ఆర్టీసీ డిపోలు మూతపడుతూ.. ప్రైవేట్ బస్సులు పెరుగుతున్నాయి..!
మూడేళ్ళ తరువాత ఆర్టీసీలో సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడిందని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ జరగలేదని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా ప్రైవేట్ బస్సులు తిరుగుతున్నాయన్నారు. ఆర్టీసీ డిపోలు మూతపడుతూ.. ప్రైవేటు బస్సులు అధికంగా పెరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డిపోల మూసివేతను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లాభ నష్టాలతో కాకుండా కొత్త బస్సులను పెంచి.. గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులు పెంచాలని కోరారు.
పవన్, అదే జరిగితే నీ పార్టీని మూసేసుకుంటావా.. మాజీ మంత్రి సవాల్
ఉభయ గోదావరి జిల్లాల్లో సై అంటే సై అంటూ జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఛాలెంజ్‌పై తాజాగా మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పందించారు. పవన్ కళ్యాణ్ పగటి కలలు కంటున్నారని, ఆ కలల్ని మానుకోవాలని సూచించారు. ఒకవేళ గోదావరి జిల్లాల్లో వైసీపీ గెలిస్తే.. నువ్వు నీ జనసేన పార్టీని మూసుకుని వెళ్తావా? అంటూ పవన్‌కి సవాల్ విసిరారు. తన సవాల్‌ను స్వీకరించే దమ్ముందా? అని ఛాలెంజ్ చేశారు. ఎమ్మెల్యే కాదు కదా.. కనీసం అసెంబ్లీ గేటు కూడా దాటే అర్హత పవన్‌కి లేదని ఎద్దేవా చేశారు. ఒక్కచోట కూడా గెలవని వాడు సవాల్ విసురుతుంటే.. తనకు నవ్వొస్తుందని దుయ్యబట్టారు. ఉభయగోదావరి జిల్లాల్లో తమని ఓడించడం కాదని, ముందు అభ్యర్థుల్ని వెతుక్కోవాలని హితవు పలికారు. ప్రజలకు మంచి చేస్తున్న సీఎం జగన్‌పై ఈర్ష్యపు మాటలు ఆపకపోతే.. పవన్ కళ్యాణ్‌కి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
అప్పుడు సైలెంట్‌గా ఉండీ.. శాంతి నెలకొనే టైంలో కాంగ్రెస్ ఏడుస్తోంది..
మణిపూర్ ఘర్షణలు మరో 10 రోజుల్లో తగ్గుముఖం పడుతాయని, రాష్ట్రంలో శాంతి నెలకొంటుందని అస్సాం సీఎం హిమంత బిశ్వసర్మ అన్నారు. కేంద్ర హోం శాఖ, మణిపూర్ ప్రభుత్వాలు గత రెండు నెలల నుంచి జరుగుతున్న ఘర్షణలను తగ్గించేందుకు పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. మణిపూర్ రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ మౌనంగా ఉండీ.. శాంతి నెలకొనే సమయంలో ఏడుస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. మణిపూర్ ఘర్షణ సమయంలో రాహుల్ గాంధీ అక్కడికి వెళ్లలేదని, శాంతి నెలకొనే సమయంలో అక్కడికి వెళ్లారని దుయ్యబట్టారు.
దేశంలో ఇప్పటికప్పుడు ఎన్నికలు వస్తే బీజేపీదే అధికారం.. తెలంగాణ, ఏపీలో పరిస్థితి ఇదే..
దేశంలో నరేంద్రమోడీ హవా తగ్గలేదని తాజా సర్వేలు చెబుతున్నాయి. 2024 లోకసభ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో టైమ్స్ నౌ నవభారత్ సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘జన్‌గన్‌కామన్’ పేరుతో ఈ సర్వేను నిర్వహించింది. దేశంలో ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే.. మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడం పక్కా అని చెబుతోంది. బీజేపీ కూటమికి 543 సీట్లకు గానూ 285-325 వరకు సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. ఇక కాంగ్రెస్ పార్టీకి 111-149 స్థానాలు వస్తాయని సర్వేలో తేలింది.
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ఏపీ జేఏసీ అమరావతి లక్ష్యం
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని తాజాగా ఏపీ జేఏసీ అమరావతి ప్రెస్ నోట్ విడుదల చేసింది. రెగ్యులర్, కాంట్రాక్ట్ ప్రధాన ఆర్ధికేతర సమస్యలను చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించిందని.. కానీ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు మాత్రం ఇంకా అపరిస్కృతంగా ఉన్నాయని పేర్కొంది. వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, వాటి పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని వెల్లడించింది. పశుసంవర్థక శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారామెడికల్ స్టాఫ్, ఔట్‌సోర్సింగ్ లాబ్ అటెండెంట్‌లకు పెంచిన జీతాలు జనవరి వరకూ చెల్లించారని తెలిపింది. అయితే.. ఆర్ధిక శాఖ ఆమోదం లేదని, ఉద్యోగులు చేయని తప్పుకు ఫిబ్రవరి-2023 నుండి తిరిగి పాత జీతాలు చెల్లించడం చాలా దారుణమని మండిపడింది. ప్రభుత్వం స్పష్టంగా మినిమం టైం స్కేల్ వర్తింపచేయమని ఉత్తర్వులు ఇచ్చినా, కేవలం ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా తక్కువ వేతనాలు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.
మహారాష్ట్ర బస్సు అగ్నిప్రమాదం.. 25 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఇదే కావచ్చు..
మహారాష్ట్రలో ఘోర బస్సు అగ్నిప్రమాదంలో 25 మంది సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రధాని నరేంద్రమోడీ సంఘటనలో మరణించిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బుల్దానా జిల్లాలో సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదం జరిగింది. మొత్తం 33 మంది ప్రయాణికుల్లో 8 మంది ప్రాణాలతో బయటపడ్డారు. బస్సు నాగ్‌పూర్ నుంచి పూణే వెళ్తున్న సమయంలో అగ్నికి ఆహుతైంది.
మానవత్వం చూపిన పోలీసులు.. చిన్నారిని లాలించిన మహిళ కానిస్టేబుల్..!
తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ – 4 పరీక్ష(Group-4 Exam) ప్రశాంతంగా జరిగాయి. పేపర్-1 ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు, పేపర్-2ను మధ్యాహ్నం 2:30 గంటలకు నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించారు. 8,180 పోస్టుల భర్తీ కోసం గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదలవగా.. 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్ – 4 పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,846 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. రాష్ట్రంలో తొలిసారి మండల కేంద్రాలలో కూడా ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు.
ఈస్ట్ ఆర్ వెస్ట్ “బిర్యానీ” ఈస్ బెస్ట్.. ఏకంగా 7.6 కోట్ల బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ ఈ పేరు వింటే చాలు నోట్లో లాలాజలం లీకవుతుంది. అంతగా ఈ బిర్యానీకి మన ప్రజలు అలవాటయ్యారు. ఇప్పటికీ మనం రెస్టారెంట్లకు వెళ్తే ముందుగా గుర్తొచ్చే పదం బిర్యానీనే. ఇది లేకుండా ప్రస్తుతం ఏ పార్టీ కూడా ఫినిష్ కావడం లేదు. జూన్ 2 ‘ఇంటర్నేషనల్ బిర్యానీ డే’ సందర్భంగా ప్రముఖ ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫాం స్విగ్గీ ఓ నివేదికను విడుదల చేసింది. గత 12 నెలల్లో ఏకంగా 7.6 బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ పేర్కొంది. జనవరి 2023 నుండి జూన్ 15, 2023 వరకు చేసిన స్విగ్గీ ఆర్డర్లను పరిశీలిస్తే ఏకంగా 8.26 శాతం బిర్యానీ ఆర్డర్లు పెరిగాయి. 2022 ఇదే కాలంతో పోలిస్తే గత ఐదున్నర నెలల్లో బిర్యానీ ఆర్డర్‌లలో ఈ వృద్ధి నమోదైనట్లు వెల్లడించింది.
అందుకే రాజీనామా చేయాలనుకున్నా.. ఆ తర్వాత నిర్ణయం మార్చుకున్న..
మణిపూర్ ఘర్షణల నేపథ్యంలో శుక్రవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ రాజీనామాకు సిద్దమయ్యారు. రాజధాని ఇంఫాల్ జరిగిన హైడ్రామా నేపథ్యంలో ఆయన రాజీనామా నిర్ణయాన్ని విరమించుకున్నారు. రాజీనామాను గవర్నర్ కి సమర్పించేందుకు రాజ్ భవన్ వెళ్లే సందర్భంలో ఆయన మద్దతుదారులు సీఎం ఇంటి ముందు భారీగా చేరుకున్నారు. రాజీనామా చేయవద్దని డిమాండ్ చేశారు. దీంతో ఆయన తన రాజీనామాపై వెనక్కి తగ్గారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజీనామా చేయనని ఆన్నారు.
రేపటితో ముగియనున్న భట్టి పాదయాత్ర
ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఆరోగ్యం క్షీణించిన లెక్కచేయకుండా భట్టి విక్రమార్క తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలని నిర్విరామంగా 1360 కిలోమీటర్లు కొనసాగింది. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మంలో ఆదివారం నిర్వహించే తెలంగాణ జన గర్జన లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, గురునాథ్ రెడ్డి లాంటి నాయకులు కాంగ్రెస్ లో చేరతారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి ప్రజాప్రస్థానం పాదయాత్రలో రైతుల ఆత్మహత్యలకు గల కారణాలను తెలుసుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం ఉచిత కరెంటుపై చేసి రైతు సంక్షేమం. ” కోసం అనేక పథకాలు తీసుకువచ్చిన తరహాలోనే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన పాదయాత్రలో పోడు భూములు, ధరణి సమస్యలతో ఎదుర్కొంటున్న రైతులు ఇబ్బందులను నేరుగా తెలుసుకోవడంతో పాటు ఆ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో కూడా గట్టిగా చెప్పారు.
