NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

న్యూ ఇయర్ వేడుకలపైకి దూసుకెళ్లిన కార్, కాల్పులు.. 10 మందికి పైగా మృతి..!

అమెరికాలో న్యూ ఓర్లీన్స్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. న్యూ ఇయర్ రోజున జనంపైకి ఓ వ్యక్తి కారును పోనిచ్చాడు. పికప్ ట్రక్‌ జనాలపైకి దూసుకెళ్లడంతో పలువురు మరణించినట్లు తెలుస్తోంది. నిందితుడైన వ్యక్తి జనాలపైకి కాల్పులు జరిపినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. బోర్బన్ స్ట్రీట్, ఐబెర్‌విల్లే కూడలిలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న జనాలపైకి ట్రక్‌ దూసుకెళ్లింది. ఈ సంఘటన తెల్లవారుజామున 3:15 గంటల ప్రాంతంలో జరిగింది. బాధితుల సంఖ్యను ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ ఘటనలో 10 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. 30 మంది వరకు గాయపడినట్లు సమాచారం.

మన్మోహన్ సింగ్ స్మారకం నిర్మించేది ఇక్కడేనా.. కేంద్రం చర్యలు..

భారత మాజీ ప్రధాని, భారత ఆర్థిక వ్యవస్థ రూపశిల్పిగా పేరున్న మన్మోహన్ సింగ్ ఇటీవల మరణించిన విషయం మనకు తెలిసిందే. ఆయన మరణం తర్వాత ఆయన స్మారక చిహ్నంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదం నెలకొంది. అయితే, కేంద్రం తాజాగా మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం నిర్మించేందుకు ప్రక్రియ ప్రారంభించింది. సోర్సెస్ ప్రకారం.. రాజ్‌ఘాట్, రాష్ట్రీయ స్మృతి స్థల్ లేదా కిసాన్ ఘాట్ సమీపంలో 1 నుండి 1.5 ఎకరాల స్థలం స్మారక చిహ్నం కోసం ప్రతిపాదించబడినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాలను ఇప్పటికే పట్టణాభివృద్ధి శాఖ అధికారులు పరిశీలించారు. ఈ రెండు స్థలాల్లో ఒకటి ఎంచుకోవాలని మన్మోహన్ కుటుంబ సభ్యులకు అధికారులు సూచించినట్లు సమాచారం.

హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు శుభవార్త.. మేడ్చల్, శామీర్‌పేట్‌ వరకు మెట్రో పొడగింపు..!

హైదరాబాద్ ఉత్తర భాగం నగరవాసుల మెట్రో రైల్ కల నెరవేరబోతోంది. హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు నూతన సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ప్యారడైజ్- మేడ్చల్ (23 కిలోమీటర్లు); జేబీఎస్- శామీర్ పేట్ (22 కిలోమీటర్లు) మెట్రో కారిడార్లకు డీపీఆర్ ల తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంటనే డీపీఆర్ లను సిద్ధం చేసి మెట్రో రైల్ ఫేజ్-2 ‘బి’ భాగంగా కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించవలసిందిగా హెచ్ఏఎంఎల్ ఎండీ  ఎన్వీఎస్ రెడ్డిని ఆదేశించారు. ఈ రోజు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ దానకిషోర్, హెచ్ఏఎంఎల్ ఎండీ శ్రీ ఎన్వీఎస్ రెడ్డితో ఈ రెండు కారిడార్లకు డీపీఆర్ తయారీ విషయంలో చర్చించి ముఖ్యమంత్రి ఈ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.

సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల డిమాండ్లు పూర్తిగా న్యాయమైనవి

మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో సమస్యలు చాయ్ తాగినంత త్వరగా పరిష్కరిస్తామని చెప్పిన వారే ఇప్పుడు ఏమి చేస్తున్నారు? అని ఆమె ఎద్దేవా చేశారు. బుధవారం గద్వాలలో 23 రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న సర్వశిక్షా అభియాన్ (SSA) ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆమె, వీరి డిమాండ్లకు పూర్తిగా మద్దతు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ, “సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల డిమాండ్లు పూర్తిగా న్యాయమైనవి. వీరిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. 23 రోజులుగా సమ్మె జరుగుతున్నా, ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరం,” అని పేర్కొన్నారు.

త్వరలో 1995 సీఎంను చూస్తారు.. వారికి చంద్రబాబు హెచ్చరిక

నూతన సంవత్సరం వేళ ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో 1995 సీఎంను చూస్తారని చంద్రబాబు అన్నారు. మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడుతూ.. తాను రాజకీయ కక్షలకు పాల్పడనని చెప్పారు. అలాగని.. తప్పు చేసే వాళ్లను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడతానని చెప్పుకొచ్చారు. సెకీ అంశం తనకు లాడ్డూ లాగే అనిపిస్తుందన్నారు. అమెరికా నుంచి పూర్తి కార్డు రాలేదన్నారు. వచ్చిన తర్వాత ఏం చేయాలో నిర్ణయిస్తామన్నారు. ఇటీవల ఎక్కువగా చర్చ జరుగుతున్న సినీ అంశంపైన చర్చించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సినీ హబ్ ఉంది. అమరావతికి అంత అవసరంలేదు. గతంలో హైదరాబాద్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసినా.. సరిగ్గా కమ్యూనికేట్ చేయలేదన్నారు. అమరావతి విషయంలో అది జరగదన్నారు.

కామారెడ్డి డిక్లరేషన్‌లో పేర్కొన్న హామీలను వెంటనే అమలు చేయాలి

తెలంగాణ రాష్ట్ర బీసీల హక్కులకు అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీసీల హక్కుల కోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జనవరి 3న నిర్వహించనున్న బీసీ మహాసభ పోస్టర్‌ను కవిత బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపు విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోంది. కామారెడ్డి డిక్లరేషన్‌లో పేర్కొన్న హామీలను వెంటనే అమలు చేయాలి,” అన్నారు. సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా బీసీ మహాసభను భారీ స్థాయిలో నిర్వహించేందుకు తెలంగాణ జాగృతి సిద్ధమవుతోందని కవిత తెలిపారు. ఈ మహాసభలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు, కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలులోకి తీసుకురావాలన్న డిమాండ్లు ప్రధానంగా ఉండనున్నాయి.

సీఎం హామీ ఇచ్చారు.. కలెక్టర్ అమలు చేశారు..

పల్నాడు జిల్లా యలమంద గ్రామానికి చెందిన ఉల్లంగుల ఏడుకొండలుకు కలెక్టర్ పి.అరుణ్ బాబు ఎయిర్ కంప్రెషర్ అందజేశారు. ఉల్లంగుల ఏడుకొండలు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని, వ్యాపారం చేసుకునేందుకు సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఎం ఆదేశాన్ని.. జిల్లా కలెక్టర్ వెంటనే అమలు చేశారు. బుధవారం ఉదయం ఏడుకొండలు ఇంటిని సందర్శించిన కలెక్టర్ ఎయిర్ కంప్రెషర్ ను అందజేశారు.

మాదాపూర్ పేస్ హాస్పిటల్ లో దారుణం.. ఠాగూర్ సినిమా సీన్ రిపీట్

మాదాపూర్ పేస్ హాస్పిటల్ లో దారుణం చోటు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయింది. ఠాగూర్ సినిమాను తలపించేలా వైద్యం చేశారు పేస్ హాస్పిటల్ సిబ్బంది. అసలు విషయం ఏమిటంటే రెండు రోజుల క్రితం లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్న క్రమంలో పేస్ హాస్పిటల్ లో లింగంపల్లికి చెందిన ఎల్లమ్మ (60) అనే మహిళను కుటుంబ సభ్యులు చేర్చారు. హాస్పిటల్ చేర్చుకునే సమయంలో రెండు లక్షల 20 వేలు కట్టించుకున్నారు పేస్ హాస్పిటల్ సిబ్బంది. ఇక నిన్న ఉదయం ఎల్లమ్మ ఆరోగ్యం మెరుగుపడిందని పేస్ హాస్పిటల్ డాక్టర్లు ఆమె కుటుంబ సభ్యులకు తెలిపారు.

అందరికీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తా.. ప్రజలకు అందరూ అందుబాటులో ఉండండి

తనకు కలవడానికి వచ్చిన ఎమ్మెల్యే, మంత్రులకు సీఎం రేవంత్ దిశా నిర్దేశం చేశారు. నేను మారిన… మీరు మారండని, ఇవాళ అందరు మంత్రులకు నేనే ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పినా అని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల పని తీరు… ప్రోగ్రెస్ పై సర్వే రిపోర్ట్ లు నా దగ్గర ఉన్నాయన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. నా ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా తెప్పించా అని, అందరికీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తా అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలకు అందరూ అందుబాటులో ఉండండని ఆయన సూచించారు. ఏడాది పాలనలో మనకు తెలిసి తప్పు చేయలేదు… తెలియకుండా జరిగిన తప్పులపై చర్యలు తీసుకున్నామన్నారు. ఏడాది పాలన అనుభవాలు…వచ్చే నాలుగేళ్లకు ఉపయోగపడతాయని, అంగన్ వాడి… డీలర్ల నియామకం లో పార్టీ నాయకులకు అవకాశం ఇవ్వండని సీఎంని ఓ మంత్రి కోరడంతో.. ఆన్లైన్ లో దరఖాస్తులు తీసుకుని… పారదర్శకంగా నియామకాలు చేయకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని సీఎం రేవంత్ చెప్పారు.

రేపు ఏపీ కేబినెట్‌ సమావేశం.. వీటికి ఆమోదం తెలపనున్న ప్రభుత్వం..

రేపు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఆరు నెలల పాలన పూర్తి కావడంతో ప్రభుత్వం పారిశ్రామికంగా దూకుడు పెంచుతోంది. క్లీన్ఎన‌ర్జీలో పెట్టుబ‌డులు పెట్టెందుకు రాష్ట్రానికి భారీ కంపెనీలు రానున్నాయి.. రాష్ట్రంలో కొత్తగా ఐదు సంస్థలు రూ. 83 వేల కోట్ల పెట్టుబడితో వివిధ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నాయి. దీంతో కేవలం క్లీన్ ఎనర్జీ రంగంలోనే 2 ల‌క్షల 50 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) నెల్లూరు జిల్లా రామయ్య పట్నంలో 6 వేల ఎకరాల్లో రూ. 96,862 కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ఏర్పాటు చేసేందుకు ముందుకు వ‌చ్చింది. దీని వ‌ల‌న‌ 2,400 మందికి ఉపాధి కలగనుంది. మొత్తం 9 మిలియన్ మెట్రిక్ టన్నులు సామర్థ్యంతో ఐదు బ్లాకుల్లో రానున్న ఈ ప్రాజెక్టులో టౌన్‌షిప్, లెర్నింగ్ సెంటర్, రిఫైనరీ, పెట్రోకెమికల్స్ యూనిట్స్, క్రూడ్ ఆయిల్ టెర్మినల్, గ్రీన్ హెచ్2, అడ్మినిస్ట్రేషన్ బ్లాకులు నిర్మించ‌నున్నారు. వచ్చే 20 ఏళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి రూ. 88,747 కోట్ల ఆదాయం రానుంది.. 2029లోగా మొత్తం ప్రాజెక్టు పూర్తి కానుంది.