ముగ్గురు ఐపీఎస్‌లకు కేంద్రం షాక్.. 24 గంటల్లో ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు..
తెలంగాణలోని ముగ్గురు ఐపీఎస్ అధికారులకు షాక్ ఇచ్చింది కేంద్ర హోం శాఖ. ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్తా, అభిషేక్ మహంతిలను రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించబడ్డ ముగ్గురు అధికారులు.. వెంటనే ఆంధ్రాలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలిచ్చింది కేంద్ర హోంశాఖ.. అంతేకాదు, 24 గంటల్లోగా ఆంధ్రాలో రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసింది.. రాష్ట్ర విభజన సందర్భంగా ఈ అధికారులను ఏపీకి కేటాయించబడ్డారు.. అయితే, ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి తెలంగాణలోనే కొనసాగుతున్నారు ఐపీఎస్ అధికారులు.. ప్రస్తుతం డీజీ ర్యాంకులో కొనసాగుతోన్న అంజనీకుమార్.. రోడ్ సేఫ్టీ డీజీగా ఉండగా.. డీజీ ర్యాంక్‌లో ఉన్న మరో ఐపీఎస్ అధికారి అభిలాష్ బిస్తా.. పోలీస్ ట్రైనింగ్ డీజీగా ఉన్నారు.. ఇక, ఎస్పీ ర్యాంకులో కొనసాగుతున్న అభిషేక్ మహంతి. ప్రస్తుతానికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్నారు.. అయితే, అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతిలను వెంటనే రిలీవ్ చేయాలని ఆదేశించి కేంద్ర హోంశాఖ.. వెంటనే ఏపీ క్యాడర్ లో రిపోర్ట్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది..
ఐడియా అదిరిపోలా.. కుంభమేళాలో డిజిటల్ స్నానం.. రూ. 1100 చెల్లిస్తే చాలు..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా ప్రపంచాన్ని ఆకర్షి్స్తోంది. కనీవిని ఎరుగని రీతిలో ప్రపంచనలుమూలల నుంచి భక్తులు కుంభమేళాలో పాల్గొంటున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి గంగామాతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇప్పటికే కోట్లాదిమంది పవిత్రస్నానాలు ఆచరించారు. మరో నాలుగు రోజులలో మహాకుంభమేళా ముగియనుంది. అయితే ఈ సారి జరుగుతున్న కుంభమేలా 144 ఏళ్లకు వచ్చే ఆధ్యాత్మిక కార్యక్రమం కావడంతో ఇందులో పాల్గొనాలని, త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించాలని చాలా మంది భావిస్తున్నారు. కానీ, చాలా మంది వివిధ కారణాల వల్ల మహా కుంభమేళాలో పాల్గొనలేకపోతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించాడు. పుణ్యస్నానాలను.. డిజిటల్ స్నానాలుగా మార్చేశాడు. అయ్యో కుంభమేళాలలో పాల్గొనలేకపోయామే అనే బాధ లేకుండా భక్తులకు త్రివేణి సంగమంలో డిజిటల్ స్నానాలు చేసే అవకాశాన్ని కల్పించాడు. అసలు ఈ డిజిటల్ స్నానం ఏంటి? అని ఆలోచిస్తున్నారా? కుంభమేళాకు హాజరుకాలేని భక్తులు వారి ఫోటోలను వాట్సా్ప్ లో పంపాలని, వాటిని ప్రింట్ తీసి త్రివేణి సంగమంలో ముంచుతానని ఓ యువకుడు వెల్లడించాడు. తన స్టార్టప్ పేరు ప్రయాగ్ ఎంటర్‌ప్రైజెస్ అని పేర్కొన్నాడు.
శరవేగంగా సిద్ధమవుతున్న ‘సతీ లీలావతి’
మెగా కోడలు లావణ్య త్రిపాఠి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ‘అందాల రాక్షసి’ సినిమాతో హీరోయిన్‌గా పరిచియమై తొలి సినిమాతోనే అందర్ని ఆకట్టుకుంది. దాదాపు అందరు యంగ్ హీరోలందరితో జతకట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇక మెగా హీరో వరుణ్ తేజ్‌ను లావణ్య ప్రేమించి పెళ్లి చేసుకున్న లావణ్య త్రిపాఠి సినిమాలకు కొంత దూరంగా ఉంటుంది. కానీ ఆ మధ్య ‘మిస్ పర్‌ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన లావణ్య తాజాగా ‘సతీ లీలావతి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది.
నేడు ప్రజాభవన్‌లో బీసీ నేతలతో సీఎం రేవంత్ భేటీ
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు నాంది పడుతున్న వేళ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ (పించబడిన వర్గాల) నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో జరగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్ కుమార్ గౌడ్ కూడా ఈ సమావేశంలో ముఖ్య పాత్ర పోషించనున్నారు.
ఈ సమావేశం వల్ల పార్టీ బీసీ నేతలకు స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని అందించడమే కాకుండా, వారిని మరింత చైతన్యవంతం చేయడానికీ అవకాశం ఏర్పడనుంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా కులగణన చేపట్టడం, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా , ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో, ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
స్మోకింగ్ లవర్స్ కి షాక్.. భారీగా పెరగనున్న సిగరెట్ల ధరలు!
పొగ తాగే వారికి ప్రభుత్వం షాకివ్వబోతోంది. త్వరలో సిగరెట్ల ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ పెంచడాన్ని పరిశీలిస్తోంది. దీంతో పన్ను ఆదాయం తగ్గదు. ప్రస్తుతం వీటిపై 28 శాతం జీఎస్టీ కాకుండా ఇతర ఛార్జీలు కూడా విధిస్తున్నారు. దీంతో మొత్తం పన్ను 53 శాతానికి చేరుకుంది. అయితే ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన 75 శాతం కంటే చాలా తక్కువ. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై విధించే పరిహార సెస్సు ముగిసే సమయంలో, వాటిపై జీఎస్టీని పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
భర్త షికారుకి తీసుకెళ్లలేదని ఇల్లాలు అలక.. క్షణికావేశంలో ఆత్మహత్య
చిన్న చిన్న కారణాలకే కొందరు తొందరపాటు నిర్ణయాలతో జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. క్షణికావేశంలో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కళ్లు తెరిచి చూసేలోపే అంతా చీకటైపోతుంది. ఇంతకీ ఏమైందంటారా? భర్త షికారుకి తీసుకెళ్లలేదని.. ఆవేశంలో ఓ ఇల్లాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన ఏపీలోని అనకాపల్లి పట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లి పట్టణంలో నివాసం ఉంటున్న మంగరాపు జ్యోతి.. అబ్దుల్ గని భార్యాభర్తలు. వీరిద్దరూ 2023లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఏడు నెలల కుమారుడు ఉన్నాడు. అయితే భార్య, కుమారుడిని చూసేందుకు భర్త అబ్దుల్ గని అనకాపల్లి వచ్చాడు. అయితే తనను షికారుకు తీసుకెళ్లాలని భర్తను కోరింది. ఇంతలో తల్లి జోక్యం చేసుకుని.. ఈ సమయంలో ఎందుకమ్మా? అని మందలించింది. అంతే ఆవేశంగా మేడ మీదకు వెళ్లి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు హుటాహుటినా.. విశాఖ కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జ్యోతి ప్రాణాలు వదిలింది. దీంతో ఏడు నెలల చిన్నారి.. తల్లి లేని బిడ్డయ్యాడు. దీంతో కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
FBI డైరెక్టర్‌గా కాష్ పటేల్ ప్రమాణ స్వీకారం.. ట్రంప్ ప్రశంసలు
భారతీయ-అమెరికన్ కాష్ పటేల్ భగవద్గీతపై ప్రమాణం చేసి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్‌గా అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. కాష్ పటేల్ ఎఫ్బీఐకి తొమ్మిదవ డైరెక్టర్. ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో పటేల్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఐసెన్‌హోవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ భవనంలో US అటార్నీ జనరల్ పామ్ బోండి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. క్రిస్టోఫర్ వ్రే తర్వాత తొమ్మిదవ FBI డైరెక్టర్‌గా కాష్ పటేల్‌ను US సెనేట్ ధృవీకరించిన విషయం తెలిసిందే. పటేల్ నియామకానికి అనుకూలంగా 51, వ్యతిరేకంగా 49 ఓట్లు వచ్చాయి. ఇద్దరు డెమోక్రాట్లు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు.
ఆస్తిపన్ను బకాయిల్లో షాకింగ్ విషయాలు.. టాప్ టెన్ బకాయి విలువ 203 కోట్లు
ఆస్తిపన్ను బకాయిల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఖైరతాబాద్ జోన్ పరిధిలో టాప్ టెన్ బకాయి విలువ 203 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారెంట్లు జారీ చేసింది జీహెచ్‌ఎంసీ. వందమందికి రెడ్ నోటీసులు జారీ చేసింది జీహెచ్‌ఎంసీ. 5 లక్షలకుపైన ఉన్న బకాయిల విలువ 860 కోట్లుగా అధికారులు తేల్చారు. ఈ చర్యలలో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులు ఇటీవల బంజారాహిల్స్ ప్రాంతంలోని ప్రముఖ తాజ్ బంజారా హోటల్‌ను సీజ్ చేశారు. హోటల్ యాజమాన్యం రూ.1.43 కోట్ల బకాయిని చెల్లించకుండా నిర్లక్ష్యం వహించడంతో రెండు సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. ఫలితంగా గురువారం సాయంత్రం జీహెచ్ఎంసీ అధికారులు హోటల్‌పై సీల్ విధించారు. అయితే, హోటల్ యాజమాన్యం వెంటనే స్పందించి శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆర్టీజీఎస్ ద్వారా రూ.51.50 లక్షలు చెల్లించింది. మిగిలిన బకాయిని మార్చి 15లోపు చెల్లించేందుకు పరిమితి కోరింది. వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు హోటల్‌పై విధించిన సీల్‌ను తొలగించారు.
కడప కార్పొరేషన్ అక్రమాలపై విజిలెన్స్ దర్యాప్తు పూర్తి.. ప్రభుత్వానికి నివేదిక
కడప కార్పొరేషన్‌లో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ కడప ఎమ్మెల్యే మాధవి.. రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. రెండు నెలల క్రితం ఎమ్మెల్యే కంప్లంట్ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విచారణ జరిగింది. తాజాగా నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. కడప మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సురేష్ బాబుపై విజిలెన్స్ విచారణ ముగిసింది. కుటుంబ సభ్యులకు చెందిన వర్ధిని సంస్థకు కాంట్రాక్టులు ఇవ్వడంపై విచారణ జరిపారు. ఇక కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో తన సొంత వాహనానికి బిల్లులు చేసుకున్న వైనంపై కూడా విజిలెన్స్ ఆరా తీసింది. మున్సిపల్ చట్టం నిబంధనలను అతిక్రమించినందుకు పదవులకు అనర్హులవుతారనే సమాచారాన్ని కమిషనర్ ద్వారా మేయర్‌కు లేఖ అందించారు. మేయర్ సురేష్ బాబు సంజాయిషీ కోసం విజిలెన్స్ అధికారులు ఎదురుచూశారు. కానీ మేయర్ సురేష్ బాబు నుంచి ఎటువంటి సంజాయిషీ రాకపోవడంతో నివేదికను విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి పంపించారు.
ఏపీలో చెత్త పన్ను రద్దు.. గెజిట్ జారీ
ఆంధ్రప్రదేశ్‌లో చెత్త పన్నును ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారంలోకి వచ్చాక… చెత్త పన్ను రద్దు చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది డిసెంబర్ 31 నుంచి చెత్త పన్ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా మున్సిపల్ చట్ట సవరణ తర్వాత గెజిట్ జారీ అయింది. ఇక నుంచి ఏపీలో చెత్తపై పన్ను ఉండదు. గత ప్రభుత్వ హయాంలో చెత్తపై పన్ను వేశారు. దీనిపై కూటమి నేతలు విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో ఇదే అస్త్రంగా విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వస్తే.. చెత్త పన్ను రద్దు చేస్తామని ప్రకటించారు. ఎన్నికల హామీల్లో భాగంగా చెత్త పన్ను రద్దు చేశారు.