NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

అసెంబ్లీ వేదికగా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించిన భట్టి విక్రమార్క

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఇందులో ఉద్యోగాల సంఖ్య ఉండదని, నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే ప్రకటిస్తామని తెలిపారు. ఇది కేవలం ప్రకటన మాత్రమేనని దీనిపై చర్చ ఉండదని అసెంబ్లీలో భట్టి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక TGPSCని ప్రక్షాళన చేశామని, కొత్త నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని వివరించారు. గ్రూప్ 2 పరీక్షను ఆగస్టు 7 8 తేదీల్లో నుండి డిసెంబర్ కు వాయిదా వేయటమైంది. రాష్ట్రంలో అనేక రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ప్రభుత్వ ఉద్యోగ నియమకాలు నిర్వహిస్తున్నందున పరీక్షా తేదీల మధ్య కావలసిన సమయం లేకపోవడం వల్ల దరఖాస్తుదారులు తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నారు. యుపీఎస్సీ మాదిరిగా పరీక్షల రద్దు లేదా వాయిదాలు అనేవి లేకుండా అట్టి సమస్యను నివారించడానికి పరీక్షలు వద్ద సరిపడా ప్రిపరేషన్ సమయం ఉండేలాగా రిక్రూట్మెంట్ ఏజెన్సీలో ముందుకు పోతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వివిధ శాఖలలో నిర్వహించే డైరెక్టర్ రిక్రూట్మెంట్ కొరకు ప్రభుత్వ ఒక వార్షిక క్యాలెండర్ తయారు చేసి తేదీ ఒకటి ఎనిమిది 2024 నాడు జరిగిన మంత్రి మండల సమావేశంలో చర్చించి ఆమోదించడమైనది. ఈ తెలంగాణ జాబ్ క్యాలెండర్ను గౌరవ సభ్యుల సమాచారం కొరకు తెలియజేయడమైనది. ఈ తెలంగాణ జాబ్ క్యాలెండర్ 2024 25 సంబంధించి సభ్యులు అందరికి కూడా సర్కిల్ చేయడం కూడా జరిగిందని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను థాంక్యూ’ అని భట్టి విక్రమార్క అన్నారు.

మరో పతకానికి చేరువలో మను భాకర్..

భారత స్టార్ షూటర్ మను భాకర్ తన అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తుంది. శుక్రవారం మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో ఫైనల్‌కు అర్హత సాధించింది. మను క్వాలిఫికేషన్ రౌండ్‌లో రెండో స్థానంలో నిలిచింది. మరో భారత క్రీడాకారిణి ఇషా సింగ్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. ఇషా క్వాలిఫికేషన్‌లో 18వ స్థానంలో నిలిచింది. మను భాకర్.. వరుసగా మూడో ఈవెంట్ ఫైనల్‌కు అర్హత సాధించింది. అంతకుముందు.. మను భాకర్, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి ఫైనల్స్‌కు చేరుకుంది. రెండింటిలోనూ కాంస్య పతకం సాధించింది. కాగా.. తాజాగా 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ఫైనల్కు చేరింది. ఈ క్రమంలో మను హ్యాట్రిక్ పతకాలు సాధించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఒక ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయురాలు మను భాకర్. మను రేపు (శనివారం) 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో ఫైనల్ ఆడనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభం కానుంది.

తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉపాధ్యాయుల పాత్ర కాదనలేనిది

ఎల్‌బీ స్టేడియంలో కొత్తగా పదోన్నతులు పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు.. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారులు, అధికారులు, ప్రొఫెసర్ కోదండరాం సహా తదితరులు హాజరయ్యారు. కొత్తగా పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు సైతం భారీగా సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ భవిష్యత్ ఎక్కడుంది అని ఈ క్షణం నన్ను అడిగితే… వేలాది మంది ఉపాధ్యాయుల రూపంలో ఎల్బీ స్టేడియంలో ఉందని చెబుతా అన్నారు. 30వేల ప్రభుత్వ పాఠశాలల్లో 26లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు వారి భవిష్యత్ ను మీ చేతుల్లో పెట్టారని, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉపాధ్యాయుల పాత్ర కాదనలేనిదన్నారు. రాష్ట్రం వస్తే విద్యా విధానం బాగుపడుతుందనుకున్నాం.. ఉపాధ్యాయుల గౌరవం పెరుగుతుందనుకున్నామని, కోదండరాం, హరగోపాల్, చుక్కా రామయ్యలాంటి వాళ్లకు గొప్ప గౌరవం దక్కుతుందనుకున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో చూశామని, గత పాలకులు ఉపాధ్యాయులను ఏ విధంగా అవమానించారో చూశామన్నారు. ఈ బడ్జెట్ లో విద్యకు 10శాతం కేటాయించాలని భావించామని, కానీ హామీల అమలు దృష్ట్యా 7.3శాతం అంటే రూ.21వేల కోట్లకు పైగా కేటాయించామన్నారు.

52 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాను ఓడించిన భారత్..

భారత హాకీ జట్టు నేడు ఆస్ట్రేలియాతో తలపడింది. పారిస్ ఒలింపిక్స్లో భారత్ తన సత్తాను చాటింది. ఆస్ట్రేలియాపై 3-2 తేడాతో విజయం సాధించి రికార్డు సృష్టించింది. ఒలింపిక్స్ లో ఆస్ట్రేలియాపై భారత్ గెలవడం 52 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. పూల్ బీలో రెండో స్థానాన్ని కైవసం చేసుకోవడంలో ఈ విజయం కీలక పాత్ర పోషించింది. క్వార్టర్-ఫైనల్‌కు ముందు.. హర్మన్‌ప్రీత్ సింగ్ జట్టు తిరిగి విన్నింగ్ ట్రాక్‌లోకి రావాలనుకుంటోంది. గురువారం జరిగిన పూల్ బి మ్యాచ్‌లో బెల్జియం 2-1తో భారత పురుషుల హాకీ జట్టును ఓడించి పారిస్ ఒలింపిక్స్‌లో భారత అజేయ పోరాటాన్ని ముగించింది.

నిరుద్యోగుల ఆశలతో చెలగాటం ఆడుతున్నారు..

గన్‌పార్క్‌ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. గన్‌పార్క్‌ దగ్గర బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆందోళన చేపట్టారు. జాబ్‌ క్యాలెండర్‌ బోగస్‌ అంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మె్ల్యేల నినాదాలు చేస్తున్నారు. ఉద్యోగాల సంఖ్య ప్రకటించకుండా జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వడంపై నిరసన తెలుపుతున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అధికారం లోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారన్నారు. నిరుద్యోగుల ఆశలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడా రాహుల్ గాంధీ అని ఆయన ప్రశ్నించారు. నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు నిజమైతే జాబ్ క్యాలెండర్ లో రెండు ఉద్యోగాలు కూడా పెట్టలేదని ఆయన వ్యాఖ్యానించారు. రెండు లక్షల ఉద్యోగాలపై మాట్లాడడానికి రెండు నిమిషాలు టైం అడిగితే ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం మాట్లాడకుండా పారిపోయిందని ఆయన నిప్పులు చెరిగారు. జీవో 46 ను సవరిస్తామని, ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను మభ్యపెట్టారని, మా పార్టీలో గెలిచి పార్టీ మారిన ఒక వ్యక్తి మాపై అసభ్యంగా మాట్లాడే విధంగా చేస్తున్నారన్నారు. బజారు మాటలు మాపై మాట్లడిపించిన సిఎం కి బుద్ధి ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ అశోక్ నగర్ కి రావాలని డిమాండ్ చేస్తున్నా అన్నారు కేటీఆర్‌.

అమరావతిపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..

రాజధాని నిర్మాణం కోసం రైతులు భూములిచ్చారు అని మంత్రి నారాయణ తెలిపారు. చంద్రబాబు మీదున్న నమ్మకంతో రైతులు భూములిచ్చారు.. గత ఐదేళ్ల కాలంలో రైతులు ఇబ్బంది పడ్డారు.. అమరావతి రైతులకు కౌలును మరో ఐదేళ్లు ఇవ్వాలని నిర్ణయించాం.. రైతు కూలీలకూ పెన్షన్లను మరో ఐదేళ్ల పాటు ఇవ్వాలని నిర్ణయం.. రాజధానిలో భూములు తీసుకున్న సంస్థలతో సంప్రదింపులు జరపనున్నామన్నారు. రాజధానిలో భూములు కేటాయించిన సంస్థలకు తమ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకే మరో రెండేళ్ల పాటు గడువు పొడిగించాం.. సోమ, మంగళవారాల్లో రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ ప్రారంభించాం.. హ్యపీ నెస్ట్ ప్రాజెక్టుని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించామని మంత్రి నారాయణ వెల్లడించారు.

సివిల్ సప్లైస్, ఎక్సైజ్ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష..

సివిల్ సప్లైస్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ధరల నియంత్రణకు వీలైనన్ని మార్గాలు అన్వేషించాలన్నారు. ఇప్పటికే రెండు విడతలుగా నిత్యావసర ధరలను కంట్రోల్ చేయడం మంచి పరిణామమన్నామని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్ల తర్వాత రైతులకు వీలైనంత త్వరగా డబ్బులు చెల్లించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రేషన్ అక్రమాలపై సమీక్షించారు. కాకినాడ కేంద్రంగా ద్వారంపూడి ఫ్యామ్లీ చేపట్టిన రేషన్ అక్రమాల కేసు పురోగతిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. అలాగే, ఎక్సైజ్ శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక అంశాలను ప్రస్తావించారు. నెల రోజుల్లోగా అన్ని మద్యం దుకాణాల వద్దా డిజిటల్ పేమెంట్ల కోసం ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాలపై వారంలో నివేదిక ఇవ్వాలని అధికారులకు తెలిపారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఎక్సైజ్ కుంభకోణంపై త్వరలోనే సీఐడీ విచారణకు ఆదేశించాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

నన్ను జైలులో పెట్టే కుట్ర జరుగుతోంది..

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచనల వ్యాఖ్యలు చేశారు. తనను జైలులో పెట్టే కుట్ర జరుగుతోందని శుక్రవారం అన్నారు. బెంగళూర్ శివారులో బీజేపీ పాదయాత్రను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన ‘‘జన ఆందోళన్ సభ’’ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ నాకు తెలుసు. వారిని చేయనివ్వండి. పరిణామాలను ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నా స్వభావం, సామర్థ్యం ఉన్న ఎందరో నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఎదుగుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై వియేంద్ర చేసిన మోసాలను బయటపెడతాను. అతనికి సత్తా ఉంటే నేను అవినీతికి పాల్పడిన విషయాలు చెప్పనివ్వండి. ఏ ప్రాతిపదికన నన్ను అవినీతి పితామహుడు అని అంటారు..?’’ అని డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంస్య పతకాన్ని కోల్పోయిన ధీరజ్, అంకిత జంట..

మిక్స్‌డ్ డబుల్స్ ఆర్చరీ జోడీ ధీరజ్ బొమ్మదేవర, అంకిత భకత్ కాంస్య పతక పోరులో అమెరికాతో తలపడింది. ఈ క్రమంలో.. భారత జోడీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. భారత జోడీ తొలి రెండు షాట్‌లలో 17 పాయింట్లు సాధించింది. అదే సమయంలో అమెరికా జోడీ కౌఫ్‌హోల్డ్, అల్లిసన్ తొలి రెండు షాట్లలో 19 పరుగులు చేసి రెండు పాయింట్ల ఆధిక్యంలో నిలిచారు. నాలుగో సెట్‌లో భారత జోడీ మొత్తం 35 పరుగులు చేసింది. నాలుగో సెట్‌లో అమెరికా జోడీ 37 పాయింట్లు సాధించి సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. భారత్‌కు కాంస్యం గెలిచి చరిత్ర సృష్టించే అవకాశం ఉండగా.. అయితే ధీరజ్, అంకిత జంట మ్యాచ్‌లో 2-6తో ఓడిపోయి పతకాన్ని కోల్పోయింది.