NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

ఇందిరాగాంధీని “భారతమాత” అన్న వ్యాఖ్యలపై కేంద్రమంత్రి వివరణ..

మాజీ ప్రధాని ఇందిరాగాంధీని “భారతమాత” అని కేంద్రమంత్రి సురేష్ గోపీ శనివారం వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో.. ఆ వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు. ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీకి ‘తల్లి’ అని అన్నానని, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఈరోజు మీడియాకు తెలిపారు. తాను హృదయపూర్వకంగా మాట్లాడే వ్యక్తినని.. ఇందిరా గాంధీ గురించి తాను మాట్లాడిన దాంట్లో తప్పు లేదని అన్నారు. ఎవరికీ నచ్చినా, నచ్చకపోయినా… కేరళలో కాంగ్రెస్ పార్టీకి తండ్రి కె. కరుణాకరన్.. భారతదేశంలో కాంగ్రెస్ కు తల్లి ఇందిరాగాంధీ అని అన్నారు.

రేపు పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించనున్న సీఎం చంద్రబాబు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తన మొదటి పర్యటనలో భాగంగా సోమవారం పోలవరం వెళ్లనున్నారు. ప్రాజెక్టును సందర్శించి వాటి ప్రస్తుత స్థితిగతులను జలవనరులశాఖ అధికారులతో సమీక్షించనున్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు పూనుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారన్నారు. పోల వరం ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధా న్యత కారణంగానే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం చంద్రబాబు పోలవరం పర్యటనకు రానుండడంపై ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.

వండిన వెంటనే ఆహారం తినడం లేదా.. ప్రమాదంలో పడ్డట్టే

వండిన ఆహారాన్ని వెంటనే తింటే ఆరోగ్యంగా ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO ) తెలిపింది. అయితే కొన్ని కారణాల వల్ల కొన్నిసార్లు వండిన ఆహారం తినడంలో ఆలస్యం అవుతూ ఉంటుంది. అయితే.. ఈ విషయాన్ని చాలామంది పట్టించుకోరు. అయితే.. వండిన తర్వాత చాలాసేపు అయిన తర్వాత ఆహారం తినడం ఆరోగ్యకరమైనది కాదని మీకు తెలుసా. దీని వల్ల అనారోగ్యానికి గురవుతామని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై యువకుల రాళ్ల దాడి..

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. భారీ మెజార్టీ సాధించిన కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంగా గద్దెనెక్కారు. కాగా.. రాష్ట్రంలో వైసీపీ పార్టీ నాయకుల ఇళ్లపై కూటమి పార్టీల కార్యకర్తలు ఎగబడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల వైసీపీ నేతలు, వాళ్ల ఇళ్లపై దాడులు జరిగాయి. నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు మాజీ మంత్రుల, మాజీ ఎమ్మెల్యేల ఇళ్లవద్ద కపలా పెంచారు. అయినా దాడులు మాత్రం కొలిక్కి రావడం లేదు. తాజాగా మాజీ మంత్రి జోగిరమేష్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులోని జోగిరమేష్ ఇంటిపై యువకులు రాళ్లురువ్వారు. AP39KD3267 కారులో వచ్చిన యువకులు జోగిరమేష్ ఇంటిముందే కారు ఆపి తమతో తెచ్చుకున్న రాళ్లను ఇంటి పైకి విసిరారు. రాళ్లు రువ్వుతున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీస్ కానిస్టేబుల్‌ పట్ల దురుసుగా ప్రవర్తించారు. కానిస్టెబుల్ వారికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపారు. రాళ్ల దాడి జరిగిన సమయంలో జోగి రమేష్ ఇంట్లో లేరు.

మందుబాబులకు అలర్ట్‌.. రాష్ట్రంలో పెరగనున్న మద్యం ధరలు?

తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి మద్యం ధరలు పెంచుతారు. 2022 మార్చిలో లిక్కర్ రేట్లు పెంచారు. మళ్లీ ఈ ఏడాది మార్చిలోనే పెంచాల్సి ఉంది. కానీ ఎన్నికల కారణంగా ధరల పెంపు వాయిదా పడింది. ఇప్పుడు అన్ని బ్రాండ్ల మద్యంపై 20 నుంచి 25 శాతం వరకు ధరలు పెంచనున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా రూ.37 వేల కోట్ల ఆదాయం సమకూరుతోంది. తెలంగాణలో ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలకు కొంత అదనపు ఆదాయం కావాలి. ఈ మేరకు ప్రస్తుతం మద్యం ధర పెంచితే అదనపు ఆదాయం వస్తుంది. ఇలా అన్ని రకాల ఆల్కహాల్ బ్రాండ్ల ధరలను 20-25% పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఏపీ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పోలా భాస్కర్..

ఏపీ ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పోలా భాస్కర్ ను నియమించింది. కాలేజ్ విద్య కమిషనర్ పోలా భాస్కర్ కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఏపీ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జే. శ్యామలరావు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా నియమితులైన సంగతి తెలిసిందే. టీటీడీ ఈవోగా ఆదివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని ఏపీ ప్రభుత్వం తొలగించింది. దీంతో ఖాళీ ఏర్పడటంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

పెళ్లి కూతురుని కారులో ఎత్తుకెళ్లిన బంధువులు.. ఎందుకంటే..

ఇటీవల సోషల్ నెట్‌వర్క్‌లలో పెళ్లికి సంబంధించిన కొన్ని వార్తలు, వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. చాలా మంది వధూవరులు తమ వివాహాన్ని గుర్తుండిపోయేలా చేయడానికి వివిధ రకాల పనులు చేస్తారు. ఈ సమయంలో కొందరు వధూవరులు తమ వింత ప్రవర్తనతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. తాజాగా ఓ పెళ్లికి సంబంధించిన ఓ వింత వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో, వధువు పెళ్లి అంనతరం తమతో వచ్చేందుకు నిరాకరించిందని బంధువులు ఏకంగా కిడ్నాప్ చేసి మరి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

టెక్సాస్లో ముష్కరుడి కాల్పులు.. ఇద్దరు మృతి

టెక్సాస్లో ఓ ముష్కరుడి జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. శనివారం సాయంత్రం టెక్సాస్‌లోని రౌండ్ రాక్‌లోని ఒక పార్కులో ఈ ఘటనకు పాల్పడ్డాడు. కాగా.. ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి గాయలయ్యాయి. జునెటీన్త్ పండుగ సందర్భంగా అందరూ సరదాగా గడుపుతున్న సమయంలో ముష్కరుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఇద్దరు పిల్లలతో సహా కనీసం ఆరుగురు గాయపడ్డారని CNN నివేదించింది. గాయపడిన వారందరిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

రుషికొండ భవనాలపై విమర్శలు.. స్పందించిన వైసీపీ

రాష్ట్రంలో రుషికొండ భవనాల వివాదం నడుస్తోంది. ఆ భవనాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. అనంతరం ఆ భవాలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియా, మీడియా ఛానెల్ లలో వైరల్ గా మారాయి. వాటిపై చాలా విమర్శలు వస్తున్నాయి. తాజాగా విశాఖ రుషికొండలో భవనాలపై వస్తున్న విమర్శలపై వైసీపీ స్పందించింది. తాజాగా సోషల్ మీడియా వేదిక ద్వారా వివరణ ఇచ్చింది. ‘అవి ప్రభుత్వ భవనాలే. ప్రైవేట్ ఆస్తులు కావు. విశాఖకు గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యంలో భాగంగానే వీటిని కట్టింది. విశాఖ ఆర్థిక రాజధాని అని చంద్రబాబు 1995 నుంచి ఊదరగొడుతున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి విశాఖకు వస్తే ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనం లేదు. వీటి ఫొటోలను వైరల్ చేస్తూ బురదచల్లడం వెనుక ఉద్దేశమేంటో ప్రజలకు తెలుసు’ పేర్కొంది.

తగ్గేదెలే అంటున్న తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలు.. AI తో ప్రచారం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులపై ప్రభావం చూపుతోంది. వార్తలను చదవడానికి AI రూపొందించిన యాంకర్‌లను కొన్ని మీడియా సమూహాలు ఉపయోగించడంతో, కరీంనగర్‌లోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని సిబ్బంది ప్రేరణ పొందారు , AI- రూపొందించిన వీడియోల సహాయంతో విద్యార్థులను ఆకర్షించడానికి ప్రచారాలను ప్రారంభించారు. ఈ ప్రయోజనం కోసం, వారు నిర్దిష్ట పాఠశాలలో అందించబడుతున్న సౌకర్యాల గురించి AI యాంకర్లు వివరించే చిన్న వీడియోలను సిద్ధం చేశారు. ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు ఈ వీడియోలను వాట్సాప్, ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ , ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్ చేస్తున్నారు.

ముస్లిం సోదరులకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌ రెడ్డి

త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ (ఈద్ ఉల్ అజ్ ) పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాం ప్రవక్తల్లో ఒకరైన ఇబ్రహీం అస్సలామ్, అల్లాహ్ ఆజ్ఞను శిరసావహించి తన కుమారుడిని సైతం బలి ఇచ్చేందుకు సిద్ధం కావడాన్ని స్మరిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు సోమవారం ఈ పండుగ జరుపుకుంటున్నారని గుర్తు చేశారు. ప్రవక్తల అచంచలమైన దైవ భక్తి, త్యాగ నిరతికి బక్రీద్ పండుగ అద్దం పడుతుందన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా, దేవుని పై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలని బక్రీద్ పండుగ మానవాళికి గొప్ప సందేశాన్ని ఇస్తుందన్నారు. తమకు ఉన్న దాంట్లో నుంచే ఇతరులకు పంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదనే స్ఫూర్తిని చాటిచెపుతోందని సీఎం అభిప్రాయపడ్డారు.

19వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్

పదేళ్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోరాటానికి ఫలితం లభించింది. గత పదేళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఆయన.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజల తరఫున కొట్లాడారు. రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయినా.. వెనకడుగు వేయలేదు. పట్టువదలని విక్రమార్కుడిలా మూడోసారి ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రజల్ని తనను ఆదరించకపోయినా… రాజకీయాల నుంచి వెనక్కి తగ్గలేదు. మూడో సారి ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవర్ స్టార్ విజయం సాధించాడు. బీజేపీ, టీడీపీతో కలిసి కూటమిగా జనసేనను పోటీగా దింపారు పవన్ కల్యాన్. ఏపీ వ్యాప్తంగా మొత్తం 21 స్థానాల్లో బరిలోకి దిగారు. పోటీ చేసిన అన్ని సీట్లలోనూ విజయం సాధించి చరిత్ర సృష్టించారు. డిప్యూటీ సీఎంతో పాటు పలు కీలక శాఖలు పవన్ కళ్యాణ్ సొంతం చేసుకున్నారు. ఈ మేరకు ఆయన ప్రమాణ స్వీకారం కూడా ముగిసింది. కాగా.. 19వ తేదీన జనసేనాని బాధ్యతలు స్వీకరించనున్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం జనసేనాని పని తీరుపై ఏపీ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.