NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ (బుధవారం) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పవన్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఏపీకి రావాల్సిన నిధులు, విభజన అంశాలు, కేంద్ర ప్రభుత్వ సహకారంపై ప్రధానితో ఆయన చర్చించనున్నారు. అలాగే, జలజీవన్ మిషన్ స్కీమ్‌లో భాగంగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులను సైతం ఇవ్వమని కోరనున్నారు. ఈ పథకాన్ని కొనసాగించాలని కోరే అవకాశం ఉంది. ఇప్పుడు ఏపీలో తాగు నీటి సరఫరా శాఖ మంత్రిగా ఉన్న పవన్.. ఇంటింటికీ కుళాయిని ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. జల జీవన్ మిషన్ ద్వారా ఈ కుళాయిల ఏర్పాటు చేయనున్నారు. అందుకే ఈ పథకాన్ని కొనసాగించాలని ప్రధాని మోడీని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కోరనున్నారు.

చిక్కుల్లో రెజ్లర్ బజరంజ్ పూనియా.. నాలుగేళ్ల నిషేధం

భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) కఠిన చర్యలు తీసుకుంది. యాంటీ డోపింగ్ కోడ్ ఉల్లంఘించిన కారణంగా ఈ నిషేధాన్ని విధించింది. దీని కింద ఇప్పుడు పూనియాపై 4 సంవత్సరాల నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. దింతో ఆటగాడిగా అతని కెరీర్ ముగిసిందని భావించవచ్చు. జాతీయ జట్టుకు ఎంపిక ట్రయల్స్‌లో మార్చి 10న డోప్ టెస్ట్ కోసం తన నమూనాను ఇవ్వడానికి నిరాకరించినందుకు బజరంగ్ పునియాను NADA మంగళవారం నాలుగేళ్లపాటు సస్పెండ్ చేసింది. అంతకుముందు, ఏప్రిల్ 23న టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత రెజ్లర్‌ను NADA మొదట సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ప్రపంచ స్థాయి రెజ్లింగ్ సంస్థ UWW (యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్) కూడా అతనిని సస్పెండ్ చేసింది.

లేటు వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజు.. వధువు ఎవరంటే?

టాలీవుడ్ ప్రముఖ నటుడు సుబ్బరాజు సంతోష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా ఆయనే వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసి.. పెళ్లి ఫోటోను షేర్‌ చేశారు. సుబ్బరాజు తన పెళ్లి గురించి ఎలాంటి హడావుడి చేయకుండా.. సైలెంట్‌గా కానిచ్చేరు.పెళ్లి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. అదే సమయంలో శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం సుబ్బరాజు పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఎన్నో సార్లు ఇంటర్వ్యూల్లో పెళ్లి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆసక్తి లేదు అని సుబ్బరాజు చెప్పిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు 47 ఏళ్ల వయసులో పెళ్లి పీటలు ఎక్కారు. ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్‌తో పాటు పలువురు ప్రముఖులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. సుబ్బరాజు సతీమణి గురించి డీటెయిల్స్ ఇంకా తెలియరాలేదు. భీమవరంలో పుట్టి పెరిగిన సుబ్బరాజు అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు. డైరెక్టర్ కృష్ణవంశీ కంప్యూటర్ బాగు చేసేందుకు వచ్చిన సుబ్బరాజు.. అనుకోకుండా సినీ అవకాశం దక్కించుకున్నారు. ఖడ్గం సినిమాలో ఒక చిన్న పాత్రతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

నేడు కొమురం భీం జిల్లాలో విద్యాసంస్థల బంద్..

కొమురం భీం జిల్లాలో నేడు విద్యాసంస్థల బంద్ కి విద్యార్ధి సంఘాల పిలుపు నిచ్చాయి. వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థి శైలజ మృతికి ప్రభుత్వ అధికారులే నిర్లక్ష్యం కారణమని, బంద్ కు పిలుపు నిచ్చారు. మృతి చెందిన శైలజ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 50 లక్షల ఎక్స్ గ్రేషియ ఇవ్వాలని, వాంకిడి మండలం బంద్ తో పాటు, జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

డిజిటల్‌గా అరెస్ట్‌ అంటూ రూ.7 లక్షలు కొల్లగొట్టిన ఐఐటీ బాంబే విద్యార్థి

ప్రస్తుత రోజుల్లో దేశంలో సైబర్ నేరాల కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇందులో భాగంగా ‘డిజిటల్ అరెస్ట్’ సంబంధించి కేసులు తెరపైకి వస్తున్నాయి. ‘డిజిటల్ అరెస్ట్’ ఒకరకంగా చెప్పాలంటే మానసికంగా ఎవరినైనా నియంత్రించడం లాంటిదే. ఒక్క ఫోన్ కాల్‌తో దీని ఉచ్చులో పడిన వ్యక్తులు లక్షల రూపాయలు పోగొట్టుకున్నట్లే. తాజాగా బాంబే ఐఐటీ విద్యార్థి ఇలాంటి మోసానికి పాల్పడ్డాడు. ఐఐటీ బాంబే విద్యార్థి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)లో ఉద్యోగిగా నటించి కాల్ చేసి బెదిరించి రూ.7.29 లక్షలు మోసం చేసి మొదట ‘డిజిటల్‌గా అరెస్టు’ చేశారని పోలీసులు మంగళవారం తెలిపారు.

ఫెంగల్‌ తుఫాన్‌ ఎఫెక్ట్.. తమిళనాడు, పుదుచ్చేరిలకు రెడ్‌ అలర్ట్‌

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు (బుధవారం) తుఫానుగా మారుతుంది. దీంతో తమిళనాడు, పుదుచ్చరిలకు భారత వాతవావరణ శాఖ అధికారులు రెడ్‌ అలర్ట్ జారీ చేసింది. ఆకస్మిక వరదలు వచ్చే ఛాన్స్ ఉందని పేర్కొనింది. ఈ ఫెంగల్‌ తుఫాను ప్రభావంతో బుధ, గురు వారాల్లో తమిళనాడులోని మూడు జిల్లాలు పుదుచ్చేరిలోని కారైకల్‌లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ సూచించింది. తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్‌లో గురువారం నుంచి శనివారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొనింది.

డైరెక్టర్‌ ఆర్జీవీ ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ

వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌, ప్రముఖ డైరెక్టర్‌ ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ చేయనుంది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. మొత్తం మూడు పిటిషన్లు దాఖలు చేశారు వర్మ.. ప్రకాశం జిల్లా, విశాఖ జిల్లా, గుంటూరు జిల్లాల్లో తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్‌ కోరుతూ.. హైకోర్టు మెట్లు ఎక్కారు వివాదాస్పద దర్శకుడు.. అన్ని పిటిషన్లపై నిన్న ఒకేసారి విచారణ చేపట్టిన హైకోర్టు ఈరోజుకు వాయిదా వేసింది. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ముందు ప్రస్తావించిన వర్మ తరఫు న్యాయవాది.. అత్యవసరంగా విచారణ జరపాలని విజ్ఞప్తి మేరకు ఇవాళ విచారణ జరపనున్నారు న్యాయమూర్తి.. ఇవాళ వర్మకు ఊరట లభిస్తే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తాను ఎక్కడికి పారిపోలేదని షూటింగ్ పనుల్లోనే బిజీగా ఉన్నానని వీడియో విడుదల చేశారు వర్మ.. హైకోర్టు వర్మకు ముందస్తు బెయిల్ నిరాకరిస్తే ఆయన ఏం చేయబోతున్నారనే అంశంపై కొనసాగుతున్న ఉత్కంఠ.

జీడిమెట్ల అగ్నిప్రమాద ఘటన.. ఇంకా అదుపులోకి రాని మంటలు..

జీడిమెట్ల ధూలపల్లి రోడ్డులోని ఎస్‌ఎస్‌వీ ఫ్యాబ్స్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అగ్నికి ఫ్యాక్టరీలోని మూడు అంతస్తులు ఆహుతయ్యాయి. అందులో ఒక భవనం కుప్పకూలింది. మంటలు చెలరేగిన వెంటనే ఫ్యాక్టరీలోని కార్మికులంతా బయటకు పరుగులు తీసి ప్రాణాలు నిలబెట్టుకున్నారు. పరిశ్రమలో మొత్తం 500 మంది కార్మికులు ఉండగా.. మంగళవారం జనరల్ షిప్ట్ లో దాదాపు 200 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం.

పద్మావతి అమ్మవారి ఆలయంలో లక్ష కుంకుమార్చన… సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

రేపటి నుంచి డిసెంబ‌ర్ 6వ తేదీ వ‌ర‌కు తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆల‌యంలో నిర్వహించనున్న కార్తీక బ్రహ్మోత్సవాల‌ను పుర‌స్కరించుకుని నిన్న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ప‌ద్మావ‌తి అమ్మవారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి స‌హ‌స్రనామార్చన నిర్వహించి, ఆ త‌రువాత కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులోభాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసి, అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఆతర్వాత భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. అయితే.. ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార‌ణంగా ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజలసేవను టీటీడీ రద్దు చేసింది. అదే విధంగా నిన్నటి నుంచి డిసెంబర్ 8 వరకు అన్ని ఆర్జిత సేవలు, కుంకుమార్చన, వేదాశీర్వచనం, వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

తుఫాన్‌గా మారనున్న తీవ్ర వాయుగుండం.. దక్షిణకోస్తా, రాయలసీమకు భారీ వర్షసూచన

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఈరోజు తుఫానుగా మారే అవకాశం ఉందని, ఆ తర్వాత రెండు రోజుల్లో శ్రీలంక తీరాన్ని దాటుకుని తమిళనాడు వైపు వెళ్లే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్‌కు’ఫెంగల్‌’గా నామకరణం చేశారు. చెన్నై-పుదుచ్చేరి మధ్య వాయుగుండం తీరం దాటనుంది. ఈ నేపథ్యంలో.. దక్షిణకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అయితే… నెల్లూరు జిల్లాలో నిన్నటి నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. మరో 48 గంటలు దాటిన తర్వాత బాపట్ల, సత్యసాయి, కడప, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది.