NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదు.. సీఎం కీలక వ్యాఖ్యలు

ఏపీలో ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకంను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని ఈదుపురం నుంచి ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. చంపినపుడు పీడ విరగడైందని ప్రజలు సంబరాలు, దీపావళి చేసుకున్నారు.. తాజా ఎన్నికల్లో నరకాసురుడిని ఓడించామని చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. 93 శాతం స్ట్రైక్ రేట్.. 43 ఏళ్లైంది పార్టీ పెట్టి.. ఎప్పుడూ ఇన్ని సీట్లు గెలవలేదని అన్నారు. తనను అనేక మంది హింస పెట్టారు.. రాజీ లేని పోరాటం చేశామని చెప్పారు. దౌర్భాగ్యకరమైన రోజులు చూశాం.. స్వేచ్ఛే లేదని చంద్రబాబు అన్నారు.

ఎన్ని అక్రమ కేసుల పెట్టినా భయపడేది లేదు….

ఎన్ని అక్రమ కేసుల పెట్టినా భయ పడేది లేదని, సోయల్ మీడియాలో పోస్టులు పెడితే మా కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. ఇవాళ మహబూబ్ నగర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కేసు నమోదు అయిన వరద భాస్కర్ కుటుంబాన్ని మేము పలకరించడానికి వెళితే భాస్కర్ తల్లి కన్నీరు పెట్టిందన్నారు. నన్ను చిత్రహింసలకు గురి చేశారని వరద భాస్కర్ మాతో ఆవేదన వ్యక్తం చేశారని, వికలాంగుల ఇళ్లు కూల్చి వారిని రోడ్డుపై పడేసారన్నారు. ఇప్పటికి ఇంకా చాలా ఇండ్లను కూ లుస్తామని భయపెడుతున్నారని, ప్రస్తుతం మహబూబ్ నగర్ లో సరైన వైద్యం అందడంలేదన్నారు శ్రీనివాస్‌ గౌడ్‌. పేదవాడికి వైద్యం అందలేదని మంచి హాస్పటల్ నిర్మాణం అప్పట్లోనే చేపట్టాలని ఆదేశాలు ఇచ్చానని, మహాయంలో ప్రారంభమైన హాస్పటల్ ను పూర్తి చేయడం ఇప్పటికి ఎమ్మెల్యేకు సాధ్యం కావడం లేదన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలు కూడా మా హాయంలోనే ఇక్కడికి తీసుకు వచ్చామని, అసత్య ప్రచారాలలో మేము కాంగ్రెస్ వాళ్ళను ఓడించలేమన్నారు శ్రీనివాస్‌ గౌడ్‌.

ఉచిత గ్యాస్ సిలిండర్లపై వైసీపీ దుష్ప్రచారం సిగ్గుచేటు..

ఉచిత గ్యాస్ సిలిండర్లపై వైసీపీ దుష్ప్రచారం సిగ్గుచేటని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, కలెక్టర్ తమీమ్ అన్సారియాలతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు సాగుతోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు.

హర్యానా ఫలితాలపై తీవ్ర అసంతృప్తి.. ఈసీపై చట్టపరమైన చర్యలకు వెనకాడబోమని హెచ్చరిక

హర్యానా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌కు ఇంకా అనుమానాలు తీరడం లేదు. హర్యానా పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. అన్ని కూడా కాంగ్రెస్ వైపే ఉన్నాయి. కాంగ్రెస్‌దే అధికారం అంటూ ఊదరగొట్టాయి. కానీ ఫలితాలు వెలువడే సరికి అంతా రివర్స్ అయింది. ఊహించని విధంగా బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. ముచ్చటగా మూడోసారి కమలం పార్టీ హ్యాట్రిక్ కొట్టింది. దీంతో కాంగ్రెస్‌‌ భారీ షాక్‌కు గురైంది. ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. ఈసీ మాత్రం కాంగ్రెస్ ఆరోపణలను అప్పుడే తోసిపుచ్చింది. తాజాగా మరోసారి కాంగ్రెస్ ఆరోపణలు చేయడంతో ఈసీ స్పందించి ఖండించింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్స్ నమ్ముకుని మోసపోయిందంటూ ఎద్దేవా చేసింది. తమకు ఫలితాలు అనుకూలంగా రాకపోవడంతో ​కాంగ్రెస్‌ నిరాధార అరోపణలు చేస్తోందని మండిపడింది. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదని వ్యాఖ్యానించింది.

మీకు పది నెలల పాలనే విసుగొస్తే పదేళ్లు మిమ్మల్ని ఎలా భరించారు

మాజీ మంత్రి కేటీఆర్ పై మెదక్ ఎంపీ రఘునందన్ రావు సెటైర్లు వేశారు. కేటీఆర్ రాజకీయాలు బంద్ చేయాలని ఉంది అన్నాడని, బంద్ చెయ్యి ఎవరు వద్దు అనలేదు…అమెరికా వెళ్లిపో అంటూ రఘునందన్‌ రావు వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న పదేళ్లు కేటీఆర్ ప్రజలను కలిసే సమయం దొరకలేదని, మీ నాన్న 10 నెలలుగా ఫామ్ హౌస్ లో ఉన్నారు..ఏమైనా నష్టం జరిగిందా అని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ వచ్చింది ప్రజల కోసం కాదు ఆయన వచ్చింది డబ్బుల కోసం, అధికారం కోసం, ఫామ్ హౌస్ కోసమని, మీకు పది నెలల పాలనే విసుగొస్తే పదేళ్లు మిమ్మల్ని ఎలా భరించారని, కేటీఆర్ మోకాళ్ళ యాత్ర చేసిన ప్రజలు విశ్వసించరని రఘునందన్‌ రావు అన్నారు. కేటీఆర్ కు తన నాన్న, చెల్లె, బావతో పాటు ఎవరిపై నమ్మకం లేదని, ఫామ్ హౌస్ కేసులో పాలేవో.. నీళ్ళేవో తెలాలంటే సీసీ ఫుటేజ్ బయట పెట్టాల్సిందే అని రఘునందన్‌ రావు అన్నారు. తెలంగాణలో ఆడవాళ్లు తాగుతారని కోరుట్ల ఎమ్మెల్యే అంటున్నారని, తెలంగాణలో ఎక్కడైనా ఆడవాళ్లు తాగుతారా అని ఆయన వ్యాఖ్యానించారు. దీపావళికి బజార్లలో బాంబులు పేలాయి కానీ పొంగులేటి చెప్పిన కుక్క తోక పటాకులు కూడా పేలలేదని ఆయన అన్నారు.

రాజకీయాలలో ఎదుగుతున్న ఒక దళితుడిని టార్గెట్ చేస్తున్నారు.. తప్పు తేలితే దేనికైనా సిద్ధం

మాజీ మంత్రి మేరుగ నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. ఎవరో ఒక మహిళ తాడేపల్లి పోలీసు స్టేషన్‌లో తనపై ఫిర్యాదు చేసిందని.. తాను ఆమెను శారీరకంగా లోబర్చుకుని, రూ. 90 లక్షలు తీసుకున్నానని ఆరోపిస్తుందని అన్నారు. తాను ఏ పరీక్షకైనా సిద్ధం అని తెలిపారు. రాజకీయాలలో ఎదుగుతూ ఉన్న ఒక దళితుడిని, పేదవాడిని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో తన తప్పు ఉందని తేలితే ఉరి శిక్షకైనా సిద్ధమని పేర్కొన్నారు. తనపై కోపం ఉంటే చంపండి.. అంతేగానీ ఇలాంటి దుష్ప్రచారం చేయకండని ఆయన సూచించారు.

రామ్ సినిమా రంగంలోకి వస్తునందుకు థ్రిల్లింగ్ గా ఉంది

నందమూరి ఫ్యామిలీ నుంచి నాలుగో తరం హీరో టాలీవుడ్‌కి రాబోతున్న సంగతి విధితమే. నందమూరి జానకిరామ్ కొడుకు, నందమూరి హరికృష్ణ మనవడు ఎన్టీఆర్ టాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. వైవీఎస్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్ కొత్త హీరోగా తెరంగేట్రం చేయనున్నాడు. అతి త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్నాడు. దర్శకుడు వైవిఎస్ చౌదరి ఫస్ట్‌ లుక్‌ రివీల్‌ దీపావళి సందర్భంగా అందించారు. ఇకపోతే, ఎన్టీఆర్ మంచి సైజు, రంగు, మంచి వాయిస్ కూడా ఉంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు సినిమా పరిశ్రమలోకి వస్తునందుకు విషెస్ చెప్పారు.

విద్యుత్ సబ్సిడీ నిధులు విడుదల

తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది, ఇది రాష్ట్రంలో విద్యుత్ సబ్సిడీని మెరుగుపరచడానికి దోహదపడనుంది. ట్రాన్స్ కో సంస్థలకు రూ. 4,791 కోట్ల సబ్సిడీ నిధులను మంజూరు చేసినట్టు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ నిధులు 2024 నవంబర్ నుండి 2025 మార్చి వరకు ఐదు నెలల కాలానికి సంబంధించి ఇవ్వబడతాయని అధికారిక ఉత్తర్వుల్లో స్పష్టం చేయబడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన ఆరు ముఖ్యమైన గ్యారంటీలలో ఒకటి ‘గృహాజ్యోతి’ పథకం, ఇది లబ్ధిదారులకు జీరో విద్యుత్ బిల్ ను అందిస్తోంది. ఈ పథకం కింద, లబ్ధిదారులు పొందుతున్న జీరో బిల్‌కు సంబంధించిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆయా ట్రాన్స్ కో సంస్థలకు చెల్లించడానికి బాధ్యత వహిస్తోంది. ఇది ఆర్థికంగా బలహీన వర్గాలకు, ముఖ్యంగా కులాల వారికి, విద్యుత్ భారాలను తగ్గించేందుకు దోహదపడుతుంది.

అభిమానులకు కృతజ్ఞతలు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన కమల్

దీపావళి సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చి అలరించాయి. అమరన్, లక్కీ భాస్కర్, క, భగిర సినిమాలు విడుదలయ్యి అన్ని సినిమాలు ప్రేక్షకుల ఆదరణను పొందుతున్నాయి. ఇకపోతే, నటుడు కమల్ హాసన్ నిర్మతగా వ్యవహరించిన సినిమా ‘అమరన్’. యాక్షన్ సెంటిమెంట్ మిలిటరీ బ్యాక్ గ్రౌండ్ గా తెరకెక్కిన ఈ సినిమా.. విడుదలైన ప్రతి చోట సూపర్ హిట్ టాక్ ను అందుకుంది. ఇకపోతే, కమలహాసన్ తాజాగా అమరన్ సినిమా విజయం పై ఆనందం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన సినీ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. అందులో భాగంగా విడుదలైన అన్ని చోట్ల అమరన్ సినిమాకు మంచి ఆదరణ దక్కిందని.. కొన్ని సినిమాలు ఆనందాన్ని ఇస్తాయని, మరికొన్ని గౌరవాన్ని తీసుకొస్తాయని తెలిపాడు. మరికొన్ని సినిమాలు గర్వపడేలా చేస్తాయని చెబుతూ.. అమరన్ సినిమా ప్రతి ఒక్కరు గర్వపడేలా చేస్తుందని తెలిపాడు. ఈ విషయం తాను సినిమా ప్రారంభ సమయంలోనే చెప్పానని.. దీనికోసం సినిమా సభ్యులు దాదాపు మూడేళ్లు శ్రమించారని చెబుతూ, మంచి చిత్రాన్ని ప్రేక్షకులు సెలబ్రేట్ చేసుకుంటారని నా నమ్మకం మరోసారి నిజమైందంటూ ఆయన పేర్కొన్నారు.