NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఒక్క నిమిషం కూడా కరెంట్ సరఫరాకు అంతరాయం ఉండొద్దు..

ఒక్క నిమిషం కూడా కరెంట్ సరఫరాకు అంతరాయం ఉండొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ శాఖపై సమీక్షలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో తెలంగాణ ఒక బిజినెస్ హబ్ గా మారబోతోందన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఐటీ, ఇండస్ట్రియల్ శాఖలతో సమన్వయం చేసుకుని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు. సోలార్ విద్యుత్ వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలన్నారు. వివిధ శాఖల్లో వినియోగంలో లేని భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు సోలార్ పంప్ సెట్ లను ఉచితంగా అందించి వారిని సోలార్ విద్యుత్ వైపు ప్రోత్సహించాలన్నారు. కొండారెడ్డి పల్లెను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

సింగపూర్‌ పార్లమెంట్ హౌస్‌లో లారెన్స్ వాంగ్‌తో ప్రధాని మోడీ భేటీ..

సింగపూర్‌ లోని పార్లమెంట్ హౌస్‌లో లారెన్స్ వాంగ్‌ తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. సింగపూర్ చేరుకున్న తర్వాత, బుధవారం నాడు మోడీ మాట్లాడుతూ.., నేను సింగపూర్ చేరుకున్నాను. భారత్ – సింగపూర్ దేశాల స్నేహాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో జరిగే అనేక సమావేశాల కోసం నేను ఎదురుచూస్తున్నాను. భారతదేశంలో జరుగుతున్న సంస్కరణలు, మన యువశక్తి ప్రతిభ మన దేశాన్ని ఒక ఆదర్శ పెట్టుబడి గమ్యస్థానంగా మార్చింది. మేము సన్నిహిత సాంస్కృతిక సంబంధాల గురించి కూడా చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. సింగపూర్‌ లోని వ్యాపార ప్రముఖులను కూడా ప్రధాని మోడీ కలుస్తారని, దేశంలోని సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తులతో సంభాషిస్తారని సమాచారం. అధికారుల ప్రకారం, ఈ పర్యటన సింగపూర్, భారతదేశం దేశాల సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థ మధ్య సమన్వయాన్ని పెంచుతుంది. సెమీకండక్టర్ల తయారీ కేంద్రాన్ని కూడా ఇరు దేశాల ప్రధానులు సందర్శించనున్నారు. ప్రస్తుతం మోడీ సింగపూర్‌ పార్లమెంట్ హౌస్‌లో ఉన్న సమయంలో వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

నేడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోనే చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన కాలువలలో ఒకటైన బుడమేరు విజయవాడలోని అనేక నివాస ప్రాంతాలను వరదలు ముంచెత్తడం, ముంపునకు గురికావడంతో రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. సింగ్‌ నగర్‌, పాయకాపురం, వైఎస్‌ఆర్‌ కాలనీ తదితర ప్రాంతాలు ముంపునకు గురికావడానికి ముఖ్యమంత్రి ఎన్‌. చంద్రబాబు నాయుడు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. అయితే.. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద నుంచి తేరుకుంటున్నారు బెజవాడ ప్రజలు. అయితే.. 80 శాతం ప్రాంతంలో నీరు తగ్గుముఖం పట్టింది. సహాయ చర్యలు ఊపందుకుంటున్నాయి. అయితే.. ఐదో రోజూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోనే సీఎం నారా చంద్రబాబు ఉండనున్నారు. సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు సీఎం చంద్రబాబు. బాధితులకు పరిహారం ఇచ్చేందుకు నష్టంపై అంచనా వేస్తున్నారు సీఎం. ఈఎంఐల రీ షెడ్యూల్ కోసం నిన్న బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబబు. బుడమేరు గండ్లను పూడ్చివేశారు అధికారులు. వాహనాలకు 12 రోజుల్లో బీమా పరిహారం అందజేయనున్నారు. వ్యాపారులు కోలుకోవడానికి ప్యాకేజీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇళ్లలో నష్టంపై ఆలోచిస్తున్నామని, నేటి నుంచి బియ్యం, పప్పు దినుసులు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు తెలిపారు.

ఆర్టీసీ శుభవార్త.. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు డిసౌంట్‌ ఆఫర్‌..

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొన్ని గ్రామాల్లో కమ్యూనికేషన్, రవాణా సౌకర్యం పూర్తిగా స్తంభించిపోయింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. తాజాగా ఆర్టీసీ ప్రయాణికులకు ఎండీ సజ్జనార్ శుభవార్త అందించింది. ఏపీ, తెలంగాణలో కురుస్తున్న వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. పలు ప్రాంతాల్లో జాతీయ రహదారులు కొట్టుకుపోయి.. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.

నేడు కేజ్రీవాల్‌ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో తనను సీబీఐ అరెస్టు చేయడాన్ని కేజ్రీవాల్‌ పిటిషన్‌లో సవాలు చేశారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఈ కేసులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు సీబీఐకి ఆగస్టు 23న సుప్రీంకోర్టు అనుమతినిచ్చి, కేజ్రీవాల్‌కు సమాధానం ఇచ్చేందుకు రెండు రోజుల గడువు ఇచ్చింది. ఈడీ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్‌కు బెయిల్‌ లభించింది.

నేడు ఏపీకి కేంద్ర బృందం..

ఆంధ్రప్రదేశ్‌లో మునుపెన్నడూ లేని విధంగా కుండపోత వర్షాలు , వరదల కారణంగా వారి సంఖ్య 32కి పెరిగిందని, సహాయక శిబిరాల్లో ఉన్న వారి సంఖ్య 45,369కి పెరిగిందని అధికారులు తెలిపారు. విజయవాడలో అత్యధికంగా ప్రభావితమైన ఎన్టీఆర్ జిల్లాలో 24 మంది మరణించారు; గుంటూరు (ఏడు), పల్నాడు (ఒకటి) అధికారికంగా విడుదలయ్యాయి. వరద బీభత్సానికి గురైన కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలను గురువారం కేంద్ర ప్రభుత్వంలోని అంతర్ మంత్రిత్వ శాఖల బృందం సందర్శించి బాధితులతో సంభాషించనుంది. కేంద్ర బృందంలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సలహాదారు కేపీ సింగ్, సెంట్రల్ వాటర్ కమిషన్ డైరెక్టర్ సిద్దార్థ్ మిత్ర ఉంటారని ఒక ప్రకటనలో తెలిపారు. ఇంతలో, బంగాళాఖాతం సముద్రం మీద కొత్త వాతావరణ వ్యవస్థ అభివృద్ధి చెందుతోంది.

జార్జియా స్కూల్‌లో కాల్పులు.. నలుగురు మృతి, పలువురికి గాయాలు

జార్జియాలోని ఓ పాఠశాలలో కాల్పుల ఘటన వెలుగు చూసింది. ఈ ఘటన బారో కౌంటీలోని అపాలాచీ హైస్కూల్‌లో చోటుచేసుకుంది. పాఠశాల “హార్డ్ లాక్డౌన్” లో ఉంచారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనేక నివేదికల తర్వాత ఈ లాక్‌డౌన్ అమలులోకి వచ్చినట్లు పాఠశాల అధికారులు తెలిపారు. ఈ దాడిలో ఇప్పటివరకు నలుగురు చనిపోయారు. అయితే, ఈ గణాంకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలంలో పెద్ద సంఖ్యలో పోలీసులు, అంబులెన్స్‌లను మోహరించారు. ఒకరిని హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించగా, మరొకరి పరిస్థితి ఇంకా స్పష్టంగా తెలియలేదు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, నలుగురు వ్యక్తులు మరణించారు.. మరో నలుగురు గాయపడ్డారు. ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.

నేడు వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ నెల 8 వరకు భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాలు వర్షబీభత్సం తేరుకోకముందే మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈరోజు (గురువారం) వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, రానున్న ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో వనగండం ఇంకా సమసిపోలేదని తెలుస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షం భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు అధికారులు. కాగా, బుధవారం రాత్రి హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సాయంత్రం వరకు ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ వర్షం పెద్దగా కురవలేదు. కానీ, రాత్రి 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌లో వర్షం మొదలైంది. రాత్రి ఒక్కసారిగా వాతావరణం ఊహించని విధంగా మారి కుండపోత వర్షం కురిసింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. రోడ్లపై నీరు నిలిచిన చోట మ్యాన్ హోల్స్ తెరిచే ప్రయత్నం చేయవద్దని ప్రజలకు సూచించారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది తప్ప ఇంకెవ్వరూ మ్యాన్‌హోల్స్‌ తెరవకూడదని, ఇది చట్టరీత్యా నేరమని పేర్కొంది. ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలను తాకకూడదని, ముఖ్యంగా చిన్న పిల్లలను వాటికి దూరంగా ఉంచాలని చెప్పారు. పొంగిపొర్లుతున్న రిజర్వాయర్లు, చెరువులు, వాగులు, ప్రాజెక్టుల దగ్గరకు వెళ్లకూడదని వాతావరణ శాఖ తెలిపింది. వర్షం కారణంగా వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉందని, పరిమిత వేగంతో వాహనాలు నడపాలని హెచ్చరింది.

భద్రాద్రి, ములుగు జిల్లాల సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తుపాకీ మోత మోగింది. మావోయిస్టులకి పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టు మృతి చెందగా మరో ఇద్దరు జవాన్లకి గాయాలైనట్టుగా సమాచారం. పినపాక నియోజకవర్గం కరకగూడెం మండలం సరిహద్దు అటువైపు ములుగు జిల్లా సరిహద్దు లో ఉన్న రఘునాథపల్లి దామెరతోగు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులకి పోలీసులకు మధ్య ఈ తెల్లవారు జామున ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టుల సమాచారం తెలుసుకున్న పోలీసులు తెలంగాణ గ్రేహౌండ్స్ దళాలు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా మావోయిస్టు దళం ఎదురు పడటంతో తెలంగాణ గ్రేహౌండ్ తలాలకి అదేవిధంగా మావోయిస్టులకు జరిగిన కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు స్పష్టమైనది. ఇందులో ఒక దళ కమాండ్ ఉన్నట్లుగా చెప్తున్నారు .ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లకు కూడా గాయాలైనట్లుగా చెప్తున్నారు. గాయపడినవారిని అదే విధంగా మృతి చెందిన మావోయిస్టు మృతదేహాలని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు సంఘటన స్థలాన్ని కి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పర్యవేక్షిస్తున్నారు.

 

Show comments