యుద్ధంతో అతలాకుతలమైన ఇరాన్ నుంచి.. భారత్ కు చేరిన 110 మంది విద్యార్థులు
ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. యుద్ధంతో అతలాకుతలమైన ఇరాన్ నుంచి 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరుకుంది. ఈ విద్యార్థులను మొదట ఇరాన్ నుంచి అర్మేనియాకు తరలించారు. అక్కడి నుంచి వారిని భారత్ కు తీసుకువచ్చారు. ఈ విద్యార్థులలో, 90 మంది జమ్మూ, కాశ్మీర్ కు చెందిన వారు. వీరంతా వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థుల కుటుంబాలు విమానాశ్రయంలో తమ పిల్లల కోసం ఆసక్తిగా ఎదురు చూశాయి. రాజస్థాన్‌లోని కోటకు చెందిన ఓ విద్యార్థి తండ్రి మాట్లాడుతూ.. “నా కొడుకు ఇరాన్‌లో ఎంబీబీఎస్ చేస్తున్నాడు. అతను ఇప్పుడు భారత ప్రభుత్వం పంపిన ప్రత్యేక విమానంలో తిరిగి వచ్చాడు. నేను భారత రాయబార కార్యాలయానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని అన్నారు.
ఇరాన్ పై యుద్ధానికి సిద్ధమవుతున్న అమెరికా.. దాడి ప్రణాళికకు ట్రంప్ ఆమోదం
ఇరాన్ పై దాడి ప్రణాళికకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. తుది ఉత్తర్వుల కోసం వేచి ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. ట్రంప్ తన సీనియర్ సహచరులతో ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇరాన్ పై దాడికి ఆమోదం తెలిపారు. తుది ఉత్తర్వు తర్వాత దాడి జరుగుతుందని, ఈ సందర్భంగా ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉందో లేదో చూడాలని కోరారు. ట్రంప్ సమావేశానికి ముందు, ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ అతని బెదిరింపులను తిరస్కరించారు. అమెరికా యుద్ధంలో చేరితే “తీవ్ర చెడు పరిణామాలు” ఉంటాయని ట్రంప్‌ను బెదిరించారు. ఇరాన్ ఎప్పటికీ తలవంచదని ఆయన అన్నారు. ఏదైనా అమెరికన్ సైనిక జోక్యానికి తీవ్రంగా స్పందిస్తామని, ఇది అమెరికాకు “కోలుకోలేని నష్టాన్ని” కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు. ” ఇరాన్ దేశం, దాని చరిత్ర తెలిసిన తెలివైన వ్యక్తులు ఈ దేశంతో ఎప్పుడూ బెదిరింపు భాషలో మాట్లాడరు.. ఎందుకంటే ఇరాన్ దేశం లొంగిపోదు” అని ఖమేనీ అన్నారు.
బిల్డర్‌ను హనీట్రాప్ చేసిన ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్.. కోట్ల రూపాయల డిమాండ్.. చివరకు
గుజరాత్‌లో హనీట్రాపింగ్ ఆరోపణలపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కీర్తి పటేల్‌ను అరెస్టు చేశారు. గుజరాత్‌కు చెందిన ఒక బిల్డర్ నుంచి రెండు కోట్ల రూపాయలు దోపిడీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కీర్తి పటేల్‌ను అహ్మదాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న కీర్తి పటేల్‌పై గత ఏడాది జూన్ 2న సూరత్‌లో కేసు నమోదు చేశామని, కొంతకాలం తర్వాత కోర్టు కూడా ఆమెపై వారెంట్ జారీ చేసిందని పోలీసులు తెలిపారు. సూరత్‌లో ఓ బిల్డర్‌ను హనీట్రాప్ చేసి, ఆపై బ్లాక్‌మెయిల్ చేసి కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు పటేల్‌పై ఆరోపణలు ఉన్నాయని ఓ అధికారి తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో మరో నలుగురి పేర్లు కూడా ఉన్నాయని వారిని ఇప్పటికే అరెస్టు చేశామని తెలిపారు. భూ కబ్జా, దోపిడీకి సంబంధించిన ఇతర ఫిర్యాదులలో కూడా ఇన్ఫ్లుయెన్సర్ పటేల్ పేరు ఉందని ఆయన తెలిపారు. సూరత్ కోర్టు జారీ చేసిన వారెంట్ ఉన్నప్పటికీ, పటేల్ పలు పట్టణాలకు మకాం మారుస్తూ.. తన ఫోన్‌లో వేర్వేరు సిమ్ కార్డులను ఉపయోగించి పోలీసులను తప్పించుకుని తిరుగుతోంది.
నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం.. సర్వత్రా ఆసక్తి!
ఇవాళ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఉదయం 11 గంటలకు మీడియా సమావేశంలో జగన్ పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు, అక్రమ కేసులు, సూపర్ సిక్స్ హామీల వైఫల్యాలపై వైసీపీ అధినేత మీడియాతో మాట్లాడనున్నారు. నిన్న పల్నాడు జిల్లా పర్యటన నేపథ్యంలో ఈ మీడియా సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైఎస్ జగన్ బుధవారం పల్నాడు జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామ ఉపసర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. పల్నాడు పర్యటనలో వైఎస్ జగన్‌ను అడ్డుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు. జగన్‌కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మారథం పట్టారు. ఓ వైపు పోలీసుల ఆంక్షలు ఉన్నా.. అవేమీ లెక్కచేయకుండా తమ అభిమాన నాయడుకు జగన్ కోసం రోడ్లపైకి వచ్చారు. జగన్ ఇటీవల పర్యటించిన తెనాలి, పొదిలి, రాప్తాడు పర్యటనలకు కూడా జనాలు భారీగా వచ్చిన విషయం తెలిసిందే.
రికార్డులు సృష్టించేందుకు సిద్దమైన విశాఖ!
రికార్డులు సృష్టించేందుకు విశాఖ సన్నద్ధమైంది. యోగాంధ్ర 2025 సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయి. గిన్నీస్ బుక్ సహా 22 రికార్డుల్లో నమోదు అయ్యేలా ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు యోగాభ్యాసంలో 3.5 లక్షల మంది పాల్గొననున్నారు. మొత్తం 5 లక్షల మందితో ఇంటర్నేషనల్ యోగా డే జరగనుంది. ప్రధానమంత్రి మోడీ సమక్షంలో విశాఖ యోగా డే డిక్లరేషన్ ఏపీ ప్రభుత్వం ప్రకటించనుంది.
మరోవైపు నగరంలో ఉత్సాహభరిత వాతావరణం కనిపిస్తోంది. ఎల్లుండి జరిగే ఇంటర్నేషనల్ యోగా డేకు స్నానహాకంగా ఆర్కే బీచ్‌లో వాక్ థాన్ ఉత్సాహంగా జరిగింది. ఏయూ కన్వెన్షన్ సెంటర్ నుంచి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్, ఎస్ సవిత సహా ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు పాల్గొన్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు, ప్రభుత్వ కార్యదర్శి సురేష్ కుమార్, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్, కార్యదర్శి వీరపాండ్యన్‌లు యోగాసనాలు ప్రదర్శనలో పాల్గొన్నారు. యోగాసనాలు ప్రదర్శనలో వందల సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
ఢిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం ఢిల్లీకి బయలుదేరారు. ఆయనతో పాటు నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా ఈ రెండు రోజుల పర్యటనలో పాల్గొంటున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఉదయం 11 గంటలకు ఇంగ్లండ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం సమావేశం కానుంది. ప్రస్తుతం టోనీ బ్లెయిర్ ‘టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ (TBI)’ అనే సంస్థను నడుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఈ సంస్థతో తెలంగాణలో పెట్టుబడులు, సహకార ప్రాజెక్టులపై చర్చ జరగనుంది.
నేడు మరోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో తెలంగాణ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) మరోసారి తన దూకుడును ప్రదర్శిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన సిట్, నేడు ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ను ప్రభాకర్ రావును మళ్లీ విచారణకు పిలిపించింది. ఉదయం 11 గంటలకు ఆయన సిట్ ఎదుట హాజరు కానున్నారు. నిన్న ఉదయం నుండి రాత్రి వరకు ఎనిమిది గంటల పాటు మాజీ ఇంటలిజెన్స్ అధికారి ప్రణీత్ రావును ప్రశ్నించిన సిట్, ఆయన , ఇతర సాక్షుల స్టేట్‌మెంట్‌ల ఆధారంగా ఈరోజు ప్రభాకర్ రావును కూడా కఠినంగా విచారించనుంది. సిట్ ప్రస్తుతం నిందితుల విచారణతో పాటు, సంబంధిత సాక్షుల వాంగ్మూలాలను సేకరించడంలో కూడా శ్రద్ధ పెట్టింది.
45 ఏళ్ల వివాహిత.. వాటర్ సప్లయర్ తో ప్రేమాయణం.. భర్తకు తెలియడంతో..
రాజస్థాన్‌లోని ఝుంఝునులో, పూనమ్ అనే 45 ఏళ్ల మహిళ తనకంటే 14 సంవత్సరాలు చిన్నవాడైన వాటర్ సప్లయర్ కృష్ణ కుమార్‌తో ప్రేమాయణం నడిపింది. అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం భర్తకు తెలియడంతో ఆ మహిళ, తన ప్రేమికుడితో కలిసి తన భర్తను చంపేసింది. హత్య తర్వాత, ప్రమాదంగా చూపించడానికి ప్రయత్నించారు. పోలీసులు తమదైన స్టైల్లో దర్యాప్తు చేయడంతో అసలు యవ్వారం బయటపడింది. ఈ కేసులో నిందితురాలు మహిళ పూనమ్, ఆమె ప్రేమికుడు కృష్ణ కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు.
ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చేయండి.. ఇరానీయులకు రాజవంశీయుడు రెజా పహ్లవి పిలుపు
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చేస్తేనే ఇరాన్ సుభిక్షంగా ఉంటుందని ఇరాన్ రాజవంశీయుడు రెజా పహ్లవి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ముగింపు దిశకు చేరుకుందని.. త్వరలో కూలిపోతుందని తెలిపారు. భవిష్యత్ బాగుండాలంటే ఇరానీయులు తిరగబడాలని కోరారు. ఇది తిరగబడే సమయమని.. ఇరాన్ క్షేమంగా ఉండాలంటే ఇదే మంచి సమయమని.. త్వరలో మీతో ఉంటానని రెజా పహ్లవి పేర్కొన్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఇరానీయులను ఉద్దేశించి ఇరాన్ షా మొహమ్మద్ రెజా పహ్లవి వంశస్థుడు క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లవి కీలక ప్రసంగం చేశారు. ఇరాన్ ప్రజలు అనిశ్చితిని ఎదుర్కొంటున్న సమయంలో ఖమేనీ రహస్య బంకర్‌లో దాక్కున్నాడని.. అలాంటి వ్యక్తి దేశాన్ని ఏం కాపాడతాడని తెలిపారు. దేశం పతనానికి కారణం ఖమేనీనే అని పేర్కొన్నారు. సంవత్సరాలుగా మాతృభూమిని యుద్ధంలో ఆహుతి కాకుండా నిరోధించడానికి ప్రయత్నించినట్లు చెప్పుకొచ్చారు. ఖమేనీ ప్రభుత్వం కూలిపోతేనే.. ఇరానీయులు క్షేమంగా ఉంటారని కోరారు. ఇరాన్‌ను తిరిగి పొందే సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. బందర్ అబ్బాస్ నుంచి బందర్ అంజాలి వరకు, షిరాజ్ నుంచి ఇష్ఫహాన్ వరకు, తబ్రిజ్ నుంచి జహేదాన్ వరకు, మష్హాద్ నుంచి అహ్వాజ్ వరకు మరియు షహర్-ఎ-కోర్డ్ నుంచి కెర్మాన్షా వరకు.. ఇప్పుడు ఖమేనీ పాలనను అంతం చేద్దాం అంటూ వెల్లడించారు. ఇరాన్ ప్రజలకు తాను భరోసా ఇస్తున్నానని.. ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థాపన కోసం సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇరాన్ భవిష్యత్ కోసం.. అభివృద్ధి కోసం ఇదే మంచి తరుణం అని చెప్పారు.
