టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది
టీడీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని.. పార్టీ ఫిరాయింపులను టీడీపీ నాయకులు ప్రోత్సహిస్తున్నారన్నారని మండిపడ్డారు. గుంటూరులో అంబటి మీడియాతో మాట్లాడారు. ‘‘కేవలం 11 స్థానాలు గెలిచిన కూటమి ఎలా స్థాయి సంగం ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఇప్పటికే నలుగురికి పచ్చ కండువాలు వేసేశారని.. టీడీపీ పెట్టిన క్యాంప్‌లో ఫ్యాన్ గుర్తుపై గెలిచిన కార్పొరేటర్‌లు ఉన్నారు. మేము కోడి పిల్లలను కాపాడుకున్నట్లు మా కార్పొరేటర్లను కాపాడుకుంటున్నాం. టీడీపీ వాళ్లు మా కార్పొరేటర్లను గద్దలు తన్నుకుపోయినట్టుగా తన్నుకుపోతున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చేస్తున్న పనులు.. చంద్రబాబు గమనించాలి. పెమ్మసానికి ప్రజాస్వామ్య విలువలు చంద్రబాబు నేర్పించాలి. పెమ్మసాని నిజాయితీగా సంపాదించిన రూ.5 వేల కోట్ల సొమ్ముతో అప్రజాస్వామికంగా కార్పొరేటర్లను కొంటున్నారు.’’ అని అంబటి ఆరోపించారు.
‘‘ఈ బడ్జెట్ ప్రజల గొంతుని వినిపించింది’’: ఆర్థిక మంత్రి..
2025 కేంద్ర బడ్జెట్‌లో ఆదాయ పన్నుల ప్రకటనలు, రిబేట్ సీలింగ్ రూ. 7 లక్షల నుంచి రూ. 12 లక్షలకు పెంచడాన్ని ప్రస్తావించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బడ్జెట్ ప్రజల గొంతును వినిపించిందని అన్నారు. శనివారం బడ్జెట్ ప్రసంగం తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. రిబేట్ పెంపు కారణంగా ఒక కోటి మంది పన్ను చెల్లింపుదారులు, ఆదాయపు పన్ను చెల్లించరని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ‘‘మాది స్పందించే ప్రభుత్వమని, ఫలితంగా జూలైలో నేను ప్రకటించిన ఆదాయపు పన్ను సరళీకరణ ఇప్పటికి పూర్తయింది. మేము వచ్చే వారం బిల్లును తీసుకువస్తాము. కాబట్టి పన్నులతో సహా సంస్కరణల గురించి పని పూర్తి చేశాం’’ అని ఆర్థిక మంత్రి అన్నారు.
వారు తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలి
జాతీయ పార్టీలు ఎప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్ తో రుజువైందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ రెండు పార్టీల నుంచి చెరో ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే ఆ 16 మంది కలిసి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తెచ్చింది అక్షరాల గుండు సున్నా అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన రేవంత్ రెడ్డి బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకోవడం వల్ల ఇవాళ ఈ పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. వరుసగా రెండో ఏడాది తెలంగాణకు చిల్లి గవ్వ కూడా తీసుకురాలేకపోయిన బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఎంపీలు తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్వీయ రాజకీయ అస్తిత్వమైన బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ హక్కులను, జాతి ప్రయోజనాలను కాపాడగలుగుతుందని ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పిన మాట ఈ రోజు మరోసారి గుర్తుకు వస్తుందన్నారు. లోక్ సభలో తెలంగాణ పార్టీ అయినా బిఅర్ఎస్ కి ప్రాతినిధ్యం లేకుంటే జరిగే నష్టం ఏమిటో ప్రజల గమనిస్తున్నారన్నారు. పార్లమెంట్ లో ప్రాంతీయ పార్టీలకు బలమున్న బిహార్, అంద్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు దక్కిన ప్రాధాన్యం చూసి జాతీయ పార్టీలను గెలిపిస్తే తెలంగాణను నిండా ముంచారని ప్రజలకు అర్ధం అయిందన్నారు.
రక్షణ రంగానికి రూ.6.81 లక్షల కోట్లు.. ఆధునికీకరణకు పెద్దపీట..
2025 బడ్జెట్‌లో రక్షణ రంగానికి కేంద్రం ప్రాధాన్యత ఇచ్చింది. ముఖ్యంగా రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 2025-26 బడ్జెట్‌లో ఢిఫెన్స్ రంగానికి రూ.6.81 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గతేడాది రూ. 6.2 లక్షల నుంచి 9.55 శాతం పెరుగుదల. ముఖ్యంగా పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో సైనిక సన్నద్ధతను మరింత పెంచే దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. బడ్జెట్‌లో రూ. 3.11 లక్షల కోట్లను రెవెన్యూ వ్యయంగా కేటాయించారు. ఇది 2024-25లో రూ. 2.83 లక్షల కోట్లుగా ఉంది. సాధారణ సాయుధ దళాల రోజూ వారీ నిర్వహణను ఇది కవర్ చేస్తుంది. ఇందులో జీతాలు, పరికరాల నిర్వహణ, మందుగుండు సామాగ్రి, ఇతర వినియోగ వస్తువులతో పాటు సైన్యాన్ని ఎప్పటికప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉంచేందుకు, భద్రతా ముప్పుని ఎదుర్కునే సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది.
కేంద్ర బడ్జెట్ తెలంగాణ పట్ల వివక్ష
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్షత సష్టంగా కనిపించిందన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. దాదాపు సగం లోకసభ స్థానాలు బీజేపీ ఎంపిలు గెలిచినా రాష్ట్రానికి సాధించింది సున్నా అని ఆయన అన్నారు. విభజన హామీలను పదకొండేళ్ళువుతున్నా ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదని, కేవలం బీజేపీ ప్రభుత్వానికి అండగా ఉన్న బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకే ప్రత్యేకంగా నిధులు కేటాయించారని ఆయన మండిపడ్డారు. ఢిల్లీ ఎన్నికలను పెట్టుకొని ఉద్యోగులు, మధ్యతరగతి ఓటర్లు ఎక్కువ ఉన్నందునే ఆదాయ పన్ను పరిమితిని పెంచారని, ఇటీవల నిజామాబాద్ ప్రకటించిన జాతీయ పసుపు బోర్డు, అంతకు ముందు ఏడాది ప్రకటించిన గిరిజన యూనివర్సిటీకి సంబంధించి నిధుల కేటాయింపుపై స్పష్టత లేదన్నారు..
కాల్పులతో దద్ధరిల్లిన బలూచిస్తాన్.. 18 మంది సైనికులు, 12 మంది ఉగ్రవాదులు హతం..
పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్ కాల్పులతో దద్దరిల్లుతోంది. ఉగ్రవాదులకు, సైన్యానికి జరిగిన ఘర్షణల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. ఈ ఘర్షణల్లో 18 మంది భద్రతా సిబ్బంది, 12 మంది ఉగ్రవాదులు మరణించినట్లుగా తెలుస్తోంది. జనవరి 31-ఫిబ్రవరి 1 రాత్రి సమయంలో ప్రావిన్స్‌లోని కలాట్ జిల్లాలోని మంగోచార్ ప్రాంతంలో రోడ్డుని ఉగ్రవాదులు దిగ్భందించడంతో ఈ సంఘటన జరిగిందని పాక్ సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది.
బడ్జెట్‌పై పవన్‌కల్యాణ్ ప్రశంసలు.. వికసిత్ భారత్‌కు తోడ్పడుతుందని వ్యాఖ్య
పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. వికసిత్ భారత్ వైపు నడిపించేలా కేంద్ర బడ్జెట్ ఉందంటూ కితాబు ఇచ్చారు. ఏపీకి అమూల్యమైన ప్రోత్సాహం ఇస్తున్న ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ మన దేశాన్ని వికసిత్ భారత్ వైపు నడిపించేలా ఉందని.. రైతులు, మహిళలు, మధ్యతరగతి, యువత… ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకున్నారని చెప్పారు. 10 లక్షల విలువైన క్రెడిట్ కార్డులు మంజూరు చేయడం వల్ల సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు ఊతం ఇచ్చినట్లు అయిందని పేర్కొన్నారు. 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ మహిళ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ.2 కోట్ల రుణాలతో ఆ వర్గాల మహిళల ఆర్థిక స్వావలంబన జరుగుతుందన్నారు. రూ.12 లక్షల వరకూ వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు మూలంగా ఉద్యోగ వర్గాలకు ఎనలేని ఊరట లభించిందని పేర్కొన్నారు.
మోసం చేసే బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రశంసలు కోరుకుంటున్నారు
కేంద్ర బడ్జెట్‌పై విపక్షాలు పదవి విరిచాయి. ఎన్డీఏ మిత్రపక్షాలు మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే మాత్రం బడ్జెట్‌ను తప్పుపట్టారు. యావత్ దేశం ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలతో బాధపడుతుంటే.. ప్రభుత్వం మాత్రం కేంద్ర బడ్జెట్‌ను ప్రశంసించే పనిలో బిజీగా ఉందని ఖర్గే విమర్శించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రజలను మోసం చేసేలా ఉందని ధ్వజమెత్తారు.
గత పదేళ్లల్లో మధ్యతరగతి ప్రజల నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం రూ.54.18 లక్షల కోట్ల మొత్తాన్ని పన్నుల రూపంలో వసూలు చేశారన్నారు. ఇప్పుడు రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చి.. కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయంతో సగటున ఏడాదికి రూ.80 వేలు ఆదా చేసుకోవచ్చని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. దేశం మొత్తం ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో పోరాడుతుంటే.. మోడీ ప్రభుత్వం మాత్రం ప్రశంసల కోసం తాపత్రయపడుతున్నారని విమర్శించారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పుల కలకలం
హైదరాబాద్ ఐటీ హబ్‌గా పేరుగాంచిన గచ్చిబౌలిలో శనివారం సాయంత్రం (ఫిబ్రవరి 1) కాల్పుల ఘటన సంచలనం సృష్టించింది. పాత నేరస్తుడి అరెస్టుకు రంగం సిద్ధం చేసిన పోలీసులు అతడ్ని పట్టుకునేందుకు స్థానికంగా ఉన్న ప్రిజం పబ్‌ను చేరుకున్నారు. అయితే, పోలీసుల రాకను గమనించిన నిందితుడు క్షణాల్లో స్పందించి తన వద్ద ఉన్న తుపాకీతో పోలీసులపైకి కాల్పులు జరిపాడు.ఈ ఘటనలో నిందితుడు రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. వీటిలో ఒకటి పబ్‌లో పనిచేసే బౌన్సర్‌కు, మరొకటి కానిస్టేబుల్ వెంకట్‌రామ్‌రెడ్డికి తగిలి గాయాలయ్యాయి.
కేంద్ర బడ్జెట్.. కోట్లాది మంది ఆకాంక్షలు నెరవేర్చే బడ్జెట్
పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి ప్రసంశలు కురిపించారు. కోట్లాది మంది ఆకాంక్షలు నెరవేర్చే బడ్జెట్ అంటూ కితాబు ఇచ్చారు. ఈ మేరకు ఆమె ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. ఆర్ధికవృద్ధిని, దేశ అభివృద్ధిని ప్రోత్సహించే బడ్జెట్ అంటూ కొనియాడారు. ముఖ్యంగా భారతదేశ వృద్ధిలో కీలకంగా వ్యవహరించే మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే విధంగా బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు, మహిళలు, యువత ఇలా అన్ని రంగాలను ప్రోత్సహించే విధంగా బడ్జెట్ ఉందని పురందేశ్వరి తెలిపారు.