NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ టీజర్‌కి డేట్ ఫిక్స్

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రష్మి తన సత్తా చాటుతుంది. వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుని బాక్సాఫీస్ హిట్ సినిమాలలో నటిస్తోంది. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా.. తాజాగా బాలీవుడ్ లో కూడా యానిమల్, పుష్ప 2 సినిమాతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది ఈ అందాల సుందరి. ఆ తర్వాత విడుదలైన యానిమల్ సినిమాతో తనదైన నట విశ్వరూపాన్ని చూపించి అందరి మన్నలను పొందింది. ప్రస్తుతం రష్మిక చేతిలో పుష్ప టు ది రూల్, ది గర్ల్ ఫ్రెండ్, కుబేర సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి సినిమా చిత్రీకరణలతో బిజీ బిజీగా గడిపేస్తోంది. ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాకు సంబంధించి చిత్రబృందం గతంలో పోస్టర్లను రిలీజ్ చేసింది. ఇందులో రష్మిక చాలా క్యూట్ గా కనిపించింది. ఈ ఫోటోలను చూస్తే మళ్ళీ మళ్ళీ ఆమెను చూడాలనిపించే విధంగా ఉన్నాయి.

గాజాలో అంతులేని అగచాట్లు.. ఆకలి కేకలతో అల్లాడుతున్న పాలస్తీనియన్లు

ఇజ్రాయెల్‌ ఆధినంలో ఉన్న గాజాలోని పాలస్తీనియన్లు పడుతున్న బాధలు అంతులేని అగచాట్లకు నిదర్శనం అని చెప్పాలి. కనీసం ఆహారం దొరక్క వాళ్లు అల్లాడిపోతున్నారు. శుక్రవారం నాడు ఖాన్‌యూనిస్‌లోని శరణార్థి శిబిరం దగ్గర ఫ్రీగా ఆహార పంపిణీ చేసే కేంద్రం వద్ద పాలస్తీనా మహిళలు, బాలికలు ఫుడ్ కోసం పెద్ద యుద్ధమే చేశారు. వారి పరిస్థితిని చూసి అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల పెరిగిన నేపథ్యంలో గాజాకు ఆహార పంపిణీని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ఐక్యరాజ్య సమితి సహాయ సంస్థలు ఇటీవలే ప్రకటించాయి.

శరవేగంగా ఎస్ డీటీ18 షూటింగ్.. టైటిల్, గ్లింప్స్ కు ముహూర్తం ఫిక్స్

విరూపాక్ష, బ్రో వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్ సినిమాల తరువాత సుప్రీమ్‌ హీరో సాయి దుర్గ తేజ్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజే ఈ సినిమా పూజ కార్యక్రమాలు జరగడం విశేషం. విరూపాక్ష, బ్రో చిత్రాలతో 100 కోట్ల క్లబ్‌లో చేరిన హీరో సాయి దుర్గ తేజ్‌ ఈ సారి మరింత ఉత్సాహంతో, అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రోహిత్‌ కేపీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హనుమాన్ నిర్మాతలు కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను గతంలోనే విడుదల చేసిన సంగతి తెలిసిందే.

నేడు సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ పోరు సభ.. హాజరుకానున్న జేపీ నడ్డా

నేడు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియంలో బీజేపీ పోరు సభ నిర్వహిస్తుంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ సభ నిర్వహించనుంది. 6 అబద్ధాలు, 66 మోసాలు అనే నినాదంతో కాంగ్రెస్ వైఫల్యాలను బట్టబయలు చేయాలని బీజేపీ నిర్ణయించింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియంలో జరిగే సమావేశానికి కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. బీజేపీ సభకు ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి జన సమీకరణ చేశారు.

కెనడాలో భారతీయ విద్యార్థి దారుణ హత్య..

కెనడాలో భారతీయులపై దాడులు పెరుగుతున్నాయి. ప్రతిరోజూ భారతీయులను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా భారతీయ విద్యార్థిని హత్య కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సర్నియాలో భారతీయ విద్యార్థిని కత్తితో పొడిచి చంపారు. బాధితుడిని పంజాబ్‌కు చెందిన గురాసిస్ సింగ్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే కొందరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న భారతీయ విద్యార్థిని గుర్తించారు.

నేడు బాపట్లలో సీఎం చంద్రబాబు పర్యటన…

నేడు బాపట్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. బాపట్ల మున్సిపల్ హై స్కూల్ లో మెగా పేరెంట్స్, అండ్ టీచర్స్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. స్వీయ క్రమ శిక్షణ, వ్యక్తిత్వ వికాసంతో కూడిన విద్యను విద్యార్థులకు బోధించాలని, ఉపాధ్యాయులకు దిశా నిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పాఠశాలల అభివృద్ధికి సహకరించిన పూర్వ విద్యార్థులను సీఎం చంద్రబాబు సత్కరించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా శనివారం బాపట్ల పట్టణంలో ట్రాఫిక్‌ మళ్లింపు చేపట్టినట్లు ఎస్పీ తుషార్‌ డూడీ వెల్లడించారు. ట్రాఫిక్‌ మళ్లింపుపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. చీరాల నుంచి బాపట్ల మీదుగా పొన్నూరు, గుంటూరు వైపు వెళ్లే వాహనాలను, అంబేడ్కర్‌ సర్కిల్‌, జమ్ములపాలెం ఫ్లైఓవర్‌, ఉప్పరపాలెం ఇందిరాగాంధీ సర్కిల్‌, దర్గా మీదుగా దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు.

నేడు నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..

నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పలు ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట నుంచి చాపర్ ద్వారా నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంలకు చేరుకోనున్నారు.నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలో ఉదయసముద్రం ఎత్తిపోతల పథకాన్ని మధ్యాహ్నం 2.40 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

వైరల్ వీడియోపై స్పందించిన మంత్రి నారా లోకేష్ వైరల్ వీడియోపై స్పందించిన మంత్రి నారా లోకేష్

శ్రీకాకుళం జిల్లాలోని ఓ కోచింగ్ సెంటర్ యాజమాన్యం ట్రైనింగ్‌ అభ్యర్థులను దుర్భాషలాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్మీ ఉద్యోగాల కోసం వ్యక్తులను సిద్ధం చేయాలని కోచింగ్ సెంటర్ ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్న మంత్రి నారా లోకేష్.. బాధ్యులపై శ్రీకాకుళం పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో “ఇండియన్ ఆర్మీ కాలింగ్” అనే సంస్థను నడుపుతున్న వెంకట రమణ అనే వ్యక్తికి సంబంధించినది. తాను రిటైర్డ్ ఆర్మీ అధికారినని చెప్పుకుంటూ, ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చేందుకు ఒక్కొక్కరి నుంచి ₹5 లక్షల వరకు వసూలు చేస్తున్నాడు.

గూగుల్ మ్యాప్స్ తెచ్చిన తంటా.. కర్ణాటక అడవుల్లో బీహార్ కుటుంబం

గూగుల్ మ్యాప్‌ మరోసారి రాంగ్ రూట్ చూపించి మరో కుటుంబాన్ని మోసం చేసింది. కొన్ని రోజుల క్రితం గూగుల్‌ తల్లి తప్పిదంతో ముగ్గురు మరణించగా.. ఈసారి ఓ కుటుంబాన్ని ఏకంగా అడవుల పాలు చేసేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌ కు చెందిన రణజిత్‌ దాస్‌ అనే వ్యాపారి ఉజ్జయిని నుంచి గోవాకు తన కుటుంబంతో కారులో వెళ్తున్నాడు. ఈ క్రమంలో వారు గూగుల్‌ మ్యాప్‌ సహాయంతో ప్రయాణం కొనసాగిస్తున్నారు. అయితే, వారు సరిగ్గా శిరోరి-హెమ్మడగా మధ్యలో దారి తప్పిపోయారు. మ్యాప్‌ సూచనలతో కారు నడుపుతుండగా.. అది నేరుగా అడవిలోకి తీసుకెళ్లింది. ఫోన్లకు సిగ్నల్స్ రాకపోవడంతో వారు రాత్రంతా కారులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వరంగల్ మిర్చికి అరుదైన ఘనత.. చపాటకు జీఐ ట్యాగ్‌..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మాత్రమే పండిస్తున్న చపాట మిర్చి అరుదైన ఖ్యాతిని సాధించింది. ఎర్రటి రంగుతోపాటు తక్కువ మోతాదులో కారం ఉండే ఈ రకం మిరప.. తాజాగా జీఐ (జియోగ్రాఫిక్‌ ఇండికేషన్‌) ట్యాగ్‌ను సాధించింది. చపాట మిరపకు జీఐ ట్యాగ్‌ కోసం తిమ్మంపేట మిర్చి ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ రెండేళ్ల క్రితం దరఖాస్తు చేయగా.. ఇండియన్‌ పేటెంట్‌ ఆఫీ స్‌(ఐపీవో) తాజాగా ఆమోదించింది. ‘జియోగ్రాఫిక్‌ ఇండికేషన్స్‌ జర్నల్‌’లోనూ చపాట రకం మిర్చికి సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి. చపాట రకం మిరపకాయలు టమోటా మాదిరిగా ఉంటాయి. అందుకే దీన్ని టమోటా మిరప అని కూడా పిలుస్తారు. రెండేళ్ల క్రితం చపాట మిర్చికి వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.లక్ష వరకు ధర పలికింది. తాజాగా జీఐ ట్యాగ్‌తో ఈ రకం మిర్చి ప్రత్యేక గుర్తింపు సాధించినట్లయింది.