నిద్రపోయే వాణ్ణి లేపవచ్చని.. నిద్ర నటించే వాణ్ణి ఎవరు లేపగలరని అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. అలాగే అంబటికి అన్నీ తెలుసు అని, అయినా వాళ్ల పార్టీ అధినేత మెప్పుకోసం ఆయన చెప్పిన అబద్ధాలనే ఈయన పదేపదే చెబుతున్నారని విమర్శించారు.

మెట్రో రైలు కొత్త మార్గాల పనులకు పరిపాలన అనుమతి

మెట్రో రైలు కొత్త మార్గాల పనులకు పరిపాలన అనుమతి లభించింది. ఐదు మార్గాల్లో మెట్రో రెండో దశ పనులు ప్రారంభం కానున్నాయి. కారిడార్ 4లో నాగోల్ – శంషాబాద్, కారిడార్ 5లో రాయదుర్గం – కోకాపేట, కారిడార్ 6లో ఓల్డ్ సిటీ mgbs – చాంద్రాయణగుట్ట, కారిడార్ 7లో మియపూర్ – పఠాన్ చెరు, కారిడార్ 8లో ఎల్బీ నగర్ – హయత్ నగర్, కారిడార్ 9లో ఎయిర్ పోర్టు – ఫోర్త్ సిటీ రానున్నాయి. మొత్తం నాలుగు కారిడార్లు 76.4 కిలోమీటర్ల మేర నిర్మాణం జరుగనుంది. ఎయిర్ పోర్టు నుంచి ఫోర్త్ సిటీకి 40 కిలోమీటర్లు.. మొత్తం ఐదు కారిడార్లు 116.4కిలోమీటర్ల కొత్త మెట్రో మార్గాల నిర్మాణం జరుగనుంది. రెండో దఫా మెట్రో నిర్మాణానికి 24,269కోట్ల రూపాయల అంచనాలకు ప్రభుత్వ అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 7333 (30%), కేంద్రం 4230 కోట్లు (18%), 11693 (48%)కోట్లు అప్పు, 1033 కోట్లు (4%) ప్రైవేట్ సంస్థలు తీసుకురావాలని నిర్ణయించారు.

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల జీతం కోత వెనుక చైనా హస్తం?

2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికా ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ భారతీయ సంతతికి చెందిన సీఈవో సత్య నాదెళ్ల జీతం 63 శాతం పెరిగి దాదాపు 7.91 కోట్ల డాలర్లకు (సుమారు రూ. 665 కోట్లు) చేరింది. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) ఫైలింగ్ ప్రకారం.. నాదెళ్ల స్టాక్ అవార్డులు గణనీయంగా పెరిగాయి. గత సంవత్సరం.. ఆయన $39 మిలియన్ విలువైన స్టాక్ అవార్డును అందుకున్నారు. అది ఇప్పుడు $71 మిలియన్లకు పెరిగింది. అయితే.. సైబర్ సెక్యూరిటీ ఆందోళనలను ఉటంకిస్తూ నాదెళ్ల తన నగదు పరిహారాన్ని తగ్గించాలని అభ్యర్థించినట్లు కూడా ఫైలింగ్ వెల్లడించింది. ఈ నిర్ణయం వెనుక ‘చైనా కోణం’ గురించి కూడా సూచించారు.

లాడ్జిలో మైనర్‌ బాలికపై అత్యాచారయత్నం.. యువకుడు అరెస్ట్

తిరుపతిలోని ఓ లాడ్జిలో మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఫోక్సోకేసులో ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతిలోని ఓ విద్యాలయంలో ఆ బాలిక 9వ తరగతి చదువుతున్నట్లు తెలిసింది. బాలిక ప్రవర్తనను గమనించిన తల్లిదండ్రులు విషయం ఆరా తీసి అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చెన్నైలోని ఓ హోటల్‌లో పని చేస్తున్న సతీష్‌కు బాలిక ఆన్‌లైన్‌ ద్వారా పరిచయమైంది. యువకుడిని వెస్ట్ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామానికి చెందిన సతీష్ (22)గా గుర్తించారు. నిందితుడిపై ఫోక్సోకేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు అలిపిరి పోలీసులు.

రెండు మూడు రోజుల్లో రాష్ట్ర భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళిక

విశాఖపట్నం కలెక్టరేట్‌లో విశాఖ, అనకాపల్లి జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు మూడు రోజుల్లో రాష్ర్ట భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళిక ఆవిష్కరిస్తామన్నారు. పది పాయింట్లతో కూడిన అభివృద్ధి ప్రణాళికతో 2047 నాటికి అన్నింటా ముందంజలో ఉంటామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

జార్ఖండ్ ఎన్నికల్లో డిప్యూటీ సీఎం భట్టి బిజీ బిజీ

ఈ దేశంలో, జార్ఖండ్ రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణకు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల గెలుపు అనివార్యమని ఏఐసిసి సీనియర్ పరిశీలకుడు, స్టార్ క్యాంపెనర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం ఆయన జార్ఖండ్ రాష్ట్రంలోని రామ్ గడ్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. శనివారం రాంఘడ్ నియోజకవర్గంలోని దుల్మి, చిత్తార్పూర్, గోలాస్ బ్లాక్ లలోని ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇంటింటి ప్రచారం ,బూత్ లెవల్ మీటింగ్స్ ఏర్పాటు,సోషల్ మీడియా ప్రచారం వంటి అంశాలపై స్థానిక బ్లాక్ కాంగ్రెస్ నేతలకు సలహాలు, సూచనలు ఇచ్చారు. రాంఘడ్ అసెంబ్లీ నియోకవర్గ నుండి కాంగ్రెస్ అభ్యర్థి మమతా దేవి నీ అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు. పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ, న్యాయ, భావ ప్రకటన, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వం ఉండాలని రాజ్యాంగాన్ని రచించుకొని శాసనంగా రూపొందించుకున్నామని ఆ లక్ష్యం అందరికీ అందాలంటే ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల గెలుపు కీలకమని పార్టీ నేతలకు సూచించారు.

ప్రతి మహిళకు భరోసా ఇచ్చేందుకు వీలుగా దీపం-2 పథకం

తిరుపతిలో దీపం-2 పథకం కార్యక్రమాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే వారిపై ఛాలెంజ్ విసురుతున్నానని.. వైసీపీ నేతలు దీపం-2 పథకం కార్యక్రమాలకు రావాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉచిత సిలిండర్ ఇస్తున్న విషయాన్ని వైసీపీ నేతలు గమనించాలన్నారు. వైసీపీ నేతలు చెప్పే మాటలను ప్రజలు నమ్మవద్దన్నారు. దేశంలో ఎక్కడా లేని దీపం పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం నిజాయితీతో, చిత్తశుద్థితో పనిచేస్తోందని చెప్పారు. బటన్ నొక్కామని ప్రజలను నిత్యం మోసం చేసిన వారెవరో ప్రజలకు తెలుసన్నారు. మహిళలకు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. ప్రతి మహిళకు భరోసా ఇచ్చేందుకు వీలుగా దీపం-2 పథకాన్ని తీసుకొచ్చామన్నారు.

వ్యవస్థలను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నాం..

రాష్ట్రం వెంటిలేషన్ మీద ఉందని.. నేడు వెంటిలేటర్ మీద నుంచి ఆక్సిజన్ తీసుకునే పొజిషన్‌కు వచ్చిందన్నారు. ఎన్నికలలో హామీలు ఇచ్చారు, ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నిస్తారు కానీ.. ఈ రాష్ర్టానికి అప్పులు ఉన్నాయని చెబితే వినే పరిస్థితి లేదన్నారు.చంద్రబాబు రాష్ట్రంలో పుట్టడం అదృష్టమన్నారు. క్లిష్ట సమయంలో సీఎంగా చంద్రబాబు ఉన్నారని వెల్లడించారు. చంద్రబాబు కాకుండా ఇంకా ఎవరిని సీఎం సీట్లో కుర్చో పెట్టినా దండం పెట్టి పారిపోతారన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఏ శాఖలో కూడా డబ్బులు లేవని.. ఎవరికి ఏది ఇద్దామన్నా సిల్లిగవ్వలేదన్నారు. కోట్ల రూపాయల బకాయిలు, 12 లక్షల కోట్లు అప్పుందన్నారు.

ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకరావొద్దు

ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకరావొద్దని, 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ, ధాన్యం కొనుగోళ్ళకు 30 వేల కోట్ల అంచనా వేసినట్లు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే కొనుగోళ్లకై 20 వేల కోట్ల కేటాయించినట్లు ఆయన తెలిపారు. అవసరమయితే అదనపు నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు సృష్టించవద్దన్నారు. ప్రభుత్వం, రైస్ మిల్లర్లు పరస్పరం తోడ్పాటు నందించుకోవాలని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల సహకారం తప్పనిసరి అని ఆయన అన్నారు. సియంఆర్ ప్రభుత్వానికి చేరగానే బ్యాంక్ గ్యారంటీ వాపస్ అని, కలెక్టర్లు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పర్వవేక్షించాలన్నారు.

 

Show comments