NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్ న్యూస్

Top Headlines@9am

Top Headlines@9am

అస్సాంలో నీట మునిగిన 27 జిల్లాలు.. వరదలకు విలవిలలాడుతున్న 19లక్షల మంది

ప్రస్తుతం దేశం మొత్తం రుతుపవనాలు చాలా చురుగ్గా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో వాతావరణ శాఖ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని చోట్ల మినహా దేశవ్యాప్తంగా ఈ రోజుల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబయిలో కురుస్తున్న వర్షాలకు తోడు అస్సాంలో వరదలు ప్రజల ఆందోళనను మరింత పెంచుతున్నాయి. అస్సాంలో ఇప్పటికీ లక్షల మంది ప్రజలు వరదల బారిన పడ్డారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. అస్సాంలోని 27 జిల్లాలు వరదలతో ప్రభావితమయ్యాయి. సామాన్యుడి జీవితం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. ధుబ్రీ, కాచర్, కమ్రూప్, గోల్‌పరా, హైలకండి, నల్‌బారి, కరీంనగర్, బంగాగావ్, గోలాఘాట్, ఇతర జిల్లాల్లోని అనేక గ్రామాల్లో నీటి ఎద్దడి ఉంది. వర్షాలకు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 91 రెవెన్యూ, 3154 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అస్సాంలో వరదల కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సహాయ కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగిస్తుంది.

రేపు ఆర్థికవేత్తలతో ప్రధాని మోడీ కీలక సమావేశం..!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 బడ్జెట్‌ను జులై 23వ తేదీన లోక్‌సభలో ప్రవేశ పెట్టనుంది. అంతకంటే ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బడ్జెట్‌కు సంబంధించి అభిప్రాయాలు, సూచనలను సేకరించేందుకు ప్రముఖ ఆర్థికవేత్తలతో రేపు (గురువారం) భేటీ అవుతారని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రధానమంత్రి సమావేశానికి ఆర్థికవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో పాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ, ఇతర సభ్యులు కూడా వస్తారని చెప్పారు. కాగా త్వరలో ప్రవేశ పెట్టే బడ్జెట్ మూడోసారి ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపటిన తర్వాత వచ్చిన బడ్జెట్ కాబట్టి.. ఇందులో ప్రధానంగా 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి కావాల్సిన రోడ్ మ్యాప్‌ను రూపొందించనున్నారని తెలుస్తుంది.

తిరుమలలో భక్తుల రద్దీ.. 27 కంపార్ట్‌మెంట్లు ఫుల్..!

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వ దర్శనానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా నిన్న (మంగళవారం) సాయంత్రానికి క్యూ లైన్‌లలో వేచి ఉన్న భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2లోని 27 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. అలాగే, వీరికి దాదాపు 16 గంటల్లో శ్రీవారి దర్శనం అవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు. అలాగే, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు కలిగిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లోని మూడు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారని చెప్పారు. వీరికి రెండు గంటల్లో శ్రీనివాసుడి దర్శనం లభించనుంది అన్నారు.

కాశ్మీర్‌లో సవాల్‎గా మారిన చొరబాటుదారులు.. చురుగ్గా 70 మంది ఉగ్రవాదులు

వర్షాకాలానికి ముందే జమ్మూకశ్మీర్‌లోకి భారీగా ఉగ్రవాదులు చొరబడి సవాల్‌ విసిరుతున్నారు. జమ్మూ ప్రాంతంలో దాడులు పెంచి, సైన్యం సహా భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుంటున్న ఉగ్రవాదుల్లో ఎక్కువ మంది విదేశీయులేనని ఏజెన్సీలు విశ్వసిస్తున్నాయి. ఉగ్రవాదుల శిక్షణ సరిహద్దు దాటిందని, వారు స్థానికుల సహాయంతో జమ్మూలో దాడులు చేస్తున్నారు. అయితే, చొరబాటు నిరోధక వ్యవస్థ-యాంటీ-ఇన్‌ఫిల్ట్రేషన్ గ్రిడ్‌ను పటిష్టం చేసినప్పటికీ, సరిహద్దు ఆవల నుండి ఉగ్రవాదులు వేగంగా చొరబడటం, దాడులను చూసి భద్రతా దళాలు, ఏజెన్సీలు ఆశ్చర్యపోతున్నాయి. ఇది కూడా స్థానిక స్థాయిలో నిఘా వ్యవస్థ బలహీనతతో ముడిపడి ఉంది. అంతేకాకుండా చొరబాటు కోసం ఎలాంటి కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారనేది కూడా భద్రతా వ్యవస్థకు పెద్ద సవాలుగా మారింది. కాశ్మీర్‌లో కఠినంగా వ్యవహరించిన తర్వాత ఉగ్రవాదులు జమ్మూలో తమ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం ప్రారంభించారని వర్గాలు తెలిపాయి. జమ్మూకు సంబంధించిన కచ్చితమైన నిఘా సకాలంలో అందితే దాడులను అరికట్టడం సాధ్యమయ్యేది.

తెలంగాణకు భారీ వర్షసూచన

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు రానున్న రెండు రోజులపాటు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్‌ అంచనా వేసింది. జులై 12 వరకు బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని, దీంతో ఎల్లో అలర్ట్‌ను జారీ చేయాలని డిపార్ట్‌మెంట్‌ని కోరింది. ఈ నైరుతి రుతుపవనాల సమయంలో తెలంగాణలో గణనీయమైన వర్షపాతం నమోదైంది, రాష్ట్రంలో సాధారణ 175.6 మిమీకి వ్యతిరేకంగా 210.6 మిమీ నమోదైంది. జోగులాంబ గద్వాల్ జిల్లాలో అత్యధికంగా 94.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు 173.5 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదైంది. రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని IMD హైదరాబాద్ హెచ్చరికలు జారీ చేసింది.

పిఠాపురంలో ప్లాస్టిక్ వినియోగం తగ్గించడంపై డిప్యూటీ సీఎం పవన్ దృష్టి..

ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించాలని ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాయి.. కానీ, ఆచరణలో అనుకున్నస్థాయిలో మాత్రం ముందడుగు పడడం లేదు.. అయితే, ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. దానిని తన సొంత నియోజకవర్గం పిఠాపురం నుంచే అమలు చేసే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. వినాయక చవితి వేడుకల్లోనూ మట్టి గణపతిని పూజిస్తే పర్యావరణానికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. దేవాలయాల్లో ప్రసాదాన్ని ఆకుల కప్పులు, తాటాకు బుట్టలలో వాడాలి అని పేర్కొన్నారు. ఈ తరహా ప్రయోగం పిఠాపురంలోని ఆలయాల్లో ప్రయోగత్మాకంగా చేపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు.

అనంతపురంలో టీడీపీ కార్యకర్తపై కత్తులతో దాడి చేసి హత్య..

అనంతపురం జిల్లా రాయదుర్గంలో దారుణం చోటు చేసుకుంది. రాయదుర్గం మండలం మెచ్చరి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ఆదెప్పను దారుణ హత్య చేశారు. ప్రత్యర్థులు కత్తులతో విచక్షిణారహితంగా పొడిచి చంపి.. మృతదేహాన్ని గ్రామ శివారులో పడవేశారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దులో ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఆదెప్ప మంగళవారం వ్యక్తిగత పని మీద సరిహద్దునే ఉన్న కర్ణాటకకు వెళ్లి.. తిరిగి సాయంత్రం 6 గంటల సమయంలో వస్తుండగా ఈ హత్య జరిగినట్లు ఆదెప్ప తరపు బంధువులు వెల్లడించారు.

ఆస్ట్రియాలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం.. వియన్నాలో మార్మోగిన వందేమాతరం

రష్యా తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రియా చేరుకున్నారు. రాజధాని వియన్నాలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. నిజానికి 41 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించారు. గతంలో 1983లో ఇందిరా గాంధీ ఆస్ట్రియా పర్యటనకు వెళ్లారు. వియన్నా విమానాశ్రయంలో ప్రధాని మోడీకి గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. అనంతరం మోడీ హోటల్ రిట్జ్ కార్ల్టన్ చేరుకున్నారు. హోటల్‌కు చేరుకున్న తర్వాత ప్రధాని భారతీయ ప్రజలను కలుసుకున్నారు. హోటల్‌లో ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు వందేమాతరం ట్యూన్ వినిపించారు. ఈ ట్యూన్ తో వియన్నా ప్రతిధ్వనించింది. అనంతరం ఆస్ట్రియా ఛాన్సలర్‌ కార్ల్‌ నెహ్మర్‌తో విందులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ వచ్చారు. విందు సందర్భంగా ఇరువురు నేతల మధ్య పలు అంశాలపై చర్చ జరిగింది. ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెల్లెతో కూడా ప్రధాని మోడీ భేటీ కానున్నారు.

నేడు సీఎం రేవంత్‌ ఉన్నతస్థాయి సమీక్ష

సీఎం రేవంత్‌ రెడ్డి నేడు జాతీయ రహదారుల విస్తరణ, అభివృద్ధిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. జాతీయ రహదారుల పనులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు చేపట్టే విషయంపై ఈ సమీక్షలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో.. NHAI అధికారులు, కలెక్టర్లు, అటవీశాఖ అధికారులు హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే.. జాతీయ రహదారుల నిర్మా ణానికి తమ పూర్తి సహకారం ఉంటుం మని స్పష్టం చేశారు. ఎన్ హెచ్ ఏఐ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఆయన నివాసంలో మంగళవారం సమావే శమయ్యారు. రాష్ట్రంలో ఎన్ హెచ్ ఏఐ చేపడు తున్న రహదారుల నిర్మాణంలో భూసేకరణతో పాటు తలెత్తున్న పలు ఇబ్బందులను అధికారు లు ముఖ్యమంత్రి కి వివరించారు. స్పందించిన ముఖ్యమంత్రి ఆయా సమస్యల పరిష్కారానికి బుధవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. రహదా రులు నిర్మాణం జరిగే జిల్లాల కలెక్టర్లు, అటవీశాఖ అధికారులు భేటీలో పాల్గొంటారని, ఆయా సమస్యలపై చర్చించి అక్కడే సమస్య లను పరిష్కరించుకుందామని ఎన్హెచ్ఎఐ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.