NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

పేర్ని నాని కారుపై కోడిగుడ్లతో దాడి.. గుడివాడలో ఉద్రిక్తత..!

గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. మాజీ మంత్రి పేర్ని నాని కారు పైన కోడిగుడ్లతో దాడి జరిగింది. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలపై జనసేన పార్టీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు కాచి మరి పేర్ని నాని కాన్వాయ్‌ను అడ్డుకుని కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. తమ అధినేతపై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. అయితే, మాజీ మంత్రి పేర్ని నాని కారుపై కోడిగుడ్లతో దాడి జరిగిన విషయం తెలిసిన వైసీపీ కార్యకర్తలు సైతం అక్కడకు భారీగా చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం దూషణలకు దిగడంతో.. తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒకరిపైకి మరొకరు దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, మాజీమంత్రి పేర్ని నానిపై జరిగిన కోడిగుడ్ల దాడిని వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. సమాజంలో ఇలాంటి దాడులు మంచిది కాదన్నారు.

విజయవాడలో వెనక్కి ప్రవహిస్తోన్న బుడమేరు వాగు

విజయవాడ నగరంలో బుడమేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉండటంతో‌.. వెనక్కి ప్రవహిస్తోంది బుడమేరు వాగు‌.. దీంతో విద్యా ధరపురం ఆర్టీసీ వర్క్ షాపు రోడ్డు మొత్తం నీట మునిగింది. ఇళ్ళలోకి బుడమేరు వాగు నీరు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. గత పదేళ్ళ క్రిందట కృష్ణానది ఒడ్డు దాటి వచ్చింది కానీ.. ఇలా బుడమేరు వాగు నీరు వెనక్కి ప్రవహించడం ఇదే మొదటిసారి అని స్థానిక ప్రజలు అంటున్నారు. అలాగే, బాపట్ల జిల్లాలోని కొల్లూరు మండలం అరవింద వారధి దగ్గర కృష్ణానదికి గండి పడింది. గతంలో ఓసారి ఈ గండి పడితే ఇసుక సంచులతో కప్పి గండి పూడ్చిగా.. మళ్లీ వరద ఉధృతికి గండి తెగిపోవడంతో ఇటుక బట్టీల్లోకి, పంట పొలాల్లోకి వరద నీరు చొరబడుతుంది. కాగా, ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ నుంచి 8 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ రాత్రికి వరద ప్రభావం మరింత పెరిగే అవకాశం మరింత ఉంది. దీంతో కొల్లూరు మండల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

అధికారులు అన్నివేళలా అందుబాటులో ఉండాలి….

వాతావరణ శాఖ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రెడ్ అలార్ట్ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా అన్ని వేళల అందుబాటులో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో జోనల్ కమిషనర్లు, చీఫ్ సిటీ ప్లానర్ తో ఆదివారం జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెరువులు సర్ ప్లస్ అవుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. అధికారులు సిబ్బంది అన్నివేళలా అందుబాటులో ఉండాలని, సెలవులలో వెళ్ళరాదని, ఎలాంటి సెలవులు ఇవ్వబడవని స్పష్టం చేశారు.

భారత పారాలింపిక్ పతక విజేతలతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని..

పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన పారా అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోఢీ ఆదివారం ఫోన్‌లో మాట్లాడి వారి కృషిని అభినందించారు. అథ్లెట్లు మోనా అగర్వాల్, ప్రీతి పాల్, మనీష్ నర్వాల్ మరియు రుబీనా ఫ్రాన్సిస్‌లతో ప్రధాని మాట్లాడినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా.. పతకాలు సాధించిన ప్రతి ఒక్కరినీ ప్రధాని మోడీ అభినందించారు. వారు తమ ప్రదర్శనతో దేశం గర్వించేలా చేశారని కొనియాడారు. అవని లేఖరా తన ఇతర ప్రయత్నాలలో విజయం సాధించాలని మోడీ ఆకాంక్షించారు. అవనీ మరో పోటీలో పాల్గొన్నందున ప్రధానితో ఫోన్‌లో మాట్లాడలేకపోయింది. భారత్‌కు ఇప్పటి వరకు ఐదు పతకాలు లభించాయి. అందులో ఒక బంగారు పతకం కూడా ఉంది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 ఈవెంట్‌లో అవని లేఖరా భారత్‌కు బంగారు పతకాన్ని సాధించింది. మోనా అదే ఈవెంట్‌లో కాంస్యం సాధించింది. మరోవైపు.. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఈవెంట్‌లో మనీష్ నర్వాల్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. అంతేకాకుండా.. మహిళల 100 మీటర్ల T35 ఈవెంట్‌లో ప్రీతి పాల్ కాంస్య పతకాన్ని గెలుచుకోగా.. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1లో రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

ముంపు బాధితుల ఇబ్బందులు ప్రత్యక్షంగా చూశా.. అందరికి అండగా ఉంటా..!

విజయవాడ నగరంలోని సింగ్ నగర్ ప్రాంతంలో వరద ఉధృతి ప్రాంతాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. అక్కడ కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బోట్ల సాయంతో వరద చిక్కుకున్న వ్యక్తులను బయటకు తీసుకువస్తున్నాట్లు.. బాధితులకు ఆహారం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ముంపు బాధితుల ఇబ్బందులు ప్రత్యక్షంగా చూసాను.. బాధితులకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటాను అని పేర్కొన్నారు. ఇంత వరదను ఊహించలేదు.. నా రాజకీయ జీవితంలో ఇలాంటి వరదలు చూడలేదు.. అవసరమైతే మళ్ళీ వస్తాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు.

పాలమాకుల కస్తూర్బా గురుకుల పాఠశాలను సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

శంషాబాద్ మండలం పాలమాకుల కస్తూర్బా గురుకుల పాఠశాలను సందర్శించిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.. పాలమాకుల కస్తూర్బా పాఠశాల విద్యార్థులు గత కొంతకాలంగా ఇబ్బందులకు గురవుతున్న తమను పట్టించుకునే నాధుడే లేడని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. అయితే విషయం తెలుసుకున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈరోజు బాలికలతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుండి అన్ని గురుకులాలకు కావలసిన వసతులు అందించినప్పటికీ ఎక్కడో లోపం కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నట్లు ఆయన గుర్తించారు. అయితే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునేందుకు తమ ప్రభుత్వం రెడీగా ఉందని ఎక్కడ కూడా గురుకులంలో చదివే విద్యార్థులకు ఇబ్బందులు లేవని అన్నారు..

రాష్ట్రంలో ఆటవిక పాలన.. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది..!

వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్‌కు అండగా న్యాయ సహాయం కోసం గుడివాడ మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ వెళ్లారు. అయితే, అక్కడ వారిపై కార్లపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడి చేయడం దారుణమని ఎమ్మెల్సీ బొత్స నారాయణ అన్నారు. గుడివాడలో మాజీ మంత్రి పేర్నినాని వాహనాలపై దాడులు, దౌర్జన్యాలు చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించారు. ఈ ఘటనపై కృష్ణా జిల్లా ఎస్పీకి మాజీమంత్రి ఫోన్‌ చేశారు. పోలీసుల తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలకు భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఆటవిక పాలన, రెడ్‌ బుక్‌ రాజ్యాంగం కొనసాగుతుంది.. గుడివాడలో మాజీ మంత్రి పేర్నినాని లక్ష్యంగా రెండు సార్లు దాడులు చేశారు. కార్లపై దాడి చేసి అద్దాలు పగలగొట్టిన టీడీపీ, జనసేన నేతలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసుల సమక్షంలోనే దౌర్జన్యం, దాడులు జరిగాయని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. భారీ వర్షానికి నీట మునిగిన తండ్రీకూతురు

మహబూబాబాద్ జిల్లాలో విషాదం మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షానికి తండ్రి కూతురు నీట మునిగి చనిపోయారు. ఆదివారం ఉదయం మరిపెడ (మ) పురుషోత్తమాయగూడెం దగ్గర ఉన్న బ్రిడ్జి పై నుండి వరదనీరు.. ప్రవహిస్తున్న ప్రవాహాన్ని అంచనా వేయకుండా వెళ్లిన కారు కొట్టుకొని పోయి ఇద్దరు మృతి చెందారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన నూనావత్ మోతిలాల్, నూనావత్ అశ్వినిగా గుర్తింపు. కారులో తండ్రీకూతురు ఇద్దరూ హైదరాబాద్ విమనాశ్రయానికి బయలుదేరారు. అయితే.. పురుషోత్తమాయగూడెం ఆకేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో అదుపుతప్పి నీటిలోకి కొట్టుకుపోవడంతో ఇద్దరు గల్లంతు అయ్యారు. తమ కారు వాగులోకి మునిగి మెడవరకు నీరు వచ్చిందంటూ అంటూ బంధువులకు ఫోన్ లు చేసిన చెప్పిన కొద్ది సేపటికే ఫోన్ ఆఫ్ కావడంతో ఆందోళనకు గురైన బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో వెతికే పనిలో పడ్డారు అటు బంధువులు, ఇటు అధికారులు.

సారీ బాలయ్య.. సినీ రంగ ప్రవేశ స్వర్ణోత్సవ వేడుకలకు రాలేకపోతున్నాను..

ఆంధ్ర ప్రదేశ్ లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున్న వరద సంభవించడంతో క్షేత్రస్థాయిలో సీఎం చంద్రబాబు పర్యటించి.. సహాయక చర్యల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష మందికి ఆహారం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే, రేపు ( సోమవారం ) సినీ రంగ ప్రవేశ స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్న ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఉత్పన్నమైన సమస్యల పరిష్కారంలో నిమగ్నమై ఉన్నందున హైదరాబాద్ లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇక, నందమూరి బాలకృష్ణ మరెన్నో ఘన విజయాలు సాధించాలని, తెలుగు చలన చిత్ర సీమలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా మరిన్ని పాత్రలు పోషించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం

శని, ఆదివారాల్లో కురుస్తున్న వర్షాలకు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. వరద నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మెదక్, సంగారెడ్డి జిల్లాల కంటే సిద్దిపేట జిల్లాలో ఎక్కువ వర్షం కురిసింది. ఆదివారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య సిద్దిపేటలోని మిరుదొడ్డి మండలంలో 152.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ కాలంలో సిద్దిపేటలోని 12 మండలాల్లో 100 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కాగా, మెదక్‌లోని రెండు మండలాల్లో 100 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.

భారీ వర్షాల కారణంగా పదుల సంఖ్యలో వాగులు జీవం పోసుకున్నాయి. పలు చోట్ల వాగులు రోడ్లపైకి ప్రవహించడంతో జిల్లాలోని మిగిలిన ప్రాంతాలతో పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా బారికేడ్లు వేసి పలు రహదారులను మూసివేశారు. మెదక్‌ జిల్లాలోని ఘన్‌పూర్‌ ఆనికట్‌, హల్దీ ప్రాజెక్టు, పోచారం ఆనకట్ట, వందలాది చెరువులు ఆదివారం ఉదయం పొంగిపొర్లుతున్నాయి. సింగూరు జలాశయానికి ఇన్ ఫ్లో 15,622 క్యూసెక్కులకు పైగా చేరింది. జలాశయంలో పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలకుగాను ప్రస్తుత నిల్వ 17.30 టీఎంసీలకు చేరుకుంది.

 

Show comments